
ఆకాశవాణి రేడియో  కార్యక్రమాలను వింటూ పెరిగిన లక్షల మందికి, మీరు ప్రసారం చెసిన కార్యక్రమాలు,  వారి బాల్యపు తీపి గుర్తులు. పాత కాలాన్ని నెమరు వేసుకుంటూ ఆ పాత కార్యక్రమాలను ఎంతగానో తమ ఊహా లోకాల్లోనె మళ్ళి మళ్ళి వినటమే  తప్ప,  ఇప్పుడు వినే అవకాశం లేదు. ఎదో మొక్కుబడిగా, తెలుగులో ఎంతగానో ప్రాచుర్యం పొందిన కాసిని నాటకాలు, లలిత సంగీతం ఒక డజను సి. డి లు వేసి (అవి కూడ  సామాన్య శ్రోతకు అందనంత ధర పెట్టి) చేతులు దులిపేసుకున్నారు. అలనాటి నాటకాలు, నాటికలు, ప్రసంగాలు, లలిత సంగీతం, చివరకు అలనాటి వివిధ కార్యక్రమ ప్రారంభ సంగీతం విందామన్నా ఎక్కడా  దొరకదు.
ఇక  మీ వెబ్ సైటు చూద్దామంటేనే కంపరం కలుగుతుంది.  ఫ్రీక్వెన్సీ  వివరాలు తప్ప, శ్రోతలకు పనికి వచ్చే సమాచారం  వీసమెత్తైనా లేకుండా ఎంతో జాగ్రత్త పడినట్టుగా కనిపిస్తుంది.  ఎవరెవరో ఉద్యోగుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లు, వారి ఈ మైలు చిరునామాలు లేదా  మీ టెండర్ల వివరాలు తప్పితే మరే విశేషమూ  లేదు. మీ వెబ్ సైట్లల్లో తెలియబరిచిన మైలు చిరునామాలకు    కొన్నిటికి మైళ్ళు ఇచ్చి చూశాను వారికి అందలేదో (అంటే పనిచేయని మైలు చిరునామా వెబ్లో ఉంచారో) లేదా వారికి అందినా శ్రోతల మైళ్ళకు స్పందించేదేమిటిలే అని ఊరుకునే సాంప్రదాయాన్ని అనుసరిస్తూ మిన్నకున్నరోగాని,  చివరకు జవాబు మాత్రం రాలేదు. 
అలాగే "కాంటాక్ట్ అజ్" అని ఒక టాబ్ మీ వెబ్ సైటులో ఉంటుంది. అది నొక్కి అభిప్రాయం వ్రాసి మీకు పంపమని మీ కోరిక అనుకుంటాను. కాని అలా అభిప్రాయం వ్రాసి పంపిద్దామంటే ఎవేవో ఎర్రర్ మెసేజీలే కాని, ఎంతకూ ముందుకు కదలదే. మీరు జన బాహుళ్యానికి వీలుగా ఎంతో ఖర్చు పెట్టి (అదికూడ ప్రజా ధనంతోనే) ఈ వెబ్ సైట్లు ఏర్పరిచారు.  ఆ వెబ్ సైట్లు ఎలా పనిచేస్తున్నాయి, అందులో ఉండే అన్ని సౌకర్యాలు పనిచేస్తున్నాయా లేదా అన్న విషయం అప్పుడప్పుడూ తణిఖీ చేసే  ఏర్పాటు ఉందో లేదో మీకే తెలియాలి.    
ఆన్నిటికన్న మీ వెబ్సైట్లు చేసిన  ఘోరమైన తప్పిదం ఏమంటే,  ఆకాశవాణి లో ఎంతో కష్టించి పనిచేసి, తమ కళాకౌశలంతో ప్రజాదరణ  తాము పొంది, ఆకాశవాణికి ఎంతగానో పేరు తెచ్చిన ఒక్క కళాకారుడి చిత్రం కూడ ఉంచకపోవటం. అలనాటి కళాకారులను గౌరవించవలసిన బాధ్యత ఆకాశవాణికి లేకపోవటం ఎంతో బాధ కలిగించే విషయం, ఇలా శ్రోతలచేత చెప్పించుకునే దశలో ఆకాశవాణి ఉండటం శోచనీయం, అలనాటి కళాకారుల వివరాలను మీ వెబ్సైటులో ఉంచే  ఆలోచనే మీరు ఎందుకు చేయరా అని శ్రోతనైన నేను ఎంతగానో బాధపడుతున్నాను. నాలాగా కొన్ని వేలమంది మీ వెబ్ సైటుకు తమ అభిమాన ఆకాశవాణి కళాకారుల గురించి తెలుసుకుందామని వచ్చి చూస్తే, ఎందుకూ పనికిరాని గుమాస్తా గోల (బ్యూరోక్రాటిక్  జంక్)  తప్ప మరేమీ లేదక్కడ.   
గత కొన్ని సంవత్సరాలుగా రేడియో  కార్యక్రమాలకు తగినంత ప్రజాదరణ, ముఖ్యంగా నగరాలలో  తగ్గుతూ వస్తున్నది అన్న మాట  నిజం రేడియో పట్ల తగ్గుతున్న ప్రజాదరణకు కారణం  టి వి,  సినిమా ప్రభావం ఉన్నమాట కూడ నిజమే.  కాని అదే కారణం అని చేతులు దులిపేసుకోకండి, మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల నాణ్యతను కూడ ఓకసారి నిస్పక్షపాతంగా మీ పాతకాలపు కార్యక్రమాలతో పోల్చి బేరీజు వేసుకోండి. 
ఇప్పటికైనా, మీ వెబ్ సైట్లను ఆకర్షణీయంగా తయారుచేసి, శ్రోతలకు ఆసక్తి కల అంశాలను ఉంచగలరు. నాకు తోచిన కొన్ని సూచనలు: 
1.       ప్రతి ఆకాశవాణి కేంద్రానికి  ఒక వెబ్ సైటు ఉండాలి. అంటే మీ (మా)  ఆకశవాణివారి వెబ్ సైటులోకి వెళ్ళిన తరువాత,  అన్ని రేడియో కేంద్రాల వెబ్సైట్లకు అక్షరక్రమలో  లింకులు ఒకచోట ఏర్పాటు  చెయ్యాలి. శ్రోతల అభిరుచిని బట్టి తమకు  కావలిసిన ఆకాశవాణి కేద్రం వెబ్ సైటుకు వెళ్ళగలుగుతారు. 
2.       అలా ఏర్పాటు చేసిన ప్రతి ఆకాశవాణి కేద్రపు వెబ్ సైట్లల్లో ఈ కింది వివరాలు ప్రముఖంగా ఉండాలి.
a)      ఆ కేంద్రపు  చరిత్ర, ఎప్పుడు  స్థాపించారు,  అప్పటి ప్రారంభోత్సవ ఉత్సవ ఫొటోలు (వెతికితే తప్పక దొరుకుతాయి)  
b)      మొట్టమొదటి కళాకరులు ఎవరు, వారి పేర్లు (ఇవి కూడ దొరకవచ్చు, అంతా కలిపితే గట్టిగా ఏ కేద్రం పెట్టి కూడ 60 ఏళ్ళకు మించి అవ్వలేదు)
c)       ఆ కేద్రంలో ఇప్పటివరకు  తయారు చేయబడ్డ కార్యక్రమ వివరాలు, వాటి ఆడియో శాంపిల్స్ 
d)      ప్రస్తుతం ప్రసారం అవుతున్న కార్యక్రమ వివరాలు (ప్రోగ్రాం షెడ్యూల్), సమయాలతో సహా (ఇదివరకు మీ పత్రిక "వాణి" లో  ప్రచురించేవారే అలా అన్నమాట, ఈ వాణి పత్రిక గురించి ఇప్పటి మీ సిబ్బందిలో ఎంతమందికి తెలూసో మరి!!)  
e)      పాత నాటికల, ఇతర కార్యక్రమల ఆడియో ఫైళ్ళు,(వీటన్నిటికి కాపీ రైటు కాలదోషం పట్టేసింది,  మీరు భవిష్యత్తులో అమ్ముకుందామన్న ఎవరూ కొనుక్కుని వినరు) కాబట్టి  డౌన్లోడ్ సౌకర్యం లేకుండా వినడానికి మాత్రమే ఉంచటం.
f)       ఎంతో పేరు ప్రఖ్యాతులు,  మీ ఆకాశవాణివారు నిర్వహించిన పోటీలలో బహుమతులు,  సంపాయించిన కళాకారుల వివరాలు, ఫొటోలతో సహా ఉంచాలి
3.       ఏ కేంద్రమైనా  సరే ప్రసారాలు జరుపుతున్న సమయంలో, లైవ్ ఫీడ్ ను ఇంటర్నెట్ కు సంధానపరిచి, ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ  వ్యాప్తంగా ఎక్కడనుంచైనా  సరే వినటానికి, ఇంటర్ నెట్ రేడియో సౌకర్యం. ఏర్పరచాలి. దీనికి మీకు పెద్దగా ఖర్చు ఏమీ  కాదు. పైగా ఇది చూపించి, మీరు మీ ప్రకటనలను ఇంకా బాగా అమ్ముకోవచ్చు!! లేదా ఈ కార్యక్రమాలకు విడిగా ప్రకటనలను అమ్ముకోవచ్చు.
          ఒక్కసారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ రేడియోలను చూడండి, మన దేశంలో వెయ్యో వంతులేని చిన్ని చిన్ని దేశపు రేడియోలు ఇంటర్నెట్లో చక్కగా ప్రసారాలను అందిస్తూ, వారి ప్రజలు,  ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వినే సౌకర్యం కలిగించారు. మన భారతీయులు  అనేక దేశాల్లో లక్షల మంది ఉన్నప్పటికీ, వారు వారికి ఇష్టమైన  ప్రాంతీయ  ఆకాశవాణి కేద్రం కార్యక్రమాలు వినాలంటే అవకాశమే లేదు. మనకు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక సౌకర్యాలను ఆకాశవాణి అందిపుచ్చుకుని, శ్రోతలకు సౌకర్యవంతంగా  ఆ సాంకేతికతను  వాడుకోకపోవటమే దీనికి కారణం.  ఇప్పటికైనా, ఆకాశవాణి కేద్రాలన్నిటిని, ఇంటర్నెట్ లో వచ్చే సౌకర్యం కల్పించాలని  నా ఒక్కడి కోరికే కాదు, లక్షల్లో ఉన్న ప్రవాస భారతీయులందరి మనస్సులో ఉన్న తీరని కల.షార్ట్ వేవ్ ట్రాన్స్మిషన్ ఎంతో ఖర్చుతో కూడుకున్నది. దానితో పోల్చుకుంటే, ఇంటర్నెట్ రేడియో చాలా తక్కు వ్యయంతో నిర్వహించవచ్చు. ప్రపంచం మొత్తం వచ్చే కార్యక్రమాలను స్పుటంగా, చక్కటి క్వాలిటీతో శ్రోతలు వినగలుగుతారు.
ఆకాశవాణి భాండారాలలో (ఆర్ఖైవ్స్) లో అలనాటి కార్యక్రమాల టేపులు ఎన్ని మిగిలి ఉన్నాయి? వాటి వివరాలు ఏమిటి? వాటిని బహిరంగంగా (అంటే మీ దగ్గర భద్రంగా ఉన్న టేపులలో ఉన్న కార్యక్రమాల వివరాలు)  మీ  వెబ్ సైటులో ఉంచటానికి అభ్యంతరం ఏమిటి? ఎవరో గుమాస్తాలు (అదేనండి బ్యూరోక్రాట్‌లు, వారి పదవి పేరు ఏదైనా సరే, )  అమ్మాలని నిర్ణయిస్తే కాని ప్రజలమైన మాకు  తెలియకూడదా?  ఎన్నెన్ని అలనాటి రేడియో కళా ఖండాలు సిబ్బంది అలసత్వం, చేతకాని తనం వల్ల, లేదా కాలక్రమేణా పాడైపోయినాయి?  తప్పకుండా తెలియచేయాలి. 1950 లనుండి  ప్రసారమైన రేడియో కార్యక్రమాల టేపులన్ని కూడ భారతదేశ ప్రజల కళాసంపద. ఈ కళా సంపదను 'హెరిటేజ్' గా భావించి వాటి పరిరక్షణకు ఆకాశవాణి తీసుకున్న చర్యలు ఏమిటి.తెలియ చేయాలి. రాబోయ్యే రోజుల్లో  తీసుకోబోయే తక్షణ చర్యలు ఆకాశవాణి వారు తీసుకోవాలి. 
వ్యక్తుల యాజమాన్యపు హక్కులలో ఉన్న పాతకాలపు భవంతులనే "హెరిటేజ్ భవంతులు" అన్నపేరుతో కూలదోసి మంచి భవంతులు కట్టుకోకుండా ప్రభుత్వం కట్టడి చేస్తున్నది,  అటువంటిది అదే ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆకాశవాణి వారి వద్ద ఉన్న ఈ "హెరిటేజ్" టేపులన్ని కూడ పరిరక్షించటానికి ప్రభుత్వం కాని, ఆకాశవాణివారు కాని ఇప్పటికే తీసుకున్న,  భవిష్యత్తులో తీసుకోబోతున్న చర్యలను ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత ఆకాశవాణివారి మీద ఉన్నది.    
ఇప్పటికి ఈ సూచనలు అమలు పరచగలిగితే, ఆకాశవాణి వారిని శ్రోతలందరం ఎంతగానో అభినందిస్తాం, మెచ్చుకుంటాము. శ్రోతల మెప్పు, అభినందన కంటే ఆకాశవాణి వారికి కావలిసినదే ఏమున్నది? అదికాదు.  అనుకుంటె ఈ వ్రాసినదంతా అరణ్య రోదనమే.
=====================================================================
ఆకాశవాణి వారి వెబ్ సైట్లో పనిచెయ్యని పుటల జాబితా (నేను చూసినంత వరకు)
| 
వెబ్ పేజీ శీర్షిక | 
లింకు | 
అక్కడకు వెళ్ళగానే కనపడే సమాచారం/సందేశం | 
| 
AUDIO PROGRAMMES | 
THE AUDIO PROGRAMMES   ARE NOT CURRENTLY  AVAILABLE | |
| 
LIVE AUDIO | 
SAME AS ABOVE | |
| 
IMPORTANT BROADCASTS | 
SAME AS ABOVE | |
| 
RADIO GUIDE | 
RADIO GUIDE UNDER   CONSTRUCTION | |
| 
AIR RESOURCES | 
LINK NOT WORKING | 
ఆకాశవాణి వారి వెబ్ సైటు తెరవగానే కనపడే అద్బుత దృశ్యం
క్లిక్ చేసి పెద్దది చేసి చూడగలరు
============================================
 
 
శ్రీ శివ రామ్ ప్రసాద్ గారికి నమస్కారం
రిప్లయితొలగించండినా పేరు రంగావజ్జుల శ్రీనివాస్ నివాసం :సూర్యాపేట
నేను మీ బ్లాగ్ " రేడియో అభిమాని"ని
మీ బ్లాగ్ విశేషాలు చదువుతున్న, మీరు కూర్చిన ఆడియో బాగాపు అమృత గుళికలు వింటున్నప్పుడు చాల ఆనందం కలుగుతుంది అలనాటి " చెళుకులు" రేడియో కార్టున్స్ అని అనౌన్స్మెంట్ వినబడగానే చేస్తున్న పని ఆపేసి చెవులు రిక్కించి వినేవాన్ని, మతిమరుపు మొగుడు గా శ్రీ నండూరి సుబ్బారావు గారి వచన రూపక నటన విని మైమేర్చేవిదంగా వుండేది " ఇనగారికి కాస్త మతిమరుపు ఎక్కువ గొడుగు తేవటం మర్సిపోవద్దని గుర్తుచేయండి" అని ఒక పేపర్ స్టిక్కర్ మొగుడి వీపుకు అంటించడం ఆది చూసి అందరు నవ్వుకొంటూ "గొడుగు తీస్కెల్లు " అని గుర్తు చేయడం చాల బాగుండేది ఆరోజుల్లో http://www.radio.maganti.org/ వారి బ్లాగ్ లోకూడా చాల సేకరించారు,
www.chimatamusic.com/ లో కూడా మొద్దబ్బయి , రేడియో లలిత సంగీతం వినేవాన్ని మొన్న శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణం రేడియో వ్యాఖ్యానము అని google search లో వెతకగా "రేడియో అభిమాని" అనే ఈ బంగారం దొరికింది దాచుకొంటాను గుండెలో పదిలంగా
కొన్ని ఆడియో భాగాలూ రావట్లేదు దయచేసి చూడగలరు
ఈ రుపకముగా రేడియో మిమ్ములను కలిపింది చాల సంతోషం
నమస్కారం
ramanamaharshi82@gmail.com
ఇప్పుడు, ఈరోజున టెస్ట్ చేస్తే అదృష్టవశాన కొన్ని లింకులు పనిచేస్తున్నాయి, కొన్ని కొన్ని స్టేషన్లు మాత్రమె లైవ్ ఫీడ్ ఇంటర్నెట్ లో ఉన్నది. అన్ని స్టేషన్లు లైవ్ ఫీడ్ వేబ్సైట్లల్లో ఉంచటానికి ఆకాశవాణి కి ఉన్న సమస్యలు ఏమిటి! సామ్కేతికమా? డబ్బులు లేవా? ఎందుకు చెయ్యాలి అని అలసత్వమా?
రిప్లయితొలగించండి