3, అక్టోబర్ 2010, ఆదివారం

ఆకాశవాణి వారికి బహిరంగ లేఖ


 
ఆకాశవాణి రేడియో కార్యక్రమాలను వింటూ పెరిగిన లక్షల మందికి, మీరు ప్రసారం చెసిన కార్యక్రమాలు, వారి బాల్యపు తీపి గుర్తులు. పాత కాలాన్ని నెమరు వేసుకుంటూ ఆ పాత కార్యక్రమాలను ఎంతగానో తమ ఊహా లోకాల్లోనె మళ్ళి మళ్ళి వినటమే తప్ప, ఇప్పుడు వినే అవకాశం లేదు. ఎదో మొక్కుబడిగా, తెలుగులో ఎంతగానో ప్రాచుర్యం పొందిన కాసిని నాటకాలు, లలిత సంగీతం ఒక డజను సి. డి లు వేసి (అవి కూడ సామాన్య శ్రోతకు అందనంత ధర పెట్టి) చేతులు దులిపేసుకున్నారు. అలనాటి నాటకాలు, నాటికలు, ప్రసంగాలు, లలిత సంగీతం, చివరకు అలనాటి వివిధ కార్యక్రమ ప్రారంభ సంగీతం విందామన్నా ఎక్కడా దొరకదు.
ఇక మీ వెబ్ సైటు చూద్దామంటేనే కంపరం కలుగుతుంది. ఫ్రీక్వెన్సీ వివరాలు తప్ప, శ్రోతలకు పనికి వచ్చే సమాచారం వీసమెత్తైనా లేకుండా ఎంతో జాగ్రత్త పడినట్టుగా కనిపిస్తుంది. ఎవరెవరో ఉద్యోగుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లు, వారి ఈ మైలు చిరునామాలు లేదా మీ టెండర్ల వివరాలు తప్పితే మరే విశేషమూ లేదు. మీ వెబ్ సైట్లల్లో తెలియబరిచిన మైలు చిరునామాలకు కొన్నిటికి మైళ్ళు ఇచ్చి చూశాను వారికి అందలేదో (అంటే పనిచేయని మైలు చిరునామా వెబ్లో ఉంచారో) లేదా వారికి అందినా శ్రోతల మైళ్ళకు స్పందించేదేమిటిలే అని ఊరుకునే సాంప్రదాయాన్ని అనుసరిస్తూ మిన్నకున్నరోగాని, చివరకు జవాబు మాత్రం రాలేదు.
అలాగే "కాంటాక్ట్ అజ్" అని ఒక టాబ్ మీ వెబ్ సైటులో ఉంటుంది. అది నొక్కి అభిప్రాయం వ్రాసి మీకు పంపమని మీ కోరిక అనుకుంటాను. కాని అలా అభిప్రాయం వ్రాసి పంపిద్దామంటే ఎవేవో ఎర్రర్ మెసేజీలే కాని, ఎంతకూ ముందుకు కదలదే. మీరు జన బాహుళ్యానికి వీలుగా ఎంతో ఖర్చు పెట్టి (అదికూడ ప్రజా ధనంతోనే) ఈ వెబ్ సైట్లు ఏర్పరిచారు. ఆ వెబ్ సైట్లు ఎలా పనిచేస్తున్నాయి, అందులో ఉండే అన్ని సౌకర్యాలు పనిచేస్తున్నాయా లేదా అన్న విషయం అప్పుడప్పుడూ తణిఖీ చేసే ఏర్పాటు ఉందో లేదో మీకే తెలియాలి.
ఆన్నిటికన్న మీ వెబ్సైట్లు చేసిన ఘోరమైన తప్పిదం ఏమంటే, ఆకాశవాణి లో ఎంతో కష్టించి పనిచేసి, తమ కళాకౌశలంతో ప్రజాదరణ తాము పొంది, ఆకాశవాణికి ఎంతగానో పేరు తెచ్చిన ఒక్క కళాకారుడి చిత్రం కూడ ఉంచకపోవటం. అలనాటి కళాకారులను గౌరవించవలసిన బాధ్యత ఆకాశవాణికి లేకపోవటం ఎంతో బాధ కలిగించే విషయం, ఇలా శ్రోతలచేత చెప్పించుకునే దశలో ఆకాశవాణి ఉండటం శోచనీయం, అలనాటి కళాకారుల వివరాలను మీ వెబ్సైటులో ఉంచే ఆలోచనే మీరు ఎందుకు చేయరా అని శ్రోతనైన నేను ఎంతగానో బాధపడుతున్నాను. నాలాగా కొన్ని వేలమంది మీ వెబ్ సైటుకు తమ అభిమాన ఆకాశవాణి కళాకారుల గురించి తెలుసుకుందామని వచ్చి చూస్తే, ఎందుకూ పనికిరాని గుమాస్తా గోల (బ్యూరోక్రాటిక్ జంక్) తప్ప మరేమీ లేదక్కడ.
గత కొన్ని సంవత్సరాలుగా రేడియో కార్యక్రమాలకు తగినంత ప్రజాదరణ, ముఖ్యంగా నగరాలలో తగ్గుతూ వస్తున్నది అన్న మాట నిజం రేడియో పట్ల తగ్గుతున్న ప్రజాదరణకు కారణం టి వి, సినిమా ప్రభావం ఉన్నమాట కూడ నిజమే. కాని అదే కారణం అని చేతులు దులిపేసుకోకండి, మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల నాణ్యతను కూడ ఓకసారి నిస్పక్షపాతంగా మీ పాతకాలపు కార్యక్రమాలతో పోల్చి బేరీజు వేసుకోండి.
ఇప్పటికైనా, మీ వెబ్ సైట్లను ఆకర్షణీయంగా తయారుచేసి, శ్రోతలకు ఆసక్తి కల అంశాలను ఉంచగలరు. నాకు తోచిన కొన్ని సూచనలు:
1. ప్రతి ఆకాశవాణి కేంద్రానికి ఒక వెబ్ సైటు ఉండాలి. అంటే మీ (మా) ఆకశవాణివారి వెబ్ సైటులోకి వెళ్ళిన తరువాత, అన్ని రేడియో కేంద్రాల వెబ్సైట్లకు అక్షరక్రమలో లింకులు ఒకచోట ఏర్పాటు చెయ్యాలి. శ్రోతల అభిరుచిని బట్టి తమకు కావలిసిన ఆకాశవాణి కేద్రం వెబ్ సైటుకు వెళ్ళగలుగుతారు.
2. అలా ఏర్పాటు చేసిన ప్రతి ఆకాశవాణి కేద్రపు వెబ్ సైట్లల్లో ఈ కింది వివరాలు ప్రముఖంగా ఉండాలి.
a) ఆ కేంద్రపు చరిత్ర, ఎప్పుడు స్థాపించారు, అప్పటి ప్రారంభోత్సవ ఉత్సవ ఫొటోలు (వెతికితే తప్పక దొరుకుతాయి)
b) మొట్టమొదటి కళాకరులు ఎవరు, వారి పేర్లు (ఇవి కూడ దొరకవచ్చు, అంతా కలిపితే గట్టిగా ఏ కేద్రం పెట్టి కూడ 60 ఏళ్ళకు మించి అవ్వలేదు)
c) ఆ కేద్రంలో ఇప్పటివరకు తయారు చేయబడ్డ కార్యక్రమ వివరాలు, వాటి ఆడియో శాంపిల్స్
d) ప్రస్తుతం ప్రసారం అవుతున్న కార్యక్రమ వివరాలు (ప్రోగ్రాం షెడ్యూల్), సమయాలతో సహా (ఇదివరకు మీ పత్రిక "వాణి" లో ప్రచురించేవారే అలా అన్నమాట, ఈ వాణి పత్రిక గురించి ఇప్పటి మీ సిబ్బందిలో ఎంతమందికి తెలూసో మరి!!)
e) పాత నాటికల, ఇతర కార్యక్రమల ఆడియో ఫైళ్ళు,(వీటన్నిటికి కాపీ రైటు కాలదోషం పట్టేసింది, మీరు భవిష్యత్తులో అమ్ముకుందామన్న ఎవరూ కొనుక్కుని వినరు) కాబట్టి డౌన్లోడ్ సౌకర్యం లేకుండా వినడానికి మాత్రమే ఉంచటం.
f) ఎంతో పేరు ప్రఖ్యాతులు, మీ ఆకాశవాణివారు నిర్వహించిన పోటీలలో బహుమతులు, సంపాయించిన కళాకారుల వివరాలు, ఫొటోలతో సహా ఉంచాలి
3. ఏ కేంద్రమైనా సరే ప్రసారాలు జరుపుతున్న సమయంలో, లైవ్ ఫీడ్ ను ఇంటర్నెట్ కు సంధానపరిచి, ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడనుంచైనా సరే వినటానికి, ఇంటర్ నెట్ రేడియో సౌకర్యం. ఏర్పరచాలి. దీనికి మీకు పెద్దగా ఖర్చు ఏమీ కాదు. పైగా ఇది చూపించి, మీరు మీ ప్రకటనలను ఇంకా బాగా అమ్ముకోవచ్చు!! లేదా ఈ కార్యక్రమాలకు విడిగా ప్రకటనలను అమ్ముకోవచ్చు.
ఒక్కసారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ రేడియోలను చూడండి, మన దేశంలో వెయ్యో వంతులేని చిన్ని చిన్ని దేశపు రేడియోలు ఇంటర్నెట్లో చక్కగా ప్రసారాలను అందిస్తూ, వారి ప్రజలు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వినే సౌకర్యం కలిగించారు. మన భారతీయులు అనేక దేశాల్లో లక్షల మంది ఉన్నప్పటికీ, వారు వారికి ఇష్టమైన ప్రాంతీయ ఆకాశవాణి కేద్రం కార్యక్రమాలు వినాలంటే అవకాశమే లేదు. మనకు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక సౌకర్యాలను ఆకాశవాణి అందిపుచ్చుకుని, శ్రోతలకు సౌకర్యవంతంగా ఆ సాంకేతికతను వాడుకోకపోవటమే దీనికి కారణం. ఇప్పటికైనా, ఆకాశవాణి కేద్రాలన్నిటిని, ఇంటర్నెట్ లో వచ్చే సౌకర్యం కల్పించాలని నా ఒక్కడి కోరికే కాదు, లక్షల్లో ఉన్న ప్రవాస భారతీయులందరి మనస్సులో ఉన్న తీరని కల.షార్ట్ వేవ్ ట్రాన్స్మిషన్ ఎంతో ఖర్చుతో కూడుకున్నది. దానితో పోల్చుకుంటే, ఇంటర్నెట్ రేడియో చాలా తక్కువ వ్యయంతో నిర్వహించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలను స్పుటంగా, చక్కటి క్వాలిటీతో శ్రోతలు వినగలుగుతారు.
ఆకాశవాణి భాండారాలలో (ఆర్ఖైవ్స్) లో అలనాటి కార్యక్రమాల టేపులు ఎన్ని మిగిలి ఉన్నాయి? వాటి వివరాలు ఏమిటి? వాటిని బహిరంగంగా (అంటే మీ దగ్గర భద్రంగా ఉన్న టేపులలో ఉన్న కార్యక్రమాల వివరాలు) మీ వెబ్ సైటులో ఉంచటానికి అభ్యంతరం ఏమిటి? ఎవరో గుమాస్తాలు (అదేనండి బ్యూరోక్రాట్‌లు, వారి పదవి పేరు ఏదైనా సరే, ) అమ్మాలని నిర్ణయిస్తే కాని ప్రజలమైన మాకు తెలియకూడదా? ఎన్నెన్ని అలనాటి రేడియో కళా ఖండాలు సిబ్బంది అలసత్వం, చేతకాని తనం వల్ల, లేదా కాలక్రమేణా పాడైపోయినాయి? తప్పకుండా తెలియచేయాలి. 1950 లనుండి ప్రసారమైన రేడియో కార్యక్రమాల టేపులన్ని కూడ భారతదేశ ప్రజల కళాసంపద. ఈ కళా సంపదను 'హెరిటేజ్' గా భావించి వాటి పరిరక్షణకు ఆకాశవాణి తీసుకున్న చర్యలు ఏమిటి.తెలియ చేయాలి. రాబోయ్యే రోజుల్లో తీసుకోబోయే తక్షణ చర్యలు ఆకాశవాణి వారు తీసుకోవాలి.

వ్యక్తుల యాజమాన్యపు హక్కులలో ఉన్న పాతకాలపు భవంతులనే "హెరిటేజ్ భవంతులు" అన్నపేరుతో కూలదోసి మంచి భవంతులు కట్టుకోకుండా ప్రభుత్వం కట్టడి చేస్తున్నది, అటువంటిది అదే ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆకాశవాణి వారి వద్ద ఉన్న ఈ "హెరిటేజ్" టేపులన్ని కూడ పరిరక్షించటానికి ప్రభుత్వం కాని, ఆకాశవాణివారు కాని ఇప్పటికే తీసుకున్న, భవిష్యత్తులో తీసుకోబోతున్న చర్యలను ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత ఆకాశవాణివారి మీద ఉన్నది.
ఇప్పటికి ఈ సూచనలు అమలు పరచగలిగితే, ఆకాశవాణి వారిని శ్రోతలందరం ఎంతగానో అభినందిస్తాం, మెచ్చుకుంటాము. శ్రోతల మెప్పు, అభినందన కంటే ఆకాశవాణి వారికి కావలిసినదే ఏమున్నది? అదికాదు. అనుకుంటె ఈ వ్రాసినదంతా అరణ్య రోదనమే.
 =====================================================================
ఆకాశవాణి వారి వెబ్ సైట్లో పనిచెయ్యని పుటల జాబితా (నేను చూసినంత వరకు)
వెబ్ పేజీ శీర్షిక
లింకు
అక్కడకు వెళ్ళగానే కనపడే సమాచారం/సందేశం
AUDIO PROGRAMMES
THE AUDIO PROGRAMMES ARE NOT CURRENTLY AVAILABLE
LIVE AUDIO
SAME AS ABOVE
IMPORTANT BROADCASTS
SAME AS ABOVE
RADIO GUIDE
RADIO GUIDE UNDER CONSTRUCTION
AIR RESOURCES
LINK NOT WORKING
ఆకాశవాణి వారి వెబ్ సైటు తెరవగానే కనపడే అద్బుత దృశ్యం
క్లిక్ చేసి పెద్దది చేసి చూడగలరు


============================================

11 కామెంట్‌లు:

  1. మీ బహిరంగ లేఖ బాగుంది. ఈ ఆవేదన అరణ్య రోదన కాకూడదని నా ఆకాంక్ష!

    రిప్లయితొలగించండి
  2. భానూ, వెణూ,సుజాతా గార్లకి ధన్యవాదాలు. సుజాతగారూ, రేడియో కార్యక్రమాల అభిమానులందరి తరఫునా ఆకాశవాణి వారికి ఈ బహిరంగ లేఖ సంధించాను. అందరి సంతకాలూ ఉన్నాయి. చూద్దాం ఆకాశవాణి వారు స్పందిస్తారో లేదో. లెకపోతే రైట్ టు ఇంఫర్మేషన్ ఏక్ట్ కింద, ఈ వివరాలు అడిగితే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  3. I share your frustration.
    ప్రస్తుత విజయవాడ స్టేషన్ డైరెక్టరు (ఈయన పేరు గబుక్కుని గుర్తు రావట్లేదు), తెలుగన్నా, సాహిత్యం అన్నా అభిమానం ఉన్నవారు. అలాంటి వారిని కదిల్చి, ఒక నిర్దుష్టమైన ప్రణాళికతో ఎప్రోచ్ అయితే ఏమన్నా మంచి ఫలితం ఉండొచ్చు.

    రిప్లయితొలగించండి
  4. కొత్త పాళీగారూ. నా బాధను పంచుకుంటున్నందుకు, నాలాంటి శ్రోతలందరి తరఫునా ధన్యవాదాలు. ఈ విషయం ఏ ఒక్క ఆకాశవాణి కేంద్రానిదో కాదండి. దేశవ్యాప్తంగా ఉన్న డజన్ల ఆకాశవాణి కేంద్రాలన్నిటికి సంబంధించి, ఉన్న కామన్ వెబ్ సైటు గురించి. సామాన్యంగా బ్యూరోక్రసీలో, ఏ ఒక్కరో ఇటువంటి విషయాలు, వారికి ఆ విషయం మీద ఎంత ఆసక్తి ఉన్నా, నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఉండవు. స్టేషన్లవారీగా వెబ్సైటులు ఉంచుకునే అధికారం కనుక ఇచ్చి ఉంటే, ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు కేద్రాల వారు, వారి వారి వెబ్ సైట్లను అద్భుతంగా తీర్చి దిద్ది ఉండేవారు. ఈ విషయంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు.

    ఇదంతా ఏ మాత్రం కళా హ్రుదయంలేని పెద్ద గుమాస్తాల వల్ల వచ్చిన తంటా. వారికి తట్టదు, చెబితే వినరు. అందుకని పూర్తి ప్రజానీకం నుండి స్పందన వస్తే, మీడియా కూడ అందుకుని, ఈ విషయం మీద ఒక ఫీచర్ వ్రాసి(వారి సెన్సేషనలిజం కు భిన్నంగా), కొంత వత్తిడి తీసుకు వస్తే, ఈ సాహితీ సంపదను, రేడియో కళారూపాలను, ప్రస్తుతం ఎక్కడ ఎన్ని, ఎటువంటి స్థితిలో ఉన్నాయో తెలిస్తే కొంత మనశ్శాంతి. ఆ తరువాత. అలనాటి కార్యక్రమాలను, వారి వెబ్ సైటులో ఉంచేట్టుగా చెయ్యగలగాలి, కనీసం వినటానికి, డౌన్లోడ్ లేకపోయినా పరవాలేదు. ప్రభుత్వం పెట్టే ఎన్నెన్నో ఖర్చుల్లో, ఈ ఖర్చు ఒక లెక్కలోనిది కానేకాదు. పైగా అలా ఆ ఆడియోలను ఉంచిన చోట వ్యాపార ప్రకటనలు ఉంచి డబ్బుకూడ చేసుకుని, జరిగిన ఖర్చు కంటె ఎక్కువే తిరిగి పొందవచ్చు.

    ఈసారి మా ఊరు విజయవాడ వెళ్ళినప్పుడు స్టేషన్ డైరక్టరు గారిని కలిసి నా బాధను వారికి వినిపిస్తాను. నేను వెళ్ళినప్పుడల్లా, ఆయన బిజీగా ఉండటం, నేను బయట కొంతసేపు వేచి చూసి లాభంలేక తిరిగి వచ్చేయటం జరుగుతున్నది. ఈసారి పక్కాగా అప్పాయింటుమెంటు తీసుకుని వారిని కలవాలి. మంచి సమాచారం ఇచ్చినందుకు థాంక్స్.

    రిప్లయితొలగించండి
  5. పైన ఒక వ్యాఖ్యకి సంబంధించి :
    విజయవాడ కేంద్రం ప్రస్తుత డైరెక్టరు యం.ఆదిత్యప్రసాదు .
    శ్రోతల అభిప్రాయాలని తెలుసుకుని పాటించే ప్రయత్నం
    తప్పకుండా చేస్తారు. అయితే శివ గారు అన్నట్లు ఇది
    ఒక్క రేడియో స్టేషను సంబంధిత విషయం కాదు. ఇలాంటి
    వాటికి ఢిల్లీ నుండి తగిన అనుమతి పొందటమే కష్టం :(

    Station Director ,
    All India Radio , Vijayavada ,
    520010 చిరునామాకి ఎవరైనా లేఖ వ్రాయవచ్చును

    రిప్లయితొలగించండి
  6. MANAVANI GAROO Thank you for your comment.

    Writing a letter is ok but I am quite apprehensive about where it would lost in the bureaucratic labyrinth of the behemoth of All India Radio.

    Being a medium of mass communication, I hope and wish they would be monitoring Papers, Magazines and now the Blogs also for any comments about All India Radio and they would see the Open Letter and all the comments thereon.

    My worry is that why we do not have web sites like the following:

    http://www.archive.org/details/oldtimeradio

    http://www.archive.org/details/OTR_Sherlock_Holmes_smurfmeat

    Only Shri Maganti Vamsi and Shri Susarla Sayi and Shri Ramamkrishna have kept a few files contributed by yours truly and others.

    May such web sites multiply and thrive.

    రిప్లయితొలగించండి
  7. Shiva garu!
    RTI is the best tool to fetch some good results. pl.try it.

    రిప్లయితొలగించండి
  8. సూటిగా, స్పష్టం గా వుంది లేఖ.+ve response వస్తుంది అని ఆశిస్తూ..

    రిప్లయితొలగించండి
  9. ఈ మద్య ఆకాశవాణి ఒక ప్రకటన కూడా ఇచ్చింది
    పాత రేడియో కార్యక్రమాలు ఎవరిదగ్గరైన ఉంటే పంపమని
    ఇది ఎంత దారుణం
    అలనాటి బంగారంలాంటి కార్యక్రమాలు భద్రపరచలేకపోయారు
    నేను కడప రేడియో స్టేషన్‌ కార్యక్రమాలు 80వ దశకం చివరలో మరియు 90వ దశకంలో వినేవాడిని ఆ కార్యక్రమాలు ఇప్పుడు వినాలంటే దొరకటంలేదు
    కనీసం వాటి సంగీతం కూడా లేదు

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.