9, అక్టోబర్ 2010, శనివారం

చందమామలో సాంఘిక కథా !!??

RSS"చందమామ"లో సాధారణంగా ఎటువంటి కధలు మనం
చదువుతాం.రాజకుమారులు, మాంత్రికులు,దేవకన్యలూ,
ఎగిరే గుర్రాలు ఇలా మనల్ని మరోవింతలోకాలకు తీసు
కొని వెళ్ళే కధలు. సాంఘిక కధలు, ఆసలు అగుపించవు.
ఐనా 1953 మార్చి సంచికలో "పక్షి దాచిన జాబు"అనే
సాంఘిక కధ, వి.నారాయణమ్మ గారు వ్రాసింది ప్రచురించ
బడింది. ఈ కధ ప్రారంభమే ఇలా సాగుతుంది!
"మద్రాసు,త్యాగరాయనగరులో రత్నం,సీతాపతి,అని
యిద్దరు తెలుగు కుర్రవాళ్ళు ఉండేవాళ్ళు.చిన్నప్పటి
నుంచి ప్రాణస్నేహితులుగా పెరిగారు"
క్లుప్తంగా కధ ఏమిటంటే ఓ నాడు ఈ ఇద్దరూ బజారులో
చిత్రంగా దెబ్బలాడు కొంటారు. మరు నాడు సీతాపతి నెత్తురు
మడుగులో చనిపోయి అగుపిస్తాడు. అందరూ రత్నాన్ని
అనుమానిస్తారు.పోలీసులు రత్నాన్ని అదుపులోకి తీసు
కొంటారు. ఈ లోగా ఆ ఊరి గుడి గోపురం పైకిఎక్కి ఆట
లాడు కొంటున్న పిల్లల్లొ ఒకడికి గుడి గూటిలో ఓ ఉత్తరం
అగుపిస్తే దాన్ని తన తండ్రికి చూపిస్తాడు.అందులో సీతాపతి
తను చెడువ్యసనాలకు బానిసైనానని, స్నేహితుడు రత్నం ఎంత
చెప్పినా వినలేదని, అప్పుల్లో కూరుకుపోయిన తను ఆత్మ
హత్య చేసుకొంటున్నాని వుంటుంది.అది అతని దస్తూరీ
అని నిర్ణయించి రత్నాన్ని విడుదల చేస్తారు.ఇదీ "పక్షి
దాచిన జాబు" కధ. ఇలా "చందమామ"లో ఓ సోషల్ కధ
అబ్బాయిలు పాంటు ,ఇన్ షర్టులతో అగుపించడం ఆరోజుల్లో
మాకు వింతగా తోచింది.అటు తరువాత అలాటి కధలు
మళ్ళీ మాకు మన చందమామలో అగుపించలెదు.ఈ రోజు
1953 నాటి నా పాత చందమామ వాల్యూమ్ చూస్తుంటే
ఈ కధ అగుపించి నా భావాలు మీతో పంచుకోవాలనిపించింది.

=================================================
పై వ్యాసం ప్రముఖ కార్టూనిస్టు, మన చందమామ బ్లాగ్ సహ రచయిత శ్రీ మట్టగుంట అప్పారావుగారు తన బ్లాగ్ "రేఖా చిత్రం" లో వ్రాసినది
=============================================

అప్పారావుగారూ! మంచి ప్రస్తావన తెచ్చారు. పిల్లల కథలు అంటె జానపద, పురాణ కథలె ఉండాలా. ఈ కాలపు కథలు ఉందకూడదా? ఇలా కనుక ఎవరైనా గద్దించి అడిగితే, నెనైతే ఘట్టిగా "అవును" అనే సమాధానం చెప్తాను. మీరు ఉదహరించిన చందమామ కాలానికి ఇంకా కొడవటిగంటి కుటుంబరావుగారు చందమామ సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించినట్టు లేదు. మీకు అప్పట్లోనే (అంటే మీ చిన్నతనపు రోజుల్లో) ఈ కథ చందమామలో వెయ్యటం చిత్రంగా అనిపించటంలో విడ్డూరమేమీ లేదు. చిన్నపిల్లల కథలు అంటే ఎలా ఉండాలి అంటే? పెద్దలు నిర్ణయించిన గిరుల్లో ఇమిడిపోతే అవి చిన్న పిల్లల కథలు ఎలా ఔతాయి. మరి? చిన్నపిల్లలే వ్రాయాలా? లేదు! చిన్నపిల్లలకు ఏమి ఇష్టమో కనిపెట్టాలి, పిల్లలకు ఇష్టమైనవి, వారికి చిత్రంగా ఉండేవి, అలా చిత్రంగా ఉంటూనే వారికి తెలియవలసిన విషయాలు తెలియ చెప్పేవి అయి ఉండాలని చందమామ వారి అభిప్రాయం, కాదు కాదు కొడవటిగంటి వారి అభిమతం. ఎందుకు అంటే, కుటుంబరావుగారు చందామామ సంపాదక బాధ్యతలు స్వీకరించేవరకు ఉన్న చందమామది ఒక రూపం, ఒక పధ్ధతి. చందమామకంటూ ఒక శైలి భాష లేవు. ఏదో వచ్చిన కథలలో అప్పటి సంపాదకులకు నచ్చిన కొన్ని కథలు వేసెయ్యటం, వాటికి బొమ్మలు గీయించటం అంతె, కుటుంబరావుగారు (అప్పటికే ఆంధ్ర పత్రిక సచిత్ర వార పత్రికను దశమార్చి వచ్చారు) చందమామ సంపాదకులుగా బాధ్యతలు స్వీకరించటం, తెలుగు బాలలు చేసుకున్న అదృష్టం.

పిల్లలకు తమ చుట్టూ తాము రోజూ చూస్తున్న విషయాలనే కూర్చి కథలుగా చెప్తే పెద్దగా ఇంటరెస్టు చూపించరు. అందుకే వాళ్ళకు కథలు చెప్పే నేర్పు ఉన్న బామ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు అప్పటికప్పుడు ఎన్నెన్నో విచిత్ర ప్రపంచాలను సృష్టించి కథలు చెప్తూనే వారికి చెప్పవలసిని నీతులు, నడవడిక రీతులను బోధించేవారు. ఇదే కీలకాన్ని పట్టుకుని, కొడవటిగంటి కుటుంబరావుగారు చందమామను దశాబ్దాలపాటు నిర్విఘ్నంగా పిల్లల అభిమాన పత్రికగా నడిపారు. అందుకనే, ఈ నాటికి ఆయన సంపాదకత్వంలో వెలువడ్డ చందమామ పాత ప్రతులంటే అంత పిచ్చి, క్రేజ్ ఆపైన సేకరణ చెయ్యాలన్న ఆతృత. చందమామ కథల వెనుక ఒక సైన్సు ఉన్నది అని ఆంధ్ర జ్యోతి (నవ్య) వారపత్రిక సంపాదకత్వంలో అదీ 2010లో వ్రాశారంటె, చందమామ కథలు అప్పటి బాలల మనోఫలకాలమీద ఎంతటి చెరగని ముద్రలు వేశాయో తెలుస్తున్నది.

పాత సంచికలు తమ వద్ద ఉన్న వారు ఒక విషయం గమనించవచ్చు. చిత్రా, శంకర్ చిత్రకారులు చందమామ మొదటినుంచీ ఉండి బొమ్మలు వేసినప్పటికీ, వారి బొమ్మల్లో జీవం, కథలకు సొగసునిచ్చే గుణం, కుటుంబరావుగారి సంపాదకత్వంలోనే అబ్బిందని చెప్పాలి. చందమామ గొప్పతనం గురించి చెప్పుకునేప్పుడు, చిత్రా, శంకర్, వడ్డాది పాపయ్యలగార్లకు పెద్ద పీట వెయ్యాలి. కొడవటిగంటి, చిత్రా, శంకర్, వడ్డాది పాపయ్యలు నలుగురూ నాలుగు స్తంభాలుగా, ఆపైన కప్పుగా చక్రపాణి నాగిరెడ్డిగార్లు, చందమామను నభూతో:నభవిష్యతి: గా నడిపారు. మరి ఇప్పుడు......

చందమామకు పోటీగా ఒక పత్రిక ఉండేది "బాలమిత్ర" అని. అందులో అన్ని రకాల కథలు వేసేవారు. ఒక్క జానపదమే కాదు, సాంఘిక డిటెక్టివ్ కథలను కూడ ఆ రోజుల్లోనే వేసేవారు. విదేశీ కథలను యధాతథంగా అవే పేర్లతో ప్రచురించేవారు కాని పాపం, చందమామకు వచ్చిన ప్రాశస్త్యం బాలమిత్రకు రాలేదు. బాలమిత్ర పాత సంచికలు సంపాయించాలని, అవి మళ్ళి చదవాలని తహతహలాడేవాళ్ళను నేను చూడలేదు.

చందమామ మహోన్నత కాలంలో ప్రతి నెలా ఆ సంచిక అందుకుని చదువుకున్న అదృష్టవంతులుగా, అలనాటి చందమామనే మళ్ళి మళ్ళి చదువుంకుటూ ఇప్పటికీ ఆనందపడుతున్న అప్పటి పిల్లలు, ఇప్పటి పెద్దలైనా కూడ పిల్లలుగానే ఉండగలిగినవారు నాతో ఏకీభవిస్తారనుకుంటాను.
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.