21, డిసెంబర్ 2010, మంగళవారం

ఉషశ్రీ వ్యాఖ్యానంతో రేడియో నాటికలు


ఉషశ్రీ గారు అంటే పురాణాలు, ధర్మ సందేహాలే గుర్తుకు వస్తాయి. కానీ, ఆయన రేడియో నాటికలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి, హాస్యాన్ని కూడా పండించారు అన్న విషయం చాలా కొద్దిమందికే తలుసు. రెండున్నర దశాబ్దాల క్రితం ఒక ఉగాది పండుగ సందర్భంగా, ఆకాశవాణి విజయవాడ వారు చక్కటి నాటికలను ఉషశ్రీ గారి వ్యాఖ్యానంతో ప్రసారం చేసారు. హాస్య నాటికలను ఉషశ్రీ గారి వ్యాఖ్యానంతో ప్రసారం చెయ్యాలని ఆలోచన ఎవరిదో కాని, ఆ ప్రయోగం అద్భుతంగా పండింది.

ఈ మధ్యనే మా తమ్ముడు రాధాకృష్ణ దీపావళి పడక్కి బెంగుళూరు వచ్చినప్పుడు, తన దగ్గరున్న కొన్ని కాసెట్లు పట్టుకు వచ్చాడు. అందులో రేడియో నాటికలు కూడా ఉన్నాయి. దాదాపు ౩౦+ సంవత్సరాల క్రితం ఆకాశవాణి విజయవాడ వారు ప్రసారం చేసిన "చిలకల పందిరి" అనేటువంటి నాటికల సంపుటి దొరికింది. ఇదొక విచిత్రమైన ప్రయోగం. ఏభై నిమిషాలకు పైగా ఉన్నది. రెండు భాగాలుగా ప్రసారం చేసి ఉంటారు.

దీంట్లో నాటికలు, చెళుకులు, ఇద్దరి మధ్య సంభాషణలు ఇలా ఒక హాస్య కదంబంగా జరిగిపోతూ ఉంటుంది. ఈ కార్యక్రమం మొత్తానికి తలమానికమైనది ఉషశ్రీగారి వ్యాఖ్యానం గురించి తప్పనిసరిగా చెప్పాలి. తన పురాణ ప్రవచనాలతో ఎంతో పేరు తెచ్చుకున్న ఉషశ్రీ గారు, ఈ నాటికలన్నిటికి ప్రయోక్తగా వ్యవహరించటం. ఆయన పురాణాలు మాత్రమే విని ఉండిన వాళ్ళకు ఉషశ్రీ గారు పోషించిన ఈ కొత్త పాత్ర చిత్రంగా ఉండకపోదు.

ఈ మొత్తం నాటికలు వగైరాలను, శ్రీ రమణ గారు రచించారు. పాత్రలు పోషించినవారు, అకాశవాణి విజయవాడ కేద్రంలోని అతిరధ మహారధులే.

1. శ్రీ చివుకుల రాం మోహన రావు
2. శ్రీ పేరి కామేశ్వర రావు
3. శ్రీ మామిడిపల్లి వీరభద్ర రావు (ఆయన అప్పటికి "సుత్తి" వీరభద్ర రావు కాదు)
4. శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (తరువాత్తరువాత ఆంధ్ర జ్యోతి వార పత్రిక సంపాదకులు)
5. శ్రీ మల్లాది సూరిబాబు
6. శ్రీమతి ఎం నాగ రత్నమ్మ
7. శ్రీమతి.వై సరోజా నిర్మల
8. కుమారి వి బి కనదుర్గ
ఒక్క నండూరి సుబ్బారావుగారే ఏ కారణానో ఈ చక్కటి నాటికలలో లేరు.

నాటికలలో, ఆల్లుడు పండక్కి వచ్చినప్పుడు మామగారు పడే బాధ, ఆపైన ఆ బావగారిని తన తవికలు అదే కవితలతో బెదరగొట్టి తరిమేసిన బావమరిది, మాట్లాడటం చేతకాకపోయినా ఏదో చెత్త పోగేసి ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే తాను నాయకుడు అనుకునే మనిషి, వాగుడు, నాటకాల పిచ్చి రాజుగారూ, చిత్రమైన మనస్తత్వాలతో ఉన్న మనుషులు తమ మాటలతో పుట్టించే హాస్యం అన్నీ కూడ కలగలిపి ఉన్నాయి.

సందర్భోచితంగా ఉషశ్రీ గారి వ్యాఖ్యానం, చక్కటి ఉప్మాలో వచ్చే జీడిపప్పుల్లాగ ఉంటుంది. ఈకింద ప్లేయర్లో విని ఆనందించండి.



కాని రికార్డింగు ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితంది కావటంతో, ఎంతో కష్టపడి డిజిటైసు చేసినా, కొన్ని కొన్ని చోట్ల టేపు సహకరించక కొద్ది కొద్దిగా నాటికలలో అంతరాయం ఏర్పడింది.

ఈ నాటికలను రికార్డు చేసి, ఇంతకాలం కాసేట్టును భద్రపరిచి, నాకు అందచేసిన మా తమ్ముడు కప్పగంతు రాదాకృష్ణకు అభినందనలతో ఈ చిన్ని వ్యాసం ఇక్కడ ప్రచురించాను.

ఆకాశవాణివారు తమ పాత ప్రసారాలు ఎవరన్నా ఇస్తే బాగుండునని పత్రికా ప్రకటన ఇస్తున్నారుకదా. ఈ రికార్డింగును వారు తీసుకుని, వారివద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యం పెంచి అందరికీ అందించగలిగితే ఎంతైనా సంతోషించవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.