24, డిసెంబర్ 2010, శుక్రవారం

ఉల్లి గోల


పై ఫోటోలో కనిపిస్తున్నటువంటి చక్కటి ఉల్లిపాయలు మధ్య ఎప్పుడన్నా మనం మార్కెట్టులో చూశామా? అన్ని డాగులు పడిపోయినవి, నాణ్యం లేని ఉల్లిపాయలె మనకి. ఉల్లిపాయలకి ఆ పలచటి పొరలు కనపడటం మానేసి చాలా సంవత్సరాలు గడిచిపొయినాయి. మంచి నాణ్యమైన సరుకంతా ఎగుమతి కోసమట. మన దేశంలో పండే మంచి సరుకు మనం తింటానికి కాదట. ఇలా సంపాయించిన విదేశీమారక ద్రవ్యమంతా పెట్టి ఏమి చేస్తున్నాము? ప్రతివాడూ ఒకా కారో, మోటారు సైకిలో కొనుక్కుని దాంట్లోపోసుకోవటానికి పెట్రోలు. మన దేశానికి అటు ఇటు దాపురించిన దిక్కుమాలిన ఇరుగు పొరుగుల బారినుంచి కాపాడుకోవటానికి ఆయుధాలు కొనుగోలు. ఇది మన విదేశీ వ్యాపారమంతా!

ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళంబట నీళ్ళుకారుతుంటాయి. అది సహజం. కానీ ఈనాడు ఉల్లిపాయలు కొంటుంటే కూడ కళ్ళనీళ్ళు వత్తుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు వ్యాపారులు. పాపం పండించే రైతుకు సరిగ్గా ధరలు లేక వాళ్ళు పడే బాధలు వాళ్ళు పడుతున్నారు. కొనలేక వినియోగదారులైన మనం విలవిలలాడుతున్నాము.

సామాన్యంగా ఏదన్నా వస్తువు ధర పెరుగుతొంది అనంగానే సంచీలు పట్టుకునిపోయి ఎగబడిపోయి, అవసరమా కాదా అని కూడ చూడకుండా ఎంత రైటైతే అంత గొప్ప అన్నట్టుగా కొనటమే ఫ్యాషనైపోయింది జనానికి. ఇలా రేటు పెరుగుతుంటే, ఒక్క నాలుగురోజులో వారం రోజులో ఆ వస్తువు లేకుండా ఉగ్గబట్టుకు కూచోగలిగితే, ఈ దళారీ వ్యాపారులందరూ మట్టికరిచిపోతారు. వాళ్ళ గిడ్డంగులలో సరుకు పెరిగిపోయి రేట్లు పడిపోతాయి

ఉల్లిపాయలు లేకుండా మన బతకలేమా. అవేమన్నా మనకు ముఖ్య ఆహార పదార్ధమా? కూరల్లోకి వాడుకునే మరొక కూర. కాని రేటు పెరుగుతోంది అనంగానే గాభరాపడిపోయి, మరింత కొనటంతో, మధ్య వ్యాపారుల పంట పండుతోంది. పంట పండించిన రైతుకు ఇందులో ఒక్క పైస వెళ్ళటంలేదు. ఆ రైతు అప్పుల పాలై గ్రామల్లో అఘోరిస్తూనే ఉన్నాడు.

వినియోగదారులమైన మనం అందరం ఒక చోట కూచుని కూడబలుక్కుని ఏమీ చెయ్యక్కర్లేదు. వస్తువులు దాచి రేటు అనవసరంగా పెరుగేట్టు చేస్తున్నారు అని అనుమానం రాంగానే, అటువంటి వస్తువు కొనకుండా కొన్ని రోజులు ఆగ గలిగితే, ఇలా ఏదో ఒక చోట కాస్త పంట తగ్గటమో, అకాల వర్షాల వల్ల పాడవటమో జరగంగానే, ఉన్నట్టుండి రేట్లు పెంచే ధైర్యం చెయ్యరు ఈ దళారీ వ్యాపారులు.

ఆర్ధిక శాస్త్రంలో కూడా గిరాకీ పెరిగిన కొద్దీ ధరలు పెరిగిపోతుంటాయని చెపుతుంటారు. గిరాకీ అంటే ఏమిటి, వినియోగదారుడు కొందామన్న కోరికను అదుపుచేసుకోలేక ఎగబడటమే గిరాకీ. అలా ఎగబడటాన్ని ప్రోత్సహిస్తున్నది మన మీడియా, ఎడ్వర్టైస్‌మెంట్ మాఫియా. అలా ఎగబడే గుంపు మనస్తత్వం నుండి బయటపడి, ఈ వస్తువు కొన్ని రోజులు లేకపోయినా ఉండగలం అని ఒక దృఢ నిర్ణయానికి వచ్చి, వినియోగదారుడు క్రమశిక్షణతో మెలగగలిగితే, దొంగవ్యాపారులు మన్ని ఏమీ చెయ్యలేరు.

అయినా చేతకాని మంత్రులు, చేతకాని ప్రభుత్వం కాకపోతే, ఒక పక్క పంటలు పాడవుతున్నాయన్న విషయం స్పుటంగా తెలుస్తుంటె, ఉల్లిపాయల ఎగుమతికి అనుమతి ఇవ్వటం ఏమిటి. రాజకీయ దురంధరులే మత్రులు అవుతున్నారుకాని, సమర్ధత ఉండి పరిస్థితులను చక్కబెట్టగల నైపుణ్యం ఉన్నవాళ్ళు మంత్రులు అవ్వటం లేదు. ఇది కూడ మనమందరమూ కలిసి తెచ్చిపెట్టుకున్న దురదృష్టమే. అదరూ ఓటు వెయ్యటం ఒక ప్రాధమిక కర్తవ్యంగా భావించి, ఉన్నవాళ్ళల్లో ఒక మంచి సమర్ధత కలిగిన వ్యక్తికి ఓటు వేయటం మొదలుపెడితే, వ్యవస్థ మారే అవకాశం ఉన్నది. ఓటింగు శాతం పెరిగితే డబ్బెట్టి ఓట్లేయించుకోవటం లాయికీగా లేక ఆపని వాళ్ళే మానేస్తారు.

కొన్నాళ్ళూ ఉల్లిపాయలు కొనకుండా ఉంటే, వాటి ధరలు ఎందుకు తగ్గవో చూద్దాం.

2 కామెంట్‌లు:

  1. వుల్లిపాయ సరే సార్ కొనటం మానేస్తాం.. మరి బియ్యం ధరలు కూడా పెరుగుతున్నాయే!
    ధరలు తగ్గటానికి కొనటం మానటం సరయిన వీలయిన చర్య కాదేమో!

    రిప్లయితొలగించండి
  2. హనుమంత రావుగారూ, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. శాంతియుతంగా ప్రజలు చెయ్యదగ్గ పని అంతకంటే ఏమున్నది చెప్పండి. ఏమీ చెయ్యలేమని బాధపడుతూ, ఆ పెరిగిన రేట్లకే ఎగబడి కొనేకన్న స్వయం నియంత్రణ వినియోగదారుడు చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎర్ర కథల్లోలాగ కొట్లమీద పడి ధ్వంసం చేస్తే ధరలు తగ్గుతాయా?

    మీరు గమనించండి, ఉల్లిపాయ రేట్లు, టమోటా రేట్లే ఇలా తారా జువ్వల్లగ ఒక్కసారిగా పైపైకి వెళ్ళిపోతాయి. ఈ రెండు వ్యావసాయిక ఉత్పత్తులూ ముఖ్యంగా టమోటా ఎక్కువకాలం దాచి ఉంచలేరు అవి పాడైపోతాయి. అందుకని వినియోగదారులు కొనటం కొద్దిగా తగ్గించుకోవటమో కొంతకాలం మానటమో చేస్తే, వ్యాపారులకు భయం కలుగుతుంది, మళ్ళి అటువంటి పని చెయ్యటానికి వెనుకాడతారు. బియ్యం రేట్లు నిమ్మదిగా పైకి వెళ్తుంటాయి. బియ్యానికి ఇదే పనిచేయగల శక్తి వినియోగదారుడికి లేదు. కారణం బియ్యం మన ప్రధాన తిండి గింజలు. కూరలోకి ఉల్లిపాయ లేకపోతేనే విలవిలలాడిపోయి, రేటు పెరుగుతోంది అనంగానే మరెంత పెరుగుతుందో అన్న గుంపు భయంతో కొనటానికి పరుగుపెట్టే వినియోగదారులకి బియ్యం కూడా ఒక్క రెండురోజులు ఉపోషం ఉండి కొనకండ్రా అంటే వింటారా. కాస్త రేటు పెరుగుతొంది అనంగానే తమవల్లే (ధర పెరిగినా ఎగబడటంవల్ల) ధరలు మరింత పెరుగుతున్నాయన్న విషయం అందరూ తెలుసుకోగలిగి, కొంతలో కొంత తమను తాము నియంత్రించుకోవాలి. తినుబండారాలలో ఉల్లి వాడకం తగ్గించటం పెద్ద కష్టం కాదు. హోటళ్ళకెళ్ళి, రోడ్లమీద మిక్చరు బండీలమీద ఉల్లిపాయ వేసిన ఆయా పదార్ధాలు తినటం తగ్గించుకుంటే చాలు. అదీ ఒకటి రెండురోజులు, అతే గుణం వెంటనే కనిపిస్తుంది. నా ఉద్దేశ్యం, వినియోగదారులకు కూడా కొంత క్రమశిక్షణ ఆలోచనా శక్తి ఉండాలి. అవి ఉండి తమను తాము కొంత నియంత్రించుకుంటూ ఉంటే, దొంగ వ్యాపారుల పని పట్టవచ్చు. ఇటువంటి స్వయం నియంత్రణ ప్రలందరూ సమిష్టిగా చెయ్యగలిగితేనే, ఒక సమాజంగా మనకు వెసులుబాటు. ఎవడిగోల వాడిదిగా ఉంటే, ఇలానే, సమాజంలో చీడపురుగుల్లాగ ఈ మధ్య వ్యాపారులు అటు రైతుని, ఇటు మనల్ని వాళ్ళ స్వార్ధంకోసం హాయిగా ఏమాత్రం భయం లేకుండా వాడుకుంటారు.

    బియ్యం రేట్లు పెరగటానికి సవాలక్ష కారణాలు. రైతుకి అయ్యే ఖర్చే పెరిగిపోయింది. ఎరువులు, క్రిమి సమ్హారకాలు, వడ్డీ రేట్లు, ఇలా అనేకం. వస్తు తయారీలో కావలిసిన వాటి ధరలు పెరగటం వల్ల ధర పెరగటం సామాన్యం. మనకి మన జీతాలు/ఆదాయాలు ఐదంకెలు, ఆరెంకలు కావాలి, రైతు మటుకు ధాన్యం పండించి రెండ్రూపాయలకు ఇవ్వాలంటే ఎలా ఇస్తాడు. రైతు బతకాలా వద్దా? మనం దాచుకునే వందరూపాయలకి సంవత్సరానికి 15 శాతం వడ్డి రావాలి, రేట్లు మటుకు తగ్గాలి. ఎన్ని మోసాలు చేస్తున్నా వడ్డీ రేట్ల మోజులో జనం చిట్ ఫండ్ల దగ్గరికి ఎగబడుతున్నారు. ప్రజలకి ఇంతేసి వడ్డీలు ఇస్తుంటే, ఆ చిట్ ఫండు వాళ్ళు లాభం రావాలంటే ఏమి చెయ్యాలి? వాళ్ళు 30 శాతానికి అప్పులు ఇవ్వాలి. ఎవరికి ఇస్తారు. దొంగ వ్యాపారులకి సరుకులు దాచెయ్యటానికి ఇస్తారు. ఆ దొంగవ్యాపారి, తాను ఇంత పెద్ద మొత్తంలో తీసుకున్న అప్పుమీద కట్టే వడ్డి కూడ మనం కొనే బియ్యం ధరమీద వేస్తాడు. ఇటు వచ్చే పెద్ద వడ్డి కాస్త ఆ పెంచబడిన రేటు పెట్టి వస్తువులు కొనేప్పటికి అదికాస్త సున్నా. క్లుప్తంగా అది విషయం. ఇక్కడ కూడ పరోక్షంగా రేటు పెరగటానికి కారణం ఎవరు. మనలో ఉన్న దురాశ. మన డబ్బులుకి పెద్ద వడ్డీలు రావాలి, రేట్లు తగ్గాలి అన్నటువంటి అసహజమైన ఆలోచన.

    ఉల్లిపాయ ధరలు కృత్రిమంగా పెంచబడినాయి అది గమనించుకోవాలి. అటువంటి కృత్రిమ ధరల పెంపుకు అరికట్టే శాంతియుత సాధనం ఆ వస్తువును కొన్నాళ్ళు కొనకుండా బహిష్కరించటమే. కొట్టండి,చంపండి, నరకండి, కొట్లమీదపడి దోచండి వంటి మాటలు చెప్పే ఇజాల వాళ్ళు చెయ్యలేని పని ప్రజలలందరూ చర్య తీసుకుంటే సమస్య శాంతియుతంగా పరిష్కరించబడుతుంది. ఎవరికి వాళ్ళు మనమొక్కళ్ళం ఏమి చెయ్యగలం అన్న నిర్లిప్తత లోంచి బయటపడలేకపోతే, ఇక అంతే!

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.