25, డిసెంబర్ 2010, శనివారం

54 ఏళ్ళు దాసరిగారు ఉన్న ఇంటి కథ

ఇంటర్నెట్లో దాసరిగారి పేరు వ్రాయగానే గూగుల్ లో వచ్చే ఫొటోలన్ని ఒక్కటే ఫ్రేం లో ఉంచాను. ఫోటోలలో ఎక్కువ భాగం అందించిన వేణు గారికి కృతజ్ఞతలు
********************************
మనకు అభిమానపాత్రులైన రచయితలు కాని, గాయకులూ కాని , నటులు కాని, వారున్న ఇల్లు, చదువుకున్న బళ్ళు, తిరుగాడిన ప్రదేశాలు చూసుకోవటం కొంత తృప్తి ఇస్తుంది. వ్యక్తిని చూడలేకపోయినా, ఆయన తిరుగాడిన ప్రదేశాలు చూసి ఆయన్ని చూసినంత సంతోషం కలుగుతుంది.

చందమామ ధారావాహిక రచయిత శ్రీ దాసరి సుబ్రహ్మణ్యంగారు తాను చందమామలో ఏకధాటిగా 54 సంవత్సరాలు పని చెయ్యటమే కాదు, అంతకాలమూ కూడా ఒకే ఇంట్లో ఉన్నారన్న విషయం తెలిసి ఆశ్చర్యం కలిగింది. ఒకే సంస్థను నమ్ముకుని (వాళ్ళెంత తనకు గుర్తింపు ఇవ్వకపోయినా) సంస్థ ఎదుగుదలకు ఎంతో కృషిచేస్తూ ఐదున్నర దశాబ్దాలపాటు అక్కడే పనిచెయ్యటం ఇప్పటి తరానికి విచిత్రమైన విషయం. కాని పాత రోజుల్లో, ఇలా దశాబ్దాల పాటు ఒకే యజమానికి సేవచేసి జీవితాలు గడిపినవాళ్ళు అనేకమంది ఉన్నారు.

దాసరి వారు ఐదున్నర దశాబ్దాలూ ఒకే ఇంట్లో ఉన్నారన్న విషయం మన చందమామ రాజశేఖర రాజుగారు చెప్పినప్పుడు, ఇక ఆయన వెంటపడటం మొదలు పెట్టాను, ఇంటి ఫోటో పంపమని. అదృష్టవశాన , చందమామ ప్రస్తుత కార్యాలయం, ఇంటి పక్కకే మధ్యనే తరలించబడటం బాగా కలిసి వచ్చింది. రాజశేఖర రాజుగారు, ఇల్లు, పరిసర ప్రాంతాలు, దాసరి గారు పొద్దున్నే ఉపాహారం తీసుకున్న హోటళ్ళు, మందులు కొనుక్కున్న షాపు అన్ని కూడా ఫోటోలు తీసి మంపారు. ఆయనకు చందమామ అభిమానుల తరఫున కృతజ్ఞతలు.

ఇప్పుడు ఇంటి బొమ్మలను చూస్తుంటే, విచిత్ర అనుభూతి కలుగుతుంది. చిన్నప్పుడు మనం ఆరాధించిన పాత్రలు అన్ని కూడ ఇక్కడనుంచేకదా సృష్టించబడినాయి అనిపిస్తున్నది. ఎన్నెన్ని పాత్రలు ఆయన కలం నుండి సృష్టించారు! తలుచుకుంటేనే ఆశ్చర్యం. విచిత్రం ఏమంటే ఆయనకు రావలిసినంత పేరు రాలేదు. ఆంగ్లంలో వస్తున్న చౌకబారు రచనలను నెత్తిన పెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఐపోయ్యారు. దాసరిగారి కథలు ఆంగ్ల సాహిత్యానికి ఏమి తక్కువ, హారీ పోటర్లు, లార్డ్ ఆఫ్ రింగ్ లు ఈయన వ్రాసిన ధారావాహికల ముందు ఏపాటి అని ప్రశ్నిస్తే, దురభిమానం అని రాగాలు తీసే అమ్మలక్కలు, అజ్ఞానులు కూడా తయారయ్యారు.
దాసరి సుభ్రహ్మణ్యం గారు 54 సంవత్సరాలు నివసించినది వడపళని లోని ఈ భవనంలోనే. ప్రస్తుతం దాదాపుగా పాడుపడినట్టుగా ఉన్నది కాని అందులో, అలనాడు దాసరి గారితో బాటుగా కొంతకాలం నివసించినవారు ఇంకా అందులోనే ఇప్పటికీ ఉన్నారుట.


దాసరిగారు నివసించిన ఏడో నెంబరు గది. ప్రస్తుతం అందులో ఉంటున్నాయన లేకపోవటం వల్ల లోపల ఫోటో తీయటం కుదరలేదట

ఆ భవనానికి వెళ్ళే దారి. శిధిలాలయ పూజారి, విక్రమకేసరి, ఖడ్గవర్మ, ధూమక సోమకుల సృష్టికర్త తన పాత్రల గురించి ఆలోచించుకుంటూ ఈ దారిలో అనేక దశాబ్దాలు నడిచి ఉంటారు.

దేవుణ్ణి నమ్మని మన దాసరి గారు ఈ గుడి పరిసర ప్రాంతాలలోనే ఐదు దశాబ్దాలు గడిపారు




దాసరి సుబ్రహ్మణ్యం గారు భోజన, ఉపాహారాలకు ఐదు దశాబ్దాలు అలవాటుగా వెళ్ళిన హోటళ్ళు


దాసరిగారు తన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి తరచుగా వెళ్ళిన మందుల షాపు

దాసరిగారు చాలా చిత్రమైన వ్యక్తి. చందమామ చరిత్రలో మొట్టమొదటిసారిగా తనకు యాజమాన్యం ఎక్స్లెన్స్ అవార్డు ఇస్తే, అవార్డును ఫోటో కట్టించి, తనకు రెండు దశాబ్దాలు పైగా మందులు సరఫరా చేస్తున్నమురుగన్ మెడికల్ షాపు శ్రీనివాస్ గారికి ఇచ్చేసారు. విజయవాడ వెళ్లిపోతున్నప్పుడు కూడ తనతో తీసుకువెళ్ళలేదు. శ్రీనివాస్ గారు, దాసరి గారి గుర్తుగా ఇప్పటికీ ప్రశంసాపత్రాన్ని తనవద్ద ఉంచుకుని రాజశేఖర రాజుగారికి చూపించి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారుట
********************************************
ఫోటోలను పంపుతూ శ్రీ రాజశేఖర రాజుగారు వ్రాసిన విషయాలు, విశేషాలు కొన్ని

********************************************
మార్వాడీల యాజమాన్యంలో ఉండే ఆ పాత భవంతిలో మొత్తం 12 అద్దె ఇళ్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువమంది తెలుగు వారే. 1952 నుంచి 2006 వరకు దాసరి గారు ఇక్కడి గ్రౌండ్ ప్లోర్ లోని 7వ నంబర్ ఇంటిలో అద్దెకు ఉండేవారు. అనారోగ్య కారణాలతో ఇక్కడి నుంచే ఆయన 2006లో విజయవాడలోకి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇక్కడ ఇతర ఇళ్లలో ఉన్నవారు కూడా గత 35 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. అందరిలోకీ సీనియర్ దాసరి గారే. 54 ఏళ్లుగా ఇదే ఇంటిలో ఆయన ఉంటూ వచ్చారు. 54 ఏళ్లు ఒకే ఇంటిలో ఉండటం, ఒకే ఆఫీసు -చందమామ-లో పనిచేయడం. దాసరి గారికే చెల్లింది. శంకర్ గారు కూడా చందమామలో గత 58 ఏళ్లుగా పనిచేస్తున్నా ఆయన చాలా ఇళ్లు మారారు. కాబట్టి ఇల్లు, ఆఫీసుకు సంబంధించిన దీర్ఘకాలిక రికార్డు ప్రపంచంలో బహుశా దాసరిగారికే దక్కవచ్చు. ఇది ఖచ్చితంగా గిన్నెస్ రికార్డుకు ఎక్కవలసిందే.

చెన్నయ్లో 54 ఏళ్ల పాటు దాసరి గారు గడిపిన ఇంటికి ఆయన సోదరులు ఈశ్వర ప్రభు తరచుగా వచ్చేవారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ప్రభుగారి కుమార్తె మణి తన చిన్నాన్నను కలవడానికి ఇక్కడికి వచ్చేవారు. భవంతిలో ఉన్న ఇళ్ళల్లో ఉన్న తెలుగు, తమిళ, కన్నడ కుటుంబాల వారికందరికీ దాసరి గారు సుపరిచితులు. ఇక్కడ ఉంటున్న తమిళ మహిళ మణివాలన్, కన్నడ మహిళ గౌరి -తెలుగు బాగాతెలుసు- తదితరులందరికీ దాసరి గారి జ్ఞాపకాలు ఈనాటికీ మెదులుతుంటాయి. కదిపితే చాలు ధారాళంగా చెప్పుకుంటూ పోతారు.

ఒక్కటి మాత్రం నిజం. దాసరి గారు చెన్నయ్ నగరంలో చివరి వరకూ మద్యతరగతి జీవితమే గడిపారు. చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో సామాన్య కుటుంబాలే ఉండేవి. చందమామలో జగత్ప్రసిద్ధి పొందిన 12 ధారావాహికలు రచించి లక్షలాది పాఠకులను దశాబ్దాలుగా ఉర్రూతలూగించిన దాసరి గారు ఇక్కడి ఇరుకుగదిలోనే నివసిస్తూ చందమామ దారావాహికలకు పాత్రల రూపకల్పన చేసి ఉంటారు!

వడపళని మురుగన్ కోయిల్ స్ట్రీట్లో దాసరి గారు 54 ఏళ్లపాటు నివసించిన ఇంటికి దగ్గరగా, మురుగన్ కోయిల్కి అతి సమీపంలో ఉన్న మురుగన్ మెడికల్ షాపు దాసరి గారు దశాబ్దాలపాటు మందులు తీసుకున్న మెడికల్ షాపు ఇదే. బోర్డు కూడా రోడ్డుకు పైన కాకుండా లోపల కనీ కనిపించకుండా ఉండటంతో పెద్గగా దీన్ని పట్టించుకోలేకపోయాము. చందమామ ప్యాకింగ్ విభాగంలో ఉన్న రవి చెప్పిన వివరాల ప్రకారం రోజు దీన్ని పట్టేశాము. ‌‌

మెడికల్ షాపుతో దాసరి గారికి 50 ఏళ్లపైబడిన బంధం ఉంది. 1952లో చెన్నయ్కి వచ్చిందిమొదలుకుని దాసరి గారు తమ వైద్య అవసరాలకు షాపుకే వచ్చేవారు. మేము వెళ్లేటప్పటికి షాపులో ఉన్న శ్రీనివాస్ గారిని దాసరి గారి గురించి ప్రస్తావిస్తే 22 ఏళ్లుగా ఆయన తనకు తెలుసని చెప్పారు. ఎందుకంటే ఇతను గత 22 ఏళ్లుగా షాపులోనే పనిచేస్తున్నారు. దాసరి గారి జ్ఞాపకాలను పంచుకోమని అడిగితే ముందుగా ఆయనకు చందమామ 2000 సంవత్సరంలో జీవితకాల సాధనకు -లైఫ్ అచీవ్మెంట్‌- గాను అందించిన చందమామ ఎక్స్లెన్స్ అవార్డు ధ్రువపత్రాన్ని దాసరిగారు స్వయంగా ఫ్రేమ్ కట్టించుకుని తర్వాత తమకు ఇచ్చారని చెప్పి షాపులోనే ఉన్న ఫోటోను మాకు అందించారు.
‌‌

చందమామ చరిత్రలో ఎక్స్లెన్స్ అవార్డు ఇద్దరికి మాత్రమే లబించింది వారు దాసరి, శంకర్ గార్లు. 1999లో చందమామ బయటి వ్యక్తుల సహాయం తీసుకుని తిరిగి ఉనికిలోకి వచ్చాక, దశాబ్దాలుగా పత్రిక అభివృద్ధికి దోహదం చేసిన మాన్యులను గౌరవించాలని పత్రిక మనుగడకు ఆర్థిక సహాయం అందించిన సుధీర్ రావు తదితరులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇద్దరు మహనీయులకు చందమామ ఎక్స్లెన్స్ అవార్డు అందించారు. వడపళనిలో ఉన్న ప్రముఖ హోటల్ ఆదిత్యలో జరిగిన ఫంక్షన్లో అవార్డును బహూకరించారు. ‌‌‌

చందమామ ఆవిర్భవించిన 50 ఏళ్ల తర్వాత సంస్థకు చెందిన సిబ్బందికి అవార్డులు ప్రకటించిన చరిత్ర అదే మొదటిదీ, చివరిదీ కూడా కావడం గమనార్హం. వ్యక్తుల కంటే సంస్త ముఖ్యమే కాని జగత్ప్రసిద్ది గాంచిన కథల పత్రికలో పనిచేసిన సిబ్బంది జీవితాలు ఇంత సుదీర్గకాలం అజ్ఞాతంలో ఉండిపోవడమే బాధాకరం. చందమామ ఎక్స్లెన్స్ అవార్డు వీరిద్దరికీ వచ్చినా, రాకున్నా వారి ఘనతర చరిత్రకు జరిగే లాభం, నష్టం ఏమీ ఉండవనుకోండి. కాని ఎక్కడో బాధ.

దాసరిగారికి చందమామ బహూకరించిన ఎక్స్లెన్స్ అవార్డు ఫోటో ఫ్రేమును మాకు చూపించిన మురుగన్ మేడికల్స్ శ్రీనివాస్ గారు సాయంత్రం 4 గంటల తర్వాత వస్తే దాసరిగారితో తమ పరిచయం విశేషాలుచెబుతానని చెప్పారు. పక్కనే ఉన్నాము కాబట్టి మళ్లీ కలుద్దామని చెప్పి మా వద్ద ఉన్న చందమామలనుగౌరవంగా అందించి ఆఫీసుకు వచ్చేశాము.

********************************************

ఇవండీ మన అభిమాన రచయిత, చందమామలో అత్యంత ప్రసిద్ది పొందిన డజను ధారావాహికలు వ్రాసిన శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి ఇంటి కథ ఆపైన ఆయన ఐదున్నర దశాబ్దాలు తిరుగాడిన పరిసరాల కథ
********************************************


7 కామెంట్‌లు:

  1. నా బాల్యం లో చదివిన విచిత్ర సోదరులు, శిధిలాలయం లాంటి కథల శిల్పి గడిపిన సాధారణ జీవితం చూస్తే.. మనసు పొరల్లో కలుక్కుమన్న ఓ బాధ.. ఎవరూ ఇవ్వలేని సమాచారాన్ని మీరు ఇచ్చినందుకు అభినందనలండి..
    రామకృష్ణ

    రిప్లయితొలగించండి
  2. మంచి విషయాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు ........

    రిప్లయితొలగించండి
  3. మన తెలుగు చందమామలో దాసరి గారు మద్రాసులో
    దీర్ఘకాలం గడిపిన పరిసరాలను చూపిస్తూ వ్రాసిన
    విశేషాలు మరువలేనివి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. ఇంత సుదీర్ఘ కాలం దాసరి సుబ్రహ్మణ్యం గారు నివసించిన భవనం, ఆ ఏడో నంబరు గది, ఆ పరిసరాల ఫొటోలు చూడటం విచిత్రమైన అనుభూతిని కలిగిస్తున్నాయి.

    దాసరి గారి కథలూ, మృత్యులోయ, అగ్నిమాల నవలలూ పుస్తకరూపంలో రాబోతున్నాయి... ‘రచన’ శాయి గారి ఆధ్వర్యంలో! జీవిత చరమాంకంలో తప్ప పెద్దగా ఎవరికీ తెలియకుండా, దాదాపు అజ్ఞాతంగానే గడిపిన దాసరి గారు ఈ సమయంలో జీవించివుంటే ఎంత బాగుండేది అనిపిస్తోంది.. !

    రిప్లయితొలగించండి
  5. వ్యాసం చదివి స్పందించిన వారందరికీ ధన్యవాదాలు.

    ఈ సమాచారం యావత్తూ సేకరించినది శ్రీ రాజశేఖర రాజుగారు. ఆయన పూనుకుని ఈ సమాచారం ఇవ్వకపోతే లోకానికి తెలిసేదేకాదు. ఆయనకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు

    ఈ మొత్తం సమాచారం, మరిన్ని విషయాలతో, దాసరి సుబ్రహ్మణ్యం గారు వ్రాసిన మృత్యులోయ (బొమ్మరిల్లు ధారావాహిక ) ఇంకా వారు వ్రాసిన ఇతర కథలు నవలలతో బాటు రచన శాయిగారు తీసుకు వస్తున్న సంపుటిలో కూడ ప్రచురించబోతున్నారు.

    ఈ ప్రత్యేక పుస్తకపు ప్రచురణలో పాలుపంచుకోదలుచుకున్నవారు ఈ కింది లింకుద్వారా వివరాలు చదివి స్పందించవచ్చు.

    http://manateluguchandamama.blogspot.com/2010/09/blog-post_30.html

    రిప్లయితొలగించండి
  6. శివరాంగారూ,
    దాసరి గారు నివసించిన ఇంటి గురించి బాగా పరిచయం చేసారు. ముఖ్యంగా పోటోలు చూస్తుంటే ఆయన ఇక్కడే ఇంకా తిరుగాడుతున్నారేమో అనిపిస్తోంది.
    అభినందనలు..

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.