విజయవాడలో మొట్టమొదటి సారి కర్ఫ్యూ పెట్టిన రోజు. జై ఆంధ్రా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నా రోజులు. మేము అప్పుడు పదోతరగతిలో ఉన్నాం. ఆ రోజున ఒక పెద్ద ఊరేగింపు మొదలయ్యింది. మేముండే సత్యనారాయణపురం నుంచి కూడ ఒక ఊరేగింపు తో బాటుగా నేను మా మేనమామ కలిసి వెళ్లాం . ఎటుచూసినా చిన్నలూ పెద్దలూ ప్రత్యెక ఆంధ్ర రాష్ట్రం కావాలని నినదిస్తున్నారు. అన్ని చోట్లా పసుపుపచ్చ జెండాలు. పసుపు రంగు అప్పుడు జై ఆంధ్రా ఉద్యమ జెండా. పసుపు రంగు లోఆంధ్ర ప్రాంత మాప్ వేసి ఉండేది. కొద్ది మార్పు చేసి అదే రంగుతో ఇప్పుడు తెలుగుదేశం వాడుతున్నది.
ఊరినిండా సి ఆర్ పి ఆపైన మిలటరీ దళాలు. వాళ్ళను చూస్తేనే భయం వేసేది.
మేము పాల్గొన్న ఊరేగింపు, సబ్ కలెక్టర్ కార్యాలం దగ్గరకు చేరేప్పటికి ఆవేశపరులైన కొంతమంది యువకులు, మైకులు చేత్తో తీసుకుని ఆ కార్యాలయంలోఉన్న మిలటరీ దళాలను ఉద్దేసించి అవాకులూచెవాకులూ వాగటం మొదలు పెట్టారు. ఇదంతా చూసిన మా మామయ్య, పరిస్థితి ఎటు పోతుందో అని మమ్మల్ని ఇంటిదారి పట్టించాడు. ఆ తరువాత, ఇలా అన్ని పేటల నుండి బయలుదేరిన ఊరేగింపులు కలుస్తూ కలుస్తూ ఏలూరు రోడ్ ప్రాతాలకు చేరినాయి.
భయపడినట్టే జరిగింది. ఏలూరు రోడ్లోకి చేరిన ఉద్యమకారులకు సి ఆర్ పి దళాలు ఎదురుపడ్డాయి. వెంటనే హోరాహోరి పోరు మొదలయ్యింది, రాళ్ళ వర్షం కురిసింది. సోడా బుడ్లు సి ఆర్ పి దళాల మీద విసురుతున్నారు. అధికారులు, పరిస్థితిని అదుపు చెయ్యటానికి టియర్ గాస్ విడుదల ఫలించక , కాల్పులకు ఆదేశాలిచ్చారు. ప్రజలు మరింతగా రెచ్చిపోయి కనిపించిన వాహనాలను, కార్యాలయాలను, బ్యాంకులను విధ్వంసం చెయ్యటం, తగులబెట్టటం చేయ మొదలుపెట్టారు.
వెంటనే విజయవాడలో కర్ఫ్యూ విధించారు. ఆ కర్ఫ్యూ నిరవధికంగా రెండు మూడు రోజులు ఉన్నది. ఆ తరువాత సాయంత్రాలు మాత్రమె ఉండేది. ఊళ్ళో సోడా బుడ్ల అమ్మకం అనధికారికంగా నిషేధించారు. సోడాబుడ్లల్లో గుండుసూదులు, మేకులు నింపి, గాస్ పట్టి పోలీసులమీద విసిరేవారు. సి ఆర్ పి వాళ్లకి ఇవంటే చచ్చేభయంగా ఉండేది. జనవరి 21 22 తారీకుల్లో జరిగిన పోలీసు కాల్పుల్లో అనేకమంది కుర్రాళ్ళు మరణించారు.
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే, పూర్తి జనావాసమైన, సత్యనారాయణపురం లో కూడ పార్కు దగ్గర సి ఆర్ పి వాళ్ళు ఒక కుర్రాణ్ణి కాల్చేశారు. అంతటి కర్ఫ్యూలో కూడ ఆ కుర్రాడి భౌతికకాయాన్ని ఒక బండి మీద ఉంచి చాలా ఆవేశంగా కేకలు వేస్తూ వారింటికి చేర్చారు.
విజయవాడలో పోలీసు కాల్పులు అప్పటికి ఇది రెండో సంఘటన. అంతకు ముందు డిసెంబరు 24 న ఇప్పుడుప్రత్యేకం అంటున్న ఒక కమ్యూనిస్ట్ పార్టీ ముక్క సమైక్య యాత్ర చేస్తే, వేర్పాటువాదులు వాళ్ళనుఎదుర్కున్నారు. పెద్ద రాళ్ళ యుద్ధం ఏలూరు రోడ్ లో జరిగింది, పోలీసు కాల్పులు, ఒక అమాయక జీవి మరణం. ఆ వెనువెంటనే అప్పటి మంత్రి కాకాని వెంకట రత్నం గారు గుండె పోటుతో విజయవాడలోనే మరణం.
అప్పటి ఉద్యమ దృశ్యాలను ఉంచుదామంటే, నెట్ లో ఎక్కడా దొరకటం లేదు.
జై ఆంధ్రా ఉద్యమం గురించిన కొన్ని విశేషాలు:
- కొన్ని నెలలపాటు విజయవాడలో ట్రాఫిక్ ఎడమ పక్క కాకుండా కుడి పక్కనే నడిచింది. ఇదొరకపునిరసన.
- ఆంధ్ర సేన, జై ఆంధ్రా ఫ్రంట్ పేర్లతో కొన్ని సంస్థలు వెలిశాయి. ఒక్కోసారి వీళ్ళ మధ్య ఘర్షణ జరిగేది.
- శాతవాహనా కాలేజీ లోపలకి వచ్చి సి ఆర్ పి వాళ్ళు విద్యార్ధులను కొట్టారు. సంకుల సమరం జరిగింది. అప్పటి ప్రిన్సిపాల్ సి ఆర్ పి వాళ్ళ అపరాధానికి ప్రతిగా జిల్లా అధికారుల నుంచి ప్రభుత్వమే అన్నితరగతి గదులకు రెండేసి ఫ్యాన్ లు సంపాయించారు.
- జై ఆంధ్రా ఉద్యమం అక్టోబర్ 1972 లో ప్రారంభమయ్యి 1973 మార్చి కల్లా జావ కారిపోయింది. ఈ మధ్యకాలంలో ప్రత్యెక ఆంధ్ర వస్తే రాజధాని విజయవాడా లేక విశాఖపట్ట్నమా అని వాదోపవాదాలు కూడాచెలరేగాయి. చివరకి ఏదీ లేకుండా పోయింది.
- కూడళ్ళలో జెండా దిమ్మలు పెట్టి ఒక్క వామపక్షాల వాళ్ళే మే డే రోజున మేమూ ఉన్నాం అని చెప్పుకునేవారు. జై ఆంధ్రా పుణ్యమా అని జెండా దిమ్మల సంస్కృతీ ఆంధ్ర ప్రాంతమంతా వ్యాపించితరువాత్తరువాత వెర్రి తలలు వేసింది.
- ఆకాశవాణి విజయవాడ కేద్రం వద్ద ఉద్యమకార్లు సదా ధర్నా చేయటం వల్ల వారు నంబూరులో ఉన్నతమ ట్రాన్స్ మీటర్ల దగ్గర నుంచే ప్రసారాలు చేసారు. చాలా కాలం విజయవాడ A కేంద్రమే ప్రసారాలుచేసింది. B కేద్రమైన వివిధభారతి ప్రసారాలు నెలలపాటు జరగలేదు.
- జనవరి 2 1973 నా విజయవాడ నుండి జిలా కేద్రమైన మచిలీపట్టణానికి వందలాది కార్లు, బస్సులు, మోటారు సైకిళ్ళు , లారీలలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొని గొప్ప ర్యాలీ జరిగింది. ఒక చోట నుంచునిచూస్తె మొత్తం ర్యాలీ వెళ్ళటానికి గంట పైగా పట్టింది. అదే రోజున నెల్లూరులో అప్పటి మంత్రి శ్రీ ఆనంవెంకట రెడ్డి (సమైక్యతా వాది, ఇప్పటి ఆనం సోదరుల తండ్రి )ఇంటి మీద ఉద్యమకార్లు దాడిచేశారు. పోలీసు కాల్పులు జరిగి అనేక మంది మరణించారు.
- మరొక రోజున విజయవాడ బందరు రోడ్ పూర్తిగా దిగ్భాధం చేసి రోడ్ మొత్తం షామియానాలు వేసిసామూహిక నిరాహార దీక్ష జరిగింది.
- శ్రీ తెన్నేటి విశ్వనాధం గారు ఉద్యమానికి గౌరవ నాయకునిగా ఉండేవారు. గౌతు లచ్చన్న గారు కూడాఇదే విధంగా నాయకత్వం వహించారు.
- ప్రస్తుతం బి జే పి అగ్రనేత శ్రీ వెంకయ్య నాయుడు అప్పట్లో విద్యార్థి నాయకుడు. ఆయన చేసే ప్రసంగాలుకామాలు ఫుల్ స్టాపులు లేకుండా అనర్గళంగా ఉండేది. ప్రతి సభలోనూ ఆయన ప్రసంగం ఒక ప్రత్యెకఆకర్షణ. ఆయన్ని మామూలుగా అరెస్టు చెయ్యలేక, న్యూ ఇండియా సెంటర్లో వెంకయ్య నాయుడుప్రసంగిస్తుండగా వెనుక రోడ్డు నుంచి, పోలీసు జీపుకి జై ఆంధ్రా పసుపు వన్నె జెండాలు తగిలించి, పోలీసులే "జై ఆంధ్రా" అంటూ నినాదాలు చేస్తూ వచ్చి హటాత్తుగా అరెస్టు చేసారు. ఆయన ప్రసంగాలుచాలా ఆవేశపూరితంగా ఉండేవి. మరొక విద్యార్థి నాయకుడు లైలా కాలీజీ అనుకుంటాను, వి టి ఎంప్రసాద్ ఉండేవారు. ఆయన ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలియదు.
- ఆంధ్ర పత్రిక దిన పత్రిక జై ఆంధ్రా ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్నది. కమ్యూనిస్ట్ పత్రిక విశాలాంధ్రవ్యతిరేకంగా వ్రాసేది. విశాలాంధ్ర పత్రిక అనేక సార్లు ఉద్యమకార్లు తగుల పెట్టారు. పత్రికని రహస్యంగాచేరవేశారు. కాని టెంత్ క్లాస్ ఫలితాలు వచ్చినప్పుడు మాత్రం అందరూ తప్పనిసరిగా విశాలాంధ్రనేకొనేవారు, ఎందుకు అంటే వాళ్ళే అందరికంటే ఒక ప్రత్యెక సప్లిమెంట్ వేసేవారు.
- మార్చ్ లేదా ఏప్రిల్ లో జరగాల్సిన టెంత్ పరిక్షలు ఎప్పుడో జూన్ చివరిలో అనుకుంటాను జరిగాయి.
- మా కాలేజీకి ఆకాశవాణి కలాకారులైన శ్రీయుతులు నండూరి సుబ్బారావు, చివుకులరామమోహనరావు, ఉషశ్రీ, కూచిమంచి కుటుంబరావు తదితరులని ఈ ఉద్యమ ఘాటు తగ్గినాక సన్మానించటానికి పిలిచారు . అప్పుడు చివుకుల రామమోహనరావు గారు, కాలేజీకి వీళ్ళు ఎందుకు పిలిచారా, మునుపు ఆకాశవాణి ఉద్యమానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసిందని కోపంతో ఇలాపిలిచి తలుపులు మూసి తన్నరు కదా అని భయపడ్డాం అని ముక్తాయించారు. కాని వారికి విద్యార్ధులందరూ చక్కటి సన్మానం చేసారు. అప్పటి ఆకాశవాణి కళాకారులకు ఉన్న ప్రాభవంఅటువంటిది.
- అప్పటి జై ఆంధ్రా ఉద్యమం జరిగిన ఐదారు నెలల్లో దాదాపు 400 పోలీసు కాల్పుల్లో మరణించి ఉంటారని ఒక అంచనా.
రెండో సారి పోలీసుల కాల్పులు, కర్ఫ్యూలతో జై ఆంధ్ర ఉద్యమం తార స్థాయికి చేరుకుంది. కాని, ఉద్యమంలో చేరిన కొంతమంది వెన్నుపోటుతో, సి ఆర్ ఫి దళాల విపరీత అణచివేతతో ఉద్యమం రెండు మూడునెలల్లో సన్నగిల్లింది.
ఇదంతా ఎందుకు వ్రాస్తున్నాను అంటే, అదే ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు అందరూ సమైక్యం అంటున్నారు, అందుకోసం ఉద్యమిస్తున్నారు. అప్పుడు సమక్యం అన్న ఒక కమ్యూనిస్ట్ పార్టీ ముక్క ఇప్పుడు వేర్పాటుకు సై అంటున్నది
1969 తెలంగాణా ఉద్యమం జరిగినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో పెద్దగా స్పందన లేదు. అదే విధంగా 1972-73 లోజై అంధ్రా ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణాలో పెద్దగా స్పందన లేదు. ఆ రెండు సందర్భాలలోనూ ఒక ప్రాంతంవారు మరొక ప్రాతం వారు కలిసి ఉద్యమించి ఉండి ఉంటే ఎప్పుడో 35-40 సంవత్సరాల క్రితమే రెండు వేర్వేరు రాష్ట్రాలు ఏర్పడి ఉండేవి. రెండు ప్రాతాలూ వారి వారి రాజదానులతో అభివృద్ది సాధించి ఉండేవారేమో.
ఈ విచిత్ర స్థితి ఇంకా ఎన్నాళ్ళు జరగాలో, మరెంతమంది అమాయకులు బలికావాలో అని బాధపడటం తప్ప చెయ్యగలిగింది ఏమన్నా ఉన్నదా అనిపిస్తున్నది.
అలనాటి ఉద్యమ ఫోటోలు ఎవరి దగ్గరన్నా ఉంటే, (ఆంధ్ర పత్రిక దిన పత్రికలు పాతసంచికలు ఉన్నవారి దగ్గర ఈ అవకాశం ఎక్కువ) దయచేసి పంపగలరు. బ్లాగులో ప్రచురించి ఈ నాటి తరానికి అప్పుడు జరిగిన ఒక మహోజ్వల ఉద్యమం గురించి తెలియచెప్పే అవకాశం ఉంటుంది.
(రెండు ప్రెస్ కట్టింగులు దొరికాయి, పైన అప్లోడ్ చేశాను. (అప్డేటెడ్ 23 06 2013)
జై ఆంధ్రా ఊద్యమం గురుంచి శివ గారు చాలా చక్కగా వివరించారు. అవును, ఆ ఉద్యమ కాలంలోనే, తెలంగాణా ఊద్యమం కూడా కలిస్తే బాగుండేది. అప్పుడే ఆంధ్ర రాష్ట్రం వచ్చివుంటే ఇప్పుడు హైదరాబాదు గురుంచి దేబిరించాల్సిన పరిస్తితి వుండేది కాదు. అలాంటి నగరాలు కనీసం 10 దాకా ఆంధ్రాలో ఏర్పడేవి. అప్పట్లొ కొందరి ద్రోహం వలన ఇప్పటిదాకా ఆంధ్రా ప్రజలు హైదరాబాదు మీద ఆస్తులు, ఆశలు పెట్టుకోవల్సిన దుస్తితి పట్టింది. ఇప్పటికీ అదే పరిస్తితి....తెలంగాణా ఇవ్వకపొవటం వలన వారికి ఏమాత్రం నష్టమో తెలియదుకానీ...ఆంధ్ర ప్రజలకి మాత్రం నష్టమే. ఇప్పటికైనా భవిష్యత్ తరాలని దృష్టిలో వుంచుకొని రాష్ట్రాన్ని విభజిస్తే బాగుంటుంది. ఒకరిమీద ఒకరు ఆధారపడాల్సిన ఖర్మ వుండదు.
రిప్లయితొలగించండిరాధాకృష్ణ,
విజయవాడ.