20, జనవరి 2011, గురువారం

అదే ఊరు, అదే మనుష్యులు కాని వేర్వేరు కథలు

మనకు టి వి ల్లో వచ్చే ఊకదంపుడు ధారావాహికలకు ఝడిసిపోయి దూరంగా ఉంటున్న సాహిత్య అభిమానులకు "మా పసలపూడి కథలు" మా టి విలో సీరియల్గా వేస్తారుట అన్న విషయం , ఒక చల్లటి వార్త.

అటు ఆంగ్లంలో ఒక మాల్గుడీ డేస్ ఇటు తెలుగులో అమరావతి కథలు ఒకే ఊళ్ళొ, అదే మనుష్యులు, కథలు వేరు వేరుగా అద్భుత రచనులుగా వెలుగొందుతుండగా, వంశీ తన "పసలపూడి" సౌదర్యం, అక్కడి ప్రజల మనోగతాలు, రకరకాల మనస్తత్వాలు కలగలిపి, "మా పసలపూడి కథలు" గా వండారు.

ఆర్ కే నారయణ్ గారు ఊహాజనిత మాల్గుడి సృష్టించి తన కథలు, నవలలు నడిపితే, సత్యం శంకరమంచి గారు తాను పుట్టి పెరిగిన ఊరు అమరావతి నేపధ్యాన్ని తీసుకుని అద్భుతమైన కథలు వ్రాశారు.

అదే ఒరవడిలో, వంశీ తన సొంత ఊరైన పసలపూడిని ఎన్నుకుని, తాను చూసిన రకరకాల మనుష్యులు , విన్న అనేకానేక కథలు కలిపి పసలపూడి కథలు అనే సాహిత్య గుళికను తయారుచేసి, బాపు గారి చేత బొమ్మలు వేయించి చదువరులకు ఎంతో హాయిగొల్పేట్టుగా మనస్సును పట్టేసే కథలను మన సాహితీరంగం మీదకు తెచ్చారు.


అటు
మాల్గుడీ డేస్, ఇటు అమరావతి కథలు టి వి ధారావాహికలుగా అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ఇందులో మాల్గుడీ డేస్ శంకర్ నాగ్ దర్శకత్వం వహిస్తే , అమరావతి కథలకు శ్యాం బెనగళ్ దర్శకత్వం వహించారు.
మా పసలపూడి కథలు ధారావాహిక దర్శకులు శ్రీ శంకు
"మా పసలపూడి కథలు" టి వి ధారావాహికకు ప్రముఖ కార్టూనిస్టు శ్రీ శంకు గారు దర్శకత్వం వహించటమే కాకుండా, ఈ కథలను టి వి కి అనుగుణంగా మలిచారు. శ్రీ శంకుగారి అసలు పేరు ఎస్ బి శంకర్ కుమార్. ఈయన "శంకు" పేరుతో 1960లు 1970లలోకార్టూన్లు వేసి ఎంతో ప్రసిధ్ధికెక్కారు. ప్రముఖ రచయిత సంపాదకులు శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఈయనకు "శంకు" అని నామకరణం చేశారు. ఈయన పేరులో ఉన్న "శంకర్" "కుమార్" లోని మొదటి అక్షరాలే "శంకు" గా మార్పుచెంది, ఈనాటి "మా పసలపూడి కథలు" దర్శకుని పేరుగా రూపొందాయి.

భారత దేశంలోని ప్రముఖ కార్టూనిస్టులందరి గురించి దూరదర్శన్లో మంచి డాక్యుమెంటరీలు తయారు చేశారు . అంతే కాకుండా ఎంతో ప్రసిద్ధికెక్కిన "కాంతం కథలు" బుల్లి తెరమీదకు ఎక్కించారు . ఇందులో కాంతంగా ఈశ్వరీ రావు కాంతం భర్తగా నరేష్ నటించారు. ఈ 13 భాగాల ధారావాహిక దూరదర్సన్ లో ప్రసారం అయ్యింది. ఈ ధారావాహిక టైటిల్ సాంగ్ వినండి.


కాంతం కథలు టైటిల్ సాంగ్

ఇలాగే, వేంకటేశ్వర భక్తి చానెల్ కు హాస వికాసం అనే ధారావాహికను అందించారు శ్రీ శంకు. మా పసలపూడి కథలు ధారావాహికలో చాలామంది నటీ నటులు పైన చెప్పిన రెండు ధారావాహికలో నటించిన వారు ఉన్నారు.

"మా పసలపూడి కథలు" టి వి ధారావాహిక టైటిల్ సాంగ్ చాలా బాగున్నది. ఈ పాటకు సంగీతం వంశీనే. అదే విధంగా ఈ ధారావాహిక మొట్టమొదటి ఎపిసోడ్ లో పాత్రలను పరిచయం చేస్తూ తనికెళ్ళ భరణి చేసిన నాంది చాలా బాగున్నది. ఈ రెండిటినీ ఈ కింద ఇచ్చిన లింకుల ద్వారా వినవచ్చు.

మా పసలపూడి కథలు టైటిల్ సాంగ్


శ్రీ తనికెళ్ళ భరణి ఉపోద్ఘాతం పాత్రల పరిచయం
నాకు ఎప్పటినుంచో ఒక ఆసక్తి. ఇప్పటి తరం మన దర్శకులు, నటులు, ఒక 60-70 సంవత్సరాల క్రితం జరిగిన కథను చక్కటి దృశ్య కావ్యంగా మలచగలరా అని. మనుకున్న సినీ నటులు, దర్శకులు ఈ పని చెయ్యలేరని అనేకసార్లు నిరూపించబడింది. ఊరికె రెండు పాత కార్లు, బుట్ట జాకెట్లు, ఎప్పటివో తెలియని వంకర నగలు, పడిపోయిన పెంకుటిళ్ళు పెట్టి తంటాలు పడ్డా,  ఆ వాతావరణం సృష్టించటంలో విఫలమయ్యారు. మనం  మూర్ఛలు   పోతూ  గొప్పగా   చెప్పుకునే  శంకరాభరణం  సినిమాలో  కూడా ఒక్క గుర్రబ్బండీ చూపించి ఊరుకుని, ఆ కథా కాలానికి అదే గొప్ప చాలులే అని, కథా కాలం ఎప్పటిదో తెలియకుండా కలివిడి చేసిపారేసారు.  కాని, మనం అనేక ఆంగ్ల సినిమాల్లో చూస్తుంటాము, ఆ పాతకాలపు వాతావరణ చిత్రీకరణ అది, ముచ్చట వేస్తుంది. మన ప్రేక్షకులకు అభిరుచి లేదు, వాళ్లకి తగ్గ దర్శకులు, గంతకు తగ్గ బొంతలాగా ఎక్కడా ఎవరూ ఏ విధమైన ఫిర్యాదూ లేకుండా రోజులు జరిగిపోతున్నాయి. అంతే!

"మా పసలపూడి కథలు" ధారావాహిక దర్శకుని ప్రతిభకు సాన పెట్టేవే. ఎందుకంటే ఇందులో కథల నేపథ్యం ఎప్పుడో కాటన్ దొర గోదావరి ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పటి నుండి, 1960 ల వరకూ వ్యాపించి ఉన్నది. శంకుగారు ఈ కథల నేపథ్యాన్ని ఎలా చిత్రీకరించారో, నటీ నటులు ఎంతవరకూ తమ తమ పాత్రలకు న్యాయం చేస్తూ, అప్పటి కథా వాతావరణాన్ని సృష్టించగలిగారో వేచి చూడాలి.

ఏది ఏమైనా, శంకు గారి దర్శకత్వంలో తయారవుతున్న ఈ ధారావాహిక (ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు ప్రసారం అయ్యినాయిట) మాల్గుడి డేస్, అమరావతి కథలు అంత ప్రాచుర్యాన్ని పొందుతాయని ఆశిద్దాం. అలాగే ఈ ధారావాహిక, ప్రస్తుతం టి వి ల్లో వస్తున్న చెత్త ధారావాహికలన్నిటికి ఒక పెద్ద ఫుల్ స్టాప్ పెట్టి, మన సాహిత్యం లో ఉన్న ఆణి ముత్యాలను బుల్లి తెర మీదకు తీసుకు వచ్చే మొదటి అడుగు అవ్వాలని, మనకున్న అనేక మంది చక్కటి నటీనటులు, దర్శకులు తమ ప్రతిభ చూపించే అవకాశం రావాలని, నా ఆకాంక్ష.

శ్రీ శంకు గారి ప్రయత్నం అభినందనీయం.

ఈ ధారావాహిక మీద సమీక్ష నెమలికన్ను బ్లాగులో వచ్చింది. ఈ కింది లింకు నొక్కి ఆ సమీక్ష చదువవచ్చు:

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.