17, మార్చి 2011, గురువారం

గైడ్ హిందీ సినిమా - ఆకాశమే హద్దు!

===================================================
కీర్తిశేషులు శ్రీ ఆర్ కే నారాయణ్ తనజీవిత చరిత్ర(My DAys)లో ఆయన నవలల్లో సుప్రసిద్ధమైన "THE GUIDE" నవలతో తాను పడ్డ కష్టాలు వివరించారు. అందులో ముఖ్యంగా గైడ్ సినిమాకు ఆధారం ఆయన నవల అయినా, ఆయనకు డబ్బు అందని విషయం చదివి బాధపడి, ఆయన జీవిత చరిత్ర నుండి నా స్వేచ్చానువాదం అందరికోసం అందిస్తున్నాను బొమ్మలు ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్ కే లక్ష్మణ్. పూర్తి జీవిత చరిత్ర చదవాలనుకునేవారు Indian Thought Publications వారి ప్రచురించిన పూర్తి పుస్తకాన్ని కొని చదువుకోగలరు. "THE GUIDE" నవలకు ఆర్ కే నారాయణ్ గారికి సాహిత్య అకాడమీ బహుమతి ఇవ్వబడినది. గైడ్ సినిమా కూడ ఫిలిం ఫేర్ అవార్డులను గెలుచుకున్నది.

===================================================
"గైడ్" నవల కొంతలో కొంత పేరు తెచ్చుకున్న మాట వాస్తవమే కాని, దానితో పాటుగా నన్ను కొన్ని హాస్యాస్పద పరిస్థితుల్లోకి నెట్టింది, కొన్ని విషాదాంతాలు కూడ ఐనాయి. 1964 సెప్టెంబరులో అనుకుంటాను ముంబాయికి చెందిన నిర్మాత దేవానంద్ న్యూ ఆర్క్ నుంచి నాకు ఉత్తరం వ్రాసి ఆ తరువాత ఒక ఉదాయాన్నే మా "యాదవగిరి" ఇంటికి వచ్చేశాడు. అతని యావంతా కూడ నా నవల గైడ్ సినిమా హక్కులు నా దగ్గర నుంచి పొందటమే! ఆటోగ్రాఫ్‌ల కోసం వెంపర్లాడేవాళ్ళ గుంపొకటి మా ఇంటి ముందు తయారయ్యింది.

ఇంట్లో మా డ్రాయింగ్ రూంలో ఉభకుశలోపరి అయినాక, దేవానంద్ తన చెక్కు పుస్తకం తీశాడు, తన కాప్ తీసిన పెన్ను చెక్కుమీద ఉంచి, గైడ్ సినీ హక్కులకోసం నేను చెప్పబోయే మొత్తం గురించి వినటానికి సిధ్ధంగా ఉన్నాడు. నేను ఏ మొత్తం చెప్పినా అతను చెక్కు వ్రాసేట్టే కనపడ్డాడు. ఇది మరీ విపరీతంగా అనిపించింది నాకు. ఈ అనుకోని నడమంత్రపు సిరి గురించి ఆలోచన రాంగానే నా మెదడు మొద్దు బారిపోయింది. అతను చెప్పబోతున్న మొత్తం నేను వినకుండా అతని చెయ్యి పట్టుకుని చెక్కు వ్రాయకుండా ఆపాను. అతను కూడ మర్యాద పూర్వకంగా నాకు ఎంత ఇవ్వాలో అంతా ఇవ్వటానికి సిధ్ధంగా ఉన్నట్టుగానే ఉన్నాడు, దానితోపాటుగా సినిమాకి వచ్చే లాభాల్లోంచి కొంత భాగం కూడా ఇస్తాట్ట! నేను గొప్పగా చెప్పాను, "సరే మీ సినిమాతో పాటు నాకు లాభాలొస్తే వస్తాయి లేదా ముణిగితే మీతోబాటే. మీ దగ్గరనుంచి డబ్బు దండుకోవాలని నాకు లేదు"

"మీ సహకారంతో మనం తప్పకుండా ముందుకు సాగగలం ఆ ఆకాశమే హద్దు"
అని అతను అన్నాడు, కాని మేము ఈ విషయంలో ముందుకు వెళ్తుండగా నాకు తెలిసింది ఆ ఆకాశం మెల్లిగా కిందకు దింపబడిందని, చివరికి నేను లాభాల్లో నా వాటా అడగొచ్చేప్పటికి ఆ ఆకాశం ఎంత కిందికి వచ్చేసిందంటే, గొడుగుతో దానికి చిల్లు పోడవగలిగినంత . వాళ్ళు నాకు చివరికి చెప్పిందేమంటే, గైడ్ సినిమా ఫ్లాప్ అని లాభాలు రాలేదని. వాళ్ళ దగ్గరనుంచి వచ్చిన ఉత్తరం ప్రకారం "ఈ సినిమాలో లాభాలు వచ్చిన తక్షణం, మీ వాటా మీకు పంపుతామని వాగ్దానం చేస్తున్నాము" ఇప్పటికి ఏడేళ్ళు గడిచిపోయినాయి.

సినిమా తియ్యటానికి వాళ్ళకి బాగా ఖర్చు అయినట్టుంది. దాదాపుగా కోటి రూపాయలు ఖర్చు చేశారుట. కాని, దాంట్లో ఎక్కువ భాగం వాళ్ళకోసమే ఖర్చు పెట్టుకున్నారు. బ్రహ్మాండమైన జీతాలు, సినిమా జరిగినంత కాలం విలాసవంతమైన జీవితం.....అప్పుడప్పుడు నన్ను పిలిపించి ఏవో పనికిరాని చర్చలు మటుకు చేశేవాళ్ళు, లేదా ప్రెస్స్ వాళ్ళను కలవటానికి. అక్కడ మందు ఏరులై పారుతుండగా ఊరికే బడాయిలు కొడుతూ ఉంటే వినటానికి.


ఒకసారి నన్ను బాంబేకి పిలిపించారు, ఎందుకూ! లార్డ్ మౌట్‌బాటన్ తో గవర్నమెంటు హవుసులో వారితో మధ్యాహ్న భోజనం చెయ్యటానికి. ఈ కార్యక్రమం దేనికి? ఆయన, ఎలిజబెత్ రాణిని గైడ్ సినిమా ప్రీమియర్ కు వచ్చేట్టుగా ఒప్పించటానికి!! నన్ను ఎయిర్ పోర్ట్ నుంచి సీదాగా గవర్నమెంట్ హవుసుకే పట్టికెళ్ళారు. సినిమా ప్రీమియర్కి రాణీగారిని పిలవటం అనే ఆలోచనే బ్రహ్మాండడమైనది. ఈ అద్భుత ఆలోచన పాపం కీర్తి శేషురాలు పెరల్ ఎస్ బక్‌కి వచ్చింది(ఆర్కే నారాయణ్ గారుఉదాహరించిన పెరల్ ఎస్ బక్ మరియు నోబెల్ బహుమతి గ్రహీత, The Good Earth అన్న అద్భుతనవల వ్రాసిన రచయిత్రి ఒక్కరేనా! ఆవిడ గైడ్ సినిమాకు స్క్రీన్ ప్లే వ్రాశారా లేక తన పేరునుఆవిధంగా వాడుకోనిచ్చారా? ఆశ్చర్యం!!!! ) విందు హడావిడి అయిపోంగానే, ఆ విందు ఇచ్చినావిడ (అప్పటి బాంబే గవర్నరు లెండి) ఈ సినిమా సజ్జునంతా ఎవరికీ తెలియకుండా వరండాలో కూచున్న లార్డ్ గారి దగ్గరకు చేర్చింది. మేము మా మా డైలాగులు (ఆయనతో చెప్పాల్సినవి) వల్లించుకుంటూ ఆయన చుట్టూ కూచున్నాం.

లార్డ్ మౌంట్బాటన్ హఠాత్తుగా ఈ గైడ్ సినిమా కథేమిటి అని అడిగారు . పెరల్ బక్ కథ చెప్పటం మొదలు పెట్టింది కాని ముందుకు సాగలేదు. ఆవిడ ఇలా చెప్పటం విన్నాను, "అక్కడ ఒహడుండేవాడు....వాడి పేరు రాజు....వాడొక గైడ్...... "గైడేమిటి, దేనికి గైడు" అడిగారు గంభీరంగా లార్డ్ గారు. పాపం ఈ ప్రశ్నతో అప్పటికే తడబడుతున్న ఆవిడ మరింత కంగారుపడి నావంకకు తిరిగి, "నారాయణ్, మీరు చెప్పండి కథ" అనేసింది.

నేను నోరు విప్పలేదు. వెధవది 80,000 మాటలతో ఈ నవల వ్రాశానూ, ఇప్పుడు కాసిని మాటలలో ఈ కథ చెప్పే జంఝాటలోకి దిగాలా అనిపించింది. ప్రెస్స్ కు ఇచ్చిన ప్రకటనల ప్రకారం గైడ్ సినిమాకు స్క్రీన్ ప్లే పెరల్ బక్కే వ్రాసిందట! ఆవిడకేమో అడ్వాన్సే పాతికో రెండొందల వేల డాలర్లో ఇచ్చారట, నేనెందుకు ఆవిడకిప్పుడు సహాయం చెయ్యాలి?? నా వంక జాలిగా చూసింది పెరల్ బక్. అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను కథ చెప్పేందుకు ఉసిగొల్పటానికి ప్రయత్నించారు. కాని నేను మటుకు గుంభనగా కూచున్నాను.

పెరల్ బక్కే మళ్ళి మొదలు పెట్టి..."అక్కడేమో రూసీ...ఆమొక డాన్సర్...." అంటున్నది. "అలాగా" ఆశ్చర్యం చూపించారు మౌంట్‌బాటన్. "ఎవరావిడ? ఆవిడకు ఏమయ్యింది?" అని హఠాత్తుగా కలిగిన ఆసక్తితో అడిగారు లార్డ్. ఈ అంతరాయంతో పెరల్ బక్ మళ్ళి కథ చెప్పలేకపోయింది. చెప్పొద్దూ, ఆవిడ అలా తంటాలుపడుతూ, కథంతా కంగాళీ చేసేసి ఆయనకి వినిపించటం చూస్తుంటే, నాకు నవ్వొచ్చింది.
మిగిలిన అతిధులు కూడ మేమున్న చోటికి ఒక్కరొక్కరే చేరటం మొదలుపెట్టారు. "చాలా బాగున్నదనే చెప్పాలి" అన్నారు లార్డ్ మౌంట్బాటన్.

పక్కకు తిరిగి తన సహాయకుడితో, "విలియం, మనం లండన్ తిరిగి వెళ్ళినాక నాకు గుర్తు చెయ్యి. నాకు తెలియదు, మరి రాణి గారిని కలవటం కుదురుతుందో లేదో. సరే కానివ్వండి నేను చెయ్యగలిగింది నేను చేస్తాను...." అన్నారు.

పాపం మన దేశాని వైస్రాయిగా పనిచేసినాయన, 1947 లో పరిపాలనాధికారాలను బదిలీ చెయ్యటం అనే మహోత్కృష్టమైన పని చేసినాయన, ఇప్పుడు గైడ్ సినిమా ప్రచారనికి పాటుబడుతున్నాడు, విచిత్రం!!! కాని ఈ విషయం గురించి మళ్ళీ ఎప్పుడూ నేను వినలేదు.

అమెరికన్ దర్శకుడు హఠాత్తుగా రెండు పులులు ఒక్క లేడికోసం కొట్టుకుని ఒకదాన్నొకటి చంపుకోవాలి అని గొడవ మొదలుపెట్టాడు. అది ఖర్చుతో కూడిన వ్యవహారం అని నిర్మాత గొణుగుడు. కాని, దర్శకుడు. "ఎలియ కజాన్" నుంచి పుణికి పుచ్చుకున్న వారసత్వమంతా కనపడాలని, "తప్పదు సార్, అది సింబాలిక్ గా ఉంటుంది" అనేశాడు. ఆ రక్తం రంగుల్లో అద్భుతమైన ఆసక్తి తీసుకు వస్తుందంటాడు! పైగా ఆపైన ఆకాశమే హద్దన్నాడు. ఆ మాటతో దేవానంద్ బుట్టలో పడ్డాడు. మద్రాసులో పులుల యుధ్ధం చిత్రీకరించారు. కాని ఎడిటింగ్ తరువాత ఆ దృశ్యం అర సెకండుకి మించి ఉంచలేదు. ఏదో పొరబాటున లాభ్‌లో ఫిలిం కడిగేప్పుడు పడ్డ మరకలాగ ఆ సీన్ మిగిలింది. భయకరమైన పులి అరుపులూ వగైరాలు మటుకు వినబడ్డాయి.


సినిమా మొదలు పెట్టటానికి ముందు, వాళ్ళు ప్రతి దానికీ నా సలహా తీసుకునేవారు. ఒక రోజు మొత్తం వాళ్ళతో గడిపి మైసూరు చుట్టుపక్కల, నది, అడివి, గ్రామాలు, గుంపులకొద్ది ఉన్న గ్రామీణులు, గ్రానైట్ మెట్లు, పడిపోతున్న పురాతన కట్టడాలు కలిపిన నా మాల్గుడి అన్నీ చూపించాను. వాళ్ళు కెమెరాలు, ఇతర సామగ్రి పట్టుకు వస్తామని నాకు వాగ్దానం ఐతే చేశారు కాని, ఎన్నటికీ వాళ్ళు రానేలేదు. నాకు తరువాత తెలిసిన విషయం ఏమంటే సినిమా మొత్తాన్ని జైపూర్ లో తీద్దామని నిర్ణయించారని. పైగా మరొకొన్ని సీన్లు ఎక్కడెక్కడో తీసేశారుట. మాల్గుడిలో కానప్పుడు ఐస్ లాండులో తీస్తేమటుకు నాకేమిటి!


మాల్గుడిని వదిలిపెట్టేసి, వాళ్ళు నేను కథలో చెప్పిన విలువలు, ఇతివృత్తం, పరిసరాలు అన్నీ కూడ విసర్జించారు . చివరికి పాత్రలను కూడా! నా పాత్రలు చాలా చిన్నవాళ్ళైనా వాళ్లకంటూ ఒక రూపం ఉన్నది, చక్కగా స్పుటంగా కనిపిస్తారు, వాళ్ళు చూపించినట్టుగా పట్టణాల్లో ఉండే పరుగులుపెట్టే, మసక మనుషులు, కాదు! నా నవలలో నాయిక ఒక చిన్నపాటి స్టారే కాని అంతకంటే గొప్పగా వ్రాయలేదు. కాని సినిమాలో ఆవిడ దేశవ్యాప్త ప్రాచుర్యం సంపాయిస్తుంది, ఎప్పుడూ బోయింగ్ 707 లో ప్రయాణాలు చేస్తూ, ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, ఐదు నక్షత్రాల హోటళ్ళలోంచి బయటకు వస్తూ కనిపిస్తుంది. ఆవిడను వి ఐ పి చేసిపారేశారు.

ఆవిడ మరణావస్థలో ఉన్న తన ప్రియుణ్ణి విమానంలో బయల్దేరి చివరి కాస్తా జీపులో వెళ్తుంది. ఇదంతా బారత రక్షణ శాఖ వారు ఏర్పాటు చేశారుట. ఆవిధంగా ఆ సీన్ని ఘొప్పగా చూపించాము అనుకున్నారు. అన్నిటికన్నా ఘోరమైనది చివరిలో శవయాత్ర సీన్. ఆ సినిమాకి డబ్బు పెట్టిన శేట్లు తమ డబ్బు సంచూలు పట్టుకుని రషెస్ చూశారుట, ఆ శవ యాత్ర సీన్లో తగినన్ని ఏడుపులు లేవట, ఏడుపులూ మొత్తుకోళ్ళూ లేకుండా సినిమా ఏమిటి అని గదమాయించీ, లేకపోతే డబ్బులు ఇవ్వమని బెదిరించీ, చివరి నిమిషంలో చాలాసేపుండే కృత్రిమమైన ఏడుపుల్ని అతికించారు.

తరువాత అదే గైడ్ నవలను స్టేజి మీద నాటకంగా వెయ్యాలన్న ప్రయత్నం కూడ నాకు చీకాకు కలిగించింది. నాకు చిరకాల మిత్రుడు, న్యూఆర్క్ టైంసులో సాహిత్య విమర్శకుడు ఐన హార్వే బ్రైట్ తాను నాటకంగా వ్రాసుకొచ్చాడు. అతను వ్రాసిన దానికి నా నవలకు పొంతనే లేదు! అందుకని నేను అనుమతి ఇవ్వకుండా ఆపేశాను. అతను వ్రాసిన ప్రకారం, హీరోయిన్ ని తీసి పారేశాడు!! ఇలా ఆయన పాత్రలను తీసెయ్యటం తాను సొంతంగా తయారు చేసిన రెండు పనికిరాని, పైగా అనవసరమైన పాత్రలను జొప్పించటం వద్దన్నాను. అన్నిటికి మించి హీరో స్టేజీ మీదే ఉచ్చపొయ్యటం వద్దని తీవ్రంగా ప్రతిఘటించాను.

ఈ గందరగోళంతో మా స్నేహం దెబ్బతిన్నది. చివరకు మేము ఒకరితో ఒకరు లాయర్ల ద్వారానే మాట్లాడుకునే పరిస్థితికి వెళ్ళింది. చాలా గోల అయ్యింది, కోర్టులవరకూ వెళ్ళింది.
కాని విషయం అంతటితో ఆగలేదు.

హార్వే బ్రైట్ అంత సులభంగా వదిలే స్నేహితుడు కాదు. అతను మళ్ళి నా దగ్గరకు వచ్చి, నా అనుమతితోనే ఒక్కో లైను కూడా సరిచూస్తూ, మారుస్తూ, ఒక నాటకం తయారు చేశాడు. గైడ్ నాటకం మార్చ్ 1968లో బ్రాడ్వేలో మొదలు పెట్టారు కాని వారంలోపలే, నేను పెట్టా బేడా సద్దుకుని న్యూఆర్క్ కి వెళ్ళి చూసేలోపలే, మూతపడింది. నిర్మాతలకి మూడు లక్షల డాలర్ల నష్టం వచ్చింది. హార్వే మళ్ళి నాకు ఉత్తరం కూడ వ్రాయలేదు. ఒక వారం తరువాత తెలిసింది, అతను హార్ట్ ఎటాక్ తో తన ఆరో అంతస్తు ఎపార్ట్మెంటు మెట్లమీద కూలబడిపోయి మరణించాడని.


===================================================

గైడ్ సినిమా సమీక్ష ఈ కింది లింకు నొక్కి చదువుకోవచ్చు


సమీక్ష
===================================================6 వ్యాఖ్యలు:

 1. ఆర్.కె.నారాయణ్ గైడ్ సినీమా కధ తాను వ్రాయలేదన్నా, గైడ్ సినిమా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అది ఎప్పటికీ హిందీ లో ఒక క్లాసిక్ చిత్రంగా నిలుస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. @సి బి రావ్

  "...ఆర్.కె.నారాయణ్ గైడ్ సినీమా కధ తాను వ్రాయలేదన్నా..."

  ఆర్ కే నారాయణ్ కు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అటువంటి మనిషీ కాదు.

  అదే భరోసా నాకు ఈ సినిమా జనం మీద లేదు. మీరు క్లాసిక్ అనే ఆ సినిమా రచయితకు ఏదో ఒక సాకు చూపి ఆయన వ్రాసిన నవల వాడుకుని డబ్బులు ఇవ్వకపోవటం ఎంతటి అన్యాయం??!! ఈ విషయం హైలైట్ చెయ్యటానికే శ్రమపడి నేను తర్జుమా చేసాను.

  మీ వ్యాఖ్యతో తెలిసింది నా శ్రమ వృధా అని.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ప్రొఫైల్ లేని వ్యాఖ్యలు వెయ్యటం మానేసాను. అజ్ఞాతకు వీటికీ తేడాలేదని నా అభిప్రాయం.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నా గత వ్యాఖ్యకు చిన్న వివరణ.తన కధ గైడ్ కు చేసిన మార్పులు, చేర్పులకు వ్యధ చెంది ఆర్.కె.నారాయణ్ ఆ సినిమాను disown చేశారు. మీ వ్యాసం ద్వారా దెబ్బతిన్న రచయిత మనోభావాలు తెలిశాయి. నిర్మాతలు రచయితకు ఏమీ ఇవ్వకపోవటం అన్యాయమే. అయితే ఈ సినిమా ద్వారా రచయిత జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి పొందారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. "...అయితే ఈ సినిమా ద్వారా రచయిత జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి పొందారు......"

  ఆర్కే నారాయణ్ గైడ్ సినిమా వల్ల కొత్తగా వచ్చిన గొప్ప పేరేమీ లేదు. అప్పటికే ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికాలో పేరు వచ్చింది. ఈ నవలకి ఆయనకి ఏకంగా సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చింది. సినిమా తీసారు కాబట్టి అవార్డు రాలేదు. ఏమైనా దేవానంద్ ఆయనకు చేసిన అన్యాయం చదువుతుంటే చాలా కోపం వచ్చింది.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.