2, మార్చి 2011, బుధవారం

భక్తిలో "శబ్ద భక్తి" ఒకటా!!!

ఈరోజున శివరాత్రి సందర్భంగా శివాలయానికి వెళ్లి ఒక్కసారి పరమేశ్వర దర్శనం చేసుకుందామని దగ్గరలో ఉన్న ఒక గుడికి చాలా పొద్దున్నే వెళ్ళాము. తోదరగా వెళ్ళటం వల్లనేమో గుళ్ళో పెద్దగా రద్దీ లేదు. పరమేశ్వరుని ఆయన వాహనం ఐన నందీశ్వరుని కొమ్ముల మధ్య నుండి చూసి తరించాము , పూజ చేయించటం జరిగిపోయింది.

గుళ్ళో భక్తులు కొద్దిమందే అయినా శబ్దానికి కొదువ లేకుండా ఆ గుడివారు తమ శక్తి కొద్దీ మైకు పెట్టి గుండెలు గుబగుబలాడేట్టుగా పాటలు పెట్టేశారు. కావటానికి భక్తి పాటలే, ఆపైన శివుని మీద పాటలే కాని అవి శబ్ద కాలుష్య స్థాయిని మించి పోయి గుళ్ళో భక్తులు కొట్టే గంటలు కాని, పూజారులు చదువుతున్న మంత్రాలు కాని వినపడటానికి వీలులేనంతగా ఈ 'శబ్దం' ఉన్నది. పాపం శివుడికి ఈరోజు ఎలా గడుస్తుందో కదా అని బెంగపడుతూ ఇంటికి బయలుదేరాను.

మీరూ ఓసారి ఆ గుళ్ళో ఉన్న శబ్ద కాలుష్యం విని చూడండి.



గుళ్ళల్లో ఉండే నిబధనలు
  1. ఫోటోలు తియ్యరాదు (కొన్ని గుళ్ళల్లో ప్రముఖంగా బోర్డ్లు కూడ పెడతారు)
  2. గర్భ గుడిలో నూనె దీపాలే కాని విద్యుత్ దీపాలు ఉండకూడదు. కొత్త సాంకేతిక పరికరాలు దేవుడికిపనికిరావట.
  3. నిశ్శబ్దం పాటించ వలెను.

ఇన్ని రకాల నియమ నిబంధనలు పెట్టె గుళ్ళల్లో మైకులు పెట్టటానికి మాత్రం విధమైన అభ్యంతరం లేదు. కొన్ని కొన్ని చోట్ల, గోపురానికి అన్నివైపులా మైకులు పెట్టి ఉంటాయి. ఆగమ శాస్త్రంలో ఇటువంటి ఆగం చెయ్యటానికి అనుమతి ఉన్నది కాబోలు!!!

ఎక్కడన్నా గుడి పక్కనో, ఎదురుగానో ఉన్న ఇళ్లవారిని చూసి "పాపం" అనిపిస్తుంది. గుడికి అతి దగ్గిరలోఉంటే, దైవ దర్శనం హాయిగా ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు అని ఇతరులు అసూయ పడాల్సినది పోయి, వాళ్ళను చూసి "పాపం" అనుకునేటంతగా
గుళ్ళ నుంచి శబ్ద కాలుష్యం ఉంటుంది. పర్వ దినాలలో ఐతే మరీపెట్రేగిపోతారు మరింతగా "గోల" చెయ్యటానికి ఈ శబ్ద భక్తులు.

ఇటువంటి శబ్ద కాలుష్యాన్ని చెయ్యకుండా స్వాములవారూ, మఠాధిపతీ కూడ ఎవరినీ కట్టడి చేసిన దాఖలాలు నాకు కనపడలేదు. దేవుడికి కావలిసినది మనలోని భక్తి ఏకాగ్రతలా, లేక యాంత్రిక దుందుభుల ఫెళఫెళలా, మైకు గొట్టాలనుండి దూసుకొచ్చే భయంకర శబ్దాలా? గుళ్ళోకి వెళ్తే మంద్రంగా వినపడే మంత్రాలు, అప్పుడప్పుడూ తాము వచ్చామని దేవుడుకి తెలియచేసే గంటల చిరు శబ్దాలు మించి ఉండవలసిన అవసరం ఉన్నదా?!

ఇంతటి అల్లరి గత మూడు నాలుగు దశాబ్దాలలో మరీ ఎక్కువైపోయింది. ప్రార్ధనా మందిరాల్లో ఉండవలసినది ప్రశాంతత, ఏకాగ్రతను పెంపొందించే నిశ్శబ్దం, కాని నిరంతర శబ్దం కాదు.

వీటికి తోడు దుమ్ము లేచిపొయ్యేట్టుగా, సినిమా పాటల ఫక్కీలో భజన చేసే భజన బృందాలు. నేను ఎక్కడన్నా కొత్త ఇల్లు వెతుక్కునేప్పుడు తప్పనిసరిగా వాకబు చేసే విషయాల్లో ఇదొకటి. చుట్టు పక్కల ఎవరన్న ఫలనా ఫలానాభక్తులు ఉన్నారా అని. వాళ్ళు ఉంటే అక్కడికి ఆమడ దూరలో కూడ నేను ఇల్లు తీసుకోను. ఈ శబ్ద భక్తులను చూస్తే నాకు అంతటి భయం!! వాళ్ళకు తోచిందే తడవుగా సాయత్రాల్లో భజన మొదలుపెట్టేస్తారు. రకరకాల "రంగు గుడ్డల" వాళ్ళు మూగిపోతారు. వాళ్ళింట్లో వాళ్ళు చేసుకుంటే పరవాలేదు, వీళ్ళకి ఇంత భక్తి ఉందని అందరికీ తెలియాలి అని ప్రదర్శన కోసం మైకు పెట్టి గోలగోల చేసి, ఇతరుల్లో
దేముడంటే ఉన్న భక్తి పారిపొయ్యేట్టుగా చేశేస్తారు.

పాపం సుప్రీం కోర్టువారు ఏనాడో ఒక తీర్పు ఇచ్చారు. ప్రార్ధనా మందిరాల్లో, మైకులు గట్రా పెట్టకూడదు అని. కాని వినేవాళ్ళేరి? తీర్పు అమలుపరిచే దమ్మున్న నాధుడేడి.

ఏం వాళ్ళూ రోజుకి ఐదుసార్లు అరవగాలేనిది, మేము పొద్దున్నేగా పాటలు పెట్టేది అని ఒకరు, వాళ్ళు ప్రతి ఆదివారం గోల చేస్తే మేము ఎప్పుడన్నా పండుగలకేగా అని మరి కొందరు. చివరికి అందరూ కలిసి చేసేది "గోల" తప్ప మరొకటి లేదు. ఇదంతా కలిపి "శబ్ద భక్తి" అని ఒక కొత్త విధానంలోకి మారింది. ఎవరెంత చప్పుడు చేస్తే అంత భక్తిపరులు.

పండుగలు
వస్తే చాలుభయం, ఎవడేమి కొత్త శబ్దోపద్రవం తెచ్చిపెడతాడో అని వణకాల్సి వస్తుంది. ప్రముఖ రచయిత 'చలం' గారు, విజయవాడలో ఆయన ఉండే రోజుల్లో అప్పట్లో ఉన్న లక్ష్మీ టాకీసుకు ఆనుకుని ఉన్న ఇంట్లో ఉండేవారు. ఆయన సినిమా హాల్లో నుండి వెలువడే విపరీత, వింత వింత శబ్దాలు భరించలేక, రాత్రి రెండో ఆట అయిన తరువాత నిద్రపోలేని పరిస్థితితి. ఆయన వ్రాసుకున్న కొన్ని మాటలు:

"...మా గోడపక్కన టాకీగృహం. యజమానులు వాళ్ళకి ఏఫిల్ము డబ్బు తీసుకొస్తుందో ఆలోచిస్తారుగాని, పక్కన నివసించే నిర్భాగ్యుల నిద్ర అదృష్టాన్ని గుర్తించరు. ఫిల్ము మారుతోంది అనేప్పటికి గుడెలు దడదడలాడతాయి, కొత్తరకం ఉపద్రవం రాబోతోందో అని. అర్ధరాత్రులు మెళుకువగా గడిపేవాళ్ళ మనశ్శాంతి డైరక్టర్ల శ్రవణ సౌకుమార్యం మీద ఆధారపడవలసి వొచ్చింది. తెలుగు ఫిల్ములను చూడని వాళ్ళ అశ్రద్ధ మీదమంచి కసి తీర్చుకుంటున్నారు వారాలకి వారాలు వాటి దుస్సహమైన శబ్దాలను వినిపించి. హీరోయినో పెద్ద పులి నోట ప్రాణాన్నో, దుర్మార్గుడి హస్తాలమధ్య శీలాన్నో, సముద్రంలో తన వస్త్రాలనో, కోల్పోయే అపాయంలోకి దిగేటప్పుడు, ఇరవై ఇనపతాళ్ళమీద రంపాలుపెట్టి కోస్తున్నట్టు గోల కల్పిస్తే ..."

"...నాకు నూరేళ్ళకన్నా ఎక్కువ అయుర్దాయమున్నదని అనుమానంగా ఉంది. నేను దేశానికీ, భాషకీ చేస్తున్న ద్రోహానికి, యముడి పక్కన, ఇటు భారతమాతా, అటు సరస్వతీ నుంచుని తప్పకుండా నరకంలోకి తోయిస్తారని ఆశపడే నీతి సోదరులకి చాలా ఆశాభంగం కలగబోతోంది. ఫిల్ముపాటలు వినడంతో నా కర్మపరిపాకం ఇక్కడే తీరింది. నాకు కూడా, నరకంలో వేసినా, ఇంతకన్నా ఏంచేస్తారు అనే నిబ్బరం చిక్కింది. ఇంతలో బాలనాగమ్మ ట్రైలరు వినడంతోటే, చాల పొరబడ్డాననీ, దర్శకుల శబ్దకల్పనాశక్తి లోతుల్నితెలుసుకోలేక, అబద్ధపు ధీమాలో బతుకుతున్నానని వొణుకు పుట్టింది. ఇల్లు మారుద్దామా, ఇల్లు దొరక్కపోతే రైలుస్టేషనులో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, అక్కడ మకాం పెడదామా అనుకొంటూ ఉండగా,...."

పాపం చలంగారు సినిమా హాలు పక్కనే ఉన్న ఇంట్లో ఉండటం వల్ల ఇంతటి ఘోరమైన శబ్ద కాలుష్యానికి గురికావటం సహజం. పరిసర ప్రాంతాలు చూడకుండా ఇల్లు తీసుకోవటం ఆయన పొరబాటు. ఎప్పుడో 1940-1950 లలో సినిమా హాళ్ళ పక్కన ఉండేవారి అవస్థ చలం గారు చెప్పిన రీతిలో ఉంటే, ఈనాడు, గుళ్ళ పక్కన పరిసర ప్రాంతాల్లో ఉండేవారి అవస్థ అంతకంటే ఎక్కువగా ఉన్నది. సినిమా హాలు వారిని కనీసం కసితీరా తిట్టుకునే అవకాశం ఉన్నది. గుడి పక్కనే ఉంటే అలా చెయ్య సాహసించరు ఎవరూ. దేవుడికి సంబంధించినవిషయం. ఏమన్నా అంటే కళ్ళుపోవూ!

భక్తి తప్పనిసరిగా అందరికీ ఉండాలి. కాని వారి భక్తితో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. భక్తి పేరిట అల్లరిచెయ్యకూడదు. ఎవరి భక్తి వారు తమకు ఇష్టమైన దేముణ్ణి ప్రార్ధించుకుంటూ, జీవనాన్ని గడుపుకోవచ్చు.

ప్రభుత్వం వారు ఎంతసేపూ, తమ పదవులను కాపాడుకోవటం మీద దృష్టేకాని, ఇటువంటి సాంఘికదురాచారాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు.

మతానికైనా సవ్యమైన దశాదిశా నిర్దేసించవలసిన మఠాధిపతులు, మతాధికారులు కూడ తమ పబ్బంతాము గడుపుకోవటంతోటే ఉంటున్నారు కాని భక్తి పేరిట పేట్రేగిపోతున్న శబ్దకాలుష్యన్ని కనీసం ఒకదురాచారంగా గుర్తించలేకపోతున్నారు.

ఎప్పటికైనా "శబ్ద భక్తి" మాయమయ్యి సవ్యమైన భక్తి మార్గంలో ప్రజలందరినీ నడుపు నాయనా అని శివుణ్ణి శివరాత్రి సందర్భంగా ఆర్తిగా ప్రార్ధించాను.

పాపం ఆయనేమో ఈరోజున శివరాత్రి సందర్భంగా తన భక్తులు కొనసాగిచబొయ్యే "శబ్ద భక్తి" భరించటానికి సంసిధ్ధుడవుతున్నాడు. ఏమైనా గరళ కంఠుడు, కాలకూట విషాన్ని మింగి భరించినవాడు కదా! భక్తులు చేసే శబ్ద దురాగతాన్ని భరిస్తున్నాడు, కాని ఎప్పుడో మూడో కన్ను తెరిచిశబ్ద భక్తుల్ని భస్మం చెయ్యకుండా ఉంటాడా అని నాలాంటి సామాన్య భక్తుల ఆశ. అది పేరాశేనేమో!!

శివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.

మీ అందరికీ శబ్దకాలుష్యరహిత శివరాత్రి కావాలని మనస్పూర్తిగా శంకరుణ్ణి ప్రార్ధిస్తున్నాను.


**********************************************
క్రితం సంవత్సరం శివరాత్రికి వ్రాసిన వ్యాసం
మనస్సు కొతా....



6 కామెంట్‌లు:

  1. ఈ.......శ్వ.....రా
    పాపం ఇంకా ఈయన పరవాలేదండీ ఒక్క రోజే. వినాయక చవితి, దసరాల టైం లో చూడాలి ఒక పక్క పరీక్షలు, ఒక పక్క చెవుల్లోంచి రక్తం వస్తుందేమో అనిపించేలా(మనకీ, దేవుడికీనూ) వీర లెవెల్లో సౌండ్ పెట్టి సినీ బాణీల భక్తి పాటలు. అదీ తొమ్మిదేసి రోజులు. దేవుడా......అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  2. ముందరగా అందరూ తమ తమ ప్రదర్శనా భక్తిని మానుకోవాలి. మనని ఎవరైనా చూస్తున్నరా,,,.మన గురుంచి ఏమైనా అనుకుంటున్నరా........... భక్తి-ముక్తి గురించి తప్పితే అన్నిటి గురుంచి ఆలోచించే వాళ్ళే ఎక్కువైనారు. దీనివలన ప్రక్కవారికి భక్తి కన్నా కక్షలు, ఉద్రేకాలు పెరిగె అవకాశం వున్నది. ఉదాహరణకి కొన్నేళ్ళక్రితం నేను అమలాపురం మెడికల్ లాడ్జి లో వున్నప్పుడు వినాయక చవితికి "హరిచంద్ర నాటకం" వేశారు.....అదీకూడా రాత్రి 10 గంటలకి మొదలైంది. [ఎదురుగా పోలీసు స్టేషను} మరోప్రక్క సెంటర్లో "చింతామణి" నాటకం........వారి వారి శక్తి కొద్ది బ్రహ్మాండమైన సౌండ్ పెట్టి వారియొక్క ఆధిక్యాన్ని చాటారు. నాకైమైనా చేద్దామనిపించి లాడ్జి వాళ్ళని అడిగాను.........వాళ్ళు అప్పటికే తాళం వేసి వున్న పోలీసు స్టేషను చూపించారు. ఆ కళాకారుల మీద ఏమూలో వున్న గౌరవం పొయి..... హరిశ్చంద్రుడుగాని, చింతామణిగాని ఎదురు పడితే గొంతు నులిమేయాలనే కక్షతో ఆ రాత్రంతా గడిపాను నిద్ర లేకుండా..

    రాధాకృష్ణ,
    విజయవాడ.

    రిప్లయితొలగించండి
  3. రాధాకృష్ణ! బాగా చెప్పారు. భక్తీ పేరిట వస్తున్నా శబ్ద కాలుష్యాన్ని అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ పని ప్రభుత్వం చెయ్యలేకపోతున్నది. మతాదిపతులకు అసలు పట్టదు! మరింకెవరు చెయ్యగలరు అన్నదే ప్రశ్న. పుస్తకాల్లో పౌరవిజ్ఞానం(Civic Sense కు తెలుగు'ట') ఒక సబ్జెక్ట్ గా చదువుకోవటమే కాని, ఈ రోజుల్లో అది దాదాపు మృగ్యం.

    రిప్లయితొలగించండి
  4. Please let me know whom should we make a complaint against this sound pollution
    We are facing too much of disturbance due to the mike sound beside our flat through out the year
    It starts early 5 am in the morning

    రిప్లయితొలగించండి
  5. Since ours is a great secular country, if the sound source is a Hindu Temple you can complain to anybody including Police and there will be swift action. In case it is a place of worship other than that of Hindus, may God help you. Nobody can help.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.