22, ఏప్రిల్ 2011, శుక్రవారం

బ్రిక్ లేన్ - ఒక మంచి సినిమా

బ్రిక్ లేన్ అనే సినిమా అంతా ఇంగ్లాండ్ లో జరుగుతుంది. బంగ్లాదేష్ కు చెందిన ఒక కుటుంబ కథ. భర్త మధ్యవయస్కుడు, తనకన్నా చిన్నదైన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. సినిమాలో ఈయనది సహాయక పాత్రే కాని పాత్ర నటించిన నటుడు అద్భుతంగా నటించాడు. నటుని పేరు శ్రీ సతిష్ కౌషిక్.

సినిమాకు ముఖ్య పాత్ర బంగ్లాదేష్ లో ఒక గ్రామీణ యువతి పేరు నాజ్నీన్. ఈ పాత్రను నటి తనిష్టా చటర్జీ అలవోకగా చేశారు.

క్లుప్తంగా చెప్పాలంటే బంగ్లాదేష్ కు చెందిన నజ్నీన్ చిన్నపిల్లగా ఉండగానే, చాను అహ్మద్ పెళ్ళి చేసుకుని, ఇంగ్లాండ్ తీసుకు వస్తాడు. వయస్సులో వీళ్ళిద్దరికీ చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక కొడుకు పుట్టి పోయాక, వీళ్ళకి ఇద్దరు కూతుళ్ళు.

చానూ ఎప్పుడూ సాహిత్యం మీద మాట్లాడుతూ, ఏవేవో రకరకాల వ్యాపార పథకాలు వేస్తూ, పెద్ద ధనవంతుడైపోయి బంగ్లాదేష్ కు వెళ్ళిపోవాలని కలలుకంటూ ఉంటాడు. కాని ఏదీ కలిసిరాదు.

కుటుంబ జరుగుబాటుకు నాజ్నీన్ బట్టలు కుట్టి తన వంతు సహాయం అందిస్తూ ఉంటుంది. ఆమె కుట్టిన బట్టలు తీసుకుని వెళ్ళటానికి కరీం అనే ఒక యువకుడు వస్తూ ఉంటాడు. అతని పాత్రను క్రిస్టోఫర్ సింప్సన్ పోషించాడు. ముస్లిం యువకునిగా బాగా నటించాడు. వీళ్ళిద్దరి మధ్యా సాన్నిహిత్యం ఏర్పడుతుంది. నజ్నీన్ చెల్లెలు బంగ్లాదేష్ లోనే ఉంటూ విచ్చలవిడి జీవితానికి అలవడి, తన అల్లరి చిల్లర పనులు వివరంగా లండన్లో ఉన్న తన సోదరికి వ్రాస్తూ ఉంటుంది.

ఈలోగా 26/11 జరుగుతుంది. ఇంగ్లాండులో అందరూ వీళ్ళని అనుమానంగా చూస్తూ ఉంటారు. భర్తతో కలిసి ఒకరోజు కరీం నిర్వహిస్తున్న ఒక మీటింగుకు వెళ్తుంది. అక్కడ ద్వేష భావాలు నూరిపోస్తున్న యువకుల మాటలు విని చాను అహ్మద్ తన మనోభావాలు వెల్లడిస్తాడు. అతను చెప్పిన విషయాలు బాగున్నాయి. మీటింగులో చాను అహ్మద్ పాత్ర మాట్లాడిన రెండు నిమిషాల వీడియో మీకోసం ఇక్కడ ఇస్తున్నాను చూడండి.



చాను అహ్మద్ మాట్లాడిన మాటలు అక్కడ ఉన్న వాళ్ళకు నచ్చవు. ఇంగ్లాండులో ఉన్న ద్వేషపూరిత వాతావరణాన్ని తట్టుకోలేక చానూ అంతవరకూ సంపాయించిన డబ్బులన్నీ తీసుకుని బంగ్లాదేష్ వెళ్ళిపోదాము అంటాడు. కాని ఇంగ్లాడ్ లోనే పుట్టి పెరిగిన కూతుళ్ళు, ముఖ్యంగా పెద్ద కూతురు (బాల నటి నయీమా బేగం) ఒప్పుకోదు. భర్తను వదిలి, తనను పెళ్లి చేసుకోమని కరీం నజ్నీన్ ను అడుగుతాడు. కాని నజ్నీన్ ఒప్పుకోదు.

చాను ఒక్కడే బంగ్లాదేష్ కు తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్లబోయే ముందు చాను తన భార్య గురించి ఒక మాట అంటాడు, "నేను ఒక పల్లెటూరి అమాయకపు పిల్లను పెళ్లి చేసుకున్నాను అని ఇన్నాళ్ళూ అనుకున్నాను, కాని ఒక సంపూర్ణమైన స్త్రీ మూర్తి నజ్నీన్ అని తెలుసుకున్నాను". పిల్లల్ని చూసుకుంటూ నజ్నీన్ ఇంగ్లాండ్ లోనే ఉండిపోతుంది . సినిమా అక్కడితో అయిపోతుంది.

సినిమా మొత్తం నజ్నీన్ తన కథ చెప్పుకుంటూ మధ్య మధ్య సంఘటనలు వస్తూ నడుస్తుంది. చక్కటి నటనతో, చిన్న కథతో పెద్దగా మెలికలు, తికమక, అల్లరి ఆగం లేకుండా చక్కగా తీసిన సినిమా ఇది. డి వి డి లో ఆడియో కామెంటరీ కూడ ఉన్నది. సినిమా చూస్తూ, ఆడియో కామెంటరీ సంభాషణల మధ్య వస్తూ, మనకు చక్కటి సమాచారం అదిస్తూ ఉంటుంది. ఇటువంటి కామెంటరీలు ఉన్న డి వి డి లు మన తెలుగులో ఎప్పటికన్నా వస్తాయా అని నా అనుమానం.



ఈ సినిమాలో కొన్ని కొన్ని డైలాగులు బాగున్నవి:

నాజ్నీన్ అంటుంది: No one told me there are different kinds of love. The kind that starts deep and slowly wears away; that seems you will never use it up and then one day it is finished. Then there is the kind you do not notice at first but which adds a little bit to itself every day like an oyster makes a pearl, grain by grain, a jewel from the sand. That is the kind I have come to know.

చాను అహ్మద్ అనే మాటలు: Anything is possible when you are young. Then you get older and the thing about getting older is that you don't need everything to be possible anymore, you just need some things to be certain.

పూర్తి వివరాలు IMDB వెబ్ సైటులో ఉన్నాయి, ఈ కింది లింకు నొక్కి చదువుకోవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.