23, ఏప్రిల్ 2011, శనివారం

కోడలు దిద్దిన కాపురం - సెన్సార్ విశేషాలు

అది 1970 సంవత్సరం. ఎన్ టి రామారావు తీసిన కోడలు దిద్దిన కాపురం సినిమా సెన్సార్ సభ్యులకు ప్రదర్శించబడుతున్నది. ఇంటర్వెల్ సమయంలో అందరూ బయటకు వచ్చారు. కాని సెన్సార్ సభ్యులలో కొంతమంది చాలా కోపంగా ఉన్నారు. " సినిమాని బాన్ చెయ్యాలి" అని కేకలు కూడ వేశారు. ఇది చూసిన నిర్మాత తరఫున వెళ్ళిన రుక్మాంగదరావుగారు కంగారుగా ఎన్ టి ఆర్ కు ఫోన్ చేశారు.

సరే మర్నాడు నిర్మాత గారు సెన్సార్ ఆఫీసుకు వెళ్ళాలి. సెన్సార్ వారు సినిమాలో వారు విధించిన కట్లు తెలియచేస్తారు. అప్పటికే విషయం తెలుసుకున్న ఎన్ టి ఆర్, తాను వెళితే వెంటనే జవాబు చెప్పి తీరాలి కనుక తన బదులుగా దర్శకుడు శ్రీ యోగానంద్ మాటల రచయిత శ్రీ డి వి నరసరాజు లను పంపారు.

సెన్సార్ అధికారులు, సెన్సార్ కమిటీ సభ్యులు పెట్టిన అభ్యంతరం వీరికి విశదపరిచారు. ఏమిటి అభ్యంతరం? సెన్సార్ వారి నిబంధన "సమాజంలో సజీవుడైన ఒక వ్యక్తిని పోలిన పాత్రను సృష్టించి అపహాస్యం చెయ్యకూడదు" విషయానికి వాదోపవాదాలు విధంగా సాగినాయట:
(కాని విచిత్రం! ఎన్ టి రామారావును (ఆయన జీవిత కాలంలోనే) గేలి చేస్తూ "మండలాధీశుడు" సినిమా తీసారు, సినిమాకి సెన్సార్ ఇబ్బందులు వచ్చినట్టుగా వినలేదు)

సెన్సార్ అధికారి: మీకు తెలుసుకదా, సత్యనారాయణ పాత్ర ఫలానా బాబా ను పోలి ఉన్నదని సెన్సార్ సభ్యుల అభ్యంతరం

నరసరాజు: పోలిక అంటే ఏమిటో ముందు నిర్వచించండి. సెన్సార్ సభ్యులు చెప్పే బాబాగారికి....మా సత్యనారాయణ పాత్ర దొంగ స్వాములవారికి, పేరులో పోలిక లేదు. మా స్వాములవారి పేరు బాబాది కాదు. నిత్యానంద స్వాములవారు! డ్రెస్స్ లో పోలిక లేదు. మా స్వాముల వారిది పైజమా, షేర్వాని, మనిషి ఒడ్డు పొడుగులో పోలిక లేదు, మాట్లాడే భాషలో పోలిక లేదు, మాట తీరులో పోలిక లేదు, నడకలో పోలిక లేదు. ఉన్నదల్లా మీరు చెప్పే విగ్గులోనే పోలిక! అదైనా ఎప్పటినుంచో వస్తున్న మా విగ్గు! 'బాల నాగమ్మ' సినిమాలో మాయల మరాఠీ విగ్గు! ఎందరో విలన్లకు పెట్టిన విగ్గు! అది ఎవరి జుట్టునో పోలి ఉందని మమ్మలి మానేయమంటే ఎలా!

సెన్సార్ ఆఫీసరు: ఏమో బాబూ మాకెందుకీ గొడవ మీరు చెప్పే ఆర్గ్యుమెంట్స్ వ్రాసి ఇవ్వండి. బొంబాయి సెంట్రల్ సెన్సార్ బోర్డుకు పంపుతాము

సరే నిర్మాత తరఫున నరసరాజు గారు తన వాదనలు వ్రాసి సంతకం చేసి ఇచ్చారుట. బొంబాయి కార్యాలయం వారు "ప్రొడ్యూసర్ చెప్పే ఆర్గ్యుమెంట్స్ సవ్యంగానే ఉన్నాయ్" అని వ్యాఖ్యానిస్తూ విధమైన కట్స్ లేకుండా క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారుట.

సినిమా విడుదలయ్యి మంచి విజయం సాధించింది.

సినిమాలో శ్రీ కొసరాజు రచించిన "ఓం సచ్చితానందా..." పాట ప్రాచుర్యం పొందింది. వినండి పాటను


సినిమాకు సంగీతం అందించిన వారు శ్రీ టి వి రాజు గారు

ఈ విషయాలన్నీ కూడ డి వి నరసరాజు గారు రచించిన "తెర వెనుక కథలు" పుస్తకంలో తెలియచేసారు.






















5 కామెంట్‌లు:

  1. సరే వాదనతో విజయం సాదించారు కానీ ఆ సినిమా చుసిన వారు ఎవరైనా సత్య సాయిబాబాను విమర్శిస్తూ పాత్రను సృష్టించారని అర్దమవ్తుంది. సరిగ్గా మొన్న రక్త చరిత్ర విషయంలో వర్మ ఇలానే వాదించాడు.

    రిప్లయితొలగించండి
  2. యన్.టి.ఆర్ సత్యసాయిని ప్రతినాయుకుడుగా చూపించాలనే అలా చేశారు.అందులో ఏమాత్రం అనుమానంలేదు.
    "కాని విచిత్రం! ఎన్ టి రామారావును (ఆయన జీవిత కాలంలోనే) గేలి చేస్తూ "మండలాధీశుడు" సినిమా తీసారు, ఆసినిమాకి సెన్సార్ ఇబ్బందులు వచ్చినట్టుగా వినలేదు)"

    ఒక్క మండళాదీశుడు మాత్రమే కాదు..ఆ కాలంలో నటశేఖర కృష్ణగారు తీసిన " సాహాసమే నా ఊపిరి ", గండిపేట రహస్యం ", దాసరి తీసిన " విశ్వామిత్ర " ఇవన్నీ యన్.టి.ఆర్ దృష్టిలో పెట్టుకొని తీసినవే ఇంకా చెప్పాలంటే అచ్చు యన్.టి.ఆర్ లాగే వేషాలు వేసి..ఆయన లాగ డైలాగ్ డెలవరీ చెప్పించారు కూడాను. కాని యన్.టి.ఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కూడ వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు..! తన పనేదో తను చేసుకుంటూ పోయాడు తప్ప.. వాటి గురించి అసలు ఎక్కడా ఆయన చర్చించలేదు. ఒకసారెప్పుడో ఎవరో కొందరు సన్నిహిత విలేఖర్లు ఈ విషయం ఆయన వద్ద ప్రస్తావించినప్పుడు అందుకు ఆయన " కృష్ణ గారు ప్రస్థుతం ఆర్థికంగా నష్టాలలో ఉన్నాడు, నా మీద సినిమా తీయడం వలన ఆయనకు డబ్బులు వస్తున్నప్పుడు నాకంతకన్న సంతోషం ఏముంటుంది చెప్పు..? " అని అన్నాడట..?

    రిప్లయితొలగించండి
  3. @ కమల్

    కాని, కోట శ్రీనివాసరావు, రామారావుకు పేరడీ వేషం మండలాధీషుడులో కట్టాడు . ఆ పాపానికి కుటుంబంతో సహా రైల్లో తిరుపతి వెళ్ళటానికి విజయవాడ రైల్వే స్టేషనుకు వెళితే, రామారావు మనుషులు కిందపడేసి తన్నారని, కోట శ్రీనివాసరావే స్వయాన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తరువాత వేరేవారితో ఎన్ టీ ఆర్ కు మొర పెట్టుకుంటే, కోటను వేధించటం మానుకున్నారుట. ఇది మండలాధీశుడు వెనుక కథ. సినిమా తీసిన కృష్ణ బాగానే ఉన్నాడు, రామారావు పైగా జాలిపడ్డాడని మీరు చెప్తున్నారు, వేషం వేసిన కోటను మటుకు తన్నారు. కారణం ఏమిటో మరి!!??

    రిప్లయితొలగించండి
  4. చర్చ దారి తప్పి అనవసరపు వ్యవహారాల్లోకి పోతున్నది. కాబట్టి, ఇక "ఆ" చర్చకు స్వస్తి.

    వ్యాసంలో వ్రాసిన విశేషాలకు, కొత్త వివరాలు తెలిసినవారు చెప్పగలరు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.