12, మే 2011, గురువారం

బంగాళదుంప చరిత్ర

అప్పుడెప్పుడో ముంబాయిలో ఉండే రోజుల్లో ప్రయాణంలో కాలక్షేపానికి "మింట్" అనే పేపర్ చదువుతూ ఉండేవాడిని. అందులో ఒక రోజున, శనివారం అనుకుంటాను "బంగాళ దుంప" గురించిన ఒక ప్రత్యెక వ్యాసం చదివాను.అందులో భారత దేశానికి బంగాళా దుంప వచ్చి గట్టిగా మూడు శతాబ్దాల కంటే కాలేదు, ఇది ఇక్కడి మొక్క కాదు అని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. చదివిన విషయం నలుగురికీ తెలియాలని (అప్పటికి బ్లాగ్ లేదు) తెలుగు వికీలో వ్రాశాను. అలా వ్రాసిన విషయాలు గుర్తుకు వచ్చి మళ్ళి చిన్న చిన్న మార్పు, చేర్పులతో ఇక్కడ పున:ప్రచురణ.

మనలో చాలామందికి ఎంతో ఇష్టమైన కూర బంగాళా దుంప. ఉత్తర భారత దేశంలో ఐతే బంగాళా దుంప , ఉల్లిపాయ లేకుండా వాళ్లకి ముద్ద దిగదు అంటే అతిశయోక్తి కాదు.

మీకు తెలుసా అశోక చక్రవర్తికి, మొగలాయి పాలకులలో చాలామందికి, అంతెందుకు, అజంతా-ఎల్లోరాలలో రమ్యమైన చిత్రాలను చిత్రించిన చిత్రకారులకు, బంగాళదుంప రుచి తెలియదు.

కారణం, 17వ శతాబ్దము వరకు బంగాళదుంప అనే కూరగాయ ఉన్నదని ఒక్క దక్షిణ అమెరికాఖండంలోతప్ప మిగిలిన ప్రపంచానికి తెలియదు. స్పానిష్ వారు దక్షిణ అమెరికా ప్రాంతమును ఆక్రమించి వారి దేశానికి వలస దేశాలుగా తమ అధీనము లోనికి తీసుకువచ్చిన తరువాత, ఈ కొత్తకూరగాయ గురించి ముందు ఐరోపా వాసులకు ఆ తరువాత వారి ద్వారా ఇతర ప్రాంతములకు తెలిసింది. భారత దేశమునకు బంగాళాదుంప ఐరోపా వలసవారి నుండి వచ్చినదే. వారు మన దేశమును వారి అధీనములోనికి తెచ్చుకున్న సందర్భములో తమ తమ దేశాలనుండి ఇక్కడకు తెచ్చిన అనేకమైన వాటిలో బంగాళాదుంప ముఖ్యమయినది.

అసలు మొట్టమొదటి బంగాళదుంప మొక్కను ఐరోపాకు తెచ్చినది ఎవరు అన్న విషయం మీద ఇదమిద్దమైన అధారాలతో కూడిన సమాచారం లేదు. కొంతమంది వాదన ప్రకారం, అనేక యాత్రా విశేషాలను తన పర్యటనలద్వారాప్రపంచానికి తెలియచేసిన సర్ వాల్టర్ రాలీ (Sir Walter Raleigh) ఈ మొక్కను మొదట ఐరోపాకు తెచ్చాడని అనిపిస్తుంది.

ఈ విషయంలో 20 సంవత్సరాలకు పైగా ఎంతగానో కృషి జరిపిన డేవిడ్ స్పూనర్ (David Spooner) మరొక విచిత్రమైన విషయం చెప్పాడు. అదేమిటంటే, స్పానిష్ ఆక్రమణాక్రమంలో, 1568లో గొంజాలో జిమెనెజ్ డే కేసడా (Gonzalo Jimenez de Quesada) అనే సైనికాధికారిని, ప్రస్తుతం కొలంబియా దేశంగా పిలవబడుతున్న ప్రాంతాన్ని తమ అదుపులోనికి తీసుకురావటానికి, స్పెయిన్ ప్రభుత్వం 2000 మంది సైనికులనిచ్చి పంపింది. అతను, తన అనుచరులతో, అక్కడి బంగారాన్ని దోచుకురావచ్చని చాలా ఉత్సాహంగా బయలుదేరాడు. కాని, నాలుగు సంవత్సరాల తరువాత అతను ఖాళీ చేతులతో, 60 మంది తనమిగిలిన అనుచరులతో చాలా డీలా పడి ఓటమి భారంతో తమ దేశానికి తిరిగి వచ్చాడు.

ఆ దెబ్బతోఅతని పరువు పోయింది, అతని పై అధికారులు అతన్ని చాలా నిరసించారు. అతని ఓటమి మీద అనేక వ్యంగ రచనలు కూడా జరిగినవట. కాని, అతను బంగారానికి బదులు, దక్షిణ అమెరికా ఖండము నుండి, అక్కడి మొక్కలలో ఒకటయిన "పప" లేదా "పొటాటొ" మొక్కలను తీసుకునివచ్చాడు. అతనికి తెలియకుండానే, బంగారాన్ని మించిన సంపదను స్పెయిన్ దేశానికి తీసుకుని వచ్చాడు. అక్కడనుండి ఈ మొక్క మొదట స్పెయిన్, ఆ తరువాత ఇతర ఐరోపాదేశాలకు, వారి వలసవాద దురాక్రమణల వల్ల ఇతర దేశాలకు వ్యాప్తి చెందినదట.


అయితే, ఐరోపాలో దాదాపు ఒకటిన్నర రెండు శతాబ్దాలవరకు ఈ దుంపకూరను ఆదరించలేదు. ఇంగ్లాండులో నయితే, ఈ దుంపను "స్పడ్" (SPUD - Society for Pevention of Unhealthy - అనారోగ్య ఆహార అలవాట్ల నిరోధనా సంఘము) గా వ్యవహరించారట. కాని కొంతకాలమునకు, ఈ విధమయిన విపరీత వర్ణనల ప్రభావంనుండి బయటపడి, బంగాళాదుంప ఒక ముఖ్య భోజ్య పదార్థముగా మారినది. చరిత్రకారులు చెప్పిన ప్రకారం, పారిశ్రామిక విప్లవం విజయవంతము కావటానికి ఈ దుంపకూర ఎంతగానో దోహదపడినదట. బవేరియన్ యుద్ధాన్ని "పొటాటో యుద్ధం" గా అభివర్ణించారు. కారణం, యుద్ధం జరుపుతున్న దేశాల దగ్గర బంగాళాదుంపల నిల్వలు ఉన్నంతవరకే ఆ యుద్ధం జరిగినదట. అలాగే, దక్షిణ అమెరికాలో జరిగిన "ఇంకా"(Inca) తెగల యుద్ధాలలో కూడ, మధ్యలో కొంత విరామం తీసుకుని, ఈ దుంపకూర పంటను ఇళ్ళకు చేర్చిన తరువాత మళ్ళీ కొనసాగించేవారట.


బంగాళాదుంప ఐరోపా ప్రాంతానికి ఎలా వచ్చింది అన్న విషయం మీద అనేక వాదనలు ఉన్నాయి, అందులో ప్రధానమైనవి, పైన ఉదహరించటం జరిగింది. భారత దేశంలోకి బంగాళాదుంప దాదాపు 17వ శతాబ్దపు మొదటి అర్ధ భాగములోనే వచ్చిందనటానికి కొంత అధారాలు ఉన్నాయి. అందులోప్రధానమయినది, సర్ థామస్ రో (Sir Thomas Roe) 1615లో ఇంగ్లాడ్ రాయబారిగా మొఘల్ వంశస్తుడు జహంగీర్ పరిపాలిస్తున్న సమయంలో భారతదేశానికి వచ్చాడు. అతనితో పాటుగా అతని స్వంత పూజారి ఎడ్వర్డ్ టెర్రీ (Edward Terry) కూడ వచ్చాడు. అతనికి కొత్త ప్రదేశాలలోతను చూసిన విషయాలమీద వ్రాయటం ఒక అభిరుచి. అతని "తూర్పు భారతావని యాత్ర " (Voyage to East India) అనే పుస్తకాన్ని వ్రాశాడు. ఆ పుస్తకంలో అతను అప్పటికే భారతదేశంలో బంగాళదుంప ఉన్నట్టు వ్రాశాడు.

భారత దేశంలో ఈ దుంపకూర గురించి చెయ్యబడ్డ మొట్టమొదటి ప్రస్తావన ఇదే. అప్పట్లో, ఈ మొక్కని పెరటి తోటలలో వేడుకగా పెంచేవారట. పూర్తిగాఒక పంటగా 1822 వరకు పండించబడలేదు. మనదేశంలో సిమ్లా నగరంలో కేంద్రీయ బంగాళదుంపపరిశోధనా సంస్థ (Central Potato Research Institute-CPRI)[2] ఉన్నది. ఈ సంస్థకుచెందిన ఎస్.కె.పాండె (S.K.Pandey) చెప్పిన ప్రకారం, 1822వ సంవత్సరమువరకు, మనదేశములో బంగాళదుంపను ఒక పంటగా పండించలేదట. మొట్టమొదట, సల్లివాన్ అనేఅంగ్లేయుడు, మద్రాసుకు దగ్గరలో తన వ్యవసాయ క్షేత్రంలో పంటగా మొదలు పెట్టాడట.

కొన్ని దశాబ్దాల క్రితం వరకూ కూడా 1980 ల మొదటి రోజుల్లో కూడ చక్కటి బంగాళ దుంపలు వచ్చేవి. రాను రాను మన మార్కేట్లల్లో నాసిరకం దుమ్పలె దర్సనమిస్తున్నాయి. కారణం, ఎగుమతి మీద దృష్టి. ఈ విదేశీ పంటను, మన వాళ్ళు విదేశాలకు ఎగుమతి చేస్తూ, నాన్యమైనవి అక్కడ అమ్మేసుకుని, చెత్త రకమంతా మన ముఖాన పడేస్తున్నారుట

ఇది మనమందరమూ హాయిగా తినే ఆలూ అదే బంగాళా దుంప కథ

3 కామెంట్‌లు:

  1. పచ్చిమిరప కూడా మనది కాదు.

    రిప్లయితొలగించండి
  2. దీని దుంపతెగ! కంటిముందు రాశిపోసినట్టుగా వుంది ఫొటో!!

    రిప్లయితొలగించండి
  3. బాబు గారూ! ఫోతోలోనే ఇలా మంచి బంగాళా దుంపలు కనపడుతున్నాయి. మార్కెట్లో అధమ రకమే మనకి. అంతా అగుమతి కోసమట. మంచి సరుకు దేశ ప్రజలకు అక్కర్లేదట

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.