23, ఆగస్టు 2011, మంగళవారం

ఏమిటీ రాజీనామాల గోల

సామెత చెప్పినట్టుగా "పిడుక్కీ, బియ్యానికీ ఒకటే మంత్రమా". ప్రతి దానికీ రాజీనామా అనేయటం మధ్య మన రాజకీయ నాయకులకు అలవాటుగా మారిపోయ్యింది.

క్రిమినల్ లా లో ఏమని ఉన్నది, ఒక మనిషి మీద కోర్టులో క్రిమినల్ కేసు నడుస్తుండగా , ఒక వేళ సదరు వ్యక్తి మరణిస్తే, కేసునుండి వ్యక్తి పేరు తొలగిస్తారు. కారణం ఏమిటి?? చచ్చిపోయిన వ్యక్తి నేరం చెయ్యలేదని కాదు! వ్యక్తి నేరం చేసాడని నిరూపించబడినా శిక్ష వెయ్యంటం కుదరదు కాబట్టి. క్రిమినల్ లా లో ఉన్న చిన్న పాయింటును పట్టుకుని, ఏదో ఘోరంజరిగినట్టుగా గత
కొన్ని రోజులబట్టి ఒకటే కాకి గోల ! అవును కాకి గోలే!!

ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మరణించిన వ్యక్తి నిర్దోషి అనడే. చచ్చిపోయిన మనిషి మీదా కేసు అనే గోలంతానూ. వీళ్ళ దృష్టిలో మనిషైనా సరే ఎన్ని ఘోరాలు చేసినా సరే , చచ్చిపోతే ఇక మనిషి చేసిన క్రిమినల్ పనుల గురించి ఆరోపణలు కూడా ఎవరూ చెయ్యకూడదు. ఎంతటి న్యాయం!

రాజీనామాల విషయానికి ఒస్తే, ఇదేమన్నా ఉద్యోగమా ఊరికే రాజీనామాలు పారేసి మరొక ఉద్యోగం లోకి దూకటానికి?? అక్కడ కూడ ఇప్పుడు బాండ్లు వ్రాయించుకుంటున్నారు, తప్పని సరిగా కొంత కాలం పనిచేసి తీరతామని, లేకపోతె, ఇంత మొత్తం అపరాధ రుసుం కింద చెల్లిస్తామని.

ఒక మనిషిని ఒక ప్రాంతానికి ఒక ఐదేళ్ళ పాటు ప్రాతినిధ్యం వహించమని ప్రజలు ప్రతినిధిగా, ప్రజా ధనం ఖర్చు చేసి ఎన్నికలు జరిపి పంపిస్తే, ఇలా రెప్ప పాటులో రాజీనామాలు చేసి పారిపోవటానికి ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం. వీళ్ళని ఎన్నుకున్నది, అర్ధం పర్ధం లేని విషయాలకు అతిగా స్పందించి, చెట్టు నుంచి ఆకు రాలినట్టుగా, రాజీనామా నాటకాలు, ఆపైన మళ్ళి ఎన్నికలు, మళ్ళి వాళ్ళే ఎన్నికవటం చేయ్యటానికా! అంత రాజీనామా చేసిన వాళ్ళు, ఊరికే ఉండి తాము సాధించ దలుచుకున్న కార్యం సఫలీకృతం కావటానికి కృషి చెయ్యచ్చు కదా. ఆ పని చెయ్యరు. మళ్ళి అదే వ్యక్తులు ఉప ఎన్నికల్లో నిలబడి గెలిచి, చూశారా మేము అన్న పాయింటు నిజం అంటూ మళ్ళి రెడీ. దేనికి? మరొకసారి రాజినామాకి! అంతే కాని తమను ఎన్నుకున్న ప్రజలకు ప్రాతినిధ్యం వహించటానికి కాదు. రాజీనామా చేసి, ఆ రాజీనామాలు చెల్లితే, ఉప ఎన్నికలు వస్తే గిస్తే, అందులో వీళ్ళు గెలిచి బయటకు వచ్చి, చూశారా, ప్రజలు మా పక్షాన ఉన్నారు అని విర్రవీగటానికాఈ రాజీనామాలు. ఒకవేళ అలా మళ్ళి గెలిచి వచ్చినా వీళ్ళ పాయింట్ నిరూపించబదినట్టేనా!! ఇలా ఐతే న్యాయస్థానాలు దేనికి. ఆరోపణలు రాంగానే, ప్రతివాడూ, ఎక్కడో అక్కడ ఎన్నికల్లో నుంచోనూ, గెలిస్తే "చూశారా ప్రజలు నా పక్షాన ఉన్నారు, కాబట్టి నేను చేసింది కరక్టే (తాను నిర్దోషి అనడు)" అని జబ్బలు చరుచుకోవచ్చు కదా!

అదృష్టం బాగుండి, ప్రపంచ వ్యాప్తంగా రాజ్యాంగాలు, న్యాయ సూత్రాలు వ్రాసే వాళ్ళు న్యాయమైన రోజుల్లో వాటిని వ్రాశారు. ఈ నాటి రాజకీయ నాయకులే కనుక ఆ సూత్రాలు వ్రాయటానికి ఒడికడితే ఫలితాలు ఊహించటానికి కూడ భయంవేస్తుంది.

రాజకీయ నాయకులు తమ ఇష్టానుసారం రాజీనామాలు చేసే హక్కు వాళ్లకు ఉంది అనుకుంటే, వాళ్ళను తమకు ఇష్టం లేనప్పుడు, ఆవతలకు పొమ్మనే హక్కు వాళ్ళను ఎన్నుకున్న ప్రజలకు ఉండాలి కదా మరి. అది లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.