21, సెప్టెంబర్ 2011, బుధవారం

గాంధీ హిల్ అలనాటి జ్ఞాపకాలు :: ఇప్పటి దుస్థితి

విజయవాడలో చుట్టూ కొండలు. ఒక పక్క ప్రసిధ్ధి చెందిన దుర్గ కొండ. మరొక పక్క గాంధీ కొండ. ఈ గాంధీ హిల్ ప్రారంభం చేసినది నాకు బాగా గుర్తు, గాంధీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా, విజయవాడ మధ్యలో ఉన్న ఒక కొండ మీద గాంధీ స్థూపాన్ని స్థాఫించి, కొండ పైదాకా చక్కటి దారి వేసి (ఘాట్ రోడ్), గాంధీ స్మారక గ్రంధాలయాన్ని కూడ నెలకొల్పారు. అది 1968వ సంవత్సరం లో అనుకుంటాను, అప్పటి రాష్ట్రపతి జాకిర్ హుస్సైన్, సరిహద్దు గాంధీగా పేరుబడ్డ ఆప్ఘనీయుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ తో కలిసి వచ్చి కొండమీది గాంధీ స్థూపాన్ని ప్రజలందరూ చూసే అవకాశాన్ని ప్రారంభించారు. ఒక టాయ్ ట్రైన్, లైట్ అండ్ సౌండ్ షో కూడా ఏర్పాటు చెశారు.

మేము మా అంతట మేము వెళ్ళగలిగి, మా పెద్దవాళ్ళు, మమ్మల్ని మేమున్న సత్యనారాయణపురం పరిధులు దాటి వెళ్ళనివ్వటం (అంటే మేమెలాగూ వాళ్ళకు తెలియకుండా సరిహద్దు దాటి వెళ్ళిపోతున్న విషయం తెలుసుకున్న వాళ్ళై) మమ్మల్ని వదిలిన తరువాత, పిల్లలందరమూ ఎక్కువ సార్లు వెళ్ళి చూసినది గాంధీ హిల్. అప్పట్లో అంటే 1970 ల మొదటి రోజుల్లో,(ఎనిమిది తొమ్మిది తరగతులు చదువుతున్నప్పుడు) గాంధీ హిల్ కి వెళ్ళటం అంటే ఎంతో సరదా. ఇంటి నుంచి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో విజయవాడ స్టేషన్, ఆ స్టేషన్ దాటితే కొత్తపేట/తారాపేట వచ్చేవి. అప్పట్లో కొత్తపేట "ఒక్కటే" రౌడీలకు నిలయంగా ఉండేది.

విజయవాడ స్టేషన్ పడమర ద్వారానికి చాలా దగ్గరగా ఉన్నది గాంధీ హిల్. గాంధీ హిల్ కి వెళ్ళటంలో ఉన్న ఆకర్షణల్లో ఒకటి, విజయవాడ రైల్వే స్టేషన్ ట్రాకుల మీదుగా వేసిన ఓవర్ బ్రిడ్జ్ మీదుగా నడిచి వెళ్ళటం. ఆ ఓవర్ బ్రిడ్జ్ విజయవాడ ప్రజలు ఈ పక్కనుండి ఆ పక్కకు వెళ్ళటానికి రైల్వే వారు వేశారు. పాద చారులు, సైకిళ్ళు తీసుకునివెళ్ళే వాళ్ళతో ఎప్పుడూ సందడిగా ఉండేది. ఈ సందడి కాదు మేము ఎదురు చూసే ఆకర్షణ. ఆ బ్రిడ్జ్ మీద నుంచుని కింద వచ్చిపొయ్యే రైళ్ళు చూడటం. సామాన్యంగా గూడ్స్ రైల్ బోగీలు ఎక్కువగా కనిపించేవి. అప్పుడప్పుడూ ప్రయాణీకుల రైళ్ళు కూడ ఆ బ్రిడ్జ్ కిందనుంచి వెళ్ళటం చూసి ఆనందించేవాళ్ళం. ఈ నాడు పూర్తిగా కనుమరుగైన స్టీం ఇంజన్ ఆ రోజుల్లో సర్వ సామాన్యమైన దృశ్యం. ఇప్పుడు చూద్దామన్నా ఫోటోలలో తప్ప కనపడటం లేదు.


ఇక గాంధీ హిల్ పైకి రోడ్డు మీదుగా వెళ్ళటం, ఒక్కోసారి సైకిల్ తీసుకుని దాన్ని తోసుకుంటూ కొండ మీదకు వెళ్ళి వచ్చేప్పుడు ఆ సైకిలు ఎక్కి వాలులో వేగంగా బెల్లు కొట్టుకుంటూ దిగటం చాలా సరదాగా ఉండేది. సాయంత్రం పైనున్న గ్రంధాలయం తెరిచే వాళ్ళు అక్కడున్న పుస్తకాలు ఏమీ చూసిన జ్ఞాపకం లేదు కాని, అక్కడ విజయవాడ నగరం మోడల్ బొమ్మ అందులో గాంధీ హిల్ ఉండటం చూసిన జ్ఞాపకం.

అటువంటి గాంధీ హిల్ కి మూడు దశాబ్దాల తరువాత (చివరిసారి 1981 లో కాబోలు వెళ్ళాము) ఈ మధ్య అందరితో కలిసి వెళ్ళాము. ఏమున్నది ఇప్పుడు చూడటానికి, గుండె తరుక్కుపోయింది. పైకి వెళ్ళే దారి అప్పుడెప్పుడో సిమెంటుతో వేశారు కాబట్టి బాగానే ఉన్నది కాని అటు ఇటు పిచ్చి మొక్కలు. వంటరిగా పగలు కూడ వెళ్ళాటే భయం వేసేట్టుగా ఉన్నది. ఇంకా ఆ చెట్లు తుప్పల మధ్య కూచుని ఎవరన్న వస్తుంటే జాగ్రత్తగా మొహలు దాచుకునే కుర్ర జంటలు. కాస్త ఏకాంత ప్రదేశం ఉంటే చాలు ఈ మధ్య ఈ న్యూసెన్సు బాగా ఎక్కువైపోయింది. చివరకు పార్కుల్లో కూడ లోపలెక్కడైనా కూచుని చదువుకుందామంటే, చుట్టూ వీళ్ళే, వాళ్ళను చూసి సిగ్గుపడి మనం పారిపోవాల్సిందే కని వాళ్ళేమీ కదలరు అక్కడనుంచి.

చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ పైకి ఎక్కి చూస్తే గాంధీ హిల్ మొత్తం అంతా పాడుపెట్టినట్టుగా ఉన్నది . పాపం ఇవ్వాల్టికీ ఆ టాయ్ ట్రైన్ నడుపుతూనే ఉన్నారు. కాని ఎక్కే వాళ్ళు ఏరి?? జనం బాగా తగ్గిపోయారు. ఇదివరకు జనం లైన్లలో నిలబడి మరీ ఎక్కే వాళ్ళు ఏడెనిమిది ట్రిప్పులు వేసేవాళ్ళు. ఇప్పుడు ఒక్క ట్రిప్పు గగనమైపోయింది. ఆ రైలు వెళ్తుండగా చూస్తుంటే ఏదో అడవిలో సఫారీ పార్కులో వెళ్తున్నట్టుగా ఉన్నదే తప్ప జాయ్ ట్రైన్ ఎక్కినట్టుగా లేదు.

కొండమీద లైబ్రరీ ఘోరంగా ఉన్నది.పుస్తకాలు, అవి పెట్టిన బీరువాలు అన్ని దుమ్ముకొట్టుకు ఉన్నాయి. పైకి వెళ్ళె దారి అంతా పాడైపోయి చూసే నాధుడు లేక పిచ్చి మొక్కలు అవి మొలిచి చీదరగా ఉన్నది. చక్కటి పెద్ద పెద్ద లైట్లు ఉండేవి అవన్ని పగలగోత్తబడి ఉన్నాయి. లైబ్రరీ ముందు, ఫౌటైన్ పనిచెయ్యటం లేదు. అందులో నీళ్ళే లేవు! అక్కడ పనిచేశే ఆవిడని మీకు జీతం ఎంత ఇస్తున్నారు, నెల నెలా ఇస్తున్నారా అని అడిగితె వచ్చిన జవాబు, "సిగ్గేస్తున్నదండీ చెప్పాలంటే, ముఫ్ఫై ఏళ్ళమట్టి పని చేస్తున్నాను, ఇప్పుడు నెలకి పదకొండు వందల ఏభై, ఇస్తున్నారు లెండి నెలకొక్కసారి!".గాంధీ స్మారక గ్రంధాలయంలో పని చేసే వ్యక్తి పరిస్థితి ఇది.

గాంధీ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా, 1968-69 లలో దేశం మొత్తం మీద ఆరు చోట్ల గాంధీ స్మారక స్థూపాల్ని స్థాపించారు. ఆ ఆరు చోట్లల్లో మన రాష్ట్రంలో ఉన్నది ఈ గాంధీ హిల్ ఒక్కటే, అది విజయవాడలో ఉన్నది. ఇక్కడ ఆ స్మారక స్థూపం స్థాపించటానికి కారణం, గాంధీ 1921 లో ఇక్కడకు రావటం, కాంగ్రెస్ సభలు జరగటం (ఆ సభలు జరిగిన ప్రాంతమేనట ఇప్పటి గాంధీనగర్), ఆ సభల్లో తరువాత్తరువాత జాతీయ జెండాగా ఏర్పరుచుకున్న జండాను మొదటి సారి ఎగురవెయ్యటం జరిగింది.

ఆ గాంధీ హిల్ ని సరిగ్గా మైంటైన్ చేసి చక్కటి పర్యాటక కేద్రంగా ఉంచాల్సింది పోయి, ఎవ్వరూ పట్టించుకోని ఒక పాడుబడ్డ కొండలాగ చేశారు విజయవాడ నగరవాసులు, గాంధీ స్మారక సంస్థ, అక్కడి రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు.


గాంధీ స్థూపం, విజయవాడ నగరాన్ని సూచించటానికి ఒక 'మాస్కట్(ముంబాయిలో గేట్ వే ఆఫ్ ఇండియా లాగ) గా ఉండాల్సింది పోయి, రాత్రివేళ ఒక్క లైటు వేసి ఉంచే దిక్కులేకుండా ఉన్నది. గాంధీ స్థూపం చుట్టూ చాలా వెడల్పైన ప్రాంతాన్ని ఖాళీగా ఉంచి, దాన్లోకి జనం రాకుండా చుట్టూ గ్రిల్ వేసి ఉంచారు. లోపలికి ఎవరూ వెళ్ళకుండా కట్టడి చెయ్యటానికి వాచ్మెన్ ఉండేవారు. సాయంత్రం అయ్యేప్పటికి రంగురంగుల లైట్లు స్థూపం పైకి అన్ని పక్కలనుండి వేసేవారు. స్థూపం విజయవాడ నగరానికి మొత్తం రాత్రి పూటా కూడ కనపడేది. ఇప్పుడు ఆరు దాటితే లైటే లేదు. ఏదో ఒక గుడ్డి లైటు ఒకటి వేళ్ళాడుతూ మెట్ల దగ్గర ఉన్నది. మిగిలిన లైట్లన్నీ ధ్వంసం అయిపోయి ఉన్నాయి. గాంధీ స్థూపం దగ్గరకు జనం వెళ్ళిపోయి ఫొటొలు తీసుకుంటున్నారు, పిల్లలు దానిమీదకు ఎక్కి ఆడుకుంటున్నారు. ఇలాగే వదిలేస్తే కొన్నాళ్ళకి ఆ స్థూపం నిండా బొగ్గులతో పేర్లు నిండటం ఖాయం.

ఎక్కడెక్కడి రౌడీలు, బేవార్సుగాళ్ళు గాంధీ పేరు చెప్పుకుని ఎన్నికై ఒక మంత్రో మరోటో అవటం, వాడు చచ్చిన మరుక్షణం వీధివీధినా వాడి విగ్రహాలు. జాతి పితగా పిలుచుకునే గాంధీ స్మారక చిహ్నం మటుకూ దిక్కూ దివాణం లేకుండా పాడుబడి ఉండటం! అదీ విజయవాడ నగరం నడిబొడ్డున, కలికాలం కాకపోతే మరేమిటి? నా ఉద్దేశ్యం లో ప్రముఖ వ్యక్తిగా పరిగనించ బడుతున్న వ్యక్తీ విగ్రహం నెలకొల్పాలంటే కనీసం పదేళ్ళ తరువాత మాత్రమె పెట్టాలన్న నియమం ఉండాలి. అంటే పదేళ్ళు వ్యక్తిని ప్రజలు గుర్తుంచుకుని, వ్యక్తికీ విగ్రహం పెట్టాలన్న కోరిక ఇంకా మిగిలి ఉంటేనే పని జరగాలి. లేకపోతె కొన్నాళ్ళకి మన వీధులన్నీ బేవార్సు గాళ్ళ విగ్రహాలతో నిండిపోతాయి. ఇదే నిబంధన వ్యక్తి పేరున వీధి, పేట, జిల్లా పెట్టటానికి కూడా వర్తించాలి.

తానొక సత్యాగ్రహినంటూ, జండాపట్టుకు నడుస్తూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఎం పీ రెండు సార్లు ఎన్నికై ఉన్న నగరం అది. ఆ ఎంపీకి తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవటం మీద ఉన్న ఆసక్తిలో లక్షో వంతు ఈ గాంధీ హిల్ మీద చూపిస్తే పూర్వపు వైభవం తీసుకురావటం కష్టమేమీ కాదు.

ఇదే స్థూపం తమిళనాడు లాంటి చోట ఉంటే, పర్యాటక పరంగా ఎంత చెయ్యాలో అంతా చేసేవారు. ఏమైనా ఇన్నాళ్ళ తరువాత గాంధీ హిల్ యత్ర బాధనే మిగిల్చింది.

గాంధీ హిల్ ప్రస్తుత పరిస్థితి
గాంధీ హిల్ పైకి వెళ్ళే దారి
కింద నుంచి గాంధీ కొండ ఇలా కనిపిస్తున్నది
గాంధీ స్థూపాని వెళ్ళే దారి

చెట్ల మధ్యనుంచి గాంధీ స్థూపం

టాయ్ ట్రైన్ స్టేషన్
టాయ్ ట్రైన్-ఎవడో వచ్చీ రానివాడు చౌకబారుగా చేసిన అలంకరణ
దశాబ్దంన్నరగా పనిచేస్తున్న టాయ్ ట్రైన్ డ్రైవర్
టాయ్ ట్రైన్ ట్రాక్ పరిస్థితి
ఆ ట్రైన్ లో వెళ్తుంటే ఇలా ఉంటుందిగాంధీ స్మారక గ్రంధాలయానికి వెళ్ళే దారి (ఏ పదహారో శతాబ్దానికో చెందిన శిధిల కోటలో భాగంలాగా ఉన్నది)
లైబ్రరీ ప్రవేశ ద్వారం పైన ఉన్న శ్రీ కే ఎల్ రావు గారి విగ్రహ పరిస్థితి.శ్రీ చీమల శ్యాం తీసిన వీడియో


గాంధీ స్తూపం వీడియో INDIAVIDEO.ORG వారు తీసినదిశ్రీ చీమల శ్యాం తీసిన మరొక వీడియో


3 వ్యాఖ్యలు:

 1. ఈ పోస్ట్ చదివి నేను నా చిన్నప్పటి రోజులు గుర్తుచేసుకున్నాను.విజయవాడ పుట్టిల్లు కావడం వలన ఒక్కసారి పుట్టింటికి వెళ్లి వచ్చినట్టుగా అనిపించింది.
  గాంధీ హిల్ గురించి ఎంతో చక్కగా రాసారు.ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శివగారూ!

  చీమల వారికి పాదాభివందనాలు. టపా వ్రాసి ప్రచురించినందుకు మీకు కూడా!

  నా అనుభవాలు వేరే టపాలో వ్రాస్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.