4, ఫిబ్రవరి 2012, శనివారం

కిషోర్ కుమార్ తో ఇంటర్వ్యూ

 అవునండి అవును! కిషోర్ కుమార్ తో ఇంటర్వ్యూ. చేసింది  ఎవరంటారా! నేను కాదు లెండి.  అప్పట్లో (1985 కు ముందు) రేడియో హేమా హేమీలు, అప్పుడప్పుడే పెరుగుతున్న (కలుపు) మొక్క టి వి లో వాళ్ళు అంతకంటే కాదు. మరెవరు? మరింత చదవాలి, కిషోర్ కుమార్ ను ఎవరు ఇంటర్వ్యూ చేశారో తెలుసుకోవాలంటే!

కిషోర్ కుమార్ ఎంతటి అద్భత గాయకుడో అందరికీ తెలుసు. ఆయన నిజ జీవితం లో ఎన్నో మలుపులు ఉన్నాయి. షష్టిపూర్తి చేసుకోకుండానే "వెళ్ళిపోయిన" ఒక చక్కటి గాయకుడు. ఆయన మీద అనేక అపప్రధలు ఉన్నాయి, మాట వినడాని, తిక్క తిక్కగా ప్రవర్తిస్తాడని ఇంకా ఇలా ఎన్నో ఆయన్ను మనిషిగా అర్ధం చేసుకోలేని వాళ్ళు ప్రచారంలో పెట్టినవి.  ఎన్ని ఉన్నా సరే, అసలు విషయాలు చెప్పటానికి ఎప్పుడూ ఆయన మీడియా ముందుకు రావటం కాని ఇంటర్వ్యూలు ఇవ్వటం కాని జరగలేదట .   ఆయన ఇంటర్వ్యూలకు దూరం, మీడియాని దగ్గరకు రానిచ్చేవాడు కాదు. అప్పట్లోనే ఇంకా ఆరోగ్యం పూర్తిగా కోల్పోని మీడియానే ఆయన అసహ్యించుకుని  దరిచేర నిచ్చేవాడు కాదు. కిషోర్ కుమార్ ఇప్పుడు జీవించి ఉంటే (ఎనభై ఏళ్ళు పైబడి ఉండేవారు) ఇప్పటి మీడియా వాళ్ళు చేసే అల్లరి చూసి ఏమనుకుని ఉండేవారో. ఎలా స్పందించేవారో  మరి!! ఊహించుకోవలసినదే కాని  చూసే అవకాశం లేకుండా పోయింది. 

మొత్తానికి, ఆయన ఇంటర్వ్యూలు ఎవ్వరికీ ఇచ్చేవారు కాదు. కాని చివరకు  వెంటపడగా, పడగా, విసిగి, "సరే నన్ను లతా మంగేష్కర్ ఇంటర్వ్యూ చేస్తే ఒప్పుకుంటాను" అన్నారట మన కిషోర్. అంటే ఇంటర్వ్యూ ఇవ్వాలని కాదు! ఎలాగో లతా మంగేష్కర్ వచ్చి తనను ఇంటర్వ్యూ చేయ్యోచ్చారా,  తప్పింకోవచ్చు  అని అయ్యి ఉంటుంది.


కాని, లతా మంగేష్కర్ ఎటువంటి భేషజాలు, అహంకారం చూపకుండా, ఆ టివి వారు (ఏ టి వి నో ఆ వీడియో చూస్తె తెలియటం లేదు) అబ్యర్ధనను  అంగీకరించి, కిషోర్ కుమార్ ను ఇంటర్వ్యూ చెయ్యటానికి అనే కంటే, కెమెరా ముందు ఆయనతో మాట్లాడటానికి ఒప్పుకున్నారు. 



ఎంతో మంది ఆవిడను ఇంటర్వ్యూ చేసారు. కాని లతా మంగేష్కర్ మరొకరిని ఇంటర్వ్యూ చెయ్యటం! ఒక చిత్రం, విచిత్రం కూడాను. ఈ చిత్రమైన ఇంటర్వ్యూ  అంటారో లేక వీడియో సంభాషణ అంటారో, ఏదైనా సరే మనకు కిషోర్ మాట్లాడటం హాయిగా చూడవచ్చు ఈ యు ట్యూబ్ వీడియోలో. చూసి ఆనందించండి.

ఈ వీడియోను మనకు అందించిన  mohdikram09కు అభినందనలు

 లతా కిషోర్ లు కలిసి ఎన్నెన్నో యుగళ గీతాలు పాడారు. ఇద్దరూ లబ్ధ ప్రతిష్టులే. ఒక ప్రముఖ వ్యక్తి  మరొక ప్రముఖ వ్యక్తిని ఇంటర్వ్యూ చెయ్యటం, లేదా శ్రోతలు/ప్రేక్షకుల కోసం ఇద్దరు ప్రముఖు వీడియో సంభాషణ చెయ్యటం నాకు తెలిసి ఇదే ప్రధమం ఆ తరువాత మరేమన్నా జరిగాయేమో మరి తెలియదు. లతా  మంగేష్కర్ చేత , కిషోర్ కుమార్ ను ఇంటర్వ్యూ చేయించటం ఒక చక్కటి ప్రయోగం ఆలోచన కిషోర్ దే అయ్యినా, ఆయన దుస్సాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసినా ఆ టి వి వారికి అభినందనలు.

నెట్లో వెతుకుతూ ఉంటే కిషోర్ కుమార్ కు సంబంధించి ఆయన బంధువులు నడుపుతున్న ఒక చక్కటి వెబ్ సైట్ దొరికింది. అందులో ఎన్నెన్నో కిషోర్ కు సంబంధించిన విశేషాలు ఉన్నాయి. అన్నిటి కంటే చాలా అరుదైన ఒక ఇంటర్వ్యూ (వీడియో కాదు) ఉన్నది. ప్రముఖ జర్నలిస్ట్, కుష్వంత్  సింగ్ తరువాత అప్పట్లో ఎంతో ప్రాచుర్యం కలిగిన ఇల్లస్ట్రెటడ్ వీక్లీ కి సంపాదకత్వం వహించిన ప్రితేష్ నందీ కిషోర్ కుమార్ ను ఇంటర్వ్యూ చేసారు. అది కూడా కిషోర్  మరణానికి కొద్దిరోజుల ముందు అయ్యి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూను ఈ కింది లింకు నొక్కి చదువుకోవచ్చు. 

కిషోర్ కుమార్ పాటలు (ఇక్కడ క్లిక్ చెయ్యండి) 

అదే వెబ్ సైటులో కొద్దిగా అటూ ఇటూ తిరుగాడితే కిషోర్  గురించిన ఎంతో సమాచారం  ఉంటుంది. 

నాకు బాగా గుర్తు, అక్టోబర్ 1987  లో ఆయన మరణించారు. ఆరోజున సినిమా కార్యక్రమం లేకపోయినాసరే, దూరదర్శన్  వారు కిషోర్ తన సోదరులతో నటించిన "चलती का नाम गाडी" సినిమాను,  మధ్య  మధ్య వాళ్లకు తప్పనిసరి అయిన తమ వార్తలను చూపిస్తూనే   (హిందీ వార్తలు, ఆంగ్ల వార్తలు, పరమ పీడగా ఉండే పార్లమెంట్ వార్తలు. ఇప్పటిలాగా పార్లమెంట్ ప్రత్యెక చానెల్ అప్పట్లో లేదు) పూర్తిగా చూపించి కిషోర్ కు నివాళి అర్పించారు. 

విచిత్రం అప్పటికి ఒక పుష్కరం క్రితం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పా పెట్టకుండా కిషోర్ కుమార్ పాటలను  అనధికారికంగా బాన్ చేసి వివిధభారతిలో వెయ్యటం మానేశారు. కారణం, అప్పట్లో వాళ్ళ యువరాజు సంజయ్ గాంధీ (ఇప్పటి "మరో గాంధీ" లాగ, వీళ్ళ పేర్ల చివర గాంధీ తగిలించుకోవటం  ఎప్పటికి మానుతారో కదా!) సభల్లో పాడటానికి కిషోర్  నిరాకరించారుట.  ఆయన పాటలు వెయ్యకుండా వివిధభారతి రుచిపచి లేకుండా దాదాపు రెండు సంవత్సరాల  దీర్ఘకాలం "తీసుకున్నది". 


1977 లో ఎవరి సలహానో కాని, అప్పటి ప్రధాని, ఎన్నికలు జరిపి మరింత మెజారిటీతో తన యువరాజుకు పట్టాభిషేకం చెయ్యాలని కాబోలు, లేదా ఎన్నికల్లో ఓడిపోయి వాడి పీడ వదిలించుకోవాలానో  మరి, చరిత్రకారులే చెప్పాలి, ఎన్నికలు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించింది. 

1977 మార్చ్ నెల పదహారో, పదిహేడో సరిగ్గా గుర్తు లేదు, ఎన్నికల ఫలితాలు రావటం మొదలయ్యాయి. ప్రజలందరూ రేడియోల దగ్గర (ప్రతి గంటకూ వచ్చే ప్రత్యెక ఎన్నికల వార్తల కోసం) కాచుకుని ఉన్నారు. ప్రతి పెద్ద పట్టణం లోనూ ఇంఫర్మేషన్ సెంటర్ వాళ్ళు, ప్రెస్ ఇంఫర్మేషన్ బ్యూరో వాళ్ళు పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి ప్రజల కు ఎన్నికల సమాచారం అందిస్తూ  మైకుల్లో ప్రకటనలు కూడా చేసారు. 


రాత్రి పదకొండు, పదకొండున్నర అయ్యేప్పటికి ఎన్నికల ఫలితాల తీరు తెలిసిపోయింది, కాంగ్రెస్ ఘోర పరాజయం, జనతా పార్టీ గెలుపు ఖాయం అని. అప్పటికి ఇంకా ఎమర్జెన్సీ అమలులోనే ఉన్నది. అయినా సరే ఆకాశవాణి విజయవాడ వారు ఎన్నికల వార్తల ప్రసారాల మధ్య కిషోర్ కుమార్ పాటలు వెయ్యటం మొదలు పెట్టారు. ప్రజలందరూ కిషోర్ పాటలు మళ్ళీ విని ఆ ఎన్నికల వార్తలు వింటూ ఎంతో ఆనందించారు. అధికారికంగా ఇంకా ఎమర్జెన్సీ ఉండగా, కిషోర్ పాటలు వెయ్యద్దు అని వాళ్లకు "ఆర్డర్స్" ఉన్నా కూడా, ప్రజా తీర్పు చూసి, అప్పటి ఆకాశవాణి విజయవాడ వారు హాయిగా కిషోర్ పాటలు వేసి, ప్రజలతో మమేకమైన సంఘటన ఎప్పటికీ మరువలేను. అప్పటి ఆ అధికారులను అభినందించి తీరాలి. 


మొత్తం మీద కిషోర్ కుమార్ ప్రఖ్యాతి అటువంటిది. ఎన్నికల ఫలితాల్లో ఒక నియంత పాలన అంతానికి సూచనగా, గుర్తుగా ఆయన పాటలు చరిత్రలో  నిలిచిపొయినాయి. 


నాదగ్గర కిషోర్ కుమార్ తాను పనిచేసిన సంగీత దర్శకుల గురించి చెప్పిన సంగతుల ఆడియో ఉన్నది. అందులో ముఖ్యంగా సచిన్ దేవ్ బర్మన్ గురించి ఆయన గొంతును శైలిని అనుసరిస్తూ కిషోర్ అద్భుతంగా చెప్పారు. ఆ ఆడియో వెతికితే కాని దొరకదు! వెతుకులాట పూర్తయినాక మీ ముందుకు తీసుకువస్తాను.











3 కామెంట్‌లు:

  1. కిషోర్ కుమార్ కు శాస్త్రీయ సంగీతం వచ్చి వుండక పోవచ్చు. గొప్ సినీ పండితుల దృష్టిలో రఫి, ముకేష్ అంత మంచి సింగర్ అయి వుండకపోవచ్చు గానీ, అతని గొంతులో మార్దవం,ఏదో తెలియని ఆకర్షణ, గాంభీర్యం,మరీ ముఖ్యంగా విషాదగీతాలపనలో కరమైన పాటల్లో అతని గొంతు పలికే భావాలు, అనితర సాధ్యం. రఫీ, కిషోర్ అభిమానుల మధ్యం వైరం వాల్లిద్దరూ గతించి పాతికేళ్ళు కావస్తున్నా, నెట్లోని వివిధ సైట్లలో ఇంకా ఇంకా కొనసాగుతునే వుంది. దురదృష్టకరం, బాలసుబ్రమణ్యం వంటి "మహా" గాయకుల దృష్టిలో కిషోర్ గొప్ప సింగర్ కాకపోవచ్చు కాని, పాడిన కేవలం 3 వేల పాటలతో జాతిలో అధిక సంఖ్యాకుల అభిమానాన్ని పుందగలిగిన ధన్య జీవి. నా దృష్టిలో కిషోర్ గాన మాధుర్యం ఒక అద్భుతం. మంచి లింక్ మాకిచ్చిన మీకు ధన్యవాదాలు.

    ప్రసాద్ శర్మ, హైదరాబాద్.
    కిషోర్ కుమార్ కు శాస్త్రీయ సంగీతం వచ్చి వుండక పోవచ్చు. గొప్ సినీ పండితుల దృష్టిలో రఫి, ముకేష్ అంత మంచి సింగర్ అయి వుండకపోవచ్చు గానీ, అతని గొంతులో మార్దవం,ఏదో తెలియని ఆకర్షణ, గాంభీర్యం,మరీ ముఖ్యంగా విషాదగీతాలపనలో కరమైన పాటల్లో అతని గొంతు పలికే భావాలు, అనితర సాధ్యం. రఫీ, కిషోర్ అభిమానుల మధ్యం వైరం వాల్లిద్దరూ గతించి పాతికేళ్ళు కావస్తున్నా, నెట్లోని వివిధ సైట్లలో ఇంకా ఇంకా కొనసాగుతునే వుంది. దురదృష్టకరం, బాలసుబ్రమణ్యం వంటి "మహా" గాయకుల దృష్టిలో కిషోర్ గొప్ప సింగర్ కాకపోవచ్చు కాని, పాడిన కేవలం 3 వేల పాటలతో జాతిలో అధిక సంఖ్యాకుల అభిమానాన్ని పుందగలిగిన ధన్య జీవి. నా దృష్టిలో కిషోర్ గాన మాధుర్యం ఒక అద్భుతం. మంచి లింక్ మాకిచ్చిన మీకు ధన్యవాదాలు.

    ప్రసాద్ శర్మ, హైదరాబాద్.

    రిప్లయితొలగించండి
  2. ఎప్పటి లాగే గతంలో జరిగిన , ప్రముఖుల ముఖ్యమైన విషయాలపైనా తనదైన శైలిలో కిషోర్ కుమార్ గురించి మంచి పోస్టు వుంచిననదుకు శివరామప్రసాద్ గారికి ధన్యవాదాలు.
    సంగీతం అనేది సరిగమలు వచ్చి పాడినా , రాకుండా పాడినా అది దాని లక్ష్యాన్ని (ప్రజలను ఆహ్లాదకరంగా రంజింపజేయడం,ఆలోచింపజేయడం)నెరవేర్చాలి .
    సంగీతం అనేది ప్రకృతిసిద్ధమైనది. సరిగమలు తరువాత పుట్టినవే అని నా అభిప్రాయం. శాస్త్రీయ సంగీతం తెలిస్తేనే సంగీతం అనడం పాడి కాదు. అప్పటిదాకా సామాన్యులకు అర్ధంకాని పండిత పైత్యం తరువాత వచ్చిన,గురజాడ సాహిత్యం ఒక విప్లవం కాదా ? కుక్క పిల్ల , సబ్బు బిల్ల కాదేదీ కవితకనర్హం అని మహాకవి శ్రీ శ్రీ అన్నట్లు ప్రజలను రంజింప జేసే పాట ఏదైనా , గాత్రం ఏదైనా గొప్పదే. మహ్మద్ రఫీ హిందీ లో రాసుకుని తెలుగులో పాడినవై కొద్ది పాటలే అయినా ఇప్పటికీ తెలుగునాట మారుమోగడం లేదా ? ఇప్పటి పాటలు సాహిత్యం ఎవడికి అర్ధం అవుతున్నాయి. ఏమి మేలు జరుగుతున్నది.
    గాంధీ (?) లకు సేవ చేయకపోతే పడే ఇబ్బందులు కిశోర్ కుమార్ నుండి నేటి జగన్‌ దాకా ఇబ్బందులు పడాల్సిందే. ( జగన్‌కు కిశోర్ కు పోలికను మరోరకంగా అర్ధం చేసుకోవద్దని మనవి )
    ఈ దౌర్భాగ్యం అంటే రాజ్యాంగయంత్రాంగాన్ని అడ్దుపెట్టుకుని ప్రసారసాధనాలను , సీ.బీ.ఐ వంటి సంస్థలను అడ్డం పెట్టుకుని ఎంతో కాలం మన జాలరని కిశోర్ కుమార్ పాటలను విజయవాడ స్టేషన్‌ వారు ఎమర్జెంసీ లోనూ ఎన్నికల ఫలితాల సందర్భంగా ప్రసారం చేసిన సంఘటన నిరూపించింది.
    అంటే రాజ్యాంగ యంత్రాన్ని దుర్వినియోగం చేయడన్ని సహించలేని ఆక్రోషం ఒక్కసారిగా పెల్లుబికి రేడియో స్టేషం ఉద్యోగులు అలా నిరసన తెలిపారనమాట. ఎన్‌.టీ.ఆర్ గెలిచినపుడు కూడా వరుసగా ఆయన నటించిన సినిమాలలోని పాటలు ప్రసారం చేశారు.
    కవులకు , కళాకారులకూ , సాహితీ వేత్తలకూ కిషోర్ కుమార్ లాగే మరణించీ జీవించే అవకాశం వుంటుంది.వారు ధన్యజీవులు.
    వివిధ అంశాలను విమర్శనాత్మకంగా తన శైలిలో వివరించే శివరామప్రసాద్ గారు గాంధీ తోకలపైనా , రాజ్య అహంకారం తో కళను బంధించలేరన్న వాస్తవాలను , మీడియా పైనా సందర్భోచిత వ్యాఖ్యలతో కిశోర్ కుమార్ గురించి తెలియని విషయాలు తెలుసుకునే అవకాశం మనకు కల్పించినందుకు ఆయన కృషి కి అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు కొండలరావుగారూ.

      మీరు అన్నది నిజమే. 1983 లో ఎన్ టి రామారావు పార్టీ పెట్టిన కొత్తల్లో భలె ఉత్సాహంగా ఉండేది. ఆకాశవాణి విజయవాడ కేంద్రవాళ్ళు రామారావు సినిమాల్లో పాటలు తెగ వేసేవాళ్ళు. లేదా జనరంజనికి, అప్పట్లో జనం చేత కావాలని ఆ పాటలు వెయ్యమని ఉత్తరాలు వ్రాయించి మానేజ్ చేసేవారో ఏమిటో మరి. ముఖ్యంగా ఉమ్మడి కుంటుంబంలో సతీ సావిత్రి నాటకం రెండ్రోజులకొకసారి వినపడేది. అప్పట్లో ఈ ఎలక్షన్ కమీషన్ కూడ ఇంత చురుకుగా లేదు. శేషన్ గారు వచ్చికదా ఆ కమీషన్ కు జవసత్వాలు ఉంటాయని నిరూపించింది. చెప్పొచ్చేది ఎమంటే, ఎన్నికల ముందు అలా రామారావు పాటలు రేడియోలో వెయ్యటం, ఇప్పుడైతే పెద్దగా అభ్యంతర పెట్టి నానా యాగీ చేసేవాళ్ళే. ఆపైన ఎన్ టి రామారావు "నా దేశం" అనే సినిమా తీసి ఎన్నికల ముందు దేశం మీదకు వదిలారు. తెలుగు దేశం గెలుస్తుండగా వచ్చిన ఎన్నికల ప్రత్యెక ప్రాంతీయ వార్తలు తిరుమలశెట్టి శ్రీరాములు గారు ఆయనకే ప్రత్యేకమైన విశిష్ట శైలిలో చదివారు. ఆ రికార్డింగులు కూడా నా దగ్గర ఒక గంట కాసెట్లో ఎక్కడో ఉన్నాయి. వెతకాలి.

      తొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.