5, ఫిబ్రవరి 2012, ఆదివారం

పాడుతా తీయగా బృందానికి బహిరంగ లేఖ

 ప్రియమైన బాలసుబ్రహ్మణ్యం గారూ, పాడుతా తీయగా కార్యక్రమపు ఇతర నిర్వాహకులారా,

మీకు ఇవే నా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా వీక్షిస్తున్న  ప్రేక్షకుడిగా, ఆ కార్యక్రమపు అభిమానిగా నాలుగు  మాటలు మీకు అందచేద్దామని  ఈ చిన్ని  ప్రయత్నం. మీకే నా మాటలు సూటిగా పంపకుండా, ఇక్కడ బ్లాగులో ఎందుకు వ్రాయటం అని మీకు అనిపించవచ్చు. ఒకటి, మీకు పంపాల్సిన చిరునామా నాకు తెలియదు. పంపినా మీకు వచ్చే అసంఖ్యాకమైన ఉత్తరాల్లో నాదొకటి అయిపోతుంది. రెండు, నాలాగా అనుకుంటున్న వాళ్ళు, నేను అనుకుంటున్నది బాగుంది అనుకున్న వాళ్ళల్లో ఎవరన్న మీ చెవిన నేను వ్రాసిన నాలుగు మాటలు వెయ్యకపోతారా అని ఒక ఆశ. అంతే.

పాడుతా తీయగా కార్యక్రమం సంగీత ప్రియులకు, ముఖ్యంగా సినిమా పాటల ప్రియులకు ఎంతో అభిమానమైన కార్యక్రమంగా మారింది.  ఈ కార్యక్రమంలో సంగీతం నేర్చుకుంటూ చక్కగా పాడగలిగిన చిన్నారులెందరినో వయస్సులవారీగా పోటీలు ఏర్పరిచి ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉండటం  ఎంతో ఆనందాన్నిస్తున్నది.  ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకులుగా సుబ్రహ్మణ్యం గారూ, మీదైనా ఒక ప్రత్యెక ముద్ర ఈ కార్యక్రమం మీద ఎంతగానో కనబడుతూ ఉంటుంది. కార్యక్రమం మధ్యమధ్య మీరు చెప్పే  "అప్పటి" విశేషాలకోసమే  నేను ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటాను. పాటలు మొదటి రౌండ్లల్లో కొంత విసుగెత్తించినా, దాదాపు ప్రేక్షకులు అందరూ  గుర్తించిన గాయనీ గాయకులే సెమి ఫైనల్ దాకా రావటం ఇక అక్కడ నుంచి వాళ్ళ వాళ్ళ ప్రతిభ మరింత పదును పెట్టుకుని ఫైనల్స్ లో నెగ్గటం  ఇప్పటి దాకా అనేక సార్లు చూడటం జరిగింది. 

నేను ఈ లేఖ వ్రాద్దామని మొదలు పెట్టినది ఒకే ఒక్క విషయం చెప్పటానికి. ఇప్పటి దాకా పాడుతా తీయగా కార్యక్రమం మొత్తం ఫోకస్ సినిమా పాటలమీదే ఉన్నది.  సినిమా పాటల మీదుగా  ప్రేక్షక ఆదరణ, వాళ్లకు సంగీతం మీద అభిరుచి కలిగించటంలో  ఈ కార్యక్రమం ఎంతగానో విజయం సాధించింది. ప్రేక్షక ఆదరణే  ఏ కార్యక్రమానికైనా పట్టుకొమ్మ. మీ కార్యక్రామానికి ఉన్న ఆదరణ దృష్ట్యా, మీరు కొత్తగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ విషయంలో ఈ కింది సూచనలు మీ ముందు ఉంచుతున్నాను. 

  1. ఇప్పటి వరకూ బాల బాలికలకు సంవత్సరాలుగా ఆవకాశం ఇచ్చి వాళ్ళల్లో నిజమైన ప్రతిభ కలిగిన వాళ్ళను గాయకులుగా చేయటం జరిగింది. ఇప్పుడు, కొంచెం పెద్ద వాళ్ళను అంటే ముఫ్ఫై-నలభై పైబడి పాడగలిగి ఉన్న వాళ్ళను, ముఖ్యంగా మహిళలకు ఆవకాశం ఇచ్చి, సినిమా పాటలు కాకుండా లలిత సంగీతం, పెళ్లి పాటలు, మంగళ హారతులు వాళ్ళ చేత పాడించి, ఆ పోటీలో నెగ్గిన వారికి  బహుమతులు ఇస్తే ఎంతైనా బాగుంటుంది. 
  2. ఇలా చెయ్యటం వల్ల, మన సాంప్రదాయం లో ఉన్న అనేకానేక అద్భుతమైన పాటలు ఇప్పటికి దాదాపుగా కనుమరుగయ్యి పోతున్న వాటిని మళ్ళి ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చి, ఆ పాత పాటలను పునరుద్ధరించిన వారు అవుతారు. 
  3. అనేకానేక పెళ్లి పాటలు, మంగళహారతులు మొదలైన వాటి  సాహిత్యం కూడా ఇప్పుడు పెద్దగా దొరకటం లేదు. మరికొంత కాలం జరిగితే, అసలు కనపడకుండా పొయ్యే ప్రమాదం ఉన్నది. మీరు ఈ కార్యక్రమం ద్వారా మన సాంప్రదాయక పాటలను ప్రోత్సహిస్తే, ఆ విధమైన సంగీతాన్ని పెంచి పోషించిన వారు  అవుతారు, ఈ పాటలు ఆ సంస్కృతీ మళ్ళి పునరుద్ధరించిన వారు అవుతారు.
 పై సూచనల వంటివి ఇప్పటికే మీకు వచ్చి ఉంటాయి ఆపైన మీకే ఆ ఆలోచన ఉండి ఉండవచ్చు. ఒక్కసారి ఆలోచించి వీలయితే పాడుతా తీయగా కార్యక్రమానికి కొంత కాలం పైన సూచించిన విధంగా కొత్త రూపు ఇచ్చి ప్రేక్షకులను అలరించమని నా కోరిక, నా ఆకాంక్ష ఈ బహిరంగ లేఖ ద్వారా తెలియచేస్తున్నాను. 

ఇట్లు
శివరామ ప్రసాదు కప్పగంతు
బెంగుళూరు, భారత్ 


29 కామెంట్‌లు:

  1. నమస్కారం,
    నా పేరు నాగమణి. పాట ఎక్కడ పుట్టిందో తెలియదు ఎందుకంటే గాలి లో కలిసి పోతుంది కదా అని ... కాని ఎక్కడ పుట్టినా, దాని మూలాలు వెతుక్కోవాల్సి రావడం గమనార్హం. నాకు అనిపిస్తుంది, బాలసుబ్రహ్మణ్యం గారు సినిమా పాటలకే ప్రత్యేకత....మీరు చెప్పిన పాటల గురించి తెలిసిన వాళ్లతో ఇలాంటి కార్యక్రమం చేస్తే ఇంకా రక్తి కడుతుంది అనిపిస్తుంది. అమ్మలు అమ్మమ్మల దగ్గర వున్న ఈ సంపదను మనం సొంతం చేసుకోవాలంటే, వందేళ్ళ కధ లా ఒకరు నడుం బిగించాలి. మీరు సాహిత్య అభిమాని. కానీ నేను మీ సాహిత్యాభిమానాని కి అభిమానిని. ఏమైనా తప్పులుంటే క్షమించండి.

    ధన్యవాదాలు,
    నాగమణి పగడాల.

    రిప్లయితొలగించండి
  2. !! శివరామప్రసాదు !! గారు మంచి ఆలోచన అండి.. చక్కని విషయాన్నీ చెప్పారు...

    రిప్లయితొలగించండి
  3. బాగుంది. మంచి సలహా. జానపదగీతాలు కూడా చేరిస్తే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జానపదాలు చెయ్యచ్చు కానీ ఇప్పటికే అనేక చానెళ్ళల్లో పోటాపోటీగా జానపద గీతాల పేరిట జానపదులు కానివారు కూడా ఒకే పంధాలో ఉండె పాటలు పాడేస్తున్నారు.

      నిజమైన జానపదపు పాటలను ప్రాంతాల వారీగా బాగా జనరంజకమైనవి, సాహిత్య పరంగా బాగున్నవి తీసుకు వచ్చి పాడుతా తీయగా లో పాడిస్తే బాగానే ఉంటుంది.

      తొలగించండి
    2. T-news లో రేలారే ధూమ్ ధాం ధరువెయ్ కార్యక్రమంలో అనేక మంది జానపద కళాకారులను పరిచయం చేస్తున్నారు. అదే రకంగా HMTV వారి మారుమ్రోగిన పాటలో కూడా.

      ఈ కార్యక్రమాలలో పాల్గొనే కళాకారులను చాన్నేల్ వారే (or anchors) ఊరూరూ తిరిగే ఇప్పటికే పల్లె స్తాయిలో పేరు గడించిన వారిని ఎంపిక చేసుకుంటున్నారు. ఇతర చాన్నెల్ల మాదిరి self registration ద్వారా కాదు.

      తొలగించండి
  4. నాగమణి గారితో నేనూ ఏకీభవిస్తున్నాను. బాలు గారు ఎన్నోసార్లు చెప్పినదే ఆయనది సినీరంగానుభవం, సంబంధిత కార్యక్రమాలలో అందె వేసిన చెయ్యి. అందునా ఈ "పాడుతా తీయగా" చాలా యేళ్ళగా ఒక విధమైన ఎక్స్పెక్టేషన్స్ ప్రేక్షకుల్లోనూ, స్పాన్సరర్స్లోనూ కలిగించింది, కనుకా ఈటీవీ వారిదే 'అదుర్స్' మాదిరి టాలెంట్ షో వేదికగా మీరన్న ప్రయత్నం సాగితే బావుంటుంది. మందాకిని గారు చెప్పినట్లు జానపదాలు + పండుగల పాటలు, పిల్లల పాటలు, హరికథలు వంటివి ప్రోత్సాహిస్తే బావుంటుంది.

    రిప్లయితొలగించండి
  5. శివరామప్రసాద్ గారూ !
    మంచి సూచన చేశారు.కానీ ఇది బాలసుబ్రహ్మణ్యం వల్ల కాక పోవచ్చు . ఎందుకంటే ఆయనకు ఆ అనుభవం లేదు. ఆయా రంగాలలో ప్రముఖుల చేత ఈ కార్యక్రమం చే్సేందుకు నిర్వాహకులు - ప్రోత్సాహకులు ముందుకు రావాలి. ఇప్పటికే మీరు సూచించినట్లు కొన్ని అంటే జానపదాలపై కార్యక్రమాలు ఇతర టీ.వీ లలో వస్తున్నాయి. మీరన్నట్లు చేస్తే మన సంస్కృతిని సాహిత్యాన్ని కాపాడుకోవడానికి వీలుగా ఒక వేదిక ఏర్పడుతుంది. ఒక మంచి సూచన ధైర్యంగా ఇలా బ్లాగులో చేసిన మీకు మద్దతుగా ఈ కామెంట్ వ్రాస్తున్నాను. మీ సూచన (కోరిక) ద్వారా త్వరలోనే మన చానల్స్ లో సినిమా పాటలే కాకుండా , మన సాహిత్యం - సంస్కృతి లపై ఒక కార్యక్రమం రూపొందాలనీ అందుకు అవకాశం ఉన్న వారంతా ప్రయత్నించాలని ఈ కామెంట్ ద్వారా విజ్నప్తి చేస్తు్న్నాను.

    రిప్లయితొలగించండి
  6. కొండలరావుగారు. మీరు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. నేను వ్రాసిన బహిరంగ లేఖ ఒక్క ఎస్ పి కే కాక, పాడుతా తీయగా బృదం మొత్తానికి. ఈ టి వి వారు నేను వ్రాసిన నాలుగు మాటలూ చూసి స్పందిస్తే ఇంకా కావలిసినది ఏమున్నది.

    మన అమ్మలు అమ్మమ్మలు పాడుకునే అద్భుతమైన పాటలను, రకరకాల సందర్భాలకు సరిపొయ్యే పాటలు, దూరదర్శన్ వారు వారి సప్తగిరి చానెల్లో వేస్తుంటారు కాని, వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అందచేసే సమయం ప్రేక్షకులకు అనుకూలంగా ఉండదు. ఏ అర్ధరాత్రి ఒంటిగంటకో, తెల్లవారు ఝామున నాలుగున్నర, ఐదు గంటలకో ఉంటాయి. నాలాంటి నిశాచరులకి కూడా కష్టమైన విషయం. అందుకనే ఒక పోటీగా, చక్కటి కార్యక్రమాన్ని, పాడుతా తీయగాలో చేస్తే ఎంతయినా బాగుంటుంది అని నేను చేసిన సూచన.

    రిప్లయితొలగించండి
  7. శివరామప్రసాద్ గారూ!
    మీరు ఆశించినట్లు జరగాలనేదే నా కోరిక కూడా !

    రిప్లయితొలగించండి
  8. చాలా చక్కని ఆలోచన! అలాంటివన్నీ చేరిస్తే ఇలాంటివి కూడా ఉన్నాయి అని చాలా మందికి తెలుస్తుంది! హారతి పాట పాడమంటే అది కూడా సినిమా పాట పాడేవాళ్ళు ఉన్నారు!

    రిప్లయితొలగించండి
  9. శివరామ ప్రసాద్ గారు మీ సూచన బాగుందండి. ఈ సూచన బాల సుభ్రమణ్యం గారికి చేరినా ... అమలు సాధ్యం కాదు. చానల్ వాళ్ళు వివర్శిప్ కు ప్రాదాన్యత ఇస్తారు. కాబట్టి పాడుతా తియగలో కాక పోయినా మీ సూచనలతో ఏ చానల్ అయినా ఒక కార్యక్రమం రూపొందిస్తే బాగానే ఉంటుంది

    రిప్లయితొలగించండి
  10. శివరామప్రసాద్ గారూ!చాలా మంచి సూచన చేసారు.
    నిజ్జంగా అలా జరిగితే బావుండు.

    రిప్లయితొలగించండి
  11. స్పంధించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

    @బుధ్ధా మురళిగారూ. మన పాత పాటలకు వ్యూయర్ షిప్ లేదని ఎలా చెప్పగలం. వ్యూయర్‌షిప్ అనేది కార్యక్రమపు పాకేజింగ్ లో ఉంటుంది. ఇదే పాడుతా తీయగా కార్యక్రమాన్ని కాపీకొట్టి ఎన్నో చానెళ్ళల్లో కార్యక్రమాలు వస్తూనే ఉన్నాయి. కాని అవి ఎంతో పేలవంగా ఉండి మీరన్న వ్యూయర్‌షిప్ పొందటం లేదు కదా. కారణం ఆ కార్యక్రమాల పాకేజింగ్ బాగాలేదు. పాడుతా తీయగా కార్యక్రమం ఎస్ పి సమర్పించటం, ఈ టి వి బృందం ఎంతో జాగ్రత్తగా పాకేజి చేసి చూపటం వల్ల విజయవంతం అవుతున్నది. అదేవిధంగా తగు విధం పాకెజీ చేసి చూపితే, మన పెళ్ళి పాటలు, మంగళహారతులు, పండుగల పాటలు మన అమ్మలు అమ్మమ్మలు, బామ్మలు పాడుకున్నవి సాహిత్యం కాయితం మీద లేని పాటలను ఈ ఎలెక్ట్రానిక్ యుగంలో సాంకేతికతను ఉపయోగించుకుని సంరంక్షించి రాబొయ్యే తరాలకు ఇలాంటివి ఉండేవి అని తెలియచెప్పే అవకాశం ఉంటుంది. ఇది చెయ్యలేం అని నిర్ణయానికి వచ్చి మొదలుపెట్టే పని ఏదీ విజయవంతం కాదు.

    నేను చెప్పేది "పాడుతా తీయగా" అనేది అద్భుతమైన పాకేజీగా ప్రస్తుతం ఉన్నది. ఆ పాకేజీ విలువను వాడుకుని మన పూర్వపు పాటలు కూడ చక్కగా చూపించి దాచుకోవచ్చుకదా అని. పాడుతా తీయగా కార్యక్రమానికి ప్రజల్లో ఉన్న పాపులారిటీ వల్ల ఆ కార్యక్రమంలో ఏ పాటలు పాడించినా ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది అని నా ధృఢ నమ్మకం. అయినా మన పాత పాటలకేమండీ బంగారాలు కాదూ.

    రిప్లయితొలగించండి
  12. మంచి సలహా ఇచ్చారు. పాడుతా తీయగా టీం కి మీ సలహా చేరాలని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  13. మంచి సలహా ఇచ్చారు. పాడుతా తీయగా టీం కి మీ సలహా చేరాలని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సూచన చాలా బాగుందండి . మా ఇంట్లోనే పెద్దవాళ్ళు పాడే పాటలు ఇప్పుడెవరికీ రావు . అప్పుడు రాసి కాని , వాళ్ళ తో పాడించి రికార్డ్ చేసుకొని వుంచలేకపోయామే అని చాలా ఫీలవుతూ వుంటాము .

      తొలగించండి
  14. మంచి సలహా ఇలాంటి కార్యక్రమాన్ని అందరూ ఆదరిస్తారనే భావిస్తున్నాను.మీ సలహాను ఏదో ఒక చానల్ వారు పాటిస్తే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  15. శివరామ ప్రసాద్ గారు మన సంసృతిని తెలిపే పాత పాటలను ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు . అందులో నేను ఒకడిని. సాధ్యం కాదు అని నేను చెప్పింది ఇప్పుడు వస్తున్నా పాడుతా తీయగాను మీరు సుచిన్చినట్టుగా మార్చారు అనేది నా అభిప్రాయం . అయతే అదే చానల్ మీరు చెప్పిన వాటితో మరో కార్యక్రమం , లేదా మరో చానల్ ఈ ప్రోగ్రాం కు రూపకల్పన చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మంచి వివర్శిప్ ఉన్న కార్యక్రమాన్ని పూర్తిగా మార్చేసి ప్రయోగం చేయలేరేమో అని నా అభిప్రాయం. అంతే తప్ప పాత పాటలను వ్యతిరేకించడం, వాటికి వివర్ షిప్ ఉండదని తక్కువగా అంచనా వేయడం కా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. My point is that with the great popularity the programme earned so far, they can change the design a little bit and project the traditional songs. I am sure it will be of great success. If Viswanath planned a movie thinking about all the perceived ingredients of a successful movie, he would not have taken SANKARABHARANAM. Is it not??

      తొలగించండి
  16. శివరామప్రసాద్ గారూ,
    నమస్కారం. నేను గత సంవత్సరకాలం పైగా మీ బ్లాగాభిమానిని. చక్కగా ముక్కు సూటిగా రాసే మీ అభిప్రాయాలు చాలా బాగుంటాయి. క్రమం తప్పకుండా చదువుతూవస్తున్నా, ఇప్పటి వరకు ఎప్పుడూ కామెంట్ వ్రాయలేదు. ఈ టపా చూశాకా మనస్ఫూర్తిగా అభినందించాలి అనిపించింది. మీరు బ్లాగ్ముఖంగా బాలూగారికి అద్భుతమైన సలహా ఇచ్చారు. ఎలాగైనా ఆయనకు ఈ సందేశం చేరుతుందని ఆశించడమే కాదు, త్వరలో అమలులోకి కూడా వస్తుందని ఆశ. మీ అభిప్రాయం, ఆకాంక్ష బ్లాగులో ప్రచురించడం వల్ల పదిమంది బుఱ్ఱల్లోకి ఆ ఆలోచన చేరి, ఆ విషయం గురించి మరింత మేధోన్మధనం జరిగి మీ ఆలోచన కార్యసాధకం కావడానికి గట్టి పునాది పడుతుందని, మన సంప్రదాయాలు మృగ్యమైపోకుండా తద్వారా భావితరాలకు అందుతాయని ఆశిస్తూ...

    ధన్యవాదాలతో...

    భవదీయుడు
    వర్మ

    రిప్లయితొలగించండి
  17. మంచి సలహా శివరామ ప్రసాద్ గారు, కానీ టి.వి చానెళ్ళ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. ఇప్పుడంతా బిజినెస్ కదా, కనుక, సినిమా పాటలకే వాళ్ళ ప్రాధాన్యత. మీ ఆశ నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  18. మీరు పాడుతా తీయగా బ్రుందానికి వ్రాసిన బహిరంగ లేఖ ఈరోజే చూసాను. ఘంటసాల ఫ్రజెక్ట్ లాగే మీరే ఈ పెళ్ళి పాటలు, మంగళ హారతులు ఫ్రాజెక్ట్ మొదలు పెడితే తప్పక విజయవంతంగా పూర్తి చెయగలరని నేను నమ్ముతున్నాను. మీరు మొదలు పెడుతున్నట్లు ప్రకటిస్తే ఎందరో సహ్రుదయులు మీకు వారి సహకారాన్ని అందిస్తారు. కాబట్టి మీరే ఈ పని మొదలుపెట్ట ప్రార్ధన. మీ విజయాన్ని ఆశిస్తూ. మీ అభిమాని
    నిష్టల సుబ్రహ్మణ్యం.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.