21, ఫిబ్రవరి 2012, మంగళవారం

సత్యనారాయణపురం రైల్వే స్టేషన్ - గుమాస్తాల తెలివి

ఊరి మధ్యలోంచి ఒక రైల్వే లైను, రైళ్ళు పెద్దగా  ఆగని ఒక స్టేషన్. ఐదు గేట్లు,  రైలు వచ్సినప్పుడల్లా ట్రాఫిక్ జామ్. ఇది ఏ ఊళ్లోనన్నా చూశారా! ఈ మధ్య వరకూ విజయవాడ నడిబొడ్డున జరిగేది. ఆ కథా కమామిషు ఏమిటి, చివరకు ఆ సమస్య గుమాస్తాల తెలివి వల్ల ఎలా పరిష్కారం కాకుండా మరింత జటిలం అయ్యిందో కథనం.


పూర్వ కథ: 
నాకు ఊహ తెలిసేప్పటికి నేను పుట్టి పెరిగిన సత్యనారాయణపురం (విజయవాడలో) ఒక దీవిలాగా ఉన్నది. దక్షిణాన రైల్వేలైను, సత్యనారాయణపురం స్టేషన్, పడమర ఉత్తరాన ఏలూరు కాలువ, ఇక తూర్పున రైల్వే కాలనీ.  పూర్తిగా నివాస ప్రాంతం కావటాన, ఒక్క సినిమా హాలు, పెట్రోలు బంకు (ఆ రోజుల్లో దీని అవసరం పెద్దగా లేదు) తప్ప మిగిలినవి అన్నీ అక్కడే ఉన్నాయి. ఈ కారణాన మా తరం పిల్లలు ఇక్కడే ప్రాధమిక విద్య ముగించుకున్నాక కూడా హైస్కూలు కూడా ఇక్కడే ఉండటాన  కాలేజీ వరకూ బయటకు వెళ్ళవలసిన అవసరం కలగలేదు. చివరకు మాకు టైపు నేర్చుకోవటానికి కూడా రెండు టైపు స్కూళ్ళు ఉండేవి-ఒకటి మా భగవాన్ దాస్ మాష్టారి స్వామీ ఇన్స్టిట్యూట్ ఐతే , రెండోది శారదా ఇన్స్టిట్యూట్.

సరే చెప్పానుకదా విజయవాడలో రెండో రైల్వే స్టేషన్ మా పేట పేరుతొ ఉన్నా కూడా, మా పేట నుండి స్టేషన్ కు వెళ్ళటానికి మార్గం ఉండేది  కాదు. పక్కన ఉన్న బావాజీ పేటలోకి వెళితే కాని ఆ స్టేషన్ లోకి దారి లేదు.  మా చిన్నతనంలో  మా నాన్నతో బయటకు వెళితే తప్పనిసరిగా రైలు గేటు పడి  ఉండేది. అప్పట్లో బొగ్గు ఇంజన్లు ఉండి  ఈ గేటు పడటం సరదాగానే ఉండేది. రైలు రావటం, ఆ తరువాత గెట్ తియ్యటం వంటి సరదాలు చిన్నప్పుడు బాగున్నట్టుగా తరువాత ఉండవు కదా!

కాల క్రమాన ఈ స్టేషన్ వల్ల మా పేటకు ఉపయోగం కన్నా చీదర ఎక్కువ అనిపించేది.
 • మచిలీపట్నం, కాకినాడ వెళ్ళే పెద్ద ఎక్స్ ప్రెస్  రైళ్ళు ఇక్కడ ఆగేవి కాదు.
 • ఈ రైలు మార్గాన ఐదు చోట్ల  జనం దాటే వాళ్ళు, అందులో  రెండిటికి (రైల్వే క్వార్టర్స్ ప్రాంతాన) చాలా కాలం గేట్లే  లేవు. రైలు వస్తూ కనిపిస్తోన్నా సరే జనం సైకిళ్ళ మీద, కాలి నడకన అలా దాటి వెళ్లి పొయ్యేవాళ్ళు. చివరకు ఒక రోజున ఇరవయ్యో నంబరు సిటీ  బస్సు అనుకుంటాను, రైలుతో పోటీపడి దానికన్నా ముందు వెళ్ళిపోయి దాటే యత్నంలో రైలుతో  ఢీ   కొని ఎగిరి ఆవతలపడినాక, అనేక మందికి గాయలవ్వటంతో అక్కడ కూడా గేట్లు పెట్టేసారు.
 • ఇలా మొత్తం మీద నాకు తెలిసి ఒక రెండు రెండున్నర దశాబ్దాలు సత్యనారాయణపురం ఐదు రైలు గేట్ల తో రోజుకి పన్నెండు రైళ్లతో (అందులో మూడో నాలుగో ఈ స్టేషన్లో ఆగేవి) ట్రాఫిక్ ఆగిపోయి నానా తిప్పలు పడేవాళ్ళం. 
 • 1971 లో అనుకుంటాను, ఒక అమ్మాయి గేటు వేసి  ఉండగా పట్టాలు దాటబోయి, లెవెల్ క్రాసింగ్ దగ్గర ఉండే రెండు పట్టాల మధ్య చెప్పులు ఇరుక్కుపోయి, ఈలోగా రైలు వచ్చి గుద్దేసి అక్కడికక్కడే మరణించింది.
 • 1989  అనుకుంటాను ఒక ప్రముఖ పాత్రికేయుని కుమార్తె మోపెడ్ మీద వస్తూ సీతన్నపేట వద్ద గేటు వేసి ఉంటే ఆగక ఆగేటు కింద నుండి మోపెడ్ తో సహా వెళ్ళబోయి, వస్తున్నా రైలు కింద పడి , మరణించింది .
 • సీతన్న పేట వద్ద ఏలూరు కాలవ మీద ఉన్న రైలు వంతెన మీద రైళ్ళు రానప్పుడు జనం నడిచి వెళ్ళేవాళ్ళు. రైలు వచ్చినప్పుడు పక్కన నిలబడే అవకాశం ఉండేది కాదు. ఒకసారి ఏడుగురు మహిళలు రైలు గేటు వేసినా కూడా దానిమీడగా నడిచి వెళ్ళబోయి, రైలు కింద పడి మరణించారు (1970 లలో అనుకుంటాను)  
అప్పటి నుంచి, ఈ రైల్వే లైను ఈ పక్కన తీసేయ్యాలి అన్న ఉద్యమం మొదలయ్యింది. తీసేస్తే రైళ్ళు మచిలీ పట్టణం ఎలా వెడతాయి అని మీరు అడగొచ్చు. 1960 లలోనే ఈ లైనుకు ప్రత్యామ్నాయంగా సత్యనారాయణపురానికి  పడమరన, పోలాల్లోంచి విజయాడ స్టేషన్ నుంచి రామవరప్పాడు దాకా లైను వేసి గూడ్స్ రైళ్ళు అటు పంపే వాళ్ళు. కాని, మా సత్యనారాయణపురం స్టేషన్లో ఆగని ఎక్స్‌ప్రెస్  రైళ్ళను మాత్రం ఊరి మధ్యలో నుంచి  వదిలేవారు. ఈ దెబ్బకి ఐదు గేట్లు పడటం ట్రాఫిక్ జామ్ అవటం  వగైరా వగైరా బాధలకు పడేవాళ్ళం. 

ఈ బాధల వల్ల మా పేట జనాభాలో చాలా మంది ఈ స్టేషన్ ఇక్కడనుంచి తీసేయిం చాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. జాయింట్ మెమోలు దగ్గర నుంచి రాజకీయ నాయకుల మీద వత్తిడి తేవటం వరకూ అన్ని రకాల ప్రయత్నాలూ జరిగాయి.  నేను కూడా, మేయర్ తో ముఖాముఖి, రేడియోలో వస్తున్నప్పుడు, అప్పటి మేయర్ జంధ్యాల శంకర్ గారితో ఈ విషయం చెప్పాను. ఆయన, తమ తప్పు లేదని, అంతా రైల్వే వాళ్ళు తమకు సహకరించక పోవటం వల్లే ఈ గొడవ అంతా అని చెప్పి తప్పుకున్నారు. అప్పుడు నేను రేడియోలో అడగటం, మేయర్ సమాధానం (అక్టోబరు 3 1989న ) రికార్డ్ చేసాను, ఆ ఆడియో ఫైలును వీడియో రూపంలో ఉన్నది వినండి :ఇలా ప్రజలు గోల పెట్టగా పెట్టగా రైల్వే వాళ్ళు మునిసిపాలిటీ వాళ్ళు ఒక అవగాహనకు వచ్చి ఈ స్టేషన్ని ఇక్కడనుంచి తీసేసి, మరొక చోట వేరొక పేరుతొ పెట్టగలిగారు. ఆ స్టేషన్ నుంచి చిట్టచివరి "పాల బండి" వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్న వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకున్నట్టుగా ఈనాడు పత్రికలో వ్రాశారు.

ప్రస్తుత స్థితి: 
రైల్వే లైను తీసేస్తే వచ్చే భూమి ఆక్రమించుకోవటానికి భూ బకాసురులు రాజకీయ నీడలో రాబందుల్లా కొట్టుకోవటం మొదలుపెట్టారు. ఇది చూసి, అప్పటి మునిసిపల్ కమీషనర్ రైల్వే లైను తీసేసి అదే చోట ఒక పెద్ద నాలుగు లైన్ల రోడ్ వేయించి రామవరప్పాడు రింగ్ రోడ్ కి కలిపేయించారు. దీనివల్ల జరిగినది ఏమిటి! అప్పటి వరకూ గంటకో, రెండు గంటలకో రైలు వచ్చి గేటు పడితే ట్రాఫిక్ ఆగిపోయి బాధపడే సత్యనారాయణపురం వాసులు, ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ ఈ పెద్ద రోడ్ మీద జరిగే లారీలు బస్సుల ట్రాఫిక్ ఎక్కువై ఎప్పుడు చూసినా ట్రాఫిక్ ప్రతిష్టంభనే. ఇదివరకు రైలు వస్తే ఆ పట్టాలు దాటేవారికి ప్రమాదం జరిగే ఆవకాశం ఉండేది. కాని ఇప్పుడు! ఎప్పుడు చూసినా ఆ రోడ్ మీద అమిత వేగంగా వెళ్ళే కార్లు, బస్సులు, లారీల వల్ల  పాదచారులకు, సైకిల్ మీద వెళ్లేవారికి ప్రమాదం ఎప్పుడూ పొంచి  ఉన్నది. ఈ రోడ్ ని ఇప్పుడు నగరం మధ్య నుంచే  బై పాస్ రోడ్ కింద వాడుకుంటున్నారు. తరచి చూస్తె, రైల్వే లైను ఉన్న అర్ధ శతాబ్దం లో జరిగిన ప్రమాదాల కన్నా, ఆ లైను తీసేసిన తరువాత వేసిన రోడ్ వల్ల జరిగిన ప్రమాదాలే ఎక్కువ. 

పోనీ మా పేటకు దక్షిణాన  ఆ రోడ్ మీదుగా ఆవతలకి వెళ్ళటానికి (ఇదివరకు రైలు  పట్టాలు అడ్డం ఉండటాన కుదిరేది కాదు) అవకాశం వచ్చిందా అంటే అదీ లేదు. రైలు పట్టాలు అడ్డం ఉండంగా ఎక్కడేక్కడైతే ఆవతలకి వెళ్ళటానికి అవకాశం లేదో,  అక్కడ ఇప్పటికీ  అవకాశం  లేకుండా పెద్ద పెద్ద అడ్డంకులు ఏర్పరిచారు, ఈ మునిసిపాలిటీ గుమాస్తాలు. కాబట్టి మా పేటలో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అయితే బాగుండేది. అది వచ్చి అందరి మీద పడి  అసౌకర్యం కలిగిస్తున్నది. 

ఇప్పుడు చూడండి ఈ కింది ఫోటోలలో సత్యనారాయణపురం రైల్వే స్టేషన్ ఉన్నప్పుడు పరిస్థితి , ఇప్పటి స్థితి. 

ఎడమపక్కన రైల్వే స్టేషన్, కుడిపక్కన ఆ స్టేషన్ తీసేసిన తరువాత రోడ్ 
ఏతా వాతా చెప్పేది ఏమంటే ఇంతా ఉద్యమం చేసి ఆ రైల్వే లైన్ తీసేయిమ్చటం వల్ల, రైల్వే గుమాస్తాలు, మునిసిపాలిటీ గుమాస్తాల గుడ్డెద్దు తెలివి వల్ల మా కష్టాలు తీరకపోగా, పదిరెట్లు ఎక్కువయ్యాయి అని బాధా పూర్వకంగా చెప్పవలసి వస్తున్నది. 


అలనాటి స్టేషన్ తీపి గుర్తులు:
 • సామాన్యంగా సాయంత్రం రైలు ఈ స్టేషన్ లో ఆగినప్పుడు రైల్వే ఉద్యోగుల కోసం కొద్ది దూరంలో ఉన్న రైల్వే క్వార్టర్స్ దగ్గర మళ్ళీ ఆగేది. మేము స్కూల్ నుంచి వస్తూ ఈ రైలు కనపడితే పక్కనే ఉన్న పార్క్ గోడలు దూకి ఆ పక్కనుంచి రైలు ఎక్కి రైల్వే క్వార్టర్స్ Unofficial Station లో దిగటం ఒక పెద్ద సాహస కృత్యం (టిక్కెట్టు లేకుండా ఆ మైలు దూరం వెళ్ళటం) 
 • అప్పుడప్పుడు, ఆదివారాలు మా కజిన్స్ ని తమ్ముళ్ళని వేసుకుని ఆ రైలు పట్టాలంబడి నడుచుకుంటూ వెళ్లి రామవరప్పాడు కేబిన్ దాకా వెళ్ళటం మరొక సరదా జ్ఞాపకం.

ఎడమ పక్కన మేము అప్పుడు తీసిన రైలు ఫోటో, కుడి పక్కన విజయవాడ సిమెంట్ ఫ్యాక్టరీ (ఇది కూడా అదే టైములో తీసివేయబడింది ) 


 • పొద్దున్నే తొమ్మిదింటికి "పాల బండి" పేరుతొ ఒక పాసింజరు బందరు అదే మచిలీపట్టణం నుంచి వచ్చేది. సత్యనారాయణ పురంలో చాలామందికి పాలు ఈ రైలులో నుంచి దిగిన చుట్టుపక్కల గ్రామీణులే సరఫరా చేసేవారు. 
 • ప్రత్యెక  ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు  1973 జనవరి నుండి దాదాపు మార్చి వరకూ విజయవాడలో పాల సరఫరా లేదు. నేను రోజూ స్టేషన్ కు వెళ్లి "పాల బండి" రాంగానే మాకు కావాల్సిన పాలు తీసుకురావటం జరిగటం మరొక గుర్తు.
 • స్టేషన్ కు పక్కనే ఉన్న పార్క్, రెండిటి మధ్య రైల్వే సిమెంటు ఫెన్సింగ్. రైలు వచ్చినప్పుడల్లా ఆ ఫెన్సింగ్ ఎక్కి వింజన్   అదేనండీ ఇంజన్ డ్రైవర్ని గ్రీజ్  అడగటం, అతను  కొండకచో ఇచ్చినప్పుడు సాహసవంతులు   ఫెన్సింగ్ దూకి అది తెచ్చి అందరూ పంచుకోవటం, మరొక గుర్తు.
 • కొంచెం పెద్దయ్యాక రైలు వస్తుండగా  ఒక ప్రమాదకరమైన పని చేసే వాళ్ళం. పైసానో, రెండు పైసలో పట్టాల మీద ఉంచి, దాని మీదనుంచి  రైలు వెళ్ళంగానే అది పెద్దదయ్యి ఉండటం చూసి అందరికీ చూపించి అదేదో గొప్ప పని అని, అందులో ఉన్న ప్రమాదం తెలియక  మురిసిపోవటం, ఇది చూసిన పెద్దవాళ్ళతో తిట్లు తినటం. ఒకసారి, మేము ఈ పనిలో మునిగి ఉండగా, స్టేషన్ సిబ్బంది పట్టుకోవటానికి రాంగానే, అందారూ పారిపోయి, దొరికిన ఇద్దరినీ వాళ్ళు హెచ్చరించి వదలటం కూడా ఒక మంచి గుర్తే.
రాజాజీ కుట్ర:

ఏమైనా తమిళులు మనకన్నా తెలివిగలవారని  ఎన్నోసార్లు నిరూపించబడింది . కాని ఇప్పుడు నేను చెప్పబొయ్యె విషయం తెలివిని మించిన కుట్ర. పైగా చేయించినది మరెవరో కాదు మన చివరి గవర్నర్ జనరల్ రాజాజీ. అప్పట్లో దేశం అంతా మీటర్ గేజ్ ఉండేది. మచిలీపట్టణం  పెద్ద రేవుగా వెలసిల్లుతూ, వర్తక కేంద్రంగా ఉండేది. మదరాసుకు పోటీగా ఉండి  ఇక్కడకు అనేక విదేశీ నౌకలు వస్తూ పోతూ ఉండేవి.ఈలోగా దేశంలో బ్రాడ్ గేజ్ రావటం మొదలు పెట్టింది. రాజాజీ గారు తెలుగు వాళ్ళ మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా, మచిలీపట్టణం విజయవాడల మధ్య ఉన్న ఆ కాస్త అరవై కిలోమీటర్ల మీటర్ గేజ్ లైన్ తీసేయించి, బ్రాడ్ గేజ్ యుద్ధ ప్రాతిపదికన చేయించారు. దీనివల్ల మిగిలిన దేశం అంతా మీటర్ గేజ్, మచిలీపట్టణం విజయవాడ మధ్య  బ్రాడ్ గేజ్. దీనివల్ల జరిగింది ఏమిటి? ఎగుమతి అవ్వవలసిన సరుకుల రైళ్ళు కూడా మచిలీపట్టణం రావటం అసంభవం అయ్యి, అవన్నీ మదరాసుకు దారి మళ్లింపు జరిగి, వారి మదరాసు పెద్ద రేవు పట్టణం అయ్యి, మన మచిలీపట్టణం రేవుగా కనుమరుగయ్యింది. ఈ రైల్వే  లైనుకు సంబంధిచిన ఒక బాధాకరమైన ఒక జ్ఞాపకం ఇది, మనకు తమిళ సోదరులు చేసిన ఒక  చెయ్యకూడని  "పని"
(ఫోటోలు: కర్టెసీ  కప్పగంతు రాధాకృష్ణ)

11 వ్యాఖ్యలు:

 1. తమిళులు యెవరికైనా ఉపకారం చేస్తారా? తమకుతామే చేసుకుంటారు తప్ప!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చాలా బాగుంది మీ వూరి కధ .. కళ్ళకి కట్టినట్టుగా రాసారు.. ఈమధ్యలోనే సాంబారు గాళ్ళు మన తెలుగు వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి ఎన్నో పరిశ్రమలు లాక్కు పోయారు... అసలు తప్పు మనదేనేమో.."మన వాళ్ళు వట్టి వెధవాయలోయ్" అని ఎప్పుడో చెప్పారు గురజాడ వారు గిరీశం ద్వారా..

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఇదొక్కటే కాదు, రాజాజి తెలుగు వాళ్లకి చేసిన కుట్రలు ఎన్నో. గ్రేట్ ఆంధ్రా వెబ్ సైట్ లో MBS ప్రసాద్ గారి ఆర్టికల్స్ చదివితే తెలుస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అభివృద్ధి అనేది ప్రజలను ఇబ్బంది పెట్టేదిగా ఎపుడూ ఉండకూడదు. సామూహిక మానవ జీవన ప్రయోజనాలకోసం ఉమ్మడిగా చేసుకునే ప్లాన్‌ కీ , సంకుచితత్వం తో చేసుకునే ప్లాన్‌ లకీ ఈ తేడా ఎపుడూ ఉంటుంది. రాధాకృష్ణ గారూ! ఫోటోలు భలే దాచారండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Sivai....35 years....venakki tisikellav....nenu kooda eadi marichi poledu...great job

  ప్రత్యుత్తరంతొలగించు
 6. శివరామ ప్రసాదు గారు

  మీ బ్లాగు తలుపు తట్టినప్పుడల్లా విజయవాడ గురించి ఏదో ఒక తెలియనిది / చారిత్రకమైనది అయిన విషయం తెలుసుకుంటూ ఉంటాను. ఎంతైనా సొంత ఊరు కాబట్టి, ఇలాంటివి తెలుసుకున్నప్పుడల్లా కొంచెం సంతోషం కలుగుతుంది.

  నేను పుట్టి, ఎనభైలలో నాకు ఊహ వచ్చేప్పటికి, సిమెంటు ఫాక్టరీ అని ఒక " బస్ స్టాపు " ఉండేది, విజయవాడ నగరంలో (ఇప్పుడు అది కుడా లేదనుకుంటాను) అయితే దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో ఈ మధ్యనే "ఉప్పల లక్ష్మణ రావు గారి 'బతుకు పుస్తకం' " చదివిన తరువాత అర్ధమయ్యింది. అయన దరిదాపుగా పదిహేను / ఇరవై సంవత్సరాలు ఆ సిమెంటు ఫాక్టరీ స్థాపించించడంలో భాగమై అప్పటి నుండి దాని ఉన్నతికి ఎంతో కృషి చేసారు. అటువంటి ఆ సిమెంటు ఫాక్టరీ చిత్రం ఇక్కడ మీ ద్వారా చూడగలగడం సంతోషదాయకం.

  ఇహః, రాజాజీ గారి గొప్పతనం ఏంటో నాకు తెలియదు గాని, (ఆయన గవర్నర్ అయితే కావచ్చు గాక) అయన గురించి నేను విన్నది ఏమిటంటే, రాష్ట్ర విభజన జరిగినప్పుడు మన జాతిని ఉద్దేశించి "ఆంధ్రా కుక్కల్లార" మదరాసు వీడి పొండి అన్నట్లుగా విన్నాను, ఎక్కడో చదివాను కుడా..! ఒక జాతిని ఉద్దేశించి అలా మాట్లాడడం ఏ మాత్రం సబబు కాదని నా ఉద్దేశం. ఆయన యెంత గొప్ప నాయకుడైనా ఇటువంటి ప్రయోగాలు తప్పనిసరిగా తప్పే...!

  కృతఙ్ఞతలు, రాజేష్ దేవభక్తుని.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @రాజేష్,
  మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీ కంటే ఒక రెండు దశాబ్దాల ముందుగా ఈ ప్రపంచలోకి రావటం వల్ల, మీరు చారిత్రికంగా భావించేవి, నేను చూసి ఉండటం జరిగింది. విజయవాడలో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు, అది ఊరి చివర. ప్రతి చోటా జరిగినట్టే, విజయవాడ ఊరు పెరిగి, పెరిగి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ చుట్టూ కమ్మేసింది. అప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ వదిలే పొగ దాంట్లొంచి వచ్చే సిమెంట్ దుమ్ము అయోధ్యనగర్, సత్యనారాయణపురం మొదలుగుగా గల ప్రాతాలకు కాలుష్యంగా పరిణమించింది. సిమెంట్ ఫ్యాక్టరీకి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరాన మా ఇంట్లో, మామిడి చెట్టు కాయలు కాచినప్పుడు, ఆ కాయలు ఆకుపచ్చగా ఉండే బదులు, ఈ దుమ్ము వాటిమీద పేరుకుని తెల్లగా ఉండేవి. చిత్రం ఏమంటే ఇలా జరగటం (గాలి వీచే దశ మారి కావచ్చు) 1970-73 ప్రాంతలకి బాగా పెరిగింది. ప్రజా ఉద్యమాల వల్ల, ఊరి మధ్యలో పర్యావరణ కాలుష్యం కలిగిస్తున్న కారణంగా ఆ సిమెంట్ ఫ్యాక్టరీని మొదట ఉత్పత్తి ఆపేసి చాలా కాలం అలాగే ఉంచారు. మేము తీసిన ఫొటో అప్పటిది. ఇది మళ్ళి మన కళ్ళకు కనపడదు అన్న దిగులుతో తీసిన ఫొటో అది. ఆ తరువాత ఆ ఫ్యాక్టరీ తొలగించారు. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా రియల్ ఎస్టేట్ గా మారి, డూప్లెక్ష్ ఇళ్ళు, అపార్ట్‌మెంట్లు వచ్చినాయి.

  ఇక రాజాజి గారు మన తెలుగు వాళ్ళను అన్నారో లేదో కాని, ఈ మధ్య అలా అనే వాళ్ళు బాగానే వినిపిస్తున్నారు మరి. అప్పుడెప్పుడో అన్నాడో లేదో తెలియని రాజాజీగారిని ఏమి చేశాం, టి వి ల్లో ఇష్టా రాజ్యంగా "వాగే" వాళ్ళను ఇప్పుడు ఏమి చెయ్యగలిగాం. అందుకే కన్యాశుల్కంలో, గురజాడ అప్పారావుగారు గిరీశం పాత్రతో అననే అపించారు, "మనవాళ్ళు ఉట్టి వెధవలోయ్" అని.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. శివా గారూ సత్యనారాయణపురం రైల్వేలైను విషేషాలు చక్కగా వివరించారు. అప్పట్లోనే ఆ లైను పీకకుండా ఉండేందుకు చాలమందిమి కృషి చేశాము. అప్పుడు పోలిసు కమీషనురుగా ఉన్న లక్టాకియాగారితో కూడా నేను మాట్లాడటం జరిగింది... కానీ, పోలిసుల ద్వారా తెలిసిందేమిటంటే.. ఆ లైను తీయ్యటానికి ప్రజల ఒత్తిడి కన్నా భూభకాసురులదే ఉన్నది కాబట్టి ఆ లైను తీయ్యకుండా, మరిన్ని గేట్లు పెట్టి, 1 వే్‌లు పెట్టే మా ప్రతిపాదనలు జరిగే పని కాదని తేల్చేశారు. చివరి రైలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు దానికి హారతిని ఇచ్చి కన్నీళ్ళు పెట్టుకొన్నారు. ఆలా రైల్వే లైనుని ప్రజల కన్నీళ్ళ మధ్యన తొలగించటం జరిగింది. అయితే, ఆ లైను తీసే కాలంలో ప్రవీణ్ ప్రకాష్ గారని మంచి కమిషనురు ఉండటం వల్లన, భూ ఆక్రమణదారుల ఆటలు సాగలేదు. ఆయన ఢిల్లీకి వెళ్ళి బీఆర్టీఎస్స్ ఇన్నర్ రింగు రోడ్‌ని శాన్‌క్షన్ చేయించుకొచ్చారు. రోడ్ బాగానే ఉన్నా, దానికి అనేక జంక్షన్లు లేవు. ఉన్న జంక్షనులలో కనీసం ట్రఫిక్ లైట్లు కానీ, పోలిసులు కానీ ఉండక, రోజూ ప్రమాదాలు జరుగుతూనే. అక్కడ అవి ఏర్పాటు చేస్తే బాగుంతుంది. ఈ విధంగా నా భావాలు మీ బ్లాగు ద్వారా పంచుకొన్నందుకు చాలా అనందంగా ఉన్నది.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. తీపి గుర్తులు: 1950s లో. మాకు వేసవి విడిది. సత్యనారాయణపురం రైల్వే స్టేషన్. పొద్దున్నే పాల/పెరుగు బండి. సాయంత్రం పార్కు, పక్కనున్న మునిసిపల్ లైబ్రరీ/రీడింగ్ రూం రేడీయో నుండి పార్కు స్పీకర్లలో వచ్చే విజయవాడ రేడీయో కార్యక్రమాలు. బావగారు దగ్గరనుంచీ సినీమా పాటలతో అల్లిన రూపకాలు విని ఇంటికి చేరేవాళ్ళం. మొన్నీ మధ్య సత్యనారాయణపురం స్టేషన్ తీసేశారని విని చాలా బాధపడ్డాను. ఆ పార్కూ, రీడింగ్ రూములు ఇంకా ఉన్నాయా? మీ పోస్ట్ తోటి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. థాంక్స్.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @Radhakrishna, thank you for your information.

  @Rao S Lakkaraju. Thank you for your sharing your sweet memories. సత్యనారాయణపురం రైల్వే స్టేషన్ తీసేశారు కాని, ఆ పార్కు, ఆంధ్ర రత్న పార్కు, ఆ పార్కుకు ఎదురుగా (ఐమూలగా) ఉన్న లైబ్రరీ ఉన్నాయి. కాని పార్కు రూపు రేఖలు ఈ మధ్యనే మార్చేశారు. ఆ లైబ్రరీ కూడా పాత భవనం కూల్చేసి, కొత్త భవనం రెండంతస్తులది కట్టారు.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.