29, ఫిబ్రవరి 2012, బుధవారం

పాఠ్య పుస్తకాలు ప్రభుత్వమే ఎందుకు ప్రచురించాలి!!??


ఈ మధ్య విజయవాడలో ఒక పదిహేను రోజులు ఉండటం తటస్థించింది. ఆ సమయంలో అక్కడి లోకల్ ఈనాడు లో ఒక వార్త ప్రచురితం అయ్యింది. ఈ లోకల్ ఎడిషన్ల పుణ్యమా అని మనకి మన పేట ఆవతలి విషయాలు తెలియటం మానేసినాయి అనుకొండి అది వేరే విషయం.

ఆ వార్త ఏమిటంటే, పాఠ్య పుస్తకాలు ఎవరో ప్రింటు కొట్టి అమ్మేసుకుంటున్నారట  , అది కూడా సంవత్సరాలబట్టీ జరుగుతున్నా కూడా ఘనతవహించిన ప్రభుత్వాధికారుల కంట పడలేదట. ఇప్పుడు మాత్రం, తెగించి ఆ దొంగ పబ్లిషర్ ను పట్టుకుని, ఆ గోడౌన్  వగైరాలు   "సీజ్" చేశారుట  అన్ని సంవత్సరాలుగా జరుగుతుంటే, ఇప్పటిదాకా పట్టుబడబోకపోవటమే పెద్ద వార్త! అసలు ఇన్నాళ్ళూ ఈ భాగోతం ఎలా జరిగింది,  ఎవరి మద్దతు ఇలాంటి పన్లకు ఉన్నది,  వంటి విషయాలు మీడియా వారు "రిపోర్ట్" చేశారో లేదో తెలియదు. ఈ లోగా నేను బెంగుళూరుకు తిరిగి వచ్చాను. అయినా విజయవాడ ప్రాంతానికి తాము ఎన్ని పాఠ్య పుస్తకాలు సరఫరా చేశారో, అక్కడి విద్యార్ధులు  ఎంతమందో, తాము ఇంత తక్కువ పాఠ్య పుస్తకాలు సరఫరా చేసినా గత కొన్ని సంవత్సరాలుగా పుస్తకాల కొరత ఎందుకు ఏర్పడలేదు అన్న అనుమానం, ప్రభుత్వంలో ఉన్న పెద్ద గుమాస్తాల ఆలోచనలోకి ఎందుకు రాలేదో మరి. తాము అదుపు చెయ్యలేని కార్యక్రమాలు తమ నెత్తిన ఎత్తుకోవటం, ఆ పని సరిగ్గా చెయ్యలేక చతికిల బడటం ప్రస్తుతం "వెల్ఫేర్ స్టేట్" అని చెప్పుకునే ప్రభుత్వాలకి బాగా అలవాటయ్యి పోయింది. 

పోనీ వీళ్ళు ప్రింట్ చేస్తున్న పాఠ్య పుస్తకాలు ఏమన్నా బాగున్నాయా అంటే, అదీ లేదు. పరమ నీచంగా ఎంత చెత్త పేపరు దొరుకుతుందో  ఇక అంతకంటే చెత్త పేపరు ఎక్కడా ఉండదు అని నిర్ధారణకు వచ్చి వెతికి మరీ అటువంటి చెత్త మీద ప్రింట్ చేసి వదులుతారు. పోనీ అవన్నా సకాలంలో తప్పులు లేకుండా, విద్యార్ధులందరికీ సరిపొయ్యే పుస్తకాలు  ప్రచురిస్తారా అంటే అదీ లేదు. అరకొరగా ప్రింట్ చెయ్యటం, ఎడా పెడా, ఈ విషయంలో ఏమాత్ర అవగాహన లేని  సిబ్బంది ద్వారా ప్లానింగ్ అనే విషయం ఉంటుంది అని కూడా తెలియకుండా,  పంపిణీ చెయ్యటం. ప్రభుత్వానికి తెలియదా ఏ తరగతి విద్యార్ధులు ఏ ప్రాంతాల్లో ఉన్నారు, ఏ ప్రాంతానికి ఎన్ని పాఠ్య పుస్తకాలు పంపిణీ చెయ్యాలని. అది తెలియనప్పుడు, ఎందుకు ఈ పని నెత్తికెత్తుకోవటం!!?? పై వార్తలో చూడండి, విద్యా శాఖాధికారులు  అయ్యిఉండి తమ సోదర శాఖ  అయిన పోలీసు వారి నుండి సహకారం పొందలేని గతి ఒక ప్రభుత్వ శాఖకు పట్టింది అంటే, మన ప్రభుత్వం ఎంతటి సమన్వయ లేమితో నడుస్తున్నదో తెలుస్తున్నది.

నాకు చాలా కాలం బట్టి ఒక్క అనుమానం ఉన్నది. పాఠ్య పుస్తకాల్లో ఏముండాలి అన్న విషయాన్ని "సిలబస్" అంటారు కదా! ఆ సిలబస్ ప్రభుత్వం విద్యా నిపుణుల(!?) చేత నిర్దారింప చేస్తారు. అంతవరకూ బాగున్నది అనుకుందాం కాసేపు. ఆ పుస్తకాలను ప్రభుత్వమే కాయితాలు కొని, ప్రింటు చెయ్యాల్సిన పనేమిటి? ప్రస్తుతం ఉన్న సాంకేతిక   పరిజ్ఞానాన్ని వాడుకుని, ప్రభుత్వం వారు ఆ సిలబస్ అనుసరించి చక్కటి పాఠాలను మంచి బొమ్మలు అవసరమైన డయాగ్రంలతో పి డి ఎప్ లుగా తయారు చేయించి వారి వెబ్ సైటులో ఉచిత డౌన్లోడ్ కు ఉంచితే, విద్యార్ధులు హాయిగా  డౌన్లోడ్ చేసుకుని వారికి కావలిసిన పేపరు మీద ప్రింట్ చేయించుకుని, ఆపైన చక్కటి బైండ్ చేయించుకుని  చదువుకుంటారు కదా. ఈ రోజున ఇంటర్ నెట్, ప్రింట్ సౌకర్యాలు మూలమూలాన వ్యాపించే ఉన్నాయి. ఎవరన్నా వ్యాపార పంధాన ఈ పుస్తకాలను ప్రింట్ చెయ్యాలంటే ఆ ప్రింట్ చేసిన పుస్తకాలు తప్పనిసరిగా ప్రభుత్వం ఇచ్చిన సిలబస్ ప్రకారమే ఉండాలి ఆ పైన ప్రభుత్వం చెప్పిన ధరకు మాత్రమె అమ్మాలి.  అలా లేకుండా తప్పులు కాని, ఉన్న సిలబస్ మార్చి కాని, చెప్పిన ధర కంటే ఎక్కువకు ప్రింట్ చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటూ ఉంటే, అటువంటి పొరబాట్లు చేసేవాళ్ళు ఉండరు. ఈ సూచనలను   ప్రభుత్వం  పాటించగలిగితే కలిగే లాభాలు:
  • పాఠ్య పుస్తకాల కొరత ఉండదు. 
  • విద్యార్ధులు ఎవరి స్థోమతును బట్టి వారికి కావలిసిన కాయితాలమీద ప్రింట్ చేయించుకోగాలుగుతారు, ఇప్పుడున్న చెత్త ప్రింట్ క్వాలిటీ పుస్తకాలు చదవాలిసిన దుర్గతి తప్పుతుంది. 
  • పుస్తకాలు కూడా ఎంతవరకూ  అవసరమో అన్ని పాఠాలే ప్రింట్ చేసుకుని, అన్ని సబ్జెక్ట్ పుస్తకాలు ఒకే ఫైలు లాగ చేసుకుని,  అంతవరకే స్కూలు తీసికెళ్ళే  ఆవకాశం వచ్చి, బండెడు  పుస్తకాలు, ఒక టన్ను బరువు మోయాల్సిన దురదృష్టం విద్యార్ధులకు  తప్పుతుంది.  
  • పిడిఎఫ్ లను డౌన్లోడ్ చేకుని పి సి తెరమీదే ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకునే ఆవకాశం కూడా ఉంటుంది. 
  • క్లాసుల్లో ఆవకాశం ఉన్న చోట, ఈ పీడిఎఫ్ ఫైల్ ను పి సి ద్వారా తెర మీద చూపిస్తూ పాఠం  చెప్పవచ్చు. విద్యార్ధులు, హాయిగా ఆ పాఠాన్ని తెర మీద పెద్ద సైజులో చూస్తూ, ఉపాధ్యాయుడు చెప్పేది వింటూ చక్కగా నేర్చుకోవచ్చు.
  • ప్రభుత్వం ఈ ప్రింటింగ్, పంపిణీ ల మీద పెట్టె  ఖర్చు మొత్తం వేరే విద్యా సంబంధమైన పనికి వినియోగించవచ్చు.  
***********************************
ఏమైనా మన పొరుగున ఉన్న తమిళ సోదరులు ఎప్పుడూ మనకంటే రెండడుగులు ముందే ఉంటారు అని మరొకసారి ఋజువు అయ్యింది. పాఠ్య పుస్తకాలు వారి ప్రభుత్వం ఇప్పటికే తమ వెబ్ సైటులో ఉంచి విద్యార్ధులు డౌన్లోడ్ చేసుకోవటానికి వీలు కల్పించింది. వారి వెబ్ సైట్ ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు, అందులో కొన్ని తెలుగు పుస్తకాలు కూడా ఉన్నాయి.
ఈ సమాచారాన్ని నాకు అందచేసిన గుత్తికొండ జవహర్ గారికి ధన్యవాదాలు.




    1 కామెంట్‌:

    1. NCERT వారి వెబ్‍సైట్‍ లో కూడా వారి పుస్తకాల సాఫ్ట్ కాపీలు దొరుకుతాయి.
      http://www.ncert.nic.in/NCERTS/textbook/textbook.htm

      రిప్లయితొలగించండి

    1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
    2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
    3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
    4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.