30, మార్చి 2012, శుక్రవారం

Remembering the Happy Station | Radio Netherlands Worldwide

1928 లో మొదలుపెట్టి 1970  దాకా హాపీ స్టేషన్ కార్యక్రమాన్ని ఏకధాటికా సమర్పించిన శ్రీ Eddy Startz
Remembering the Happy Station | Radio Netherlands Worldwide: The television archives of Radio Netherlands Worldwide contain hundreds of hours of footage. Among them is a programme made to mark the 50th anniversary of the Happy Station, the show of 'Smiles across Miles.

రేడియో నెదర్లాండ్స్ లో ఒక చక్కటి కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు వచ్చేది. మనకు ఈ కార్యక్రమం మెడగాస్కర్ నుంచి రిలే అయ్యి చాలా బాగా వినిపించేది. షార్ట్ వేవ్ రేడియోలో వినేప్పుడు స్టేషన్ బాగా వినగలగటం ఒక అదృష్టమే. శ్రోతలకు దగ్గర కావటానికి పెద్ద రేడియో సంస్థలు ఆ రోజుల్లో రిలే స్టేషన్లను ప్రపంచ వ్యాప్తంగా ఏర్పరిచి తమ ప్రసారాలను చేసేవారు. 

ఎడ్డీ స్తార్జ్ తన ప్రాస్థానం పూర్తయ్యి, తన తరువాతి కలాకారున్ని 1970 పరిచయం చేస్తున్నప్పటి రికార్డింగ్ 
 
1970 నుండి 1995    వరకూ హాపీ స్టేషన్ కార్యక్రమాన్ని సమర్పించిన    శ్రీ Tom Meyer
ఈ హాపీ స్టేషన్ కార్యక్రమం 1920 లలో ప్రారంభం అయ్యి 1995 వరకూ కొనసాగింది. 1920 లలో ఎడ్డీ స్తార్జ్ అనే ఆయన ఈ కార్యక్రమాన్ని రేడియో నెదర్లాండ్స్ మొదలు పెడితే, 1970 వరకూ ఆయనే ఆ కార్యక్రమాన్ని సమర్పిస్తూ వచ్చారు. ఆయన తరువాత టాం  మాయర్స్ అనే ఆయన ఈ కార్యక్రమాన్ని సమర్పించటం   మొదలు పెట్టారు. నేను 1974 నుంచి 1995  (ఈ కార్యక్రమం టాం మాయార్ సమర్పించటం ఆపెసేవరకూ) ఈ కార్యక్రమాన్ని వింటూనే ఉన్నాను.


 ఈ రోజున హాపీ స్టేషన్ కార్యక్రమం గోల్డెన్ జూబిలీ సందర్భంగా 1978 లో తీయబడిన ఒక వీడియో దొరికింది. ఆ వీడియోని పైనున్న లింక్ నొక్కి చూడవచ్చు.  

ఆ తరువాత కొంత కాలానికి, ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అద్భుతమైన పేరు ప్రఖ్యాతులను  చూసి రేడియో నెదర్లాండ్స్ లో సంతోషించటం పక్కనుంచి  అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యి ( ఆ కార్యక్రమాన్ని సమర్పించే సామర్ధ్యం లేకపోయినా కూడా ఆ ఒక్కడికే పేరు ఎందుకు రావాలి, మేము మాత్రం చెయ్యలేమా అని పిడివాదాలు చేసి) టాం     మాయార్ బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తరువాత, చాతకాని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సమర్పించటం మొదలుపెట్టి, కార్యక్రమాన్ని అధోగతి పట్టించారు. రేడియో నెదర్లాండ్స్ లో ఈ కార్యక్రమం ప్రస్తుతానికి లేదు.

మన రేడియోల్లో ఇలా ఒకే వ్యక్తి  దశాబ్దాల పాటుగా ఒకే కార్యక్రమాన్ని సమర్పించటం  జరిగిందా! ఒకవేళ జరిగితే అటువంటి కార్యక్రమానికి గోల్డెన్ జూబిలీ ఉత్సవాలు జరిపారా. మన ఆకాశవాణి గుమాస్తాలు (బ్యూరోక్రసీ) అలా జరుపుకునే ఆవకాశం రేడియో కళాకారులకు ఇచ్చారా. ఆకాశవాణి గుమాస్తాలకు అటువంటి ఆసక్తి ఎక్కడిది. రికార్డు చేసుకున్న వారి అద్భుత కార్యక్రమాలనే దాచుకోలేక పారేసుకున్న చరిత్ర మన ఆకాశవాణిది. 

రేడియో నెదర్లాండ్స్ అయినా మన ఆకాశవాణి అయినా ఒక పరిధికి మించి పేరు వచ్చిన కళాకారులను చూస్తె, గుమాస్తాలకు (అదే బ్యూరోక్రసీ) కు ఎప్పుడూ అసూయే. తమ సంస్థకు పేరు పడిపోయినా పరవాలేదు, అటువంటి కళాకారులను దిగలాగి కాని వదలరు. 

ఈ కార్యక్రమం మీద ఉన్న మక్కువతో కీత్ పెర్రాన్  అనే ఆయన 2009  నుండి  ఈ కార్యక్రమాన్ని అదే పేరుతొ తైవాన్ నుంచి, పి జె సి మీడియా పేరుతో   ప్రసారం చేస్తున్నారు. అనేక దేశాల్లో ఎఫ్ ఎం రేడియోలు రిలే చేస్తున్నాయి. మన ఎఫ్ ఎం డప్పులు దరువులు, కేకల స్టేషన్  వాళ్ళు ఈ కార్యక్రమాన్ని రిలే చేస్తారనుకోవటం అత్యాశే.  

2009 లో ఈ కార్యక్రమం మళ్ళీ మొదలవటానికి ముందే నాకు  కీత్ పెర్రాన్ పరిచయం(నా పూర్తిపేరు నోరు తిరగక సింపులుగా నన్ను శివ అని కీత్ పిలుస్తూ ఉంటాడు). హాపీ స్టేషన్ యాహూ గ్రూప్ లో. నేను అప్పుడప్పుడూ ఈ హాపీ స్టేషన్ మళ్ళీ ఎవరన్నా మొదలెడితే బాగుండును అని అంటూ ఉండేవాడిని, గ్రూప్ చర్చల్లో. చివరకు కీత్ పెర్రాన్   ఆ పని చేసి చూపించాడు. మొట్టమొదటి కార్యక్రమం ప్రసారం కావటానికి ముందు, నన్ను హాపీ స్టేషన్ గురించి రెండు మాటలు చెప్పమని కీత్ అడగటంతో రికార్డ్ చేసి పంపాను. నాకు చాలా ఆనందకరమైన విషయం ఏమంటే, ఆ మొట్టమొదటి హాపీ స్టేషన్ కార్యక్రమంలో పూర్వపు శ్రోతల భావాలు వినిపించిన వాణ్ని మొట్టమొదటగా నేనే. నా తరువాత అమెరికా నుంచి దక్షిణ ఆఫ్రికా పూర్వపు శ్రోతలు మాట్లాడారు. కాని ఈ కార్యక్రమం ప్రసారం అయినప్పుడు నేను వినలేకపోయ్యాను. అప్పుడు ముంబాయి నుంచి బెంగుళూరు బదిలీ హడావిడిలో ఉన్నాను. ఇది తెలిసి కీత్ పెర్రాన్ ఆ కార్యక్రమం మొత్తం రికార్డింగ్ మెయిలులో పంపారు. అందులో నేను మాట్లాడిన భాగం ఈ కింది ప్లేయర్లో వినవచ్చు:



ఈ కార్యక్రమాన్ని ఈ కింది లింకు నొక్కి వినవచ్చు / చూడవచ్చు



   

ప్రస్తుతం  హాపీ స్టేషన్ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న కీత్ పెర్రాన్  


2009 లో నా పుట్టినరోజు సందర్భంగా కీత్ నాకు శుభాకాంక్షలు చెబుతూ, హాపీ స్టేషన్ ప్రసారాలు మళ్ళీ మొదలవటానికి   నేను అందించిన సహకారానికి ధన్యవాదాలు చెప్పినప్పటి రికార్డింగ్. నా పేరు చాలా కష్టపడి ఉచ్చరించాడు కీత్. తానూ తప్పుగా ఉచ్చరించానని అనుకున్నాడు కాని దాదాపుగా సరిగ్గానే నా పేరు పలకగలిగాడు. అతనికి కష్టం ఎందుకు అని "శివ" అని సింపుల్ గా పిలవమని చెప్పాను. 





1 కామెంట్‌:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.