24, మే 2012, గురువారం

బావగారి కబుర్లు

బావగారి కబుర్ల ద్వయం శ్రీ చివుకుల రామమోహనరావు గారు, శ్రీ నండూరి సుబ్బారావుగారు

(PHOTO COURTESY SHRI N SASIMOHAN)

ఒకప్పటి మంచి కాలాన్ని చూసిన తరువాత ఆ మంచి కాలాన్ని "అవ్వొక రోజులూ" అనుకోవటం సహజమే. ఈ మధ్య కాలంలో, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రతిరోజూ వచ్చే ఒక అద్భుత కార్యక్రమం "బావగారి కబుర్లు" మాటి మాటికీ గుర్తుకు వస్తున్నది. అప్పట్లో అంటే 1971 దాదాపు 1975 వరకూ బావగారి కబుర్లు అనే సంభాషణ మీద ఆధారపడిన ఒక కార్యక్రమం సాయంత్రం ఆరు ఏభైకి అనుకుంటాను ఒక పదినిమిషాలు వచ్చేది. ఆ కార్యక్రమానికి ఆద్యులు అలనాటి అద్భుత రేడియో కళాకారులు శ్రీయుతులు నండూరి సుబ్బారావు గారు, చివుకుల రామమోహనరావు గారు. వీళ్ళిద్దరూ కూడా స్క్రిప్ట్ వ్రాసుకునేవారో లేక అప్పటికప్పుడు వాళ్ళకు ఇవ్వబడిన విషయం మీద చక్కగా మైక్ ముందు కూచుని ఈ కబుర్లు కార్యక్రమం నిర్వహించేవారో తెలియదు కాని, వినటానికి మాత్రం ఎంతో సొంపుగా ఉండి అప్పటి రాజకీయాలు, ఇతర విషయాల మీద ఎంతో ఆసక్తి కలిగించేవాళ్ళు.ఈ ఇద్దరూ కలిసి 1971 యుధ్ధం జరుగుతున్నప్పుడు, బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగినప్పుడు అంటే డిసెంబర్ 1971 లో ఆ యుధ్ధ వార్తలు, విశేషాలు, తమ కబుర్ల ద్వారా ప్రజల్లోకి ఎంతో చక్కగా తీసుకుని వెళ్ళారు.నండూరి సుబ్బారావుగారు బావగారూ అంటూ పిలవటం, వెంటనే రాం మోహనరావు గారు అందుకుని సంభాషణ మొదలు పెట్టటం చాలా బాగుండేది.

అప్పటి ఆ బావగారి కబుర్లు కార్యక్రమాలన్నీ కూడా రికార్డ్ చేసి జాగ్రత్తగా పదిలపరిచి ఉండి ఉంటే అప్పటి చరిత్ర మొత్తం ఇప్పటి తరానికి చక్కగా అవగతమయ్యేది.కాని మనకు ఆ అదృష్టం ఏది, ఆకాశవాణి అధికార్లకు ముందు చూపు లేక అప్పటి రికార్డింగులన్నీ కూడా చెరిపేసి తరువాతి కార్యక్రమాలకు వాడేసుకున్నారుట.బావగారి కబుర్లు కార్యక్రమం, విజయవాడ కేంద్రం నుండి కొన్ని సంవత్సరాలు ప్రసారం అయ్యినా, ఒక్క రికార్డింగ్ కూడా వాళ్ళ దగ్గర లేదుట ఇప్పుడు. అసలు మన ఆకాశవాణి వారికి ఆర్ఖైవ్స్, ఆ ఆర్ఖైవ్స్ కుండవలసిన విధి విధానాలు ఎంత మాత్రం తెలిసినట్టుగా లేవు. అప్పటి అధికార్లు కొద్దిగా ముందు చూపు చూపించి ఉంటే ఎన్నెన్నో అద్భుత మైన రేడియో కార్యక్రమాలు మనకు ఇవ్వాళ దొరికేవి. నెట్లో వేరే దేశాల రేడియో కార్యక్రమాలు ఎప్పటివో 1930ల నుంచి కూడ కనపడుతూ ఉంటే అసూయ కలుగుతుంది.

సరే ఎంత బాధపడి ప్రయోజనం ఏమున్నది. అప్పటి ఆ బావగారి కబుర్ల ద్వయం శ్రీ నండూరి సుబ్బారావు మరియు చివుకుల రాం మోహనరావు గార్లను ఈ బ్లాగ్ ద్వారా తలుచుకుని ఆనదించటమే గొప్ప పని ఈ రోజున.

2 వ్యాఖ్యలు:

  1. అవును. నిజమే. మీ కృషి వలన కనీసం గుర్తైనా చేసుకోగలుస్తున్నాము మరియు ఆనందించగలుగుతున్నము . మరొకసారి మీకు నా ధన్యవాదములు.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.