7, జూన్ 2012, గురువారం

కుటుంబయ్య గారి మార్కెట్ ధరవరలు

పెరిగే ధరల మీద ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ కొలను దుర్గా ప్రసాద్ (బాబు) గారు వేసిన అద్భుత కార్టూన్

నానాటికీ పెరిగిపోతూ పైకి పైపైకి ఏక మార్గాన (అదే ONE WAY TRAFFIC) ఎగిరిపోతున్న నాటి నిత్యావసరాల ధరలను ఎద్దేవా చేస్తూ వ్రాసిన వ్యాసం కాదు ఇది. తనకిచ్చిన ఒక పని అందరూ మెచ్చేవిధంగా చేస్తూ అప్పట్లో ఎంతో చక్కటి పేరు తెచ్చుకున్న ఒక సామాన్య రేడియో కళాకారుని గురించిన నా జ్ఞాపకాలు.


ఆకాశవాణి నిలయ విద్వాంసులు శ్రీ కుటుంబయ్య గారు
ఫోటో కర్టెసీ శ్రీ నండూరి శశి మోహన్ ,విజయవాడ

oooOooo


ఫోటోలోఉన్నది ఎవరా అని ఆలోచిస్తున్నారా! అవును ఆలోచించాల్సిందే. కాని ఈ తరం వారికి ఆలోచించినా జవాబు అంతు చిక్కక పోవచ్చు. 1960-70 లలో విజయవాడ ప్రాంతాల్లో పుట్టిపెరిగి, రేడియో వినే అలవాటు ఉన్నవారికి మాత్రం ఈయన గొంతు ఎంతో సుపరిచితం. ఆకాశవాణి వారు వారి రోజువారి కార్యక్రమాల్లో వారికి సరైన కార్యక్రమం దొరక్కపోయినా, అనుకున్న లైవ్ ప్రోగ్రాం సంబంధించి ఏదన్న సాంకేతిక సమస్య వచ్చినా, ఆ ప్రసంగకర్తో, హరికథా కళాకారుడో రానప్పుడో, చటుక్కున "ఇప్పుడు మీరు నిలయ విద్వాంసుని గోటు వాయిద్యం వింటారు" అనేసి ఆ కళాకారుణ్ణి స్టుడియోలోకి తోసి చేతులు దులుపుకునేవారు.

ఆ నిలయ విద్వాంసుల్లో ఒకరు మన కుటుంబయ్య గారు. ఆయన వాయించే వాయిద్య పరికరం "గోటు వాయిద్యం" అంటే ఏమిటో నాకు తెలియదు, అప్పట్లో వినే ఉంటాను. ఆయన తంబుర కూడ పడతారుష, మరొక ఫొటోలో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి పక్కనే కుటుంబయ్య గారు ఉన్నారు.

సరే అసలు విషయంలోకి వస్తే, కుటుంబయ్య గారు తాను అప్పుడప్పుడూ వాయించే సంగీత వాయిద్యం వల్ల కంటే, తాను క్రమం తప్పకుండా చదివే "మార్కెట్ ధరవరలు" కార్యక్రమం వల్లనే అప్పటి తరంలో కోస్తా ఆంధ్రా అంతటా చాలా ప్రసిధ్ధి చెందారు. వారానికి రెండు సార్లు అనుకుంటాను, రాత్రి సమయంలో పంట సీమల తరువాతో లేదా ఢిల్లీ వార్తలకి ముందో ఒక ఐదు నిమిషాలు ఆకాశవాణివారు టోకు మార్కెట్ ధరవరలు శ్రోతలకు అందించేవారు. ఈ ధరవరల్లో, పప్పులు, ధాన్యాలు (కుటుంబయ్య గారు "అపరాలు" అన్నప్పుడు వినాలి ఆయన గొంతులోని వయ్యారం). ఇతర శాకాహార ఆహార దినుసులతోపాటుగా, మాంసాహారాల ధరలు కూడా చెప్పి వినిపించేవారు. శుధ్ధ శోత్రియ శాకాహారి ఐన మన కుటుంబయ్యగారు, శాకాహార పదార్ధాలతోబాటుగా, కోడి గుడ్లు, రకరకాల చేపల ధరలు, పంది మాంసం, పంది వారు వంటి వాటి గురించి కూడా చదివేవారు.

ఇక్కడే కుటుంబయ్యగారు తమ గళంతో చిత్రమైన ప్రయోగాలు చేసి "మార్కెట్ ధరవరలు" కార్యక్రమాన్ని సుప్రసిధ్ధం చేశారు. అసలు కుటుంబయ్య గారి గళమే విలక్షణమైనది. ఒక్కసారి వింటె మళ్ళి మర్చిపోలేనిది, స్పుటంగా, ఖంగుమంటూ మోగేది (ఆరోజుల్లో అలా గొంతు ఉన్నవాళ్ళనే తీసుకునేవారు మరి). ఇప్పుడు చూస్తే రేడియోలో దాదాపు అందరి గొంతులూ ఒక్కటిగానే వినిపిస్తాయి. నాటిక వింటూ ఉంటే, ఏ పాత్ర ఎవరో తెలుసుకోలేము. కాని ఆకాశవాణి విజయవాడలో మాత్రం, అందరివీ వేరువేరు గంభీర స్వరాలే. మాట వింటే చాలు తెలిసిపొయ్యేది ఆ కళాకారుడు వేసిన పాత్ర ఏమిటో.

కుటుంబయ్య గారు తన సుస్వరంతో ఈ మార్కెట్ ధరలు చక్కగా ప్రతి మాటా స్పష్టంగా పలుకుతూ చెప్పేవారు. మాంసాహార వస్తు విశేషాల దగ్గరకు వచ్చేప్పటికి, తన గొంతు భలే చమత్కారంగా మార్చేవారు. శాకాహారి అయిన తాను ఈ ధరలు చదవాలిసి రావటం వల్ల (ఉద్యోగ ధర్మం, చదవాలి తపప్పదుగా మరి!) పుట్టిన ఉక్రోషం, ఆయా పదార్ధాల పట్ల తన అయిష్టత కలగలిపి, మంచి హాస్యంగా ఆ ధరలు చదివేవారు. ముఖ్యంగా చేపల్లో ఒక రకమైన "కుక్క సావడాయిలు" అన్న మాట అద్భుతంగా పేలేది. ఇప్పటికీ నాకు ఆయన గొంతు గుర్తుకు వస్తుంది. అలాగే మరొక మాట, 'పంది వారు" అనే మాట, "వారు" మీద భలేగా నొక్కి చెప్పి ఆయన చదువుతుంటే, అందరూ పొట్టపగిలేట్టు నవ్వుకునేవాళ్ళు.

మీరు నమ్మండి నమ్మకపొండి, అప్పట్లో ఈయన చదివే విధానానికి మెచ్చి శ్రోతలు (శాకాహారులు, మాంసాహారులు కలగలిపి) ఆయన చదువుతూ ఉంటే క్రమం తప్పకుండా వింటూ ఉండటం వల్ల , అతి సామాన్యంగ చప్పగా జరగాల్సిన రొటీన్ "మార్కెట్ ధరవరలు" కార్యక్రమం సూపర్ హిట్ అయిపోయి ఇప్పటికీ అందరికీ గుర్తుండిపొయ్యింది. ఆయన దాదాపు 1970ల చివరి వరకూ కూడా ఆకాశవాణిలో ఉన్నారు. ఆ తరువాత పదవీ విరమణ చేసినట్టున్నారు. ఆయన తరువాత ఎందరో ఈ ధరలు చదివారు కాని, ఎవ్వరికీ ఈ ప్రత్యేకత వంటబట్టలేదు.

ప్రముఖ రేడియో కళాకారులు శ్రీ నండూరి సుబ్బారావు గారి కుమారుడు శ్రీ నండూరి శశి మోహన్ గారు తన తండ్రిగారి ఆల్బం నుంచి, కొన్ని అపురూప చిత్రాలు నాకు మైలు ద్వారా పంపారు. వాటిల్లో ఒక గ్రూప్ ఫొటోలో అప్పటి ఆకాశవాణి హేమాహేమీల్లో ఒకడిగా మన కుటుంబయ్య గారు కూడ దొరికారు. ఆ అపురూప చిత్రం ఈ కింద వివరాలతో ఇస్తున్నాను.

ముందు వరుసలో కూచున్న మహిళా కళాకారిణులు (ఎడమ నుంచి కుడికి) శ్రీమతులు ఎ కమల కుమారి, వి బి కనక దుర్గ, శ్రీరంగం గోపాలరత్నం, ఎం నాగరత్నమ్మ, వింజమూరి లక్ష్మి మరియు బి టి పద్మిని 
కూచున్నవారు:శ్రీయుతులు అన్నవరపు రామస్వామి, ఆయన పక్కన ఎవరో తెలియదు, వారిపక్కన శ్రీ ఓలేటి ఓలేటి వెంకటేశ్వర్లు , శ్రీ కందుకూరి రామభద్ర రావు, శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి, శ్రీ జి వి కృష్ణారావు, శ్రీ రాచకొండ నృసింహ మూర్తి,    శ్రీ ఎన్ సి హెచ్ కృష్ణమాచార్యులు .
కూచున్నవారి వెనుక నుంచున్నవారు  : శ్రీయుతులు    రామవరపు సుబ్బారావు; తరువాతి వ్యక్తీ తెలియదు, శ్రీ కుటుంబయ్య, శ్రీ దండమూడి రామ మోహనరావు, శ్రీ బలిజేపల్లి రామకృష్ణ; శ్రీ  ఉషశ్రీ,  శ్రీ ఎం వాసుదేవ మూర్తి, శ్రీ సి రామ మోహన రావు, శ్రీ చార్లెస్, శ్రీ  సీతారాం  
పూర్తిగా పైన నుం చున్నవారు : శ్రీయుతులు అల్లం కోటేశ్వర రావు, శ్రీ నండూరి సుబ్బారావు , శ్రీ దత్తాడ పండు రంగా రాజు, శ్రీ సుందరంపల్లి  సూర్యనారాయణ మూర్తి,   శ్రీ ఎన్  సి వి జగన్నాధా చార్యులు, శ్రీ ఎ లింగరాజు శర్మ; శ్రీ ఎ బి ఆనంద్, ఆ తరువాతి ముగ్గురి పెర్లుతెలియవు                                                                                         



శ్రీయుతులు దండమూడి రామ మోహన రావు, మంగళం పల్లి బాల మురళీ కృష్ణ, కుటుంబయ్య, అన్నవరపు రామస్వామి 
శశి మోహన్ గారు తన చిన్నతనపు జ్ఞాపకాలు వెల్లడిస్తూ, కుటుంబయ్య గారు మంచి సరదా మనిషని, అందరితోనూ కలివిడిగా ఉంటూ ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉండేవారని చెప్పారు. నిజమే ఎంతటి హాస్యం ఆయనలో లేకపోతే మార్కెట్ ధరవరలు వంటి ఒక మామూలు కార్యక్రమాన్నికి ఇంత పేరు తీసుకు రాగలరు.

శశిమోహన్ గారు పంపినదే మరొక ఫొటో, కుటుంబయ్య గారు తంబుర వాయిస్తున్నప్పటిది చూడండి, అప్పటికే కుటుంబయ్య గారి వయసు బాగా మళ్ళినట్టుంది, పై ఫొటోకి ఈ ఫొటోకి ఆయనలో చాలా మార్పు వచ్చింది.


అవును ఇన్ని వ్రాస్తున్నారు, ఆయన గొంతు లేదా మీ దగ్గర అని సహజంగా అడిగి తీరతారు. అప్పట్లో టేప్ రికార్డర్లు నా లాంటి సామాన్యులకి అందుబాటులో లేవు. అందుబాటులో ఉన్నవారికి అభిరుచి లేదు. కాని ఆయన గొంతు ఇంకా మిగిలే ఉన్నది! కాని ఎక్కడ? నా జ్ఞాపకాల్లో! లేదా అప్పటి తరపు శ్రోతల్లో అంతే!! ఈ మార్కెట్ ధరవరలు లైవ్ కార్యక్రమంట అందుకని రికార్డింగ్ లేదు. అప్పట్లో కుటుంబయ్య గారు ఒక్క పట్టున మొత్తం ధరల పట్టిక మొత్తం నట్టు పడకుండా అద్భుతంగా చదివేసేవారు. ఆయన చదివిన ఆ ధరవరలు రికార్డింగులు ఉంటే ఎంతటి ఆర్ధిక చరిత్ర మనకు తెలిసేది!!

చిన్నతనం నుంది, ఈ మధ్య వరకూ చాలా కాలంగా, నేను ఒక గొప్ప (అప)నమ్మకంలో బతికేవాణ్ణి, ఆకాశవాణి కార్యక్రమాలన్నీ (రోజుకి ఎన్ని గంటలు వస్తే అన్ని గంటలూనూ) క్రమం తప్పకుండా రికార్డ్ చేస్తూ, ఆ టేపులన్నీ కూడ వరుస క్రమంలో వివరాలతో భధ్రపరుస్తూ ఆర్ఖైవ్ చేస్తూ ఉంటారని. కాని తరువాత్తరువాత తెలిసింది, అటువంటి బృహత్‌కార్యక్రమం ఒకటి ఉంటుందని కూడ అప్పటి ఆకాశవాణి గుమాస్తాలకు (కళాకారులకి కాదు) తెలిసిన దాఖలాలు లేవు. ఏవో ఒకటో రెండో కార్యక్రమాల టేపులు పొరబాటున ఎక్కడో బీరువాల్లో గుమాస్తా కాయితాల మధ్య పడి వాళ్ళకు కనపడకుండాపోయినవి మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మిగిలినవి రికార్డ్ చేసినా కూడా 1980-90 ల్లో"ట" ఒక ఘనత వహించిన డైరెక్టరు వారు టేపుల్ని చెరిపేయించి (ఎందుకు ఈ పాత కార్యక్రమాలు వృధా {!??} అనేసి, ) వాటిని చెరిపేసి రీసైకిలింగ్ చేసి, అబ్బో ఎంతో పొదుపు, పొదుపు(
లల్లూ ప్రసాద్ యాదవ్ తన అద్భుత శక్తి యుక్తులతో రైల్వే శాఖకు లాభాల మీద లాభాలు తెచ్చి పెట్టినట్టు!)దీనివల్ల ఎంత లాభం అని మూర్చలుపోతూ వాటిని మళ్ళి రికార్డ్ చెయ్యటానికి వాడేశారని ఒక వదంతి. చిత్రం! ఎంతటి పనికిరాని ఆఫీసు అయినా వాళ్ళు ఖరాబు చేసే కాయితాలన్నీ కూడా "రికార్డ్" పేరుతొ భద్రపరిచే నియమ నిబంధనలు ఉన్నాయి. కాని పాపం ఆకాశవాణి వారి కార్యక్రమాలను భద్రపరిచే నియమం లేకపోవటం, అప్పటి వారికి తోచకపోవటం శోచనీయం. మిగిలిన ఆఫీసుల్లో కాయితాలకి కాయితాలు ఫైళ్ళు తయారు చేస్తే అవ్వి దాచే వారు మరి ఆకాశవాణి వారి పని అద్భుత కార్యక్రమాలు ఆడియోలో ప్రసారం చెయ్యటం. అవ్వి భద్రపరిచి తీరాలని అన్న నియమం గుమాస్తాలకు తట్టకపోవటం, రేడియో అభిమానుల దురదృష్టం అని చెప్పుక్క తప్పదు.

నిజానిజాలు ఆ "ఆకాశవాణి" కే తెలియాలి. మనం రోజూ వినే ఆకాశవాణి కాదండీ బాబూ! పౌరాణిక సినిమాల్లో కనిపించకుండా "నిజం! నిజం!!" అంటూ వినపడి దానవుల గుండెల్లో బేజారు పుట్టిస్తుందే ఆ నిజమైన "ఆకాశవాణి" కి అన్నమాట.

చిట్ట చివరగా "కుటుంబయ్య గారు" అమర్ రహే. ఆ తరం వారున్నంతవరకూ, ఈ బ్లాగు అందరికీ కనపడుతున్నంతవరకూ కూడ ఆయన చిరంజీవులే. కుటుంబయ్య గారి కుటుంబ సభ్యులు కాని, అప్పట్లో ఆయనతో పనిచేసి, ఆయన తెలిసినవారు కాని, కుటుంబయ్య గారి గురించిన మరిన్ని వివరాలు (నేను వ్రాసిన వాటిల్లో ఆయన వివారే లేవు మరి) ఇవ్వగలిగితే, వారికి సదా కృతజ్ఞతతో ఈ బ్లాగులో అందరికోసం ఉంచగలను.

ఎన్ని సార్లు కృతజ్ఞత చెప్పినా, నండూరి శశి మోహన్ గారి పట్ల నా కృతజ్ఞత తరగదు. అంతటి చక్కటి అపురూపమైన ఫొటోలు అందించారు. నా చిన్నతనపు ఊహల్లో గొంతులుగానే ఉన్న అనేకమంది రేడియో కళాకారులను ఇన్నాళ్ళకు దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘకాలం తరువాత చూడగలిగే అవకాశాన్నిచ్చారు. మరొక్కసారి శ్రీ శశి మోహన్ గారికి, అప్పటి ఫొటోలను తీసుకుని తన దగ్గర దాచుకుని మనకి అందించిన వారి తండ్రిగారు శ్రీ నండూరి సుబ్బారావుగారికి అనేక కృతజ్ఞతలు

1 కామెంట్‌:

  1. నా అదృష్ట వశాత్తూ మిమ్ములను ఈ బ్లాగ్ లో అనుసంధానమయినాను. మీ కృషిని ఎంత ప్రశంసించిననూ తక్కువే అవుతుంది. మీరు సేకరించిన విషయాలు తెలుగువారికే గాక యావత్ భారతీయులకూ ముఖ్యంగా ఆకాశవాణికి కూడ ఉపయొగకరము. మీకు ధన్యవాదములు.
    మీరు రాసిన విషయాలు చదువుతుంటుంటే ఇప్పుదిప్పుడే నాకు కూడా కొంచెం కొంచెం లీలగ ఆ గొంతుక జ్ఞాపకం వస్తున్నట్లే ఉన్నది.కానీ నేనొక అజ్ఞానినగుటచేత మీలాగ సమాజానికి ఈ విధమైన సేవ చేయలేక పోయేను. మరొకసారి మీకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.