కళాకారులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కళాకారులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జూన్ 2012, గురువారం

కుటుంబయ్య గారి మార్కెట్ ధరవరలు

పెరిగే ధరల మీద ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ కొలను దుర్గా ప్రసాద్ (బాబు) గారు వేసిన అద్భుత కార్టూన్

నానాటికీ పెరిగిపోతూ పైకి పైపైకి ఏక మార్గాన (అదే ONE WAY TRAFFIC) ఎగిరిపోతున్న ఈ నాటి నిత్యావసరాల ధరలను ఎద్దేవా చేస్తూ వ్రాసిన వ్యాసం కాదు ఇది. తనకిచ్చిన ఒక పని అందరూ మెచ్చేవిధంగా చేస్తూ అప్పట్లో ఎంతో చక్కటి పేరు తెచ్చుకున్న ఒక సామాన్య రేడియో కళాకారుని గురించిన నా జ్ఞాపకాలు.


ఆకాశవాణి నిలయ విద్వాంసులు శ్రీ కుటుంబయ్య గారు
ఫోటో కర్టెసీ శ్రీ నండూరి శశి మోహన్ ,విజయవాడ

oooOooo


ఫోటోలోఉన్నది ఎవరా అని ఆలోచిస్తున్నారా! అవును ఆలోచించాల్సిందే. కాని ఈ తరం వారికి ఆలోచించినా జవాబు అంతు చిక్కక పోవచ్చు. 1960-70 లలో విజయవాడ ప్రాంతాల్లో పుట్టిపెరిగి, రేడియో వినే అలవాటు ఉన్నవారికి మాత్రం ఈయన గొంతు ఎంతో సుపరిచితం. ఆకాశవాణి వారు వారి రోజువారి కార్యక్రమాల్లో వారికి సరైన కార్యక్రమం దొరక్కపోయినా, అనుకున్న లైవ్ ప్రోగ్రాం సంబంధించి ఏదన్న సాంకేతిక సమస్య వచ్చినా, ఆ ప్రసంగకర్తో, హరికథా కళాకారుడో రానప్పుడో, చటుక్కున "ఇప్పుడు మీరు నిలయ విద్వాంసుని గోటు వాయిద్యం వింటారు" అనేసి ఆ కళాకారుణ్ణి స్టుడియోలోకి తోసి చేతులు దులుపుకునేవారు.

ఆ నిలయ విద్వాంసుల్లో ఒకరు మన కుటుంబయ్య గారు. ఆయన వాయించే వాయిద్య పరికరం "గోటు వాయిద్యం" అంటే ఏమిటో నాకు తెలియదు, అప్పట్లో వినే ఉంటాను. ఆయన తంబుర కూడ పడతారుష, మరొక ఫొటోలో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి పక్కనే కుటుంబయ్య గారు ఉన్నారు.

సరే అసలు విషయంలోకి వస్తే, కుటుంబయ్య గారు తాను అప్పుడప్పుడూ వాయించే సంగీత వాయిద్యం వల్ల కంటే, తాను క్రమం తప్పకుండా చదివే "మార్కెట్ ధరవరలు" కార్యక్రమం వల్లనే అప్పటి తరంలో కోస్తా ఆంధ్రా అంతటా చాలా ప్రసిధ్ధి చెందారు. వారానికి రెండు సార్లు అనుకుంటాను, రాత్రి సమయంలో పంట సీమల తరువాతో లేదా ఢిల్లీ వార్తలకి ముందో ఒక ఐదు నిమిషాలు ఆకాశవాణివారు టోకు మార్కెట్ ధరవరలు శ్రోతలకు అందించేవారు. ఈ ధరవరల్లో, పప్పులు, ధాన్యాలు (కుటుంబయ్య గారు "అపరాలు" అన్నప్పుడు వినాలి ఆయన గొంతులోని వయ్యారం). ఇతర శాకాహార ఆహార దినుసులతోపాటుగా, మాంసాహారాల ధరలు కూడా చెప్పి వినిపించేవారు. శుధ్ధ శోత్రియ శాకాహారి ఐన మన కుటుంబయ్యగారు, శాకాహార పదార్ధాలతోబాటుగా, కోడి గుడ్లు, రకరకాల చేపల ధరలు, పంది మాంసం, పంది వారు వంటి వాటి గురించి కూడా చదివేవారు.

ఇక్కడే కుటుంబయ్యగారు తమ గళంతో చిత్రమైన ప్రయోగాలు చేసి "మార్కెట్ ధరవరలు" కార్యక్రమాన్ని సుప్రసిధ్ధం చేశారు. అసలు కుటుంబయ్య గారి గళమే విలక్షణమైనది. ఒక్కసారి వింటె మళ్ళి మర్చిపోలేనిది, స్పుటంగా, ఖంగుమంటూ మోగేది (ఆరోజుల్లో అలా గొంతు ఉన్నవాళ్ళనే తీసుకునేవారు మరి). ఇప్పుడు చూస్తే రేడియోలో దాదాపు అందరి గొంతులూ ఒక్కటిగానే వినిపిస్తాయి. నాటిక వింటూ ఉంటే, ఏ పాత్ర ఎవరో తెలుసుకోలేము. కాని ఆకాశవాణి విజయవాడలో మాత్రం, అందరివీ వేరువేరు గంభీర స్వరాలే. మాట వింటే చాలు తెలిసిపొయ్యేది ఆ కళాకారుడు వేసిన పాత్ర ఏమిటో.

కుటుంబయ్య గారు తన సుస్వరంతో ఈ మార్కెట్ ధరలు చక్కగా ప్రతి మాటా స్పష్టంగా పలుకుతూ చెప్పేవారు. మాంసాహార వస్తు విశేషాల దగ్గరకు వచ్చేప్పటికి, తన గొంతు భలే చమత్కారంగా మార్చేవారు. శాకాహారి అయిన తాను ఈ ధరలు చదవాలిసి రావటం వల్ల (ఉద్యోగ ధర్మం, చదవాలి తపప్పదుగా మరి!) పుట్టిన ఉక్రోషం, ఆయా పదార్ధాల పట్ల తన అయిష్టత కలగలిపి, మంచి హాస్యంగా ఆ ధరలు చదివేవారు. ముఖ్యంగా చేపల్లో ఒక రకమైన "కుక్క సావడాయిలు" అన్న మాట అద్భుతంగా పేలేది. ఇప్పటికీ నాకు ఆయన గొంతు గుర్తుకు వస్తుంది. అలాగే మరొక మాట, 'పంది వారు" అనే మాట, "వారు" మీద భలేగా నొక్కి చెప్పి ఆయన చదువుతుంటే, అందరూ పొట్టపగిలేట్టు నవ్వుకునేవాళ్ళు.

మీరు నమ్మండి నమ్మకపొండి, అప్పట్లో ఈయన చదివే విధానానికి మెచ్చి శ్రోతలు (శాకాహారులు, మాంసాహారులు కలగలిపి) ఆయన చదువుతూ ఉంటే క్రమం తప్పకుండా వింటూ ఉండటం వల్ల , అతి సామాన్యంగ చప్పగా జరగాల్సిన రొటీన్ "మార్కెట్ ధరవరలు" కార్యక్రమం సూపర్ హిట్ అయిపోయి ఇప్పటికీ అందరికీ గుర్తుండిపొయ్యింది. ఆయన దాదాపు 1970ల చివరి వరకూ కూడా ఆకాశవాణిలో ఉన్నారు. ఆ తరువాత పదవీ విరమణ చేసినట్టున్నారు. ఆయన తరువాత ఎందరో ఈ ధరలు చదివారు కాని, ఎవ్వరికీ ఈ ప్రత్యేకత వంటబట్టలేదు.

ప్రముఖ రేడియో కళాకారులు శ్రీ నండూరి సుబ్బారావు గారి కుమారుడు శ్రీ నండూరి శశి మోహన్ గారు తన తండ్రిగారి ఆల్బం నుంచి, కొన్ని అపురూప చిత్రాలు నాకు మైలు ద్వారా పంపారు. వాటిల్లో ఒక గ్రూప్ ఫొటోలో అప్పటి ఆకాశవాణి హేమాహేమీల్లో ఒకడిగా మన కుటుంబయ్య గారు కూడ దొరికారు. ఆ అపురూప చిత్రం ఈ కింద వివరాలతో ఇస్తున్నాను.

ముందు వరుసలో కూచున్న మహిళా కళాకారిణులు (ఎడమ నుంచి కుడికి) శ్రీమతులు ఎ కమల కుమారి, వి బి కనక దుర్గ, శ్రీరంగం గోపాలరత్నం, ఎం నాగరత్నమ్మ, వింజమూరి లక్ష్మి మరియు బి టి పద్మిని 
కూచున్నవారు:శ్రీయుతులు అన్నవరపు రామస్వామి, ఆయన పక్కన ఎవరో తెలియదు, వారిపక్కన శ్రీ ఓలేటి ఓలేటి వెంకటేశ్వర్లు , శ్రీ కందుకూరి రామభద్ర రావు, శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి, శ్రీ జి వి కృష్ణారావు, శ్రీ రాచకొండ నృసింహ మూర్తి,    శ్రీ ఎన్ సి హెచ్ కృష్ణమాచార్యులు .
కూచున్నవారి వెనుక నుంచున్నవారు  : శ్రీయుతులు    రామవరపు సుబ్బారావు; తరువాతి వ్యక్తీ తెలియదు, శ్రీ కుటుంబయ్య, శ్రీ దండమూడి రామ మోహనరావు, శ్రీ బలిజేపల్లి రామకృష్ణ; శ్రీ  ఉషశ్రీ,  శ్రీ ఎం వాసుదేవ మూర్తి, శ్రీ సి రామ మోహన రావు, శ్రీ చార్లెస్, శ్రీ  సీతారాం  
పూర్తిగా పైన నుం చున్నవారు : శ్రీయుతులు అల్లం కోటేశ్వర రావు, శ్రీ నండూరి సుబ్బారావు , శ్రీ దత్తాడ పండు రంగా రాజు, శ్రీ సుందరంపల్లి  సూర్యనారాయణ మూర్తి,   శ్రీ ఎన్  సి వి జగన్నాధా చార్యులు, శ్రీ ఎ లింగరాజు శర్మ; శ్రీ ఎ బి ఆనంద్, ఆ తరువాతి ముగ్గురి పెర్లుతెలియవు                                                                                         



శ్రీయుతులు దండమూడి రామ మోహన రావు, మంగళం పల్లి బాల మురళీ కృష్ణ, కుటుంబయ్య, అన్నవరపు రామస్వామి 
శశి మోహన్ గారు తన చిన్నతనపు జ్ఞాపకాలు వెల్లడిస్తూ, కుటుంబయ్య గారు మంచి సరదా మనిషని, అందరితోనూ కలివిడిగా ఉంటూ ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉండేవారని చెప్పారు. నిజమే ఎంతటి హాస్యం ఆయనలో లేకపోతే మార్కెట్ ధరవరలు వంటి ఒక మామూలు కార్యక్రమాన్నికి ఇంత పేరు తీసుకు రాగలరు.

శశిమోహన్ గారు పంపినదే మరొక ఫొటో, కుటుంబయ్య గారు తంబుర వాయిస్తున్నప్పటిది చూడండి, అప్పటికే కుటుంబయ్య గారి వయసు బాగా మళ్ళినట్టుంది, పై ఫొటోకి ఈ ఫొటోకి ఆయనలో చాలా మార్పు వచ్చింది.


అవును ఇన్ని వ్రాస్తున్నారు, ఆయన గొంతు లేదా మీ దగ్గర అని సహజంగా అడిగి తీరతారు. అప్పట్లో టేప్ రికార్డర్లు నా లాంటి సామాన్యులకి అందుబాటులో లేవు. అందుబాటులో ఉన్నవారికి అభిరుచి లేదు. కాని ఆయన గొంతు ఇంకా మిగిలే ఉన్నది! కాని ఎక్కడ? నా జ్ఞాపకాల్లో! లేదా అప్పటి తరపు శ్రోతల్లో అంతే!! ఈ మార్కెట్ ధరవరలు లైవ్ కార్యక్రమంట అందుకని రికార్డింగ్ లేదు. అప్పట్లో కుటుంబయ్య గారు ఒక్క పట్టున మొత్తం ధరల పట్టిక మొత్తం నట్టు పడకుండా అద్భుతంగా చదివేసేవారు. ఆయన చదివిన ఆ ధరవరలు రికార్డింగులు ఉంటే ఎంతటి ఆర్ధిక చరిత్ర మనకు తెలిసేది!!

చిన్నతనం నుంది, ఈ మధ్య వరకూ చాలా కాలంగా, నేను ఒక గొప్ప (అప)నమ్మకంలో బతికేవాణ్ణి, ఆకాశవాణి కార్యక్రమాలన్నీ (రోజుకి ఎన్ని గంటలు వస్తే అన్ని గంటలూనూ) క్రమం తప్పకుండా రికార్డ్ చేస్తూ, ఆ టేపులన్నీ కూడ వరుస క్రమంలో వివరాలతో భధ్రపరుస్తూ ఆర్ఖైవ్ చేస్తూ ఉంటారని. కాని తరువాత్తరువాత తెలిసింది, అటువంటి బృహత్‌కార్యక్రమం ఒకటి ఉంటుందని కూడ అప్పటి ఆకాశవాణి గుమాస్తాలకు (కళాకారులకి కాదు) తెలిసిన దాఖలాలు లేవు. ఏవో ఒకటో రెండో కార్యక్రమాల టేపులు పొరబాటున ఎక్కడో బీరువాల్లో గుమాస్తా కాయితాల మధ్య పడి వాళ్ళకు కనపడకుండాపోయినవి మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మిగిలినవి రికార్డ్ చేసినా కూడా 1980-90 ల్లో"ట" ఒక ఘనత వహించిన డైరెక్టరు వారు టేపుల్ని చెరిపేయించి (ఎందుకు ఈ పాత కార్యక్రమాలు వృధా {!??} అనేసి, ) వాటిని చెరిపేసి రీసైకిలింగ్ చేసి, అబ్బో ఎంతో పొదుపు, పొదుపు(
లల్లూ ప్రసాద్ యాదవ్ తన అద్భుత శక్తి యుక్తులతో రైల్వే శాఖకు లాభాల మీద లాభాలు తెచ్చి పెట్టినట్టు!)దీనివల్ల ఎంత లాభం అని మూర్చలుపోతూ వాటిని మళ్ళి రికార్డ్ చెయ్యటానికి వాడేశారని ఒక వదంతి. చిత్రం! ఎంతటి పనికిరాని ఆఫీసు అయినా వాళ్ళు ఖరాబు చేసే కాయితాలన్నీ కూడా "రికార్డ్" పేరుతొ భద్రపరిచే నియమ నిబంధనలు ఉన్నాయి. కాని పాపం ఆకాశవాణి వారి కార్యక్రమాలను భద్రపరిచే నియమం లేకపోవటం, అప్పటి వారికి తోచకపోవటం శోచనీయం. మిగిలిన ఆఫీసుల్లో కాయితాలకి కాయితాలు ఫైళ్ళు తయారు చేస్తే అవ్వి దాచే వారు మరి ఆకాశవాణి వారి పని అద్భుత కార్యక్రమాలు ఆడియోలో ప్రసారం చెయ్యటం. అవ్వి భద్రపరిచి తీరాలని అన్న నియమం గుమాస్తాలకు తట్టకపోవటం, రేడియో అభిమానుల దురదృష్టం అని చెప్పుక్క తప్పదు.

నిజానిజాలు ఆ "ఆకాశవాణి" కే తెలియాలి. మనం రోజూ వినే ఆకాశవాణి కాదండీ బాబూ! పౌరాణిక సినిమాల్లో కనిపించకుండా "నిజం! నిజం!!" అంటూ వినపడి దానవుల గుండెల్లో బేజారు పుట్టిస్తుందే ఆ నిజమైన "ఆకాశవాణి" కి అన్నమాట.

చిట్ట చివరగా "కుటుంబయ్య గారు" అమర్ రహే. ఆ తరం వారున్నంతవరకూ, ఈ బ్లాగు అందరికీ కనపడుతున్నంతవరకూ కూడ ఆయన చిరంజీవులే. కుటుంబయ్య గారి కుటుంబ సభ్యులు కాని, అప్పట్లో ఆయనతో పనిచేసి, ఆయన తెలిసినవారు కాని, కుటుంబయ్య గారి గురించిన మరిన్ని వివరాలు (నేను వ్రాసిన వాటిల్లో ఆయన వివారే లేవు మరి) ఇవ్వగలిగితే, వారికి సదా కృతజ్ఞతతో ఈ బ్లాగులో అందరికోసం ఉంచగలను.

ఎన్ని సార్లు కృతజ్ఞత చెప్పినా, నండూరి శశి మోహన్ గారి పట్ల నా కృతజ్ఞత తరగదు. అంతటి చక్కటి అపురూపమైన ఫొటోలు అందించారు. నా చిన్నతనపు ఊహల్లో గొంతులుగానే ఉన్న అనేకమంది రేడియో కళాకారులను ఇన్నాళ్ళకు దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘకాలం తరువాత చూడగలిగే అవకాశాన్నిచ్చారు. మరొక్కసారి శ్రీ శశి మోహన్ గారికి, అప్పటి ఫొటోలను తీసుకుని తన దగ్గర దాచుకుని మనకి అందించిన వారి తండ్రిగారు శ్రీ నండూరి సుబ్బారావుగారికి అనేక కృతజ్ఞతలు

26, ఏప్రిల్ 2012, గురువారం

Remembering the Happy Station | Radio Netherlands Worldwide


1928 లో మొదలుపెట్టి 1970 దాకా హాపీ స్టేషన్ కార్యక్రమాన్ని ఏకధాటికా సమర్పించిన శ్రీ Eddy Startz
Remembering the Happy Station | Radio Netherlands Worldwide: The television archives of Radio Netherlands Worldwide contain hundreds of hours of footage. Among them is a programme made to mark the 50th anniversary of the Happy Station, the show of 'Smiles across Miles.

రేడియో నెదర్లాండ్స్ లో ఒక చక్కటి కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు వచ్చేది. మనకు ఈ కార్యక్రమం మెడగాస్కర్ నుంచి రిలే అయ్యి చాలా బాగా వినిపించేది. షార్ట్ వేవ్ రేడియోలో వినేప్పుడు స్టేషన్ బాగా వినగలగటం ఒక అదృష్టమే. శ్రోతలకు దగ్గర కావటానికి పెద్ద రేడియో సంస్థలు ఆ రోజుల్లో రిలే స్టేషన్లను ప్రపంచ వ్యాప్తంగా ఏర్పరిచి తమ ప్రసారాలను చేసేవారు.

ఎడ్డీ స్తార్జ్ తన ప్రాస్థానం పూర్తయ్యి, తన తరువాతి కలాకారున్ని 1970 పరిచయం చేస్తున్నప్పటి రికార్డింగ్
1970 నుండి 1995 వరకూ హాపీ స్టేషన్ కార్యక్రమాన్ని సమర్పించిన శ్రీ Tom Meyer
ఈ హాపీ స్టేషన్ కార్యక్రమం 1920 లలో ప్రారంభం అయ్యి 1995 వరకూ కొనసాగింది. 1920 లలో ఎడ్డీ స్తార్జ్ అనే ఆయన ఈ కార్యక్రమాన్ని రేడియో నెదర్లాండ్స్ మొదలు పెడితే, 1970 వరకూ ఆయనే ఆ కార్యక్రమాన్ని సమర్పిస్తూ వచ్చారు. ఆయన తరువాత టాం మాయర్స్ అనే ఆయన ఈ కార్యక్రమాన్ని సమర్పించటం మొదలు పెట్టారు. నేను 1974 నుంచి 1995 (ఈ కార్యక్రమం టాం మాయార్ సమర్పించటం ఆపెసేవరకూ) ఈ కార్యక్రమాన్ని వింటూనే ఉన్నాను.


ఈ రోజున హాపీ స్టేషన్ కార్యక్రమం గోల్డెన్ జూబిలీ సందర్భంగా 1978 లో తీయబడిన ఒక వీడియో దొరికింది. ఆ వీడియోని పైనున్న లింక్ నొక్కి చూడవచ్చు.

ఆ తరువాత కొంత కాలానికి, ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అద్భుతమైన పేరు ప్రఖ్యాతులను చూసి రేడియో నెదర్లాండ్స్ లో సంతోషించటం పక్కనుంచి అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యి ( ఆ కార్యక్రమాన్ని సమర్పించే సామర్ధ్యం లేకపోయినా కూడా ఆ ఒక్కడికే పేరు ఎందుకు రావాలి, మేము మాత్రం చెయ్యలేమా అని పిడివాదాలు చేసి) టాం మాయార్ బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తరువాత, చాతకాని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సమర్పించటం మొదలుపెట్టి, కార్యక్రమాన్ని అధోగతి పట్టించారు. రేడియో నెదర్లాండ్స్ లో ఈ కార్యక్రమం ప్రస్తుతానికి లేదు.

మన రేడియోల్లో ఇలా ఒకే వ్యక్తి దశాబ్దాల పాటుగా ఒకే కార్యక్రమాన్ని సమర్పించటం జరిగిందా! ఒకవేళ జరిగితే అటువంటి కార్యక్రమానికి గోల్డెన్ జూబిలీ ఉత్సవాలు జరిపారా. మన ఆకాశవాణి గుమాస్తాలు (బ్యూరోక్రసీ) అలా జరుపుకునే ఆవకాశం రేడియో కళాకారులకు ఇచ్చారా. ఆకాశవాణి గుమాస్తాలకు అటువంటి ఆసక్తి ఎక్కడిది. రికార్డు చేసుకున్న వారి అద్భుత కార్యక్రమాలనే దాచుకోలేక పారేసుకున్న చరిత్ర మన ఆకాశవాణిది.

రేడియో నెదర్లాండ్స్ అయినా మన ఆకాశవాణి అయినా ఒక పరిధికి మించి పేరు వచ్చిన కళాకారులను చూస్తె, గుమాస్తాలకు (అదే బ్యూరోక్రసీ) కు ఎప్పుడూ అసూయే. తమ సంస్థకు పేరు పడిపోయినా పరవాలేదు, అటువంటి కళాకారులను దిగలాగి కాని వదలరు.

ఈ కార్యక్రమం మీద ఉన్న మక్కువతో కీత్ పెర్రాన్ అనే ఆయన 2009 నుండి ఈ కార్యక్రమాన్ని అదే పేరుతొ తైవాన్ నుంచి, పి జె సి మీడియా పేరుతో ప్రసారం చేస్తున్నారు. అనేక దేశాల్లో ఎఫ్ ఎం రేడియోలు రిలే చేస్తున్నాయి. మన ఎఫ్ ఎం డప్పులు దరువులు, కేకల స్టేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని రిలే చేస్తారనుకోవటం అత్యాశే.

2009 లో ఈ కార్యక్రమం మళ్ళీ మొదలవటానికి ముందే నాకు కీత్ పెర్రాన్ పరిచయం(నా పూర్తిపేరు నోరు తిరగక సింపులుగా నన్ను శివ అని కీత్ పిలుస్తూ ఉంటాడు). హాపీ స్టేషన్ యాహూ గ్రూప్ లో. నేను అప్పుడప్పుడూ ఈ హాపీ స్టేషన్ మళ్ళీ ఎవరన్నా మొదలెడితే బాగుండును అని అంటూ ఉండేవాడిని, గ్రూప్ చర్చల్లో. చివరకు కీత్ పెర్రాన్ ఆ పని చేసి చూపించాడు. మొట్టమొదటి కార్యక్రమం ప్రసారం కావటానికి ముందు, నన్ను హాపీ స్టేషన్ గురించి రెండు మాటలు చెప్పమని కీత్ అడగటంతో రికార్డ్ చేసి పంపాను. నాకు చాలా ఆనందకరమైన విషయం ఏమంటే, ఆ మొట్టమొదటి హాపీ స్టేషన్ కార్యక్రమంలో పూర్వపు శ్రోతల భావాలు వినిపించిన వాణ్ని మొట్టమొదటగా నేనే. నా తరువాత అమెరికా నుంచి దక్షిణ ఆఫ్రికా పూర్వపు శ్రోతలు మాట్లాడారు. కాని ఈ కార్యక్రమం ప్రసారం అయినప్పుడు నేను వినలేకపోయ్యాను. అప్పుడు ముంబాయి నుంచి బెంగుళూరు బదిలీ హడావిడిలో ఉన్నాను. ఇది తెలిసి కీత్ పెర్రాన్ ఆ కార్యక్రమం మొత్తం రికార్డింగ్ మెయిలులో పంపారు. అందులో నేను మాట్లాడిన భాగం ఈ కింది ప్లేయర్లో వినవచ్చు:


ఈ కార్యక్రమాన్ని ఈ కింది లింకు నొక్కి వినవచ్చు / చూడవచ్చు




ప్రస్తుతం హాపీ స్టేషన్ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న కీత్ పెర్రాన్


2009 లో నా పుట్టినరోజు సందర్భంగా కీత్ నాకు శుభాకాంక్షలు చెబుతూ, హాపీ స్టేషన్ ప్రసారాలు మళ్ళీ మొదలవటానికి నేను అందించిన సహకారానికి ధన్యవాదాలు చెప్పినప్పటి రికార్డింగ్. నా పేరు చాలా కష్టపడి ఉచ్చరించాడు కీత్. తానూ తప్పుగా ఉచ్చరించానని అనుకున్నాడు కాని దాదాపుగా సరిగ్గానే నా పేరు పలకగలిగాడు. అతనికి కష్టం ఎందుకు అని "శివ" అని సింపుల్ గా పిలవమని చెప్పాను.

ఆకాశవాణి వారూ వింటున్నారా !!!!!

తెలుగునాట ఉషశ్రీ గారి గురంచి తెలియని వారెవ్వరు! రేడియో లో పురాణ ప్రవచనాల గురించి చెప్పాలంటే ముందుగా ఉషశ్రీ గారి గురించి చెప్పాల్సిందే. ఉషశ్రీ గారి గురించిన ఒక చక్కటి వెబ్ సైటు వారి దగ్గిర బంధువులు (కుమార్తెలు అల్లుళ్ళు) నడుపుతున్నారు. ఊరికే ఆయన ఫోటోలు అందులో ఉంచి ఊరుకోవటం కాకుండా, ఉషశ్రీ గారి గురించిన సమగ్ర సమాచారం, ఆయన గురించిన అనేకానేక అపురూపమైన ఫోటోలు, ఆయన పెళ్లి శుభలేఖ తో సహా ఆ వెబ్ సైటులో ఉన్నాయి.


ఇవే కాదు, ఆయన ప్రవచించిన రామాయణ, భారత, భాగవతాల ఆడియోలు కూడా ఉన్నాయి. ఇంతేనా అంటే, ఇంకా ఉన్నాయి, అప్పుడెప్పుడో, 1980 లో రాజమహేంద్రవరం లో బహిరంగ సభలో భారత యుద్ధం గురించి ఉషశ్రీ గారు చేసిన అద్భుత ప్రసంగం కూడా ఉన్నది. ఈ ప్రసంగం విని తీరవలసిందే. భారత యుద్ధం గురంచి ఒక పక్క చెబుతూనే, సమకాలీన పరిస్థితుల మీద ఉషశ్రీ గారు Extempore గా (ఈ మాటకు తెలుగు తట్టడం లేదు) చేసిన వ్యాఖ్యలు అద్భుతం అనేసుకుని ఊరుకోవటానికి మాత్రమె కాదు , మనసు ఉన్నవాళ్ళు ఆలోచించి తీరవలసినవి. ఇంతేనా అంటే, ఇంకా ఉన్నాయి. అవును అక్కడి ఆడియోలను వీడియోలను చూస్తుంటే, ఇంతేనా? ఇంకా ఉంటే బాగుండును అనిపించి తీరుతుంది. అలనాడు శ్రీరామనవమి సందర్భంగా ఉషశ్రీగారు ఆకాశవాణి బృందంతో భద్రాచలం లో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలను కళ్ళకు కట్టినట్టు ప్రత్యక్ష ప్రసారం చేశారు . ఆ ఆడియో కూడా ఆ వెబ్ సైటులో వినటానికి ఉన్నది. ఇంకా ఎన్నో వీడియోలు.


అన్నిటికి మించి వారి అమ్మాయి డాక్టర్ గాయత్రి గారు తమ తండ్రి ఉషశ్రీ గారి 80 వ జయంతి సందర్భంగా వ్రాసిన వ్యాసం ఆ వెబ్ సైటుకు తలమానికమైనది. ఆవిడ ఉషశ్రీ గారి గురించిన అనేక వివరాలను ఫోటోలను తమ వ్యాసం లో ఉంచారు. ఆ వ్యాసం పూర్తి పాఠం, ఈ కింది లింకు నొక్కి చదువ వచ్చు.


(క్లిక్ చేసినాక కొద్దిసేపు ఓపిక వహిస్తే అక్కడున్న పిడిఎఫ్ చక్కగా లోడ్ అయ్యి మీకు కనిపిస్తుంది )


ఈ వ్యాసం శీర్షిక ఆకాశవాణి వారిని ఉద్దేశిస్తూ వ్రాయటానికి కారణం పైన ఉదాహరించిన వ్యాసంలోని ఒక భాగం. ఈ కొద్ది భాగం (కొద్దిగా అక్కడక్కడ మార్పులు చేసి ఈ కింద ఇస్తున్నాను)చదవగానే చాలా విచారం కలిగింది. ఆపైన కోపం వచ్చింది. ఉషశ్రీ గారు రేడియోలో చేసిన అద్భుత ప్రవచనాలు ఒక్కటి కూడా ఆకాశవాణి వారు సి డి ల కింద ఇంతవరకూ విడుదల చేయలేదు కదా అన్న విషయం స్పురించింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు ఐతే, ఉషశ్రీ గారి పురాణ ప్రవచనాలు ఒక ఎత్తు. అంతటి ప్రజాదరణ పొందినాయి ఆయన చేసిన ఆ కార్యక్రమాలు. అంతటి ప్రజాదరణ పొందిన కార్యక్రమాల టేపులు ఆకాశవాణి వారి వద్ద ఉన్నాయో లేవో , ఉండీ సి డి లుగా విడుదల చెయ్యటానికి ఇలా తాత్సారం చెయ్యటానికి కారణాలు ఏమిటో. సెక్యులరిజం పిచ్చా! ఇన్ని కోట్ల మంది ఆదరించిన కార్యక్రమం సి డి లుగా ఇవ్వకపోవటానికి వారికి ఉన్న కారణాలు ఏమిటో కదా అని చిత్రవిచిత్రంగా అసంఖ్యాకమైన శ్రోతలు అనుకోవటానికి ఆకాశవాణి వారు అవకాశం ఇవ్వటం చాలా బాధాకరమైన విషయం.
1986 లో ఉషశ్రీ గారు ఆకాశవాణి ఉద్యోగం నుండి రిటైర్ అయ్యారు. రామాయణ భారతాల ప్రవచన దీక్ష నుండి ఆయనకు రిటైర్మెంట్ లేదు. 1990 జులై నాటికి ఉషశ్రీ గారి ఆరోగ్యం బాగా లేదు.కూర్చుంటే వెన్నంతా మంట, భరించలేని నొప్పితో నిరంతరం పడుకునే ఉండవలసి వచ్చింది. ఆ సమయం లో ఆకాశవాణి విజయవాడ వారు ఆర్ఖైవ్స్ కోసం ఉషశ్రీ గారిచేత పదమూడు ఎపిసోడ్స్ కృష్ణ లీలలు చెప్పించి రికార్డ్ చేస్తాం అన్నారు. రోజుకి ఒక్క భాగమైనా చెయ్యగలనో లేదో అనుకుంటూ ఆకాశవాణి స్టుడియోకి వెళ్ళారు ఉషశ్రీ ఏకబిగిన ఆరేసి ఎపిసోడ్స్ చొప్పున రెండు రోజుల్లో రికార్డింగ్ పూర్తిచేసేశారు. ఆ రెండు రోజులు ఉషశ్రీ గారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారట. "అసలు నాకు అనారోగ్యం రేడియోకి వెళ్ళకపోవడమే, ఇవాళ నాకు అసలు ఏ బాధా లేనట్లు ఉంది" అన్నారట ఆనందంగా. రేడియో అంటే అంత ప్రాణం ఉషశ్రీగారికి. రెండు దశాబ్దాల క్రితం ఉషశ్రీ గారు ఇచ్చిన ఆ కార్యక్రమాన్ని ఇప్పటికయినా సి డి లు చేసి తెలుగు శ్రోతలకి ప్రసార భారతి వారు అందిస్తే......ఉషశ్రీ గారు అనారోగ్యాన్ని కూడా లెక్క చెయ్యకుండా ఆర్ఖైవ్స్ కోసం స్టుడియోకి వెళ్ళిన శ్రమకీ, కృష్ణ లీలలు అందించడానికి ఆయన చేసిన కృషికీ ఫలితం ఉంటుంది.
ఉషశ్రీ గారు ఎంతో అనారోగ్యంతో ఉండి కూడా ఆకాశవాణి మీద ఉన్న ప్రేమతో రెండే రెండు రోజుల్లో రికార్డ్ చేసిన కృష్ణ లీలలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శ్రోతలకు అందకుండా తమ బూజు పట్టిన బీరువాల్లో దాచేసి, తెలుగువారికి ఆకాశవాణి చేసిన ద్రోహం (అవును ద్రోహమే) అంతా ఇంతా కాదు, అందరూ ముక్త కంఠంతో గర్హించి, తీవ్రంగా విమర్శించవలసిన విషయం.


ఆకాశవాణి వారూ! ఇప్పటికైనా సరే, ఉషశ్రీ గారు ప్రవచించిన పురాణాలు అన్నీ కూడా సి డి లుగా విడుదల చెయ్యండి. చెయ్యరూ, మన పురాతన ఆలయాలను ఎడారులా మీదుగా వచ్చి ధ్వంసం చేసిన దురాక్రమణ దారులుతో సమం అయిపోతారు.


మార్కెట్లో ప్రస్తుతానికి ఉషశ్రీ గారి ఆడియో కాసెట్లు దొరుకుతున్నాయి. అలాగే కొన్ని వెబ్ సైట్లల్లో కూడా ఆ ఆడియో ఫైళ్ళు లభ్యం అవుతున్నాయి. అవి ఆకాశవాణి లో ఉషశ్రీగారు చేసిన ప్రసంగాలు కాదు. ఆయన పదవీ విరమణ చేసినాక, బయట రికార్డ్ చేసినవి మాత్రమె.


నాకు బాగా గుర్తు 1977-79 ప్రాంతాల్లో అనుకుంటాను, ఇంతటి ప్రజాదరణ పొంది శ్రోతల మనస్సులో నిలిచిపోయిన ఉషశ్రీ గారిని విజయవాడ నుంచి కడప కేంద్రానికి బదిలీ చేశారు. ఎక్కడి విజయవాడ, ఎక్కడి కడప. ఆయన వెళ్ళలేదు, శలవపెట్టి కూచున్నారు. శ్రోతలు ఉద్యమించారు, నానా గోల చేశారు. అర్జీలు పెట్టారు. చివరకు దిగివచ్చి ఆయన్ని అక్కడే అంటే విజయవాడ కేంద్రంలోనే ఉంచినట్టు గుర్తు. ఆ సమయంలోనే, ఉషశ్రీ గారు విజయవాడలో ప్రసిధ్ధి పొందిన శివరామకృష్ణ క్షేత్రంలో(రామకోటి ఉత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు) అఖండ పురాణ ప్రవచనం చేశారు. ప్రతిరోజూ తండోప తండాలుగా ప్రజలు వచ్చి అవి వినేవాళ్ళు. పక్కనే ఉన్న రోడ్డు మూసుకుపోయి, ఆ రోడ్డుకు ఆ పక్కన అప్పట్లో ఉన్న సత్యనారాయణపురం రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారం కూడా జనంతో నిండిపోయ్యేది. ఉషశ్రీ గారి గురించిన ఒక గుర్తు ఇది.


ఉషశ్రీ గారి గురించి వారి బంధువులు నిర్వహిస్తున్న వెబ్ సైట్ ఈ కింది లింక్ నొక్కి చూడవచ్చు.



ఇదే వెబ్ సైటులో ఇవ్వాళ శ్రీరామనవమి సందర్భంగా ఒక కొత్త ఆడియో, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు చేసిన రేడియో ప్రసంగం "జానకితో జనాంతికం" ఉంచారు. శ్రీరామనవమి సందర్భంగా విని తీరవలసిన చక్కటి పురాణ ప్రసంగం.

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు

ఈ వ్యాసంలో ఉన్న బొమ్మలన్నీ కూడా ఉషశ్రీ.ఆర్గ్ వారి సౌజన్యం





1, నవంబర్ 2010, సోమవారం

ఆకెళ్ళ సత్యనారాయణ మూర్తి

జీవన కాలం కేవలం నాలుగున్నర దశాబ్దాలు. ఆకాశవాణి శ్రోతల జ్ఞాపకాల్లో కలకాలం. వారే ఆకెళ్ళసత్యనారాయణ మూర్తి. రాజమండ్రిలో జూన్ 30, 1946 జన్మించిన ఆకెళ్ళ మార్చ్ 17, 1992 పైలోకాలకువెళ్ళిపోయారు.

ఆంగ్లంలో ఎం ఏ చేసి, కొంతకాలం లెక్చరర్ గానూ, మరి కొంత కాలం జర్నలిస్టు గానూ పనిచేసారు ఆకెళ్ళ సత్యనారాయణ మూర్తి గారు. 1972 లో ఆకాశవాణి విజయవాడ కేద్రంలో అనౌన్సర్ గా చేరినప్పటికీ హైదరాబాదు ఆకాశవాణి కేద్రం లోనే చివరి వరకు పనిచేశారు. అనేక నాటికలు రచించారు, తాను నటించారు. వారు
వ్రాసిన నాటికల్లో నీలి నీడలు, రైలు కదిలింది, సక్షిప్త సంక్షోభ చిత్రం, కల్పన మున్నగునవి ఉన్నాయి. ఆకాశవాణిలోనే పనిచేస్తున్న జలసూత్రం సీతాదేవి గారిని వివాహమాడారు సత్యనారాయణ మూర్తి గారు.
రేడియో కళాకారునిగా ఆ కళలో బహుముఖ ప్రజ్ఞ కనబరిచి ఎంతో పేరు, అనేక మంది సహోద్యోగులను ఆత్మీయులుగా సంపాయించిన ఆకెళ్ళ సత్యనారాయణ మూర్తి గారికి ఆకాశవాణి వివిధ భారతి, హడారాబాడు కేంద్రం వారు సముచితమైన శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. ఆ కార్యక్రమ నిర్వహణ, సమర్పణ శ్రీ మట్టపల్లిరావు గారు. ఈ కింది ప్లేయర్ లో ఆ శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని వినవచ్చు.


ఆడియో కర్టెసీ రంజని గారు. 23 నిమిషాల ఆడియోని కుదించి క్లారిటీ లేని భాగాలను తొలగించటం జరిగింది

శ్రద్ధాంజలి కార్యక్రమంలో శ్రీ మట్టపల్లి రావుగారు ఆకెళ్ళ సత్యనారాయణ మూర్తిగారి గురించిన అనేక విషయాలు తెలియచేసారు. ఈ శ్రద్ధాంజలి కార్యక్రమం 31 మార్చ్ 1992 న ప్రసారం అయ్యింది.

===============================================================================
ఆకెళ్ళ సత్యనారాయణ మూర్తి గారు నటించిన నాటికల ఆడియో ఉన్నవారు దయచేసి అందరితో పంచుకో ప్రార్ధన, మాకు పంపితే ఈ బ్లాగ్ ఆర్ఖైవ్స్ లో భద్రపరుస్తాము.
ఫోటోలు "వాచస్పతి" పుస్తకం నుండి గ్రహించబడినవి
===============================================================================









24, అక్టోబర్ 2010, ఆదివారం

మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి గారు

శ్రీమతి మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి
(ఫొటో కర్టెసీ "వాచస్పతి" పుస్తకం నుండి)
1960లలో ఆకాశవాణి ఢిల్లీ కేద్రం నుండి తెలుగులో వార్తలు చదివే ఇద్దరే ఇద్దరు మహిళా న్యూస్ రీడర్లు. అందులో ఒకరు సీనియర్ జోలెపాళ్యం మంగమ్మగారైతే, రెండవవారు, అప్పుడె చేరి అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నవారు శ్రీమతి మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి గారు. ప్రస్తుతం మదరాసులో ఉంటున్నారని తెలుస్తున్నది.

రాజ్యలక్ష్మి గారి గళం ఆడియో అందుబాటులో లేదు. ఈ బ్లాగులో సహ-రచయితలు కాని, చదువరులు కాని, లేదా వారికి తెలిసినవారి వద్దగానీ అలనాడు ఆవిడ వార్తలు చదువుతుండగా రికార్డు చేసిన ఆడియో ఉండి, నాకు పంపితే ఎంతైనా అదృష్టవంతుణ్ణి, అభిరుచిగాలవారికి వినే అవకాశం కల్పిస్తూ ఈ బ్లాగులోనే ప్రచురించగలను.










*


2, అక్టోబర్ 2010, శనివారం

వివిధ భారతి వ్యవస్తాపకుడు

FATHER OF VIVIDHA BHAARATI SHRI PANDIT NARENDRA SARMA

(PHOTO COURTESY VIVIDH BHAARATI LISTNERS' CLUB)


వివిధభారతి మనకు ఎంతగానో పరిచయం ఉన్న ఆకాశవాణి వారి వాణిజ్య ప్రసార విభాగం. ఈ స్టేషన్ దేశ వ్యాప్తంగా ఉన్నది. మనందరికీ ఎంతో ఇష్టమైన చాయా గీత్, మంచాహే గీత్, జైమాలా, మనోరంజన్, హవామహల్ కార్యక్రమాలు వారి ప్రత్యేకం. ఇలాంటి కార్యక్రమాలు విని ఆనందించేవారు కొందరు కలిసి ఒక యాహూ గ్రూప్ ను తయారు చేసుకున్నారు. అందులో చేరి వివిధభారతి కార్యక్రమాల గురించి అనేకానేక చర్చలు చేస్తున్నారు, ఫోటోలు, రికార్డింగులు ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. ఈ గ్రూపును కింది లింకు నొక్కి దర్శించవచ్చు. ఆసక్తి ఉంటే అందులో చేరి ఆయా చర్చలలో పాలు పంచుకోవచ్చు.









****************

30, సెప్టెంబర్ 2010, గురువారం

శ్రీ మల్లాది సూరిబాబు (ఆకాశవాణి విజయవాడ) ఇంటర్వ్యూ



ఆకాశవాణి విజయవాడ కేంద్రంతో పరిచయం ఉన్నవారెవరైనా మల్లాది సూరిబాబు గారు ఎవరో తెలీదని అంటే విస్తుపోవాల్సి ఉంటుంది. అద్భుతమైన గాత్రం. ఎంతో ప్రావీణ్యం. వారి ఇంటర్వ్యూ ఇక్కడ చూడవచ్చు. ఇంగ్లీషులో ఉంది కానీ, ఆయన ప్రతి చిన్న సంగతినీ ఎంతో బాగా వివరించిన తీరు చూడవచ్చు ఈ వీడియోలో. దాదాపు గంట వరకూ సాగే ఈ ఇంటర్వ్యూ బోల్డు విశేషాలు చెపుతుంది. ఇహ ఆనందో బ్రహ్మ!

గమనిక - ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసారం చేసిన కార్యక్రమం కాదు!

భవదీయుడు

మాగంటి వంశీ