8, జూన్ 2012, శుక్రవారం

బావగారి కబుర్లకి ఆద్యులు

కొన్ని రోజుల క్రితం  అలనాటి అద్భుత ఆకాశవాణి కార్యక్రమం "బావగారి కబుర్లు"(క్లిక్ చెయ్యండి) గురించిన ఒక చిన్న వ్యాసం అనే కన్నా నా జ్ఞాపకాలు వ్రాయటం జరిగింది. నా బ్లాగులో అది చూసి ప్రముఖ రేడియో కళాకారుడు శ్రీ "సుధామ" గారు ఒక మంచి సమాచారం అందించారు. నేను బావగారి కబుర్లు కార్యక్రమం నండూరి సుబ్బారావు, చివుకుల రాం మొహనరావుగార్లతోనే మొదలయ్యింది అనుకుంటున్నాను. అదే వ్రాశాను 

కాని,  శ్రీ సుధామ గారు చెప్పిన ప్రకారం, బావ గారి కబుర్లు కార్యక్రమానికి ఆద్యులు ప్రయాగ నరసింహ శాస్త్రి గారు, గాడేపల్లి సూర్యనారాయణ శర్మగారు. సుధామ గారు ఇలా చెప్పి ఊరుకోకుండా, ఆ ఇద్దరూ ఉన్న ఫోటో ఒకటి పంపారు. చూడండి: 

ఎడమ పక్కన శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి గారు వారికి ఎదురుగా గాడేపల్లి సూర్యనారాయణ శర్మ గారు - బావగారి కబుర్లు కార్యక్రమానికి ఆద్యులు 
నేను వ్రాసిని విషయం చదివి  వదిలెయ్యకుండా, తనకు తెలిసిన సమాచారం అందించిన  శ్రీ సుధామ గారికి నా ధన్యవాదాలు ఆపైన కృతజ్ఞతలు . సుధామ గారు ఇదే విధంగా తన జ్ఞాపకాల నుండి తన దగ్గర ఉన్న ఫోటోల నుండి విలువైన సమాచారాన్ని బ్లాగు లోకానికి అందిస్తారని ఆశిస్తూ  మరొక్క సారి ఆ అద్భుత కార్యక్రం గురించి మరిన్ని జ్ఞాపకాలు.

  • సామాన్యంగా ఈ బావగారి కబుర్లు కార్యక్రమం సాయంత్రం ఆరు యాభై  నుంచి పది నిమిషాల సేపు  ఏడుగంటల వరకూ  వచ్చేది.
  •  ఎక్కడా అది ఒక స్క్రిప్ట్ తయారుచేసుకుని చేసున్న కార్యక్రమంగా ఉండేది కానేకాదు. ఇద్దరు వరసైన పెద్దమనుషులు ఎకసేక్కాలు  ఆడుకుంటూ కబుర్లు చెప్పు కుంటున్నట్టే    ఉండేది.
  • ఇద్దరిలో ఒకరు కొద్దిగా డాంబికంగా  అంతా తనకు తెలిసినట్టే మాట్లాడేవారు, కాని ఆవతల వ్యక్తీ (చివుకుల రాం మోహనరావుగారు) అసలు విషయం విప్పి చెప్పేవారు. దాంతో ఇద్దరూ నవ్వుకుంటూ కార్యక్రమం ముగించేవాళ్ళు.
  • బావగారి కబుర్ల గురించి మరొక ముఖ్య విషయం. ఈ కార్యక్రమం ప్రభుత్వ ఆధీనం లో ఉన్న ప్రచార మాధ్యమం లో వచ్చేది. అటువంటప్పుడు ఈ కార్యక్రమంలో రాజకీయాలను చర్చించాలి అంటే ఎంతటి ధైర్యం, నేర్పు కావాలి. పాము చావకూడదు, కర్రా  విరగకూడదు. ఈ విషయంలో నండూరి వారు చివుకులవారు అద్భుతమైన నేర్పు చూపిస్తూ ఈ  కత్తి  మీద సాము అతి సమర్ధవంతంగా చేసి చూపించి, వీళ్ళు బాకా ఊదుతున్నార్రా అనిపించు కోకుండా (అతి తక్కువ సార్లు బాకా లాగ వినపడేది) ఉన్న విషయం గురించిన సమాచారం ఇస్తూ, అటు తమ ఉద్యోగాలకు ప్రమాదం వాటిల్లకుండా నెగ్గుకు వచ్చారు. 
  • ఈ కార్యక్రమాన్ని ఎక్కువసార్లు ఇంట్లో కంటే పార్క్ లో  ఉండే రెడియోలోనే విన్నట్టుగా గుర్తు. ఈ కార్యక్రమం ఆ తరువాత ఢిల్లీ  నుంచి వచ్చే తెలుగు వార్తలు హెడ్ లైన్స్ విని, పంట సీమల కార్యక్రమం వచ్చేప్పటికి ఇంట్లో పడేవాళ్ళం. ఇక చదువు తిండి, మళ్ళీ రేడియో కార్యక్రమాలు,నిద్ర ఇలా ఉండేది. 
  • అసలు మన దూరదర్శన్  కి కాని ఇతర టి వి చానెళ్లకు ఆసక్తి లేకపోవటం అనాలి కాని , పానుగంటి వారి "సాక్షి" (బాబోయ్ మీరనుకునే సాక్షి కానే కాదు, ఇరవయ్యో శతాబ్దపు  ఒకటి నుండి  మూడు దశాబ్దాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు వ్రాసిన వ్యాసాలు) ఫార్మాట్ తీసుకుని, నలుగురు మంచి నటులను  కూడగట్టి, ఒకరు జంఘాల శాస్త్రి, మరొకరు వాణీ దాసు, ఇంకొకరు బోర్రయ్య శెట్టి, ఇంకొకరు కాలాచార్యుడు, చివరగా సాక్షి గా నటిస్తూ ప్రస్తుతపు  సామాజిక, రాజకీయాలను  అద్బుతంగా విశ్లేషిస్తూ  ప్రేక్షకులకు వినోదంతో బాటుగా మంచి అవగాహన కూడా తీసుకు రావచ్చు.  
ఇదే విధంగా బావగారి కబుర్లు కార్యక్రమానికి ఆద్యులైన  ప్రయాగ వారు గాడేపల్లి వారు చేసిన కార్యక్రమం ఎలా ఉండేదో జ్ఞాపకాలు సుధామ గారే చెప్పాలి. మరింకెవరి వద్దనన్న అప్పటి బంగారు జ్ఞాపకాలు ఉంటే అందరితో పంచుకుంటే,  మరుగున పడిన మన తెలుగు రేడియో చరిత్ర  వెలుగులోకి తెచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకు ఇంకా  ఆలస్యం, మీ తాతయ్యలను, బామ్మలను, మామగార్లను, అత్తగార్లను, బాబాయ్ పిన్నులను ఇలా అప్పుడు ఈ కార్యక్రమం విని ఉండవచ్చు అనుకునే వాళ్ళను కదిలించి జ్ఞాపకాలు పంపగలరు.

 అంతకంటే ముఖ్యం ఎవరన్నా అప్పటి కార్యక్రమాన్ని రికార్డ్ చేసి ఉంచారా!!?? ఉంటే దయచేసి అందరితో పంచుకోగలరు. ఉండే ఉంటాయి ఎక్కాడో ఒకచోట.  తెలుగు రేడియో చరిత్రలో అద్భుతమైన కార్యక్రమాల్లో ఒకటి ఈ బావగారి కబుర్లు. 

----------------------------------------------------------------------------------

(అతి త్వరలో ప్రముఖ రేడియో కళాకారుడు శ్రీ నండూరి సుబ్బారావుగారి గురించిన ఒక ప్రత్యెక వ్యాసం )

నటుడు , రచయితా, దర్శకుడు, అద్భుత రేడియో కళాకారుడు శ్రీ నండూరి సుబ్బారావు గారు 
బ్లాగులోకంలో సీనియర్లు,  నండూరి సుబ్బారావుగారి గురించిన  వారి జ్ఞాపకాలు దయచేసి పంపగలరు. వారి పేరుతొ సహా రాబొయ్యే ప్రత్యెక వ్యాసం లో ప్రచురించ బడును. వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.