16, ఆగస్టు 2012, గురువారం

అమ్మమ్మ మాటలు-తాత వ్యాఖ్యానాలూ

మనం ఇల్లు మారటం, బదిలీ మీద మరో ఊరు వెళ్ళటం ఒక తప్పనిసరి చీదరగా భావిస్తాము కాని ఒక్కొక్క సారి ఈ మార్పుల వల్లే మంచి పనులు కూడా జరుగుతూ ఉంటాయి. ఒక పదేళ్ళ క్రితం అనుకుంటాను గోర్కీ ఆత్మ  కథ (మూడు భాగాలూ కూడా) మా ఊరు నుండి  చదువుదామని తెచ్చుకుని ఉంచాను. సమయం దొరకక, ఆ పుస్తకాలు ఎక్కడ పెట్టానో కూడా గుర్తు లేక దిగులుపడి, సరే మన దగ్గరే ఎక్కడో ఉన్నాయి అని తృప్తితో ఉన్నాను. ఇటీవల బెంగుళూరు నుండి ముంబాయి బదిలీ సందర్భంగా, ముంబాయిలో సామాన్లు సద్దుతూ ఉండగా ఒక నిధి బయటపడింది. ఈ కింది ఫొటో లోదే  ఆ నిధి. 

గోర్కీ ఆత్మా కథ మూడు భాగాలు-నా బాల్యం, నా బాల్య సేవ, నా విశ్వవిద్యాలయాలు
నేను  ఇంటర్ మీడియేట్ (ప్లస్  టు) చదువుతున్నప్పుడు (1973-75) విశాలాంధ్ర వారి పుణ్యమా అని పాకెట్ మనీ తోనే  కొని అనేక సార్లు చదివినవి ఈ అద్భుత పుస్తకాలు.  ఒక్కొక్క పుస్తకం నాలుగైదు సార్లు చదివాను. చివరి సారి చదివినది మాత్రం 1984 లో . మళ్ళి  ఇప్పటికి తీరుబడి అయ్యింది.  సరే ఈసారి చదివి ఈ పుస్తకాల గురించి బ్లాగులో వ్రాద్దాం అని మొదలు పెట్టాను. ముందుగా మీమాంస! ఏమని వ్రాయాలి! సమీక్షా? అంత పెద్దాయన గురించి మనం సమీక్ష వ్రాయటం ఏమి సమంజసం! ఈ మధ్య కొంతమంది గట్టిగా ఒక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత ఒకటో ఆరో పి  హెచ్ డి చేసో,  చేస్తున్న ప్రయత్నంలో ఉండో, ఆ పొగరులో విశ్వనాధ సత్యనారాయణగారి మీద అవాకులూ చెవాకులూ వారి చిన్న బుల్లి బుర్రకు తట్టినవి "సమీక్ష"  పేరిట వ్రాసినవి నా కంటపడి గోడ మీద గోరుపెట్టి గీకినట్టు అనిపించింది. అటువంటి వారి దారిలో మనమెందుకు వెళ్ళాలి అని సమీక్ష ఆలోచనే  విడిచిపెట్టాను. 

సరే అటు సమీక్షా వద్దు,ఇటు పరిచయమూ వద్దు, గోర్కీ ఆత్మ కథలో నాకు బాగా నచ్చిన విషయాలు వ్రాద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చి మొదలు పెట్టాను. 

గోర్కీ వ్రాసిన కథలు నవలలు ఒక ఎత్తైతే ఆయన ఆత్మ కథ ఒక్కటే ఆ రచనలన్నిటికీ సాటి వస్తుంది, అంతటి లోతైన రచన, అంతటి పరిశీలన, తనకు తారసపడిన ప్రతి వ్యక్తీ గురించిన నిర్దిష్టమైన అభిప్రాయాలు, ఒక ఆత్మకథ అంటే ఎలా ఉండాలో ఒక  ప్రామాణికత  ఏర్పరిచారు మాక్జిం గోర్కీ. 

ఆత్మకథలు ఎందరో వ్రాసుకుంటారు. అందులో అతి కొద్దిమంది తమ కథ తాముగా ఎందుకు వ్రాసుకున్నారో చెబుతారు. చాలామంది చెప్పరు.  కానీ గోర్కీ, తను  ఆత్మ  కథ ఎందుకు వ్రాసుకున్నాడో  ఒకచోట చక్కగా వివరించారు:

"...సత్యం, జాలికి అతీతమైనది. అంతేకాకుండా నా స్వవిషయం గురించి కాదు నేను రాయడం. సామాన్యమైన రష్యను అప్పట్లో ఎంతటి సంకుచితమైనట్టీ  ఊపిరిసలపనట్టీ ఘోర పరిస్థితుల్లో జీవిస్తూండేవారో, ఈనాడు కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఎలా జీవిస్తున్నాడో  ఆ విషయాల గురించి రాయడమే నా ఉద్దేశ్యం".

గోర్కీ ఆత్మకథ మొదటి భాగం "నా బాల్యం" మొత్తం,  రెండవ భాగం "నా బాల్య సేవ" లో కొంత భాగం ఎక్కువగా కనపడేది గోర్కీ అమ్మమ్మ.  గోర్కీ తన ఆత్మ కథలో తన అమ్మమ్మ చెప్పిన అనేక మంచిమాటలు ఉదాహరించారు. అవన్నీ కూడా అందరూ ఒక్క చదవటమే కాదు, చదివి ఆలోచించతగ్గ విషయాలు. అందుకని ఆవిడ తన మనవ డితో చెప్పిన మంచి మాటలను సేకరించి వ్రాద్దామని ఈ ప్రయత్నం.
 అమ్మమ్మ చెప్పే కబుర్లు ఆసక్తిగా వింటున్న గోర్క
 ఇక ఉపోద్ఘాతం ఆపి అసలు విషయం లోకి వస్తాను. 

అతనొక చిన్న కుర్రాడు. అతనికి జీవితంలో మొదటి గుర్తు మరణించి నేలమీద పడి  ఉన్న తండ్రి. అ శవం  మీద పడి  ఏడుస్తూ, అటువంటి సమయంలో పురిటి నేప్పులు వచ్చి, అక్కడే కానుపు అయిన తల్లి. పక్కనే ఉన్న తన అమ్మమ్మ. తండ్రి మరణంతో, అంత్యక్రియల అనంతరం అమ్మమ్మగారింటికి తల్లితో సహా వెళ్ళిపోతాడు ఆ కుర్రాడు. ఆ ప్రయాణంలో,  అప్పుడే పుట్టిన అతని తమ్ముడు  మరణిస్తాడు. అతని తల్లి ఈ కుర్రాణ్ణి అమ్మమ్మ దగ్గిర  వదిలేసి, వయస్సు ప్రభావాన ఎక్కడెక్కడికో  వెళ్ళిపోతుంది. కొంతకాలానికి తిరిగి వస్తుంది కానీ  తనకంటే చిన్న వాడిని  పెళ్లి చేసుకుని అతని దౌష్ట్యం వల్ల  అనేక కష్టాలు పడుతుంది, ఆపైన పిన్న వయస్సులోనే మరణిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో పెరిగి పెద్దైన ఆ కుర్రాడే రష్యన్ రచయిత  మాక్జిం గోర్కీ. ఆయన అమ్మమ్మ పేరు అకులినా ఇవనోవ్నా.


మాక్జిం గోర్కీ చిన్నతనం అంతా కూడా తన అమ్మమ్మ వద్దే జరిగింది. అమ్మమ్మ ప్రభావం గోర్కీ మీద చాలా ఉంది అనటానికి ఉదాహరణ, ఆయన వ్రాసిన గొప్ప  నవల "అమ్మ". అటువంటి అద్భుత వ్యక్తి  పాలనలో పెరిగిన గోర్కీ, ఒక చక్కటి వ్యక్తిగా, ఆలోచనాపరునిగా  తనను తానూ తీర్చి దిద్దుకోవటం లో ఆశ్చర్యం లేదు. స్వతహాగా ఎంతో నిశితమైన ఆలోచనా, అద్భుతమైన జ్ఞాపక శక్తి, అతి చిన్నతనం లోనే లోతైన ఆలోచనలు చెయ్యగలిగిన శక్తి కలవాడు గోర్కీ.  


ఇక అమ్మమ్మ గురించి గోర్కీ కొన్ని గుర్తులు  ఒక సారి చూద్దాం:



"అమ్మమ్మ స్థూలంగా గుండ్రంగా ఉంది , పెద్ద తల, పెద్ద పెద్ద కళ్ళు . మాంసపు ముక్కలా ముక్కు. ఆ ముక్కు చూస్తేనే నాకు నవ్వొచ్చేది. ఆమె అంతా నల్లగా మృదువుగా వుంది అద్భుతంగా కనబడుతోంది.....ఆమె మాట్లాడుతుంటే హాయిగా పాట  పాడుతూన్నట్టే వుంటూ మాటలనుండి  సంతోషమూ దయా ఉట్టిపడుతూ వుంటాయి.......మాట్లాడుతుంటే ఆమె తమాషాగా మాటలన్నింటినీ కలిపి ఒక పాటలాగు పాడేది. అందుచేత ఆమె మాటలని నేను సులభంగా జ్ఞాపకం ఉంచుకోగలిగేవాడిని. ఆ మాటలు కూడా రంగురంగులతో తీర్చిదిద్దిన పువ్వుల్లాగు రసభరితంగా ఉండేవి. ఆమె నవ్వితే కళ్లల్లోని నల్ల పాపలు పెద్దవై చెప్పనలవి కాని తేజస్సుతో మెరుస్తూ ఉండేవి. నవ్వినప్పుడల్లా గట్టిగా తెల్లగా ఉన్న పల్వరస కనపడేది. చెక్కిళ్ళు రెండూ నల్లబడి పూర్తిగా ముడుతలు పడిపోయినా  ఆమె ముఖం మాత్రం యవ్వనంతో నవ్వుతూ కళకళలాడుతూ ఉండేది.  ఎర్రగా మాంసపు కండలాంటి ఆ పెద్ద ముక్కూ,  పెద్దగా ఉబ్బిన ముక్కు పుటాలూ ఆ ముఖానికల్లా కళంకాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఆమె కళ్ళను చూస్తే మాత్రం లోపలనుండి అవిరామంగా ప్రజ్వలిస్తూ ఆ మూర్తిని సంతోషానందాలతో ప్రకాశింపజేస్తూన్న తేజస్సు ఎదుటి వాడికి గోచరించేది. ఆమె వలంగా ఉండి నడుము వంగిపోయి గూను ఉందేమో అనిపించేది. కాని తేలికగా చురుకుగా పెద్ద పిల్లి నడిచినట్టే నడిచేసి,  ఆ జంతువు మోస్తరుగానే మృదువుగానూ ప్రేమగానూ ఉండెది.  

ఆమె రాకకు పూర్వం నేనెక్కడో చీకటిలో దాగునిపోయి నిద్రపోతూ ఉండినట్టు అనిపించింది నాకు. ఆమె వచ్చి నన్ను ఆ నిద్రలోనుంచి లేపి తన చేతులలో బైట ప్రకాశిస్తూన్న వెలుగులోకి తీసుకెళ్ళింది. నా చుట్టు పక్కల ఉన్న పరిస్థితులన్నిటినీ మేళవించి సాపుగా ముళ్ళూ ముడుతలూ లేని ఏకపోగుకింద వడికి ఆ పోగుని సుందర వివిధవర్ణ శోభితమైన జల్తారు మైజారుకింద నేసింది. ఆమె నా కళ్ళబడిన ఉత్తర క్షణంలోనే నాకత్యంత సన్నిహితంగా ప్రియతమంగా ఉండి నాకు పరిచయమైన  వ్యక్తులందరిలోనూ ఆమెనే నేనెక్కువగా అర్ధం చేసుకొనగలుగుతూ ఆమెతో నాకు ఆజన్మమూ నేస్తము కుదిరిపోయింది. ప్రపంచం ఎడల ఆమెకుండిన  స్వార్ధ రహితమైన ప్రేమ నా మనుగడని ఎంతో భాగ్యవంతంగా చేసి భావిలో నేను అనుభవించవలసిన కష్టపరంపరలను అధిగమించగలిగిన మనోబలాన్ని నాకు చేకూర్చింది.
నేను ఏది అడిగినా ఏ  దాపరికమూ లేకుండా ఎంతో ఆప్యాయంగా అన్నీ బోధపరిచి చెప్పడం ఆమె స్వబావం."



  • తండ్రి అంత్య క్రియలు జరుగుతుండగా గోర్కీ ద్రష్టి అంతా ఆ గొయ్యిలో  ఉన్న కప్పు లమీదే. ఇప్పుడు ఆ గోరీని పూడిచేస్తే అవి ఏమయి పోతాయి అనుకుంటూ ఉంటాడు. చిన్నతనం,  జరుగుతున్నది తెలియకపోవటం వల్ల  ఆతను ఎడవడు . అప్పుడు, అమ్మమ్మ "నువ్వు ఏడవాలి. ఎందుకు ఎడ్చావుకావు?" అని అడుగుతుంది. గోర్కీ సమాధానంగా "నాకు ఎడవాలని లేదు" అంటాడు. అప్పుడు,  అమ్మమ్మ బేషజం లేని  సమాధానం చెబుతుంది "సరే, నీకు ఏడవాలని    లేకపోతె ఏడవక్కర్లేదులే " అని.
  • తండ్రి అంత్యక్రియలు అయిన తరువాత పడవలో ఓల్గా నదిమీద వాళ్ళ ఊరి వెడుతుండగా, అమ్మమ్మ మంచి మంచి కథలు చెబుతూ అందరినీ నవ్విస్తూ ఉండేది "అమ్మా ! నిన్ను చూసి అందరూ నవ్వుతున్నారు" అంది అమ్మ కోపంతో ఒకనాడు. "వాళ్లకి నవ్వడమేసరదాగా ఉంటే నవ్వనీ. నవ్వేవాళ్ళ రోగాలు మాయమై పోతాయి" అంది అమ్మమ్మ.
  • తనకు పుట్టి, ఆ తరువాత మరణించిన పిల్లలగురించి-"పద్నాలుగేళ్ళు నిండకుండానే మా వాళ్ళు నాకు పెళ్లి చేసి కాపురానికి పంపించేసారు. పదిహేనేళ్ళు నిండకుండానే మొదటిసారి పురుడుపోసుకున్నాను. నా  కడుపునా పుట్టిన పిల్లలంటే  దేవుడికి ఎంత ప్రేమో ఉండెనో  మరి-ఒకరి తరువాత ఒకరిని అలా వాళ్ళని తన దగ్గరకు తీసుకుపోయి వాళ్ళని దేవదూతల్ని చేసేసాడు ఎంత బాధగానో ఉండేది-ఎంతో ఆనందంగా కూడా ఉండేది"
  • డెవుడిని ప్రార్ధిస్తూ, ప్రతివాడూ తను  ముందుకు రావాలని కోరుకోవడం సహజమే కదా ప్రభూ! నీకు తెలియనిది  ఏమి ఉంది కనుక! మిహాయిల్  పెద్దవాడు కనుక వాడే ఇక్కడ ఊళ్ళొనే ఉండవలసినవాడు ఏమౌతుందో  తెలియదుకదా! ఎరగని చోటికి ఏటి అవతలికి వాడిని పపించడం వాడికి కోపకారణమే అవుతుంది. వాళ్ళ నాన్నకి యాకోవ్ అంటె హెచ్చు ఇష్టం. తండ్రి తన కొడుకులలో ఒకడిని హెచ్చుగాను ఒకడిని  తక్కువగాను ప్రేమించడ ధర్మమా. మొండి మనిషి ముసలాయన. అతని బుర్రలోకి ఒక బొట్టు బుధ్ధి ఎక్కించుదూ, ప్రభూ.  ఆయనకి ఒక మంచి కల తెప్పించు కొడుకులకు ఎలా వాటాలు పంచి ఇవ్వాలో తెలియచెబుదూ.......ఇంకేమి  ఉన్నాయి నీతో చెప్పుకోవటానికి...... అని అంటూ తన కనుబొమ్మలు చిట్లించుకుని చివరికి అనేది, నిన్ను కొలిచేవారినందరినీ దయగా చూడు. పాపిష్టినీ మందమతినీ అని నేను నీతో వేరే చెప్పాలా. నీకు తెలియదా ఏమిటి నాగురించి. నన్ను క్షమించాలి నువ్వు.  
  • "బలహ్నాలో నే నుండేప్పుడు   అక్కడో అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరేమిటో  నాకిప్పుడు జ్ఞాపకం లేదు.  అమ్మాయి నృత్యం చేసిందంటే మాత్రం చూసే వారు ఆనందం పట్టలేక ఏడ్చేవారు! ఆమెను చూడడమే ఒక పర్వదినం-అంతకు మించి మాకు కోరిక అంటూ ఉండేది కాదు. ఆ అమ్మాయిని చూసి నేనెంతో ఈర్ష్య పడేదాన్ని-నాది పాపిష్టి బుద్ది మరి!"
  • గోర్కీని ఉతుకుతున్నతాత  ఆపుతున్న  అమ్మమ్మ 
  • గోర్కీకి తన తాతంటే ఇష్టం లేదు. అందుకు కారణం ఆయన అన్ని విధాలా అమ్మమ్మకు వ్యతిరేకపు భావనలు, ప్రవర్తన కలవాడు చివరకు ఆకారంలో కూడా. అమ్మమ్మని పట్టుకుని చిల్లంగి మనిషి అని తిట్టిపోసే వాడు. కాని ఆ తాత కూడా ఒక అద్భుతమైన విషయం చెబుతాడు, అది గుర్తుంచుకుని గోర్కీ తన ఆత్మకథలో మనకు  అందించారు. "భూదాసులుగా ఉన్న రోజుల్లో నయంగా ఉండేవారు-చేత ఇనుములా ఉండేవారు ప్రజ. ఇప్పుడు అంతా ఎవడిష్టం వాడిది-ఫలితం,  రొట్టేలేదు, ఉప్పులేదు కూడు పడిపోయింది! శ్రీమంతుల హ్రదయాలు సహజంగానే కఠినమైనవి. అందుకు బదులు వాళ్లకి తెలివితేటలూ హెచ్చు. కాని ఆ మాటకొస్తే శ్రీమంతుడు మంచివాడే గనుకైతే అతడి మంచితనాన్ని చెప్పటానికి   మాటలే చాలవు! కొందరు మళ్ళీ తెలివి తక్కువ దద్దమ్మలు, వాళ్ళ బుర్రలు బస్తాల్లాంటివి -నువ్వు ఏ మాట  వాళ్ళ   బుర్రల్లోకి కుక్కితే ఆ మాటే ఆ బస్తాల్లో అలా ఉండి  పోతుంది.  మనలో చాలా ఖాళీ గుల్లలున్నాయి,  చూడ్డానికి మనుషులే కాని-కాస్త దగ్గరకెళ్ళి కనిపెట్టేటప్పటికల్లా, తెలిసిపోతుంది-ఉత్త గుల్ల, గుజ్జు సున్న, లోపలంతా పురుగులు తినేశాయని. ఇప్పుడు మనకి కావలసిందేమంటే చదువు, తెలివితేటలు పదును పెట్టాలి    కాని అసలు ఇక సాన రాయే లేదు...."   
  • నెపోలియన్ బోనపార్ట్  గురించి గోర్కీ తాత చెప్పిన మాటలు, ఈ మాటలు తానెన్నటికీ మరవలేదని గోర్కీ వ్రాసుకున్నారు. "అతడు మంచి ధైర్యమైనవాడు. ప్రపంచాన్నంతనీ జయించాలని అనుకున్నాడు. తరువాత అందరూ సర్వసమానంగా జీవించెందుకని గోప్పవారంటూ, ఉద్యోగాస్తులంటూ  ఉండకూడదట! అందరు సామాన్యంగా బతకాలట! జమీలు ఉండకూడదట! మనుషుల పేర్లు వేర్వేరుగా ఉంటాయి, కాని అందరికీ ఒకటే హక్కు. ఇహ అందరిదీ ఒకటే మతం. సహజంగా ఇది పిచ్చితనమే. పీతలన్నీ  ఒక్కలా ఉంటాయి  కాని చేపలు-నానా రకాలు:స్టర్ణ్ న్ కీ కర్రకూ సఖ్యం లేదు. ఉల్లాకు  చేపకీ   స్టర్ణ్ న్ కీ స్నేహం కుదరదు మనకి మన బోనపార్టులూ ఉండే వారు..." 
  •  చేడిపోయారని అందుకు కారణం  అమ్మమ్మ  వెనకేసుకు రావటమే అని ఆడిపోతున్న తాతకు ప్రశాంతంగా అమ్మమ్మ చెప్పిన సమాధానం "ఎందుకిలా మనసు కష్టపెట్టుకుంటారు? ఎంత పెట్టాలో దేవుడికి బాగా తెలుసును కడమ వాళ్ళ పిల్లలందరికంటే మన వాళ్ళు ఏం చేదిపోయారని? సర్వత్రా ఉన్నదే ఇది-తగవులూ పోట్లాటలూ గోడవలూనూ తల్లి తండ్రుల పాపాలన్నీ వాళ్ళ కన్నీటి ధారలతో శుద్ది  అయిపోతాయి....."
  •   ..అడుగున    పానశాల తలుపు తెరచినప్పుదల్లా అలసిపోయి జీరబోయిన కంఠం ఒకటి వినపడుతున్నది ఆ గొంతుక ఒంటి కంటి  ముష్టివాడు నికీతుష్కది  అని నాకు తెలుసును......తలుపు దభీమని మూసుకుపోయే సరికల్లా ఒక్క గొడ్డలి  పెట్టుతో నరికినట్టుగా   అతని పాట ఎగిరిపోయ్యేది (ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్ ఇప్పటికి మనవాళ్ళు సినిమాల్లో చూపిస్తున్నారు కాని   గోర్కీ తన  చిన్నతనం లో జరిగినదానిని గద్యంలో చక్కగా వర్ణించారు). ఆ ముష్టివాడి మీద ఈర్ష్య పాడేది అమ్మమ్మ. అతని పాట  వినపడినప్పుడల్లా, ఆవిడే నిట్టూర్చుతూ అనేది "ఎంత అదృష్టం ఉంటే అంత అద్భుతమైన పాటలు వస్తాయి"
  •  అమ్మమ్మ ప్రార్ధన చేసుకుంటూ ఉంటే, తాత అక్కడికొచ్చి, "ఒసేవ్! నీది ఉత్త మట్టి బుర్ర! నీకు ఎన్నిసార్లో పాఠం  చెప్పాను ఎలా ప్రార్ధన చెయ్యడమో నీ సొంత ధోరణిని గోణు గుతూనే ఉంటావు పాషండిలాగా! అదంతా వినడానికి దేవుడికి ఎంత ఓపిక ఉందో నాకేమీ అర్ధం కావటం లేదు" "ఆయనకి  అర్ధం అవుతుంది" అని అమ్మమ్మ మనస్పూర్తిగానే అంది. "మనం  ఏమి చెప్పినా ఆయన తప్పకుండా అర్ధం చేసుకుని తీరుతాడు". "ఓసీ పాపిష్టీ! థూ ! ఎం మనుషులు..." అన్నాడు తాత. 
  •  అమ్మమ్మ కొలిచే దేవుడు రోజంతా నిరంతరం ఆమె చెంతనే  ఉండేవాడు ఆమె తన పెంపుడు జంతువులతో కూడా దేవుడి గురించి చెప్పేది మనుష్యులూ కుక్కలూ పక్షులూ తెనేటీగలూ  మొక్కల్లోఒక్కటేమిటి  సర్వ ప్రాణులూ అమ్మమ్మ కొలిచే దైవానికి సులభంగానూ వినమ్రాతతోనో అధీనమైపోతాయి...... ప్రపంచం మీద ఉన్న అన్ని వస్తువుల ఎడల  దయను  అన్నిటికి  ప్రియతమం గా ఉంటున్నాడాయన 
  •  పానశాల  యజమాని  పెంచుతున్న పిల్లి  టక్కరైన తిండిపోతు.ఒకనాడు అది ఒక  పిట్టని పట్టుకుంది. అమ్మమ్మ సగం ప్రాణంతో ఉన్న ఆ పిట్టను పిల్లి నోట నుండి విడిపించేసి ,   పిల్లిని  కసిరింది: "నీకు దైవ భీతి లేదే దుష్ట జంతువా,  నీచురాలా!" పానశాల  ద్వారపాలకుడూ యజమాని భార్యా అమ్మమ్మని చూసి నవ్వేరు అందుమీద అమ్మమ్మ వాళ్ళని గట్టిగా కేకలేసింది. "దేవుని గురించి  తెలీదని మీరనుకుం టున్నారేమో?  దేవుని గురించి,గడ్డి చెట్టుకి సహితం దయా దాక్షిణ్యాలు లేని మీకంటే తక్కువ తెలియదు".  బాగా బలిసి మందకొడిగా ఉన్న  గుర్రాన్ని బండికి కట్టేటప్పుడు అమ్మమ్మ దానితో అనేది: "ఎందుకే అంత నీరసంగా  ఉన్నావు దేవ భ్రుత్యువా ?   ఆ గుర్రం సకిలించి  తల ఆడించేది.
  • అమ్మమ్మ కొలిచే దైవాన్ని నేను అర్ధం చేసుకోగలను  అతనంటే నాకు భయం  లేకపోయినా అతని సమక్షంలో అబధ్ధాలాడటానికి జడిసేవాడిని   అంటే సిగ్గుచేటు అనిపించేది. ఈ సిగ్గు మూలాన్నే అమ్మమ్మ దగ్గర నేను ఎన్నడూ అబద్ధాలు  చెప్పేవాడిని కాను అంత దయాయయుడైన దేవుడి దగ్గర, నాకు బాగా  జ్ఞాపకం  ఆ ఉద్దేశ్యమే కలిగేది   కాదు. 
  • చిట్టి చిలకా నేను చెప్పే మాటలు  జాగ్రత్తగా విని జ్ఞాపకం పెట్టుకో పెద్దవాళ్ళ వ్యవహారాల్లో ఎన్నడూ కలుగాచేసుకోకు పెద్దవాళ్ళు అష్టకష్టాలకీ లోనై     దేవుడి శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళు.   నీకింకా ఆ గతి పట్టలేదు. నీ చిన్నారి బుద్దితోనే జీవితం సాగించు ఆ ప్రభువు నీ హృదయాన్ని తాకి నిన్ను  నియమించిన కార్యాన్ని నీకు సూచించి నీ బాట పైన నిన్ను నడిపించే వరకూ ఆగు అర్ధం అయిందా నీకు. ఇక దైనందిన వ్యవహారంలో   ఎవరిదీ ఒప్పు అన్న  నీకేమీ ప్రసక్తి లేదు. దేవుడే విచారణ చేస్తాడు దేవుడే శిక్షిస్తాడు ఆయనే--కాని మనం కాదు. ఒక్కొక్కప్పుడు దేవునికే  ఎంతో కష్టమైపోతుంది ఎవడిది తప్పో చెప్పడం. ఈ మాటలు విని   గోర్కీ అడుగుతాడు "ఏమీ? ఆయనకీ అంతా తెలియదా మరి". అమ్మమ్మ జవాబు "ఆయనకే అన్నీ తెలిసి ఉన్నట్టైతే మనుషులు  చేయరాని పనుల నెన్నింటినో ఎందుకు చేస్తున్నారు స్వర్గంలో ఆయన కూచుని కింద ప్రపంచంలో పాపాత్ములం మనం చేస్తున్న పనులన్నీ చూస్తూ ఒక్కొక్కప్పుడు ఆయన  నా వాళ్ళు! ప్రియతమమైన నా ప్రజలారా! మీ కోసం ఎంత జాలిపడుతున్నానో అని ఏడుస్తాడు అంది. ఆ రోజునుండి ఆమె కొలిచే దైవం గోర్కీకి మరింత  మరింత సుళువుగా  గ్రాహ్యమయ్యాడు. 
  • ఒకనాడు అమ్మమ్మ హాస్యానికి అంది: "నీ ప్రార్ధన వినీ వినీ దేముడికి విసుగేసిందేమో ఎప్పుడూ చెప్పిందే మళ్ళీ చెబుతుంటావయ్యే నువ్వు" అదివిని తాతయ్య, "ఏ-మీ-టీ  నువ్వు అంటూన్నది" అంటూ హడాలగోట్టేట్టు దీర్ఘం తీస్తూ అన్నాడు, "ఏమి పేలుతున్నావ్". "నీ హృదయంలో నుండి పుట్టుకొచ్చే మాటలని ఏనాడు నువ్వు దేవుడికి  లేదు--అదీ నేను అన్నది". 
  • తాత చెప్పిన మాటలు, "దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించిన వారందరూ చెడిపోయి నాశనం అయిపోయి దుర్మరణం పాలు అయి తీరారు" అని ఎముకల్లాగున్న తన వేళ్ళతో బల్ల తట్టుతూ నాకు భయం చెప్పాడు ఆయన. దేవుడు ఇంత క్రూరుడా అని నమ్మడానికి నాకెంతో కష్టంగా ఉండేది. దేవుని ఎడల భయం కంటే తన ఎడలే నేను హెచ్చు భయం కలిగి ఉండాలని తాతకి  తోచి ఇలా లేనిపోనివన్నీ కల్పించి చెబుతున్నాడు  అనే అనుమానం వచ్చింది నాకు "నువ్వు చెప్పినట్టూ నేను వినాలని నువ్వు  నాకు  చెబుతున్నావేమిటి?" అని నిష్కపటంగా నేనాయన్ని అడిగాను "నిశ్చయంగా"  అని అంత నిష్కపటంగానే ఆయనా జవాబిచ్చాడు.   
  • భార్యా భర్తలుగా ఉండటానికీ వివాహానికీ  మధ్య ఉండే తేడా నీకింకా  తెలియదు--నువ్వింకా కుర్రాడివి.  కాని పెళ్ళికాకుండా ఉన్న అమ్మాయికి కడుపోచ్చి పురుడొచ్చిందంటే  ఘోరం అన్నమాట అది మాత్రం నువ్వు జ్ఞాపకం పెట్టుకుని పెద్దాడివయ్యాక ఎన్నడూ కూడా కన్నేపడుచులను మానభంగం చెయ్యకు తెలిసిందా? ఆ కన్యను అంతో క్షోభ పెట్టేసి   బిడ్డకిపరువు మర్యాదలు లేకుండా చేసేసి ఘోరపాతకం చేసిన వాడవవుతావు నేను చెబుతున్నది గుర్తుంచుకో. ఎన్నడూ మర్చిపోకేం! స్త్రీని ఎంతో జాలిగా చూస్తూ మనో వాక్కాయ కర్మలా  ప్రేమిస్తూండాలి  కాని,ఉత్త సంతోషం పొందటానికి కాదు. నేను చెబుతున్నది మంచి మాట సుమా.  
  • మంచి కుర్రాడివి బాధను సహించడం యుద్ధంలోగెలుపొందడమే  సుమా.
  • పిల్లల మధ్య పందెం తో గోర్కీ ఒకరోజున దయ్యాలు లేవని నిరూపించటానికి స్మశానంలో  ఒక గోరీ మీద పడుకుంటాడు. మర్నాడు పొద్దున్నే అమ్మమ్మ అతన్ని లేపటానికి వచ్చినప్పుడు వాళ్ళమధ్య జరిగిన సంబాషణ:
అమ్మమ్మ:  లే, లే! చలికి కొయ్యబారి పోయావా? అంతగా భయం           వేసిందా?" అన్నది 
      గోర్కీ: అవ్వా! నిజంగా భయమే వేసింది, ఇలా అని  ఎవరికీ చెప్పకు సుమీ! ఆ కుంకమ్మ గాళ్ళుకు అసలే తెలియరాదు".

అమ్మమ్మ: చెబితేనెం? అని ఆశ్చర్యముతో అడిగి, ఆమె "భయమేమీ లేకపోతె డాబులు కొట్టేందుకు ఏమీ ఉండదురా"
  • ప్రతి విషయమూ నీ అంతకు నీవే నేర్చుకోవాలి. నీకు నీవే నేర్చుకోనక పోతివా ఎవ్వరూ నీకు బోధించరు  
  • గోర్కీ కొంత కాలం ఒక స్టీమరు మీద పని కుర్రాడిగా పని చేసినప్పుడు అక్కడి పెద్ద వంటవాడు చెప్పిన మాటలు-"మనుషుల్లో తేడాలు వాళ్ళ తలకాయాల్లో ఉంటాయి.కొందరు బుద్ది మంతులు మరి కొందరు మందబుద్దులు మరికొందరు ఉత్త మూర్ఖులు సరైన పుస్తకాలు-మంత్ర విద్య ఇంకా మరేమిటో ఉన్నాయిగా అన్ని పుస్తకాలూ చదవాలి అలా చదివితేనే మంచి  పుస్తకాలేవో తెలుస్తాయి .....చదవాల్రా పుస్తకం అర్ధం కాదూ- ఏడుమాట్లు చదువు,ఏడుమాట్లైనా  అర్ధంకాదూ  పన్నెండు మాట్లు  చదువు..."  


అసలు ఆత్మకథ అద్బుతం అవ్వటం ఏమిటి అని మీరు అడగచ్చు. కాని చిన్న తనంలో చదివినవి అన్నీ అద్భుతాలుగానే కనపడినా, పెద్దయ్యాక ఇదా నేను ఇంతకాలం అద్భుతం అనుకున్నది అని ఆశ్చర్యాపోతూంటాము. కానీ మాక్జిం గోర్కీ ఆత్మ  కథ ఇరవై రెండేళ్ళ తరువాత ఆరోసారి (మొదటి సారి 1974 లో చదివాను) మళ్ళీ నెలలో చదివాను. ఎప్పుడో పద్నాలుగు పదహారేళ్ళప్పుడు అద్బుతం అనిపించినది, ఇప్పుడు ఏభై ఐదేళ్ళప్పుడు కూడా మరింత అద్భుతం అనిపించింది


పైన వ్రాసిన అమ్మమ్మ మాటలు తాత వ్యాఖ్యలు ఆ పుస్తకాల లో ఉన్న అనేకానేక  విషయాలలో అతి కొద్ది మాత్రమె మూడు భాగాలూ కలిపి  దాదాపుగా ఎనిమిది వందల పేజీల అపూర్వ గ్రంధం గోర్కీ ఆత్మ  కథ. ఈ ఆత్మకథ చదువుతున్న కొద్దీ మరింత చదవాలని ఎప్పటికీ అయిపోకూడదని అనిపిస్తూంటుంది. దానికి కారణం గోర్కీ రచనా చమకృతే. ఎన్నెన్ని విషయాలు ఎంతో లోతైన పరిశీలనతో గొప్ప వివరాలతో అప్పటి జన జీవనం మొత్తం చదువరుల ముందు నిలబెట్టాడు.


ఈ మొత్తం మూడు భాగాలు ఇప్పుడు ఎక్కడా  దొరుకుతున్నట్టుగా లేదు. బెంగుళూరులో మాత్రం ఈ మూడు భాగాలు, చక్కటి బైండు లో  దర్శన మిచ్చాయి కాని అవన్నీ కన్నడ భాషలో ఉన్నాయి అవి కూడా నలభై సంవత్సరాల క్రితం వేసిన ప్రింటులే  ఆ పాతవి ఉంటే-గింటే విశాలాంధ్ర వాళ్ళ దగ్గర ఉండాలి. మళ్ళీ  పూనుకుని ఈ ఆత్మకథ  సంకలనాన్ని  ఇప్పటి తరానికి అందిస్తే ఎంతైనా  బాగుంటుంది. నా దగ్గర ఉన్న మూడు భాగాలూ స్కాన్ చేసి దాద్దామా అని ఉన్నది కారణం ఇప్పటికే కాయితాలు గోధుమ రంగుకు తిరిగిపోయి పెళుసుగా తయారయ్యాయి. 


వీలయితే మొత్తం మొత్తం ఆత్మ  కథని అర్ధవంతంగా చదువుతూ ఒక ఆడియో బుక్ చేద్దామనీ ఉన్నది కాని రెండు పనులకూ  ఎంతో సమయాన్ని కేటాయించాలి రోజుకు కొంత చేస్తూ కొన్ని నెలలు చేస్తే కాని జరగని పని.  ప్రస్తుతం జరుగుతున్న  ప్రాజెక్టులకు ఇదొకటి తగిలించి ఉంచితే ఎప్పటికో అప్పటికి  అవకపోతుందా  అని ఒక ధైర్యం.  మధ్య మధ్యలో అలసట తీరటానికి ఉల్లాసంగా ఈ ఆత్మకథ చదివి రికార్డ్ చెయ్యాలని నిర్ణయించాను .    మనకున్న అభిరుచులను అందరితో  పంచుకునే అవకాశం ప్రస్తుతం మనలాంటి సామాన్యులకు కూడా అందుబాటులో ఉన్న   సాంకేతిక  పరిజ్ఞానం కారణం. అలనాటి సిద్ధ ప్రసిద్ధులైన రచయితలకు   అందుబాటులో ఉండి  ఉంటే, వాళ్ళు ఎన్నెన్ని అద్భుతాలు సృష్టించి  ఉండేవారో కదా . 



గోర్కీ ఆత్మ  కథను మనకు చక్కటి తెలుగులో అందించిన  వారు  వారు ఉప్పల లక్ష్మణ  రావుగారు. అద్భుతమైన శైలిలో అనితర సాధ్యంగా ఆయన  మనకు అందించారు  ఇప్పుడు  చదువుకుని ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాము. 


గోర్కీ అమ్మమ్మ తాతయ్యలు ఎలా ఉండే వారో ఫోటో లు అందుబాటులో లేవు. గోర్కీ తన ఆత్మకథలో వారిని  వర్ణించిన తీరుతో చక్కటి బొమ్మలు వేసి అందించినవారు  ఎల్ గ్రిత్సిన్ మరియు ఎల్ కతయేచ్. బొమ్మలన్నీ కూడా ఆత్మకథ మొదటి బాఘంలోనే ఉన్నాయి. ఆ బొమ్మల్లో మరికొన్ని చూడండి.



నృత్యం చేస్తున్న గోర్కీ అమ్మమ్మ 



గోర్కీ చిన్నతనంలో నివసించిన అమ్మమ్మ ఇల్లు 


బ్రతుకు తెరువుకోసం ఊరు విడిచి వెళ్తున్న గోర్కీ 
 

7 కామెంట్‌లు:

  1. మంచి ప్రయత్నం ప్రసాద్ గారు.

    ఇది మీ సంతృప్తి కోసం వ్రాసుకున్నా అందరికీ ఉపయోగకరమనడం లో సందేహం లేదు.

    800 పేజీల ఈ బుక్ మీకు ఎంత సంతృప్తి నిస్తే దానిని స్కాన్ చేసి , రికార్డ్ చేద్దామనే పట్టుదల వస్తుంది. మీ ఆలోచన అభినందనీయం.

    ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని అది మా అందరికీ ఉపయోగపడాలనీ ఆశిస్తున్నాను. వీలైతే మీరు స్కాన్ చేసిన కాపీలు ఎప్పటికప్పుడు మెయిల్ చేయగలరా?

    మొత్తం ఈ పోస్టు చదివాక మీరు చెప్పిన నోస్టాలజియా అనే పదం గుర్తుకొచ్చింది.

    నాకు గోర్కీ గురించి కొంత తెలుసు. అమ్మ నవల నా దగ్గర ఉంది. ఇంటర్మీడియట్ లో దానిని కొంత చదివాను. ఆ బుక్ లో కుక్కలకొడకల్లారా అనే తిట్టు బాగా గుర్తుంది. మళ్ళీ ' అమ్మ ' చదువుతాను.

    గోర్కీ గురించి అతను వ్రాసుకున్న ఆత్మకథలో మీకు నచ్చిన ముఖ్యాంశాలు బాగున్నాయి. సమీక్ష కంటే మీరు ఎంచుకున్న సంతృప్తినిచ్చిన అంశాలను చెప్పడం కూడా బాగుంది.

    అభినందనలు సర్.

    రిప్లయితొలగించండి
  2. కొండలరావు గారూ. మీ వెన్నుదన్నుకు కృతజ్ఞతలు. గతస్మృతులవల్ల ఈ వ్యాసం
    వ్రాయటం కొంతవరకూ నిజమే. కాని నా ముఖ్య ఉద్దేశ్యం రష్యన్ సాహిత్యంలో
    పేరెన్నికగన్న గోర్కీ ఆంత్మ కథ గురించి ఇప్పటి తరానికి తెలియచెబుదామనే.
    కాని బ్లాగుల్లో తిరిగే ఇప్పటి తరంలో సాహిత్య అభిమానం ఉన్నవారికంటే,
    ఎక్కువ భాగం కామెంట్లు చేసుకుంటూ తిరిగే "అజ్ఞాతలే"
    ఎక్కువ లేదా వితండ వాదం చేస్తూ తమ తెలియనితనాన్ని వెళ్ళబేట్టుకునేవారే
    ఎక్కువ. ఏమి చేస్తాం. మేము కాలేజీలో చదువు మొదలు పెట్టిన రోజుల్లో
    (1973-74), గోర్కీ ఆత్మ కథ మూడు భాగాలు (మూడు భాగాలూ కలిపి 800+ పేజీలు)
    ఒక్కొటొక్కటిగా కొనుక్కుని మొదటి బాగం ఐదు రూపాయలు (అంటే పది రోజుల
    పాకెట్ మనీ, రెండో భాగం మూడు రూపాయల ఇరవై పైసలు, మూడవ భాగం బాగా చిన్నది,
    రెండు రూపాయలన్నట్టు గుర్తు.15-16 ఏళ్ళ వయస్సులో పుస్తకాల మీద ఉన్న
    ఆసక్తి మిగిలిన విషయాలను పక్కకు నెట్టేట్టుగా చేసింది.

    ఇప్పుడు ఈ మూడు భాగాలనూ మళ్ళి ప్రచురించే ప్రయత్నం జరగాలంటె, ముందు
    పాఠకులకు అటువంటి ఆత్మ కథ ఒకటి ఉన్నదని తెలియాలి, ఆసక్తి కలగాలి. అప్పుడు
    కాని మళ్ళి ప్రచురణ అనే మాట ఆలోచన కూడా రాదు ఎవ్వరికీ.

    నిజానికి పాశ్చాత్య దేశాలలో, ఆడియో బుక్ పధ్ధతిలో వాళ్ళ అపురూప గ్రంధాలను
    కొంతమంది చక్కగా చదవగలిగిన వాళ్ళు, ఆ ఆసక్తి ఉన్నవాళ్ళు ఒక బృందంగా
    ఏర్పడి, గ్రంధాలను చదివి ఒక చోట నిక్షేపిస్తున్నారు(See http://librivox.org/). మనం కూడా అలాంటి ఏర్పాటు చెయ్యగలమా అనిపిస్తున్నది. ఈ విషయంలో మరికొంత లోతుగా ఆలోచించి ఒక వ్యాసం వ్రాయాలి అని ఉన్నది. మీకు ఆసక్తి ఉంటే మీరు కూడా మీ బ్లాగు
    ద్వారా ఒక చెయ్యి వేయవచ్చు.

    రిప్లయితొలగించండి
  3. మీరు చెప్పినట్లు చేయడం మంచిదే. అయితే ఎలా అనేది కొంత వివరం కావాలి. మీకు మెయిల్ చేస్తాను సర్.

    రిప్లయితొలగించండి
  4. శివ గారు,

    క్రొవ్విడి లింగరాజు గారు అనువదించిన అమ్మ archive.org లో ఉన్నది:

    http://ia600306.us.archive.org/27/items/amma025797mbp/amma025797mbp.pdf

    రిప్లయితొలగించండి
  5. Javahar garu,

    Thanks for a good link which I find working and I downloaded the famous novel of Shri Maxim Gorky for reading in my IPAD.

    రిప్లయితొలగించండి
  6. శివరామప్రసాద్ గారూ! విషయం, వివరణ రెండూ బావున్నాయి. అమ్మమ్మ కొటేషన్లు దేవుడి గురించి అద్భుతం. అందించినందుకు ధన్యవాదాలు. ఇంతటి మంచి పుస్తకాన్ని పునర్ముద్రణకు ఎందుకు ప్రయత్నించకూడదు? కాపీరైటు ఉల్లంఘన వగైరా ఇబ్బందులు లేవకపోతే మీ తోడ్పాటు తో నేను సైతం ప్రయత్నం చేస్తాను. నా మెయిల్ gksraja@gmail.com
    మీ సమాధానాన్ని బట్టి నేను వనరులు సమకూర్చేదానికి సమాయత్తం అవుతాను. నమస్తే.

    రిప్లయితొలగించండి
  7. I am quite delighted to see your comment on my blog (which I have been neglecting for some time now).

    I am happy to see that you liked my article on Gorky's autobiography.

    For your information, I wish to inform you that all three parts of the Gorky Autobiography was already reprinted and being sold through Kinege.com and Logili.com I have already purchased.

    If you can contact Visalandhra Publishers or any major publishing companies in your area, you can purchase these books.

    Please click on the following link for the details of Gorky books including autobiography:

    http://www.logili.com/home-books/search?q=gorky

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.