23, ఆగస్టు 2012, గురువారం

నా చావు నే చస్తాను

ఇంటర్వ్యూ లో చివరిగా అడిగిన ప్రశ్న,  "మీ గురించి మీరు ఒక్క వ్యాక్యంలో చెప్పండి?" ఇంటర్వ్యూ ఇస్తున్న వ్యక్తి  క్షణం కూడా సంశయించకుండా , " నా చావు నేను చస్తాను" అని చెప్పేసి  నాగురించి ఈ విధంగా చెప్పటం ఇదే మొదటి సారి ఆదీ  ఒక్క వ్యాక్యం లో అని తన మాటలకి తానె ఆనందాన్ని చూపించారు.  

అదే వ్యక్తి తన ఆత్మ  కథకి పెట్టిన పేరు "నా ఇష్టం". అంతటితో ఊరు కోకుండా "అంకితం  నాకే" అని చమత్కరిస్తూ, తనకు తానె అంకితమిచ్చుకున్న  విచిత్ర  వ్యక్తి.  ఏ అత్మకథలోనన్నా ఉంటే ముందు మాట ఉండవచ్చు  కాని ఈయన ఆత్మ  కథలో  "వెనుక మాట" కూడా ఉంది. పైగా అందులో "నాకు నిలకడ ఉండదు నేను అన్న మాట మీద నిలబడను. మాటి మాటికీ మనసు మార్చు కుంటాను. చాలా స్వార్ధపరుణ్ణి , విపరీతమైన తలపోగరున్న వాడిని. ఇక్కడి వ్రాతలన్నీ నేను పైన చెప్పిన బ్యాక్ గ్రౌండ్ లోంచి వచ్చినవి. ఇంత చెప్పిన తరువాత కూడా మీరు ఇంకా ఈ పుస్తకం  చదివితే అదింక మీ ఇష్టం. నా ఇష్టం తో నేను మాట్లాడే దానికి అర్ధం మీ ఇష్టం తో మీరేం అర్ధం చేసుకుంటే అదే". అని చెప్పగల స్థైర్యం కలవాడు.

సామాన్యంగా పేరొందిన వారి  ఆత్మ  కథలు,  వారి వయసు మళ్ళిన తరువాత వ్రాసినవే చదువుతాము. కాని ఈయన విషయం లో ఆయన చిన్న వయస్సులోనే తన ఆత్మ  కథ వ్రాసుకుని, అందులో తన తల్లి చేత కూడా ఒక వ్యాసం   వ్రాయించి, ఆత్మాకథా ప్రచురణలో కూడా వైవిధ్యం చూపించటంలో తనకు తానె సాటి అనిపించు కోవటంలో విజయం సాధించారని చెప్పక తప్పదు.  ఒక ఆత్మ  కథలో ఆ ఆత్మ  కథ వ్రాసుకున్నాయన తల్లి గాని తండ్రి గాని ఆ వ్యక్తి  మీద వ్యాసం వ్రాయటం నాకు తెలిసి ఇదే ప్రధమం. నాకు ఆత్మ  కథలు అంటే మక్కువ ఎక్కువే. కాలేజీలో చదువుతున్న  రోజుల్లో, విలక్షణమైన టైటిల్ తో వచ్చిన ఆత్మకథ My Son's Father. ఈ ఆత్మ  కథ వ్రాసుకున్నాయన ప్రముఖ పాత్రికేయుడు, గోవా రాష్ట్రానికి చెంది,  అంతర్జాతీయ రచయితగా పేరొందిన  Dom Moraes. ఈయన కంటే వారి తండ్రి ఫ్రాంక్ మోరిస్ వ్రాసే వ్యాసాలూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఆయన పేరు పక్కనే ఉండి వార్తల మధ్య రావటం చూసిన జ్ఞాపకం, మా తండ్రిగారు చదివి చెబుతుంటే అర్ధం చేసుకున్నవి. డాం మోరిస్   తన  ఆత్మకథకు ఆయన పెట్టిన పేరు చూసి చిత్రంగా అనిపించి చదివిన పుస్తకం. ఇప్పుడు ఈ ఆత్మ  కథ కూడా  ఫలానా ఆయన  వ్రాశారు  కాబట్టి చదివాను  అనేకంటే, ఆయన తన ఆత్మ  కథకు పెట్టిన పేరు నా చేత ఆ పుస్తకాన్ని చదివింప చేసింది. చదివిన  తరువాత "నో రిగ్రెట్స్".


ఇంతకీ ఎవరీ మనిషి 
వినోదభరిత చిత్రాలు,  నటీ నటుల ఎవరు అన్న విషయం కంటే దర్శకుడు ఎవరు అన్న విషయం చూసి ప్రేక్షకుడు సినిమాకు వెళ్ళటం 1980 ల చివరి రోజుల్లోనే. అప్పటి వరకు ఎన్  టి ఆరా,  ఏ  ఎన్నారా, లేదా సూపర్ స్టారా , మెగా స్టారా అని చూసుకుని సినిమాలు చూస్తూన్న రోజుల్లో ఒక్క సారిగా తన సినిమాతో సంచలనం సృష్టించారు ఒక దర్శకుడు .  కథలో గొప్పతనం లేకపోయినా, ఎవరేజి నటీ నటులైనా కూడా, ఆ సినిమా తీసిన పద్ధతికి ఎంతో ప్రజాదరణ వచ్చింది, అదొక ట్రెండ్ సెట్టర్ అయి అలాంటివి,  జనం విసిగెత్తి చూడటం మానేసేవరకూ మన సినిమా వాళ్ళు తోమి వదిలిపెట్టారు. కాని "శివ" శివానే! సునిసితమైన హాస్యంతో తీసిన సినిమా క్షణ క్షణం, మంచి  పొందికతో  చక్కగా ఉన్న సరదా సినిమా. ఆ తరువాత "గాయం", "అంతం" వంటి సినిమాలు కూడా తీసి ప్రేక్షకుల చేత మెప్పు పొందారు అదే దర్శకుడు.  ఇక ఆ తరువాత ఏమయ్యింది? వరుస విజయాలు మస్తిష్కం లో వెళ్లకూడని చోటుకి వెళ్లి అక్కడ తిష్ట వేశాయా! ఏమో మరి. మంచి దర్శకుడు అనుకుంటున్న ఈయన  వరుస అపజయాల పాలయ్యాడు అనేకంటే, ప్రేక్షకులతో కనెక్ట్ అవటంలో విఫల ప్రయత్నాలే చేసాడు అని చెప్పాలి. కాని ఆయన దృష్టిలో ప్రేక్షకులే తనతో కనెక్ట్ కాలేకపోయ్యారని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇంత వ్రాసినాక,   పేరు వేరే చెప్పాలా!! ఆ మనిషి మరెవరో కాదు WRONG-GO-PAL-WAR-MAA. ఈ కొత్త రకపు స్పెల్లింగ్ నా స్వంత పైత్యం కాదు, ఆ ఆత్మకథ లోనే ఉన్నది.


రెండు  రోజుల అనుకోని విశ్రాంతి.  ఈ విశ్రాంతి లో ఒక పుస్తకం ఎప్పటి నుండో నన్ను చదవమని ఊరిస్తున్నది, ఇవ్వాళ్టికి చదవటానికి కుదిరింది. అదే రాంగోపాలవర్మ ఆత్మ  కథ "నా ఇష్టం" . ఎలాగూ ఈ పుస్తకం చదవబోతున్నాం కదా,  అసలు ఆయన ఎలా మాట్లాడుతారు చూద్దాం  అని ఓపెన్ హార్ట్ కార్యక్రమంలో   యు ట్యూబ్ లో దాదాపు గంట సేపు వచ్చే (ప్రకటనలు గోల లేకుండా)  ఉన్న ఇంటర్వ్యూ లాంటి శ్రీ వేమూరి రాధాకృష్ణ తో వర్మ  కొనసాగించిన సంభాషణ  కూడా చూశాను. ఇంటర్వ్యూ బాగున్నది. పుస్తకమూ బాగున్నది.

పుస్తకం లో నాకు నచ్చిన విషయాలు:
 • "వెనుక మాటలో"  తాను  ఆత్మకథ ఎందుకు వ్రాసుకున్నానో తెలియచేసిన విధానం-"నా కుటుంబంలో నా వారసుల కన్నా నా ఆలోచనలే అక్కడెక్కడో ఎక్కడెక్కడో మిగులుండాలన్న ఓ కోరిక ఉండబట్టి ఈ పుస్తకం వ్రాశాను".
 • ఆసక్తి కలిగే విధంగా ఒక్కొక్క  అధ్యాయానికి పెట్టిన పేర్లు- బాక్ సీట్  డైరెక్టర్, డస్ట్ బిన్ లో అదృష్టం, రంగీలా వెనుక రమేష్, మర్యాదలేని మర్యాద-ఇలా 41 అధ్యాయాలుగా 119 పేజీలు  తనగురించి తానె  మనకు చెప్పటానికి ప్రయతినించారు వర్మ.
 • తన ఆత్మ  కథలో ఇతరులు తన గురించి చెప్పిన మాటలు వారిచేతనే వ్యాసాలుగా  13 మందిచేత, మొట్టమొదటి వ్యాసం  తన తల్లి శ్రీమతి సూర్యావతి చేత వ్రాయించి వారి దృక్పథం నుంచి కూడా తన గురించి చెప్పించారు. ఇది కూడా ఆత్మకథల్లో ఒక కొత్త పంథానే.
 • మధురం అనే మాట మనం వింటాము, ఈ ఆత్మ  కథలో అమధురం అనే మాట మధురం కు వ్యతిరేక మాటగా మొదటిసారి చూశాను.  
 • ఆత్మ కథ అనంగానే బాగా అలవాటైన ఒక పద్ధతి ఉన్నది. బాల్యం, యవ్వనం అంటూ  ఒక వరుసలో వ్రాసేయటం. వర్మ తన జీవితాన్ని మలుపు తిప్పిన శివ సినిమా దగ్గర మొదలుపెట్టి కాలగమనంలో వెనక్కీ ముందుకీ  వెడుతూ తన కథ వ్రాయటం బాగున్నది. 
 • బ్రూస్లీ మీద తనకున్న అభిమానాన్ని నిష్కర్షగా చెప్పిన పద్ధతి-"ఒక విధంగా బ్రూస్లీ 32 ఏళ్ళ వాడిగా 1973లో చనిపోవటం నాకు చాలా ఆనందమే. ఎందుకు అంటే  ఇప్పుడు 2010 లో 70 ఏళ్ళ  ముసలి బ్రూస్లీని చూసే గత్యంతరం నుంచి తప్పించుకున్నందుకు".
 • శివ సినిమా మొట్టమొదటి షాటులోనే తన అనుభవరాహిత్యం గురించి మొహమాటం, భేషజం లేకుండా చెప్పటం.
 • విజయవాడ విజయలక్ష్మీ సినిమా హాలు దగ్గర  తను గాలికి  తిరుగాడుతున్నప్పుడు తనను తిట్టి వేళ్ళగోట్టిన మానేజరు గురించి నాటకీయ పద్ధతిలో  విపులీకరించటం.
 • తాను  పోలీసులతో పడ్డ బాధలు, లాకప్ లో ఉన్నప్పటి అనుభవం హాయిగా చెప్పెయ్యటం.
ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి ఏతావాతా చెప్పేది ఏమంటే, రాంగోపాల్ వర్మ నిర్మొహమాటంగా, తన గురించి తాను నిజాయితీగా వ్రాసుకున్న తన ఆత్మ  కథ,  ఆయన మొదటి బాచ్ సినిమాలంత బాగున్నది. చదివి ఆయన గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలను అర్ధ చేసుకోవచ్చు, లేదా అవి అపోహలన్న విషయం తెలుసుకోనూవచ్చు.

రాం గోపాల్ వర్మతో ఓపెన్ హార్ట్ కార్యక్రమం యు ట్యూబ్ లో అందుబాటులో ఉన్నది: 

రాం గోపాల్  వర్మకు స్వంత బ్లాగ్ ఉన్న  సంగతి పైనున్న ఇంటర్వ్యూ చూస్తున్నపుడు తెలిసింది ఆ బ్లాగ్ ను ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు.

రామ్ గోపాల్ వర్మ బ్లాగ్   

తన బ్లాగ్ లో అనేక విషయాలు వ్రాసుకున్నారు రాం గోపాల్ వర్మ. ఈ ఆత్మ  కథలో ఉదాహరించిన కొన్ని సంఘటనలను బ్లాగులో ఆంగ్లంలో మునుపే వ్రాసినట్టుగా కనపడుతున్నది. పైన లింక్ ఇచ్చిన ఆయన బ్లాగు లోనే తన కొత్త బ్లాగ్ కు ఒక లింక్ ఇచ్చారు కాని ఆ లింక్ నొక్కితే ఎక్కడికో పోతున్నది నాకైతే ఆ కొత్త బ్లాగ్ కనపడలేదు.

 

2 వ్యాఖ్యలు:

 1. బాగుంది. భిన్న వ్యక్తి ఆత్మకథ పై విభిన్నమైన పోస్టు ఇది. నేను కూడా ఈ పుస్తకం చదవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఏ.బీ.ఎన్ లో ఇంటర్వ్యూ చూసినప్పుడే వరం బుక్ చదవాలనుకున్నాను. తొణకకుండా వర్మ సమాధానాలు చెప్పే స్టైల్ బాగుంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.