9, సెప్టెంబర్ 2012, ఆదివారం

గురజాడ రచనా సాగరం ఆవిష్కరణ - ఆహ్వానంఏ  బాషా సాహిత్యంలోనైనా ఒక రచయిత మొదటి రచనలతోనే ప్రసిద్ధుడైపోడు. కాలక్రమాన ఆయన రచనలు పరిణతి చెంది బహుళ ప్రజాదరణ పొంది, సాహిత్య అభిమానుల మనసు పట్టేస్తాయి. కాని ఈ క్రమంలో ఆయా రచయితల రచనలు ఎక్కడెక్కడి ప్రచురితం అవుతూ ఉంటాయో కొన్ని రోజులు పోయినాక ఆ రచయితకే గుర్తు ఉండకపోవచ్చు. ఒక గొప్ప రచయిత  రచనలు అన్ని ఒకచోట దొరికి సావకాశంగా చదవగలిగే  అవకాశం  ఎలా వస్తుంది? సాహిత్య అభిమానుల్లో ఎవరన్నా పూనుకుంటేనే ఈ బృహత్కార్యం సుసాధ్యం అయ్యే అవకాశం  ఉన్నది.

ఆంగ్ల సాహిత్యంలో,  ఈ విషయంలో వాళ్ళు సహజంగానే చాలా ముందు ఉన్నారు. వాళ్ళ సాహిత్యంలో అద్భుత రచయితల సాహిత్యం అంతా కూడా ఒక్కచోటే దొరికే పద్ధతిన "OMNIBUS" ప్రచురణలు మొదలుపెట్టారు. అసలు ఈ "ఆమ్నిబస్" అంటే ఏమిటి, దీనికి తెలుగేమిటి అని స్యయంప్రకటిత తెలుగీకరణ గుంపులు ఏదో ఒక అనువాద పదాన్ని మనమీదకు గిరవాట్టేసేలోపుగానే, మన అదృష్టం బాగుండి, ప్రముఖ రచయిత  ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒక చక్కటి పద సృష్టి చేసారు. ఒక రచయిత సమగ్ర రచనలను ఆయన "రచనా సాగరం" అని పేరు పెట్టి తెలుగు పదాలను ఆస్వాదించగలిగిన స్థితిలో ఉన్న వారందరికీ ఆనందం కలిగించారు.

మన తెలుగు ప్రచురణా చరిత్రలో కూడా ఈ రచనా సాగరాలు ఇప్పుడిప్పుడే మొదలయాయని చెప్పవచ్చు. విశాలాంధ్ర వారు అరుణా పబ్లికేషన్స్ వారు కొడవటిగంటి, చలం వంటి సాహిత్య ఉద్దండుల రచనలను అనేక భాగాలుగా ప్రచురించారు. విశ్వనాధ సత్యనారాయణ గారి సాహిత్యాన్ని "సంపూర్ణ నవలా నిధి" గా వారి కుమారుడు ప్రచురించి సాహిత్య అభిమానులను అలరించారు. కాని ఇవన్నీ కూడా విడి విడి పుస్తకాలుగానే ప్రచురితం అయినాయి. అవన్నీ కూడా ఒక్కటే సంపుటిగా తేవటం, పెరిగిపోయ్యే పేజీల దృష్ట్యా (చలం గారి రచనలు ఒక్క సంపుటిలో ఇమిడే అవకాశం ఉన్నది) కూడా అసాధ్యమేమో కూడా.

ఇలా భాగాలు భాగాలుగా  కాకుండా ఒక రచయిత వ్రాసిన అనేక రకాల రచనలను-కథలు నవలలు వ్యాసాలూ వగైరా-అన్నీ కూడా ఒక్కే ఒక్క సంపుటిలో ప్రచురించటం  అనేది నాకు తెలిసి "మనసు ఫౌండేషన్" వారు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి రచనలతో మొదలుపెట్టారు. వీరే శ్రీ శ్రీ రచనలను రెండు భాగాలుగా ఒక్కేపాక్ లో అందించారు. 

మనసు  ఫౌండేషన్ వారి అద్భుత కార్యక్రమ ప్రణాళికలో ఇప్పుడు గురజాడ వారి సాహిత్య సర్వస్వం ఒకే సంపుటిలో తీసుకు వస్తున్నారు. ఈ రచనా సాగరానికి వారు పెట్టిన పేరు-"గురు జాడలు"-చాలా సముచితంగా ఉన్నది. ఈ అద్భుత సాహిత్య కార్యక్రమం జరిగే రోజు,  రాబొయ్యే వినాయక చవితి తరువాత రెండవ రోజు,  సెప్టెంబరు 21 2012, విజయనగరం లో. పూర్తి వివరాలు పైన ఉన్న ఆహ్వానంలో చూసుకోవచ్చు. 

వీలున్న అదృష్టవంతులకు  పై కార్యక్రమానికి  హాజరై,  ఈ సాహిత్య కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యటంలో తమ వంతు పాత్ర  నిర్వహించే అవకాశం మళ్ళి మళ్ళి రాదనీ మాత్రం చెప్పగలను.

ఈ సాహిత్య కార్యక్రమాన్ని అనేక కష్ట నష్టాలకు ఓర్చి ఒక గురుతర బాధ్యతగా నిర్వహిస్తున్న "మనసు ఫౌండేషన్" వారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా బెంగుళూరులోని ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ ఎం వి రాయుడు గారు ఈ కార్యక్రమపు వెన్నుముక. ఆయన "పబ్లిసిటీ" అంటే చాలా వైముఖ్యం చూపిస్తారు, ప్రచారానికి దూరంగా ఉంటారు.  అందుకనే ఆయన ఫోటో ఉన్నా కూడా ప్రచురించలేక  పోతున్నాను.

వారి భవిష్యత్ కార్యక్రమాలు కూడా విజయవంతం కావాలని కోరుకుంటూ నాకున్న ఒకటి రెండు కోరికలు వారికి విన్నవించే ప్రయత్నం చేస్తున్నాను:

  1. చందమామలో దాసరి సుబ్రహ్మణ్యం గారి ధారావాహికలన్నీ కూడా రంగు బొమ్మలతో సహా, ఆయన ఇతర రచనలు అనేక పేర్లతో తో చేసిన రచనలతో కలిపి   ఒకే సంపుటిలో తీసుకు రావటం. వారు పూనుకుంటే నేను ప్రస్తుతం ముంబాయిలోనే ఉన్నాను కాబట్టి చందమామ ప్రస్తుతపు యాజమాన్యంతో చర్చించటానికి నా వంతు సహాయం చెయ్యగలను. 
  2. ముళ్ళపూడి వారి పూర్తి  సాహిత్య సాగరం ప్రచురణ.
  3. పురాణం వారి "ఇల్లాలి ముచ్చట్లు" మొత్తం కలిపి ఒక్కటే రచనా సాగరంగా ప్రచురణ.
  4. తెలుగులో ప్రముఖ కార్టూనిస్టుల కార్టూన్లు అన్నీ (బాపు, జయదేవ్, బాబు, K, సత్యమూర్తి, తులసీరాం, శంకు మొదలైన వారు) వారి వారి జీవిత విశేషాలతో ఒకే సంపుటిగా ప్రచురణ.
నా కోరిక తీరుతుందో లేదో తరువాత సంగతి. తెలుగులో 'రచనా సాగరం" ప్రచురణలు కొనసాగాలని తెలుగు  పాఠకులు  ఈ ప్రచురణలన్నీ  కూడా "కొని" చదివి ప్రోత్సహిస్తారని ఆశిద్దాం. మరొక ఆశ  కూడా ఉన్నది. ఇలా కొన్న వారు, ఈ రచనా సాగరాలను డ్రాయింగ్ రూముల్లో పుస్తకాల బీరువాల్లో అందరికీ కనిపించే ఆలంకరణ గా కాకుండా ఈ పుస్తకాలను చదివి, ఆయా రచయితల రచనా వైవిధ్యాన్ని, రచనా పటిమను తెలుసుకుని  ఆస్వాదిస్తారని ఆశిద్దాం.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.