19, సెప్టెంబర్ 2012, బుధవారం

తిలక్ పశ్చాత్తాపం


 పై ఫోటో వరధాస్త్ అనే వెబ్సైటు నుండి తీసుకోవటం జరిగింది
*
***
*
2012లో వ్రాసిన వ్యాసం

స్వర్గంలో  కలకలం!  నారదుల వారికి తెలిసిపోయింది అసలు విషయం. ఇంతకాలంగా లోలోన కుసిళ్ళుతున్న తిలక్ అంతరంగం త్రికాలజ్ఞుడు నారదునికి తెలియకపోవటమా! ఎంత మాట. బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ ఉంటే అక్కడే కదా మన నారదుడు.  స్వర్గంలో 144వ సెక్షన్ విధించరుగాని, సామాన్యంగా గుమికూడటం, గుంపులు గుంపులుగా తిరగటం అంతగా ఉండదు. ఎవరి స్వర్గంలో వాళ్ళుంటారుష . కాని నారదుడు స్వర్గంలోకి దిగేప్పటికి అక్కడ పెద్ద గుంపు, వారి మధ్య కల్ప వృక్షం కింద కూచుని ఎంతగానో మధన పడుతున్న తిలక్. తనలో తానూ గొణుక్కుంటున్నాడు కాని పైకి వినపడుతున్నాయి మాటలు. మిగిలిన అందరూ తల తాటిస్తున్నారు.

"ఎంతటి పనిచేసాను! అయ్యో ఆ బ్రిటిష్ వాళ్ళ కళ్ళు కప్పి జన సమీకరణకు వాడుకున్నానేగాని వినాయక చవితి పేర  ఇంతటి వెర్రి ప్రబలుతుందని  ఆనాడే తెలిసి ఉంటే, ఇలాంటి అ(నా)చారాన్ని మొదలు పెట్టేవాణ్ణి   కాదుకదా. ఒక మంచి పనికి వాడుకుంటే అది ఈ నాడు వేలంవెర్రి అయిపోయి, ఆ వినాయకుని పేర  ఎంతటి అకృత్యాలు జరుగుతున్నాయి.  సకల చెత్తతో ఆ వినాయకుని విగ్రహాలు చెయ్యటమే కాకుండా అవి పట్టుకుపోయి అసలే మురికి అయిపోయిన జలాశయాలను మరింత మురికి,  విషతుల్యం చేస్తున్నారు కదా! నేను మొదలెట్టించిన అపసవ్య పూజా విధానం ఆపేవాళ్ళేలేరా. ఒక విషయం మొదలు పెట్టిన తరువాత ఆ కార్యక్రమపు అంతరార్ధం తెలియకుండా ఇలా గుడ్డిగా దశాబ్దాలు పాటు సాగిపోవటమేనా? భారత దేశం ఇంతగా ముందుకు వెళ్లిందని ఈ మధ్య వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, ఈ చిన్న విషయం  తెలిసిన వాళ్ళు లేకపోతె అదేమి   ముందుకు వెళ్ళటం"

ఇలా పరిపరి విధాల తిలక్  బాధపడుతూ, మరచిన విషయం గుర్తుకు వచ్చినట్టుగా, గొణుగుడులో  మరో విషయం తీసుకొచ్చాడు. "స్వతంత్రం నా జన్మ హక్కు అని ఆనాడు అన్నాను. కాని ఆ స్వతంత్రం ఈనాడు ఏమయి పోయింది మన భారత్ లో. ఎవరి జన్మ హక్కు అయ్యింది? బలవంతుడి జన్మ హక్కు అయ్యింది. మొన్న అతగాడెవరో ఒక కార్టూన్ వేస్తె అతన్ని జైల్లో పెట్టారుట. నిజమే ప్రజాస్వామ్యానికి  ప్రతీక అయిన పార్లమెంట్ ను ఆతను అలా గీసి ఉండకూడదు కాని మరీ టెర్రరిస్ట్ ను నిర్భంధించినట్టుగా నిర్భంధించటమా. ఏమవుతున్నది నా భారత్ లో" అంటూ ఆక్రోశిస్తున్నాడు.

నారదుడు అక్కడికి రావటంతో అందరూ ఆయన వంకే చూసారు, తిలక్ ను ఒదార్చగల వారు మీరే  అన్నట్టుగా.

నారదుడు తిలక్ పక్కనే కూచుని, "నాయనా బాల గంగాధరూ! అనవసరంగా అంతగా బాధ పడకు. క్రితం సంవత్సరమే గణేశుని మొర ఆలకించి ఆ పరమశివుడు శాపం పెట్టాడు చూడు నాయనా ఈ కింది లింకు నొక్కి అక్కడి విషయం చదువు:


కాబట్టి నాయనా తిలక్కూ!  నీవేమీ  బాధ పడకు ఇప్పుడిప్పుడే ఈ వెర్రి బజారు పూజలూ, వేలంవెర్రి విగ్రహాలూ వాటి నిమజ్జనాలు  వంటి దురాచారాల గురించి కొద్ది కొద్దిగా జనం తెలుసుకుంటున్నారు. మరి కొంతకాలం ఓపిక పడితే ఈ దురాచారం తగ్గే అవకాశం  ఉన్నది.  ఇక నువ్వు చెప్పే స్వతంత్రం  జన్మ హక్కు గురించి మీ పార్టీ వాళ్ళేగా పరిపాలనలో ఉన్నది. వాళ్లకు కనీసం సలహా అన్నా ఇవ్వలేవా", అన్నారు నారదుల వారు. 

తిలక్ నిస్పృహగా "ఏమి చెప్పను నారదా మునీంద్రా! కనీసం కలలో కనపడి అయినా వాళ్లకు కొన్ని మంచి మాటలు చెబుదామని నేనూ లజపతి రాయ్  గారు తరచూ ప్రయత్నిస్తూనే ఉన్నాము. కాని నాలాంటి వారిని ఈనాటి రాజకీయ నాయకులు కలలోనైనా తలవటం లేదే! ఇంకెలా చెప్పేది వాళ్లకు. పైగా మా పార్టీ వాళ్ళేనుట!  సిగ్గు చేటు!! తల కొట్టేసినట్టు ఉంటున్నది.    పోనీ ఇక్కడకు వచ్చిన వాళ్లకు చెబుదామా అంటే, వాళ్ళు కాని వాళ్ళ సంతతి కాని ఏకాయెకిన ఆ రాజుగారి పేటకే  లైను కడుతున్నారు.  ఏమి చెప్పేది ఎవరికీ చెప్పేది....స్వర్గంలో కూడా నాకు శాంతి సుఖం ఉండటం లేదు" అంటూ మళ్ళీ తన పాత ధోరణిలో పడిపోయాడు. 

సరే! నీకీ బెంగ తీరేది కాదు కాని, పశ్చాత్తాపమే నీకు తగిన మందు. పోనీ ఒక పని చెయ్యి, నేను ఇంద్రుడికి చెప్తాను, ఆ రాజుగారి పేటకు పోయి కొంతకాలం ఉండి  వాళ్లకు కొన్ని మంచి మాటలు చెప్పిరా. వాళ్లకు ఎలానూ పునర్జన్మ ఉంటుంది కదా,    నీ మాటలు గుర్తుండి   రాబొయ్యే జన్మలోనన్నా ఏమన్నా మంచి పనులు చేస్తారేమో చూద్దాం.

 అయినా ఇక్కడ నీతో మాటలు పెట్టుకుంటే ఎలా!  ఈ సంవత్సరం ఎక్కడ పెద్ద విగ్రహం పెట్టారో చూసి రావాలి అంటూ చటుక్కున మాయమయ్యాడు నారదుడు. నివ్వెరపోయి చూస్తున్నాడు తిలక్.

=======================================================================
ఇంట్లో చక్కటి మట్టి విగ్రహాలు పెట్టుకుని, పత్రిలో కావలిసిన ఆకులలో ఎక్కువ భాగం ఇంట్లో పెంచుకున్న చెట్ల నుండి తెచ్చుకుని  వినాయక చవితి చేస్తున్న వారికి జిందాబాద్ 

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు  
=======================================================================

 మునుపు వినాయక చవితి సందర్భంగా వ్రాసిన వ్యాసాలు 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.