2, అక్టోబర్ 2012, మంగళవారం

గాంధి గురించి చలం


ప్రముఖ రచయిత శ్రీ గుడిపాటి వెంకట చలం గారు వ్రాసిన నవలలు/కథలు ఒక ఎత్తైతే ఆయన వ్రాసిన "మ్యూజింగ్స్" ఒక ఎత్తు.  గాంధీ గారి గురించి ఆ మ్యూజింగ్స్ లో చలం గారు  అనేక సార్లు రకరకాలుగా తన అభిప్రాయాలు వెలిబుచ్చారు అందులో నాకు నచ్చిన అభిప్రాయం, ఈ కింద ఇవ్వబడింది.
గాంధీ గారు చచ్చిపోక పూర్వమే, చాలాసార్లు అనుకునే వాణ్ణి; ఆయన స్వయంగా రాసుకున్న కొద్ది సంగతులు తప్ప ఆయన్ని ఊరికే పొగడడమేగాని, ఆయన్ని గురించి, జీవితంలో చిన్న చిన్న సంఘటనల్ని గురించి ఎవరూ ఏమీ రాయరేమని. స్థలంలో,  కాలంలో కోట్ల కొలది మనుషులతో సన్నిహిత సంబంధం ఉన్న ఒక మహావ్యక్తిని గురించి ఇంతేనా-మిత్రులూ, భక్తులూ మనుషులూ, రిపోర్టర్లూ, గంధకర్తలూ చెప్పగలిగింది? అని. అంతకన్నా ఒక సినిమా స్టార్ విషయాలు ఎక్కువ తెలుస్తాయి.  చచ్చిపోయింతరువాత ఇంకా జాగ్రత్తగా వెతుకుతున్నాను, నాకు పత్రికలు చిక్కినంతవరకు; ఆయన ఆశయాలూ, అభిప్రాయాలూ తప్ప-అసలు ఆయన్ని గట్టిగా బొమ్మ కట్టి నుంచోపెట్టగలిగిన సంగతులు బైటికి రాలేదు. ఆయనది గొప్ప 'సెన్సు ఆఫ్ హ్యూమర్  అంటారు ప్రతివారూ-ప్రతి నిమిషం నవ్వు ఊరికే పొంగిపొరలి వచ్చేదంటారు. కాని మనకి ఆ సంతోషం, నవ్వూ దగ్గిరిగా కలిగేట్టు చూపలేరు.

ఏ సందర్భంలో, ఏమి చూసి, విని ఆయన నవ్వేవారు? ఏ మాటలు చెప్పి ఆయన నవ్వించగలిగారు? వాటి సంగతి మనకి తెలీదు.  చివరికి డి కే రాయ్ వంటి వారైనా; ఒక గొప్ప వాతావరణంలో మనని ముంచి గాంధీగారి ఔన్నత్యాన్నీ ఫీల్ అయ్యేట్టు చెయ్యగలిగారు గాని, అంతకన్నా ఏమీ స్పష్టంగా చెప్పలేకపోయినారు.  గాంధీగారు మమ్మల్ని ఇట్లా నవ్వించారు అని రాస్తే మనకి నవ్వురాదు.  ఆయన్ని చూస్తే అంత భమేమంటే మనకి భయం కలగదు; ఆయన మీద దేనికి మాకు ప్రేమ కలిగందంటే మనకి ప్రేమ కలగదు. అంటే ముందు తరంవారు గాంధీని గురించి చదివితే, , ఆయన సాధించిన దానివల్ల పైగా ఆయన్ని గురించి చెప్పే సంగతులు, ఇంకో మనిషి విషయమై చెపితే, చాదస్తమూ, కపట నమ్రతలో కప్పుకున్న డాంబికమూ, మూర్ఖమూ, సిల్లీ, హస్యాస్పదమనిపిస్తాయి.  తెలుగు వాళ్ళకి మూడు గొప్ప విశేషాలు దొరికాయి,. గాంధీగారిని గొప్పవారనేందుకు. అంగోస్త్రమూ, బోసితనమూ, పిలకా.

ప్రకాశ రాయుడు ఆయన హృదయాన్ని వజ్రాలపొడిలో పొదిగిన గులాబి రేక అన్నాట్ట. నాకేం తోస్తొంది అంటే,ఆయన గొప్పతనం ఆయన సాధించి తెచ్చుకున్నది. కాని ఆయన చేసే సాధనాక్రమం, మనకి కనపడేది, చాలా సామాన్యం.  ఆయన తనలోపల సాధించిన విషయం రంగులేని ఆత్మ వికాసం - అత్తరు నించి పరిమళం వస్తేం, ఆ! ఎంత విలవైన అత్తరు అని ఆశ్చర్యపోతాంగాని, పువ్వునించి వొస్తే,దాంట్లో  ఏమీ ఆశ్చర్యం లేదు.  కనుకనే కారణం లేని ఆకర్షణ, ప్రతి వ్యక్తిలో ఉండే గోడల్ని తనలో చాలావరకు పగలకొట్టుకుని ఇతరులు తమకి తాము నిర్మించుకున్న గోడల్ని బేధించి, వారితో  ఐక్యాన్ని సాధించారు, ఆయన. అందుకనే ఆయన కళ్ళెర్రచేస్తే, దేశం కూడా కోపం లోకి ఉరికింది; నవ్వితే నవ్వింది; భయంలేదంటే ధైర్యపడ్డది. ఆయన నవ్విస్తే నవ్వాం గాని ఎందుకు నవ్వామో ఇవాళ చెప్పలేము. ప్రోత్సహిస్తే ఉరికాము, కాని ఏం చెప్పి ప్రోత్సహించాడో మనకి తెలియదు. 


 చలం గారి మ్యూజింగ్స్ అధ్యాయం 48, [పుటలు 263,264, ఐదవ ప్రచురణ 2005] నుంచి గ్రహింపబడినది 


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.