30, అక్టోబర్ 2012, మంగళవారం

చా| సో| తో రేడియో ఇంటర్వ్యూ

శ్రీ చాగంటి సోమయాజులు గారు 


 పై బొమ్మ  ఈ మాట వెబ్ సైట్ సౌజన్యం 


చాసోగా ప్రసిద్దికెక్కిన రచయిత శ్రీ చాగంటి సోమయాజులు గారు. ఆయన పంధాలో ఆయన కథలు వ్రాసుకుంటూ పాఠకులకు సమాజం మీద తన దృష్టి చెప్పుకొచ్చారు. సామాన్యంగా అభ్యుదయ సాహిత్యం అనే పేరుతొ వచ్చే కథలు కాని కవితలు కాని వామపక్షం చుట్టూనే తిరుగుతూ ఉండి అవన్నీ  దాదాపుగా ఒకే ఒక థీం తో ఉంటాయి. ఒకటి చదివితే రెండోది చదివే అవసరం పెద్దగా ఉండదు అనేట్టుగానే ఉంటాయి, ఒకే మూస కథలు.  కానీ చాసో గారు తన ప్రతి కథలోనూ ఒక  ప్రత్యేకతను, తన సునిసిత పరిశీలనను వ్యక్తపరుస్తూ,  పాఠకులకు తమకు తాముగా ఆలోచించుకునే వెసులు బాటు ఇచ్చారు కాని, ఇదే ఒక కొత్త పంధా ఇదే అందరూ అనుసరించాలి అని పేడాంటిక్ గా సాహిత్య నియంతృత్వపు చాయలను, పడికట్టు మాటలతో ఎదో ఒక ఇజాన్ని చదువరులకు  తన రచనలో కనపడనీయలేదు, తద్వారా తాను  నమ్మిన పంథా మీద  పాఠకులకు ఏవగింపు కలగనివ్వలేదనే  చెప్పాలి. వామపక్ష వాదాన్ని తెలియచేసేవే అభ్యుదయ సాహిత్యమా అంటే, అలా అనుకోవటానికి వీల్లేదని కూడా ఆయన నిర్ద్వంద్వంగా చెప్పటం నాకు నచ్చింది.

చాసో గారితో రేడియో ఇంటర్వ్యూ ఒకటి తెనాలికి చెందిన ఒక అజ్ఞాత శ్రోత రికార్డ్ చేసిన కాసేట్ ఒకటి,  శ్రీ శ్యాంనారాయణ నాకు అందచేశారు.  ఆ ఇంటర్వ్యూ పదిహేను నిమిషాలది అయి ఉంటుంది, కాని మొదటి నుంచి రికార్డ్ అయినట్టు లేదు. కాసేట్ కు దాదాపుగా చివరగా రికార్డింగ్ మొదలయ్యి రెండో వైపుకు కూడా మళ్ళింది. ఇందు మూలాన ఈ ఇంటర్వ్యూ హటాత్తుగా మొదలవుతుంది, పది నిమిషాల తరువాత చాసో గారు చెబుతున్న విషయం చటుక్కున  మారిపొతుంది.   ఈ రికార్డింగ్ వినేప్పుడు, వినబోయ్యే శ్రోతలు గమనించగలరు.

ఇక ఇప్పుడు చాసో గారి గొంతు, ఆయన చెప్పిన విశేషాలు ఈ కింది యు ట్యూబ్ వీడియోలో వినండి.సోమయాజులు గారితో, ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు చేశారు, ఆకాశవాణి   కేంద్రం  నుండి ప్రసారం జరిగింది, ఇంటర్వ్యూ చేసినాయన ఎవరు వంటి  వివరాలు తెలియవు. ఇలా తెలియనివి ఈ బ్లాగులో ఎవరన్నా చెప్పండని  అనేకసార్లు అడిగాను, కాని స్పందన శూన్యం. చివరకు ఆకాశవాణి  పూర్వపు  ఉద్యోగులు, కళాకారులు  కొంతమంది మన బ్లాగుల్లో కూడా ఉన్నారు కాని, ఈ బ్లాగ్ వారి కంట పడే అదృష్టానికి నోచుకున్నట్టుగా లేదు. లేదా అలా చెప్పక పోవటానికి, ఎవరి  కారణాలు వారికి ఉండే ఉంటాయి లెండి. 

కాని సోమయాజులు గారి  మాటలు వింటూ ఉంటే, వారి  డెబ్భయ్యో జన్మ దినం దగ్గిరలో ఈ ఇంటర్వ్యూ చేసి ఉండవచ్చు అని తోస్తుంది. సోమయాజులు గారు 1915 లో జన్మించారు. కాబట్టి ఈ ఇంటర్వ్యూ దాదాపుగా 1985, 1986 లలోది అయ్యి ఉంటుంది.  సోమయాజులు గారు శ్రీకాకుళం-విజయనగరం ప్రాంతానికి  చెందినవారు కాబట్టి,ఆ దగ్గరలో ఉన్న విశాఖపట్టణం కేంద్రం వారు ఈ కార్యక్రమాన్ని తయారు చేసి ప్రసారం చేసి ఉండవచ్చు.  కాని నాకు గుర్తు ఉన్నంతవరకూ ఆకాశవాణి  విజయవాడ వారివే కార్యక్రమాలు ఎక్కువ, విశాఖ పట్టణం, కడప కేద్రాలు అప్పట్లో దాదాపుగా రిలే కేంద్రాలు గానే  ఉండేవి. 1980 ల ద్వితీయార్ధం లో పరిస్థితి ఏమైనా మారిందేమో మరి.

ఏది ఏమైయినా, ఈ విశేషాలు ఎవరన్నా తెలిసి ఉన్న వారు,  విషయాలు అందరితో పంచుకుందా మన్న అభిలాష ఉండి  చెప్తే కాని తెలియదు. కాని అటువంటి అభిలాష ఉన్న వాళ్ళు ఈ బ్లాగ్ చూడవద్దూ!! లేదా చూసినవాళ్ళల్లో విషయజ్ఞానం ఉండటమే కాకుండా, ఆ విషయం పంచుకోవాలన్న  అభిలాష కూడా ఉండాలి మరి. ఈ రెండూ కాకపొతే ఇలాంటి రేడియో కార్యక్రమ వివరాలు అరకొరగానే తెలుస్తాయి, కొన్నాళ్ళకు ఎవరికీ తెలియకుండానే కాలగర్భంలో కలిసిపోతాయి.
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.