20, నవంబర్ 2012, మంగళవారం

రజనీకాంతరావుగారి జ్ఞాపకాలు-వ్యాపకాలు


 తెలుగులో ఆకాశవాణి వారి రేడియో ప్రసారాలతో ఏ కొద్దిపాటి పరిచయం (1960లు 70లల్లో) ఉన్నవారికైనా, బాలాంత్రపు రజనీకాంతరావు గారి గురించి పరిచయం చెయ్యాల్సిన పని లేదు. లక్షలమందికి అభిమాన కార్యక్రమం ఐన "భక్తి రంజని" కార్యక్రమానికి ఆద్యులు శ్రీ రజనీకాంతరావుగారు. ఆయన 1970వ దశకంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి సంచాలకునిగా ఉన్న రోజులు, ఆ కేద్రానికి బంగారు రోజుల్లో తలమానికమైనవి. కళాకారుడు సంచాలకుడు ఐతే అంతటి అద్భుతాలు సృష్టించవచ్చో రజనీకాంతరావుగారు చేసి చూపించారు. ఆకాశవాణి వారు తమ కేద్రాలకు సంచాలకులను నియమించేప్పుడు తప్పకుండా ఆలోచించ  విషయం ఇది

చాలాకాలం క్రితం బ్లాగు గంధర్వ శ్రీ శ్యాం నారాయణ నాకు కొన్ని ఆడియో ఫైళ్ళు ఇచ్చి చూడమన్నారు. వాటిల్లో ఒక గంట నిడివిగల ఒక ఆడియో ఉన్నది. అది "వ్యాపకాలు-జ్ఞాపకాలు" అన్న శీర్షికతో ఉన్నది. ఆసక్తితో విని చూస్తే ఒక బంగారు గని. ఆ ఆడియో శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావుగారితో ఆకాశవాణి వారు జరిపిన ఒక ఇంటర్వ్యూ. కాని ఆ ఇంటర్వ్యూ లో విషయాలు ఒక కాల క్రమాన్ని అనుసరించి  రావట్లేదు. పైగా ఆ ఇంటర్వ్యూ చేసినావిడ (పేరు తెలియదు) గొంతు, అడిగే పధ్ధతి, నాకు ఎంత మాత్రం నచ్చలేదు. ఆ కారణాన,  వీలుచూసుకుని ఫైలు మొత్తం ఎడిట్ చేసి ఒక పధ్ధతి ప్రకారం ఉంచుదాము అనుకుంటూ ఉండి  నెలలబట్టి పెండింగ్ ఉంచిన ప్రాజెక్ట్ ఇది. చివరకు ఈ మధ్య వచ్చిన వరుస శలవల పుణ్యమా అని అనుకున్న పని నెరవేరింది. రజని గారే మన ముందు ఉండి  విషయాలు చెబుతున్నట్టుగా ఉండాలి అన్న ఆశయంతో ఆడియోను నాకు చేతనైన పద్ధతిలో ఎడిట్ చేసి కూర్పు చేశాను. ఆ ప్రయత్నంలో ఎంతవరకూ కృతకృత్యుణ్ణి అయ్యానో తెలియదు.

రజనీ కాంతరావుగారు ఈ రికార్డింగులో తన చిన్న నాటి జ్ఞాపకాలు, తన చదువు సంధ్యల గురించి, అప్పటి మహామహుల గురించి, తాను సినిమాలో పాటలకు సంగీతం సమకూర్చిన వైనం, తన సాహిత్య వ్యాసంగం, ఆకాశవాణిలోకి తాను చేరటం, అక్కడ తాను చేసిన కొన్ని కార్యక్రమాలు, ఇలా అనేక విషయాలు, విశేషాలు చెబుతూ  చిట్ట చివరగా అడ్మినిస్ట్రేషన్ కు సంగీతానికి ఉన్న పోలికను అద్భుతంగా పోల్చి చెప్పి ముగించారు.

ఈ ఆడియో ఫైలు అందించిన శ్రీ శ్యాం నారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ ఇంటర్వ్యూను రికార్డ్ చేసిన ఆ అజ్ఞాత రేడియో అభిమానికి, అందరు రేడియో అభిమానుల తరఫునా  అనేక మనం:పూర్వక ధన్యవాదాలు. ఆపైన తమ సంస్థకు ఎంతో పేరు ప్రఖ్యాతులు   సంపాయించి పెట్టిన ఒక మహోన్నత కళాకారుని గురించి ఆయన చేతే వారి అనుభవాలను చెప్పించి, రికార్డ్ చేసి ప్రసారం చేసిన
ఆకాశవాణి వారికి ప్రత్యేక అభినందనలు

ఇలాగే ఆకాశవాణి వారు తమ కళాకారులు అందరి గురించి వారితో ముచ్చట్లు రికార్డ్ చేసి ప్రసారం చేసి ప్రసారం చెయ్యటం మొదలు పెడితే  ఆ కళాకారుల ఋణం కొంతవరకైనా తీర్చుకున్న వారవుతారు శ్రోతలను మళ్ళీ అలరించటం అన్న వారి పాత అలవాటును పునరుద్ధరించుకున్న వారవుతారు అని నా ప్రగాఢ విశ్వాసం. ఇంతకీ, రజని గారితో చేసిన ఈ ఇంటర్వ్యూ ఆడియో ఆకాశవాణి వారి వద్ద భద్రంగా ఉన్నదో లేదో మరి!

రజనీ కాంతారావు గారు ఆయన గొంతులోనే తన గురించి తాను  చెప్పుకున్న విషయాలు వినటానికి అవకాశం ఉన్నప్పుడు నేను  ఆ విషయాల గురించి చేప్పబూనటం, వ్రాయాలని ప్రయత్నించటం, హాస్యాస్పదమే కాదు అసందర్భం కూడా అని నా ఉద్దేశ్యం.  అందుకని, ఇక ఆలశ్యం దేనికి ఈ కింది వీడియో ఫైలులో ఆయన కంఠ స్వరంలోనే, రజనీకాంతరావు గారి ఆత్మకథ "మిని సిరీస్" వినండి.
 
 

*****************************************************

మన బ్లాగుల్లో రేడియో కార్యక్రమాల గురించి వ్రాస్తూ ఉండేవారిలో "తృష్ణ" గారు ఒకరు. ఆవిడ తన బ్లాగులో శ్రీ రజనీకాంతరావుగారి ఆత్మకథ ఆవిష్కరణ సందర్భంగా ఒక వ్యాసం ప్రచురిస్తూ, ఆ సందర్భంగా చేయబడ్డ రెండు అద్భుతమైన ప్రసంగాలను వినటానికి ఉంచారు. ఆ ప్రసంగాలను ఈ కింది ప్లేయర్లో వినవచ్చు.
శ్రీ గొల్లపూడి మారుతీ రావుగారి ప్రసంగం 

  
 
 శ్రీ పన్నాల సుబ్రయ్మణ్య  భట్టు గారి ప్రసంగం 
ఇంతటి అద్భుతమైన  ఆడియో ఫైళ్ళను అందరికీ అందుబాటులోకి తెచ్చిన "తృష్ణ" గారికి ధన్యవాదాలు.

*****************************************************
రజనీకాంతరావు గారు, ప్రముఖ (సినీ) రచయిత శ్రీ వేటూరి సుందరరామమూర్తి గారి  సిరికాకొలను చిన్నది సంగీత నాటిక రచనకు ముందు మాట వ్రాశారు. ఆ మాట ఈ కింది లింకు నొక్కి చదువుకోవచ్చు.

సిరికాకొలను చినదానికి ఆశీస్సు

*****************************************************

రజనీకాంతరావు గారి గురించిన ఆడియోలు యు-ట్యూబులో లభ్యం అవుతున్నాయి. అవి ఈ కింది లింకు సహాయంతో చూసి వినవచ్చు.

*****************************************************
రజనీ కాంతారావు గారి వీడియో/ఆడియో 
*****************************************************
బహుముఖ ప్రజ్ఞావంతుడు  రజనీకాంతరావుగారు స్వర పరచిన అనేక పాటలను పాత తెలుగు పాటలు వెబ్ సైటులో వినటానికి డౌన్లోడ్ చేసుకోవటానికి అనువుగా ఉంచారు. ఈ కింది  నొక్కి ఆ విశేషం చూడవచ్చు.

*****************************************************  
9 వ్యాఖ్యలు:

 1. బావుందండి. లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
  రజని గారి గొప్పతనాన్ని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయనలాంటి బహుముఖప్రజ్ఞాశాలులు చాలా తక్కువ మంది ఉంటారు. రేడియో వెనకాలే చిన్నతనం గడపటం వల్ల అటువంటివారి దగ్గర్లో మసలగలగటం నా ఆదృష్టంగా భావిస్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. సర్, నమస్కారం. వ్యాసం చాలా బాగుంది. బసవరాజు అప్పారావు గారు రాసిన ఒంటిగా ఉయ్యాల లూగితివా అనే పాట ఎమ్ ఎస్ రామారావు గారు పాడిన పాటకి లింక్ ఉంటే షేర్ చేసుకుంటారా ప్లీజ్

  ప్రత్యుత్తరంతొలగించు
 3. రజని గారి పాటలు అని చూపిస్తున్న చివరి లింక్ పని చేయడం లేదండీ

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @రాధ ఎం
  మీరు చెప్పిన పాటలు నా దగ్గర లేవండీ.చివరి లింక్ పనిచేస్తున్నది మరొకసారి చూడగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఈ పోస్ట్ కి వ్యాఖ్య తప్పకుండా వ్రాయాలి అనిపిస్తుంది కానీ నాకు వ్రాసే అర్హత లేదు అని కూడా అనిపిస్తుంది. కానీ బాలాంత్రపు రజనీకాంతరావు గురించి మీరు ఈ పోస్ట్ వేసినందుకు ధన్యవాదములు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @Rao S lakkaraju గారూ ఏమిటి మరీ అల్లా అనేశారు!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కొందరు జీవితాల్లో కొత్తవాటిని ఆశ్వాదిస్తూ, చుట్టూ ఉన్న వాళ్ళని ఆశ్వాదింప చేస్తూ, తాము ఆనందిస్తూ ,ఇంకోళ్ళని ఆనందపరుస్తూ, కష్టాలొచ్చినా ఎదమరుస్తూ, ఉల్లాస హృదయంతో జీవితం సాగిస్తారు. మనం కూడా అల్లాగే ఉందామనుకుంటాము కానీ కుదరదు. ఆయన చేసిన దాంట్లో ఒక్క అయోటా కూడా నేను చెయ్యలేదు. అల్లా చేయగలిగినవారు ఆదర్శపురుషులు, అదృష్టవంతులు, దైవ సంభూతులూ. వారికి చెయ్యెత్తి నమస్కారం పెట్టటమే మనం చెయ్య గలిగింది.

   తొలగించు
 7. అందరూ గొప్పవాళ్ళయిపోతే గొప్పతనం ఎలా తెలుస్తుంది! అందుకనే కోటికొక్క రజనీకాంతరావు ఉంటారు. కాని మనకు పదికోట్లకు ఒక్కడే రజనీకాంతరావుగారు. ఆయన ఉన్న కాలంలోనే మనంకూడా ఉన్నాము అన్న ఒక్క విషయం చాలు గర్వపడటానికి.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఈ మధ్యనే విన్నాను, శ్రీరమణ గారు చెబుతున్నారు. రజనీకాంతరావు గారిని కొత్త పాటల్లో ఆయనకు ఇష్టమైనది ఏది అని అడిగితె "కెవ్వు కేక" పాటన అన్నారుట. అది రజనీకాంత రావుగారి ఉల్లాస హృదయం.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.