24, నవంబర్ 2012, శనివారం

ఆడియో కాసెట్ కలెక్షన్‌దారులకు ఉపయోగపడే విషయం


1970లలో,  మనకు రేడియో కాకుండా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చిన గొప్ప వినోద సాధనం కాసెట్ రికార్డర్. 1980లు, ఆపైన దాదాపు 1995 వరకూ కూడా  కాసెట్లకు బంగారు కాలం. అప్పట్లో కాసెట్లు కొనుక్కుని వినటం ఎంతో గొప్ప హాబీ. ఈ విధంగా అప్పట్లో అనేకానేక కాసెట్లు కొనుక్కుని కలెక్షన్లను తయారుచేసుకున్న సంగీత అభిమానులు అనేకమంది. 

ఇదే కాకుండా, కాసెట్ రికార్డరుతో మరొక విశేషం ఉన్నది. "టు ఇన్ వన్"  అని రేడియోతో కలిపి లేదా సింగిల్ గా ఉన్న కాసెట్ రికార్డరును రేడియోకి అనుసంధించి రేడియోల్లో వచ్చే అనేక కార్యక్రమాలను రికార్డు చేసుకున్నారు అప్పటి రేడియో  అభిమానులు. ఈ కాసెట్ రికార్డరు, అభిమానం ఉన్న శ్రోతలు ఉండబట్టే, ఆకాశవాణి కార్యక్రమల్లో కొన్ని అపురూపమైనవి ఇంకా మనకు దొరుకుతున్నాయి. తమ కార్యక్రమాలను తామే ఒక చోట పొందుపరచి, రేడియో కార్యక్రమ సాహిత్యం ఏవిధంగా అభివృధ్ధి  చెందింది అనేటువంటి ముఖ్య విషయాలను పొందు పరచటంలో ఆకాశవాణి విపరీతమైన నిర్లయక్ష ధోరణే వారి ముఖ్య పాలసీగా  ఉంచుకున్నారు. ముందు చూపు లేని అధికార్లు, ఆ సంస్థలో గుమాస్తాలుగా మాత్రమే పని చేసి, అలనాటి అపురూప కార్యక్రమాలను ముందు తరాలవరికి అందచేయటంలో ఘోరంగా విఫలమయ్యారు. అసలు ఆ కార్యక్రమాలను భద్రపరచాలన్న ఆలోచనే వాళ్లకి ఉన్నట్టుగా కనపడదు. ఎదో ఆరోజుకి అవసరమైన టేప్, అంతకు ముందు ఉన్న కార్యక్రమం (అది ఎంత విలువైనది అయినా సరే) చెరిపేసి అప్పటి పబ్బం గడిపెసుకున్నారు. తప్పితే,  స్టేషన్లో రికార్డ్ చేసినవి ఏవైనా సరే ఆర్ఖైవ్స్ గా ఉంచి,  ఆర్ఖైవ్స్ ఎలా మైంటైన్ చెయ్యాలి అన్న విషయంలో ఒక నిర్దిష్టమైన పాలసీ ఉండాలన్న అతి కనీస విషయం కూడా తెలియని బాపతు ఆకాశవాణి కేంద్రాలను  నడిపినట్టు కనపడుతున్నది. 


ఎందుకూ కొరగాని వెర్రి ఆఫీసుల్లో గుమాస్తాలు ఖరాబు చేసిన పిచ్చి కాయితాలే దశాబ్దాల పాటు జాగ్రత్తగా ఓల్డ్ రికార్డ్స్ పేరిట దాస్తారే, అటువంటిది ఆకాశవాణి కళాకారులు తమ శక్తియుక్తులను ధారపోసి,  ప్రమోషన్ లేని ఉద్యోగాలు దశాబ్దాలపాటు చేసి,  తయారు చేసిన అద్భుత కార్యక్రమాలను జాగ్రత్త పరచాలన్న కనీస ఇంగితం లేని  అధికారులు ఆకాశవాణికి దాపురించటం, మన దేశపు రేడియో చేసుకున్న దురదృష్టం తప్ప మరొకటి కాదు.  ఈ విషయంలో రేడియో కళాకారులను తప్పు పట్టలేము. ఎందుకు అంటే అడ్మినిస్ట్రేషన్ పేరిట  ఎప్పుడూ పై చేయి గుమాస్తాలదేనుట!! ఆకాశవాణి  ఎవరివల్ల నడుస్తున్నదో ఆ కళాకారులకు ఈ విషయంలో ఏ విధమైన ప్రమేయమూ అధికారమూ లేనట్టు,  ఈ మధ్య వచ్చిన  కథనాలు ఆత్మకధలూ చదివితే తెలుస్తున్నది. ఇప్పుడు ఎదో మేలుకున్నట్టుగా నటిస్తూ, మీరా మీరా అంటు రోడ్డున పడి పేపర్ ప్రకటనలు!!   శ్రోతలుట  వాళ్ళ దగ్గర ఉన్న రికార్డింగ్ లు వీళ్ళను నమ్మి  ఇవ్వాలిట, వాళ్ళు డిజిటైజ్ చేస్తారుట! వాళ్ళు చేసేదేమిటి?  ఇవ్వాళ సాంకేతిక నైపుణ్యం మనలాంటి సామాన్యులకూ అందుబాటులో ఉన్నది. శ్రోతలమైన మనమే మనదగ్గర ఉన్న రికార్డింగ్ లు డిజిటైజ్ చేసుకుని ఒకరికొకరు అందచేసుకోగలం.

ఈ విషయంలో కొంతవరకూ రేడియో అభిమానులు స్వాంతన పడగలుగుతున్నారు అంటే కాసెట్ రికార్డర్ వల్లే. అప్పటి రేడియో అభిమానులు వారికి నచ్చిన కార్యక్రమాలు ఈ కాసేట్ రికార్డరులో రికార్డుచేసి దశాబ్దాలపాటు దాచి ఉంచటంవల్లే, ఇప్పుడు కొన్ని వెబ్ సైట్లల్లోనూ, బ్లాగుల్లోను అలనాటి రేడియో కార్యక్రమాలను వినగలిగే అవకాశం మిగిలి ఉన్నది. ఈ విషయంలో దశాబ్దాల నాడు ఈ కార్యక్రమాలను రికార్డుచేసి, దాచి ఉంచిన వారందరికీ  రేడియో అభిమానులు ఎప్పటికీ ఋణపడే ఉంటారు.

కాలక్రమాన, సాంకేతిక అభివృధ్ధి పథంలో కాసెట్ రికార్డరును మించి సి డి వచ్చేసింది. కాసెట్ ప్లేయర్లు మూలన పడ్డాయి. ఎంతగా మూలపడ్డాయి అంటే ఎవరిదగ్గరన్నా కాసేట్ ఉంటే అదెలా వినాలో తెలియనంత. రికార్డింగ్, రికార్డయిన ఆడియోను పొందుపరచటంలో ఎం పి 3 వచ్చి విప్లవాత్మకమైన మార్పు తీసుకు వచ్చింది. కాని శ్రోత తనకు తానె రికార్డ్ చేసుకోగల సౌకర్యం పోయింది.

సరే ఇక అసలు విషయానికి వస్తే, అలనాడు కాసెట్లు అనేకానేకం కొనుక్కుని వాటిల్లో రేడియో కార్యక్రమాలే కాక, తమ దగ్గిరవారి గళాలను రికార్డు చేసుకున్నవి కాసెట్లల్లోనే ఉండిపోయి వాటిని ఎం పి 3 చెయ్యాలంటే, రికార్డింగ్ సాంకేతిక నిపుణులు సహాయం తీసుకుంటే కాని వాటిని పి సి లోకి వినటానికి వీలుగా తర్జుమా చెయ్యలేనివారు ఆ కాసెట్లు చూసుకుని ఆనందించటమే కాని ఏమీ చేయలేని పరిస్థితి.  


ఏ వాక్-మాన్ లోనో కాసేట్ పెట్టి దానిని పి సి కి   కనెక్ట్ చేసి  (ఎలా కనెక్ట్ చెయ్యాలి!?) ఆడాసిటీ ఆడియో రికార్డింగ్ సాఫ్ట్వేర్ తో  తంటాలుపడి రికార్డు చెయ్యగల సాంకేతిక నైపుణ్యం అందరికీ ఉండటం అసాధ్యం కదా! కాబట్టి, కాసెట్ కలెక్షన్‌దారుల దగ్గిర ఉన్న అనేకానేక అపురూపమైన రికార్డింగులు, వాటిని ఎం పి 3 కిందకు మార్చే ప్రక్రియ అందుబాటులో లేక అలాగే మగ్గి, నశించిపొయ్యే ప్రమాదం ఉన్నది.

ఈ విషయంలో ఫిలిప్స్ సంస్థ వారు ఒక చక్కటి టేప్ రికార్డరును (పై బొమ్మలో ఉన్నది) రూపొందించారు. ఇది 4 ఇన్ 1. ఇందులో
1. కాసెట్ టేప్ రికార్డరు
2. ఎఫ్ ఎం రేడియో
3. సి డి ప్లెయర్
4. యు ఎస్ బి ప్లేయర్ ఉన్నాయి(పెన్ డ్రైవ్  కనెక్ట్ చేసుకోవచ్చు) 

పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి, కాసెట్ ప్లే చేస్తూ ఉంటె, ఆ కాసెట్లో  వచ్చే ఆడియో మొత్తం ఎం పి 3గా మార్చేసి పెన్ డ్రైవ్ లోకి తర్జుమాచేసి ఉంచుతుంది. కాకపోతే మనం ఏ కాసెట్ ఎంపి 3 చెయ్యలనుకుంటున్నామో, ఆ కాసెట్ మొత్తం వినాలిసిందే. 

మునుపు వాక్ మాన్ తో చాలా తంటాలుపడి రేడియో నాటికలను ఎం పి 3 చేసి మొట్టమొదటి సారి వెబ్ సైటులో (సురస . నెట్) లో 2004 లో అనుకుంటాను ఆ వెబ్ యజమాని సుసర్ల శాయిగారి సహకారంతో ఉంచాను. ఇంటర్నెట్ ప్రపంచం లో     ఆయన    గణపతి    నాటిక    ఉంచిన తరువాత,     రేడియో నాటికలు ఉంచినది బహుశా నేనే మొదటి రేడియో అభిమానిని అనుకుంటాను. ప్రస్తుతం వెబ్ ప్రపంచం లో ఎక్కడెక్కడ "తాళంచెవులు", "దొందూ దొందే", "సంఘ  సంస్థాపనార్ధాయ",  "ఓటున్న మారాజులకు కోటి దండాలు", "పెళ్ళాంతో పెళ్ళికి", "క్రికెట్ పిచ్చి",  "బామ్మ గారి రేడియో" దొరుకుతున్నాయో అవ్వి అన్నీ కూడా నా దగ్గర నుండి అక్కడకు చేరినవే. 

ఈ మధ్యనే నేను ఈ సాధనం కొనుక్కుని (దసరా సందర్భంగా నాకు నేనే కానుకగా ఇచ్చుకుని) నా దగ్గర ఉన్న కాసెట్లను మంచి క్వాలిటీతో ఎంపి 3 చేసే బృహత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. అలా రికార్డ్ ఐన ఆడియో చాలా చక్కగా మంచి క్వాలిటీతో (సి డి క్వాలిటీ) ఉన్నది. అంటే, కాసెట్లో ఎలా ఉంటే అదే క్వాలిటీలో  ఎంపి 3 అవుతున్నది.

ఈ సాధనం వివరాలు:

తయారీదారు          ఫిలిప్స్

మోడల్ పేరు            AZ-1852

ధర                     నాలుగువేల ఎనిమిది వందలు(ముంబాయిలో)

దీనితో పాటు ఒక చిన్ని రిమోట్ కూడా ఇస్తున్నారు.ఎలా రికార్డు చేసుకోవాలో తెలియచెప్పే చక్కటి పుస్తకం కూడా ఉన్నది.

ఎలా రికార్డ్ చేయ్యాలి
 1. ఈ సాధనంలో ఉన్న సాకెట్లో పెన్ డ్రైవ్ సరిగ్గా ఉంచాలి.
 2. మనం ఎంచుకున్న కాసెట్ మొదట్లోకి రి వైండి చేసి కాసెట్ ప్లెయర్లో ఉంచి పాజ్  నొక్కి, ఆ తరువాత మాత్రమె  ప్లే బటన్ కూడా నొక్కాలి. అంటే పాట వెంటనే మొదలు కాకూడదు. ఎందుకు అంటే రికార్డింగ్ వెంటనే మొదలు కాదు  ఇండికేటర్లో "CASS"  అని వస్తుంది. ఆ ఇండికేటర్ పక్కనే ఉన్న బటన్ నొక్కితే వెంటనే "RIP" అన్న అక్షరాలు స్థిరంగా ఇండికేటర్లో "CASS" పక్కనే కనిపిస్తాయి.
 3.  కాసేపటికి "RIP' అన్న పదం బ్లింక్ అవ్వటం మొదలుపెడుతుంది, అంటే ఎంపి 3 చెయ్యటం మొదలు పెట్టిందన్న మాట. రికార్డ్ అవుతున్నంతసేపూ అలా బ్లింక్ అవుతూనే ఉంటుంది.
 4. బ్లింక్ అవుతున్న "RIP" పదం చూడగానే పాజ్ బటన్ ను మాత్రమె  నొక్కి కాసెట్ ప్లే అయ్యేట్టుగా చెయ్యాలి. 
 5.  మనం రికార్డ్ చేద్దామనుకున్న కార్యక్రమం/పాట ఐయిపోంగానే స్టాప్ బటన్ నొక్కాలి (కాసెట్ రికార్డరు స్టాప్ బటన్ కాదు, యు ఎస్ బి కి చెందిన స్టాప్ బటన్). అప్పుడు రికార్డ్ అయినది ఎంపి 3 కింద పెన్ డ్రైవ్ లో సేవ్ అవుతుంది. కాసేట్ ప్లేయర్ స్టాప్ బటన్ నొక్క కూడదు. అలా చేస్తే అంతసేపు రికార్డ్ ఎం పి  3 కింద మారినది సేవ్  కాదు.
రేడియోలో వచ్చే కార్యక్రమాలను, ఆడియో సి డీ లో వచ్చే పాటలను ఇదే విధంగా ఎంపి 3గా ఈ  ఫోర్ ఇన్ వన్ లో చేసుకోవచ్చు.

ఈ సాధనంలో ఒక్కటే లోపం అదేమిటి అంటే, సామాన్యంగా కాసెట్లు అరగంట (ఒక పక్క) లేదా నలభై ఐదు నిమిషాలు ఉంటాయి. పూర్తి కాసెట్ రికార్డ్ చెయ్యాలి అంటే, లేదా రికార్డ్ చేస్తుండగా ఒక పక్క టేప్ పూర్తిగా అయిపోయి ఆటో స్టాప్ లో కాసెట్ ప్లెయర్ దానంతట అదే ఆగిపోతే అప్పటిదాకా ఎం పి 3 కింద కన్వర్ట్  అయ్యినది సేవ్  కాకుండా పూర్తిగా పోతుంది. అదుకని, కాసెట్ ను ఉంచి, టేప్ అయిపొయ్యే సమయం వస్తుండగా పక్కనే ఉండి పాజ్ నొక్కి ఆపైన యు ఎస్ బి కి చెండిన స్టాప్ బటన్ నొక్కాలి.  ఇదొక పెద్ద లోపం. ఫిలిప్స్ వాళ్ళు ఇంతా చేసి,  ఇటువంటి లోపం పెట్టటం శోచనీయం. 

కాసేట్లు కలెక్షన్  ఉండి,  వాటిని వినే వీలు లేక  చూస్తూ చూస్తూ పారెయ్యలేక, తమవారి గళాలు, రేడియో కార్యక్రమాలు రికార్డ్ అయిన కాసెట్లు ఉన్నవారికి ఇదొక మంచి సమాచారం అని భావించి, నేను కొని చూసి సంతృప్తి చెందాను కాబట్టి తెలియచేస్తున్నాను.

ఈ సాధనం ఉపయోగించి మరిన్ని రేడియో కార్యక్రమాలు బ్లాగుల్లోకి తద్వారా రేడియో అభిమానులకు అందుబాటులోకి రావాలని నా ఆశ/తాపత్రయం. ఎంతవరకూ సఫలీకృతం అవుతుందో చూడాలి. 

11 వ్యాఖ్యలు:

 1. చాలాబాగుంది శివరామప్రసాద్ గారు. ఇది మాటవరసకి చెప్పే మాటకాదని గమనించగలరు. ఉపయోగకరమైన పోస్టు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చాలా మంచి సమాచారం శివరామప్రసాద్ గారు, ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చాలా బాగుందండీ ఇది! నా దగ్గర వందల కొద్దీ ఆడియో కాసెట్ల కలెక్షన్ ఉండేది. వాడక పోవడం వల్ల కొన్ని సినిమా అపటల కాసెట్లు పాడై పోయాయి కూడా. అప్పుడు ఈ ప్రాడక్ట్ లేదు అనుబాటులో నేను ఇదిగో ఈ లింక్ లో ఉన్న టేప్ ఎక్స్ ప్రెస్స్ అమెరికా నుంచి తెప్పించి, ముఖ్యం అనుకున్న కాసెట్లన్నీ mp3 లు మార్చాను ఇండియాలో ఉన్నపుడు.
  కన్వర్ట్ చేసుకున్న తర్వాత, కాసెట్లు మొత్తం పంచేశాను...టేప్ రికార్డర్ ఉన్న వాళ్ళకి.
  http://www.youtube.com/watch?v=Mrd5wwo51Cg
  మంచి సమాచారం! ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 4. Venu Srikanth and Sujata

  Thank you for your appreciating comments.

  @Sujatha,

  Still I carry hundreds of cassettes through my transfers among metropolitan cities in the fond hope of one day I shall be able to convert them easily. At last I found what I have been searching. I know about the gadget you are referring to, but could not get it and content what is available locally at affordable price.

  Sony has a giant of a Many-in-One costing 24Kplus which too has this facility. When I tested, I found the Phillips gadget recording quality is the best between them. Sony bundled unnecessary things with it like CD playing, DVD viewing etc.for which we already have other gadgets.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఉపయోగకరమైన సమాచారం అందించినందుకు అభినందనలు ప్రసాద్ గారు. మీ అనుభవం ద్వారా ఫిలిప్స్ వారు తమ లోపాన్ని సవరించాలని ఆశిస్తున్నాను. కేసెట్లలోని ఉపయోగకర సమాచారమంతా నాశనం కాకుండా కాపాడుకోవడానికి మీరందించిన సమాచారం ఉపయోగపడే చాలామందిలో నేనూ ఒకడ్ని.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. కొండలరావుగారూ,

  మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఈ సాధనం కొనటానికి కొంచం ఎక్కువ మొత్తాన్ని వినియోగించినా కూడ, మన దగ్గర ఉన్న కాసెట్లు ఒక్కటొక్కటే ఎం పి 3 చేస్తుంటె వచ్చే ఆనందం విలువ, ఆ మొత్తానికి కొన్ని రెట్లు ఉంటుంది. అందుకనే అందరికీ ఉపయోగపడాలని ఈ సమాచారం బ్లాగులో ఇచ్చాను.

  తరువాత ఫిలిప్స్ వారి ఈ 4 ఇన్ 1 మార్కెట్లో ఎక్కువగా లేవుట. కాబట్టి కొనదలిస్తే వెంటనే ఫిల్లిప్స్ డీలర్ దగ్గర వాకబు చెయ్యటం మంచిది.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. Vijay Vardhan,

  The recording is done at 128 KBPS and the quality is quite good. You can just see in my blog where I recently wrote a small article on Sri Venkateswara Subprabhatam. The audio is recorded using this Phillips 4 in 1 only. You can use the following link to hear that.

  http://saahitya-abhimaani.blogspot.in/2012/11/blog-post_6.html

  ప్రత్యుత్తరంతొలగించు
 8. Baammagaari Radio and Cricket Pichhi.... Are they available on Surasa.net? I could not see them....
  Sri Kumar

  ప్రత్యుత్తరంతొలగించు
 9. కుమార్ గారూ మీ వ్యాఖ్య చాలారోజులుగా చూడలేదు. అందుకనే స్పందించలేదు.

  మీరు అడిగిన నాటికలు నెట్లో నేను ఇచ్చినవే. గూగులమ్మని తెలుగులో అడిగి చూడండి. ఈ మాత్రం కష్టపడకుండా అటువంటి అపురూపాలు ఎలా కనపడతాయి!

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.