28, నవంబర్ 2012, బుధవారం

బారిష్టరు పార్వతీశం సృష్టి కర్త శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారితో ఇంటర్వ్యూతెలుగు హాస్య రచనా పరంపరలో మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు వ్రాసిన బారిష్టరు పార్వతీశం నవలది ఒక ప్రత్యేక స్థానం. ఆ నవల మొదటిసారి ప్రచురణ జరిగినప్పుడు, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాయించుకున్నది. ఒక హాస్య కథను ఆధారం చేసుని తీయబడ్డ మొట్టమొదటి తెలుగు చిత్రం కూడా బారిష్టరు పార్వతీశమే  అనుకుంటాను. అలాగే ఒక నవలకు రెండవ, మూడవ భాగాలు వ్రాయబడ్డ ఏకైక నవల ఇదొక్కొటేనేమో కూడా.

మొక్కపాటి నరసింహ శాస్త్రిగారు, ఈ నవల తనను అనామకుని చేసిపారేసిందని మురిపెంగా చెప్పుకుంటారు. ఈ విషయం ఇప్పుడు మీరు వినబొయ్యే ఇంటర్వ్యూలోనే ఆయన చెప్పారు. తనను ఎవరికన్నా పరిచయం  చెస్తే, ఐతే ఏమిటి అన్న అభిప్రాయం ఆ కొత్త వ్యక్తుల కళ్ళల్లో కనిపిస్తుందని, పరిచయం చేస్తున్న వ్యక్తి ఆ పిదప, బారిష్టరు పార్వతీశం వ్రాసినది వీరే అని చెప్పగానే వెంటనే తనకు గుర్తింపు వస్తుందని చమత్కరించారు.

ఈరోజు (28 నవంబరు 2012) ఇక్కడ ముంబాయిలో శలవు. కాబట్టి ఏ కాసెట్లో ఏ ఆద్భుతం ఉన్నదో అనుకుని,   పాత కాసెట్లు,  మొదలు చివర విని, అందులో ఉండేవి ఇంతే అని లేబుల్ చేసి పక్కన పడేసినవి క్షుణ్ణంగా విని చూద్దాం,  అని మొదలు పెట్టాను. నా హామ్ రేడియో సంభాషణల రికార్డింగుల  మధ్య ఒక అపురూపమైన ఆణిముత్యం దొరికింది. ఈ రికార్డింగ్ నా దగ్గర ఉన్న సంగతే నాకు గుర్తులేదు.

ఆ ఆణిముత్యమే ప్రముఖ రచయిత, బారిష్టరు పార్వతీశం పాత్ర సృష్టికర్త శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారితో రేడియో ఇంటర్వ్యూ.  "స్మృతివాహిని"  అనే కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు 1995 ప్రాంతాల్లో ఈ ఇంటర్వ్యూను ప్రసారం చేశారు. ఈ ఇంటర్వ్యూను మొదటి సారి ఏప్రిల్ 1971 లో ప్రసారం చేశారుట. నేను విని రికార్డు చేసుకున్నది 1995 లో జరిగిన పున:ప్రసారం. ఇంటర్వ్యూ చేసినది శ్రీ జి వి కృష్ణారావుగారు. 

ఈ కాసేట్ లో రికార్డింగ్ క్వాలిటీ బాగాలేదు. ఏమిటి అని  చూస్తె మొదట్లో రికార్డ్ చేసినప్పుడే టేప్ వెనుక ఉండే చిన్న స్పాంజ్ ముక్కకు బదులు దూది పెట్టి ఉన్నది. అంటే అప్పుడున్న తొందరలో ఈ కాసేట్ కు
చటుక్కున రిపేర్   చేసి రికార్డ్ చేసిపారేశాను అన్నమాట. ఇవ్వాళ ఆ కాసేట్ జాగ్రత్తగా విప్పతీసి వెనుక సపోర్ట్ స్పాంజ్ వేరే కేసేట్లోది పీకి, ఇక్కడ  పెట్టి ఎం పి 3 చెయ్యటానికి ప్లే చెశాను. కానీ గుణం కనిపించలేదు. సరే మనకు తెలిసిన విద్య, ఆడాసిటీలో   వేసి రుబ్బి తిరుగమోతలు పెట్టాను. అయినా సరే  క్వాలిటీ బాగుపడలేదు. అందుకని మనకు ఇంతే ప్రాప్తం అనుకుని,  ఆ ఒరిజినల్ రికార్డింగే ఎలా ఉన్నది అలా అందచేస్తున్నాను. కాస్త సౌండ్  ఎక్కువగా పెట్టి వినాలి అంతే. 

ఇప్పుడు ఇక ఈ కింది వీడియో ఫైల్ ద్వారా ఆ ఇంటర్వ్యూ వినండి. 


ఈ ఇంటర్వ్యూలో, మొక్కపాటివారు తన రచనా వ్యాసంగం  ఎలా మొదలు పెట్టినది, హాస్య రచనల వైపు తాను ఎలా మళ్ళినది, బారిష్టరు పార్వతీశం నవల వ్రాయటానికి గల ప్రోద్బలం, తన స్నేహితులైన ఇతర రచయితల విశేషాలు చక్కగా చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూ అంటే ఎలా చెయ్యాలో తక్కువగా మాట్లాడి, పెద్దాయన మాటలకు అడ్డుపడకుండా సంయమనం  పాటిస్తూ,  కృష్ణారావుగారు చూపించారు. పెద్దవాళ్ళను ఇంటర్వ్యూ చేద్దామని బయలుదేరే వాళ్ళు తప్పనిసరిగా విని నేర్చుకోవలిసిన ఇంటర్వ్యూ ఇది.       
    
మొత్తం మీద, 1971 నుంచి ఈ అపురూపమైన రికార్డింగ్ జాగ్రత్త పరిచి 1995 లో పున:ప్రసారం చేసిన ఆకాశవాణి విజయవాడ వారికి ధన్యవాదాలు చెప్పవలసిందే.                        

మీకు తెలుసా!
మొక్కపాటి వారు బారిష్టరు పార్వతీశం నవలకు రెండవ, మూడవ భాగాలు (వీటికి పేరు రాకపోగా, చాలా పేలవంగా ఉన్నాయని అపకీర్తే వచ్చింది) ఆయన చెప్తుండగా వ్రాసినది ఎవరో తెలుసా? ప్రముఖ రచయిత శ్రీ ముళ్ళపూడి  వెంకటరమణగారు. అలా ఆయన చెప్పినది వ్రాస్తూ, లేదా శాస్త్రి గారు వ్రాసినది  కాపీ చేస్తూ, రమణ గారు  అక్కడక్కడా తన స్వంత శైలిలో  మార్చటం జరిగిందట. అది చూసి నరసింహ  శాస్త్రిగారు తనను  మెత్త మెత్తగా చీవాట్లు పెట్టారని, రమణగారే కోతి కొమ్మచ్చిలో (ఆయన అసంపూర్ణ ఆత్మకథ) వ్రాసుకున్నారు. 

1 వ్యాఖ్య:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.