16, డిసెంబర్ 2012, ఆదివారం

మీడియాకు పక్షపాతం లేదా!!

  మీడియా - పక్షపాతమూ  


 ==================================================
 News is what somebody, somewhere wants to suppress. Everything else is advertising.

-Lord Northcliffe, Newspaper Magnet from UK

  ================================================== News is meant to be objective, fair and neutral and that is what sets apart such information and opinion from advertisements that are paid for by corporate houses, government organisations or individuals.  What happens when the distinction between news and advertisements begins to blur, when advertisements double up as news or when news is published in favour of a particular politician through sale of editorial space? In such situations, the reader or the viewer is in no position to distinguish between news reports and advertisements / advertorials.

-KULDIP NAYAR
 ==================================================
ఈ వ్యాసం వ్రాయటానికి ప్రేరణ కల్లూరి భాస్కరం గారి బ్లాగులో ఆయన వ్రాసిన వ్యాసం అనే కంటే, అక్కడ వచ్చిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలకు ఆయన స్వతహాగా మీడియా మనిషి కాబట్టి వారి స్పందన అని చెప్పవచ్చు, ఆయన వ్రాసిన వ్యాసానికి నేను ఉంచిన వ్యాఖ్య చూసి, ఆయన మీడియా ఎప్పటికీ నిష్పాక్ష పాతంగానే ఉన్నది తెలుసుకోండి అనేవిధంగా చెప్పటం.  ఈ కింది లింకు నొక్కి ఆ వ్యాసం అక్కడి వ్యాఖ్యలు చదవగలరు.
పైనున్న వ్యాసానికి నేను మరొకరు  శ్రీ  శ్రీనివాస్ గారు వ్రాసిన వ్యాఖ్యలకు భాస్కరం గారి స్పందన
==================================================
 ఇక ఇప్పుడు నా స్పందన మీడియాకు పక్షపాతం లేదా ! అనే వ్యాస రూపంలో 

మన భారత దేశంలో ఇవ్వాళ మీడియాగా పిలవబడుతున్న పేపర్లు కాని, రేడియో కాని,  మొదలు ఎక్కడ అని చూస్తే, మన దేశం విదేశీయుల పరిపాలనలో ఉన్నప్పుడు పడిన బీజాలు. అప్పట్లో ఉన్న సాంకేతికత దృష్ట్యా వార్తా పత్రికలు మాత్రమే ఉండేవి. రేడియో నామ మాత్రంగా ఉండేది, అందులో వార్తలు రావటం,  అవ్వి విని ప్రజలు ప్రభావితం కావటం అతిస్వల్పం.  అప్పట్లో పత్రికలు,  సాధ్యమైనంతవరకూ కూడా స్వతంత్రంగానే వ్రాయటానికి ప్రయత్నించేవి. కాని పరిపాలన విదేశీయులు కాబట్టి,  వారి బాకా ఊదవలసినదే. లేకపోతే ప్రభుత్వ ప్రకటనలు ఆపెయ్యటం, వారి వ్రాతల్లో  విమర్శ మరీ ఎక్కువైతే సంపాదకుడు జైలు పాలవ్వటం, పేపరు మూతపడటం జరిగేవి. మీడియా పక్షపాత ధోరణికి  మొదటి బీజాలు అక్కడే పడ్డాయి. కాని ఆ పక్షపాతం బలవంతపు పక్షపాతం, అవసరార్ధం పక్షపాతం. 

స్వాతంత్ర పోరాటపు మొదటి రోజుల్లో ఇలా పత్రికల్లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్రాసిన పత్రికలు అతి తక్కువ. సాధ్యమైనంత వరకూ గోడమీది పిల్లివాటంగా వ్రాస్తూ, ప్రభుత్వ ప్రకటనలు సంపాయించుకుంటూ బతుకు ఈడుస్తూ ఉండేవి. తరువాత్తరువాత గాంధీ వంటివారు వచ్చి కొంతలో కొంత ధైర్యాన్నిచ్చి పత్రికల్లో స్వతంత్రంగా వ్రాయటం జరిగింది. ఆంధ్ర పత్రిక తెలుగులో స్థాపించబడింది.  అప్పటికి అదొక్కటే వార్తా పత్రిక మనకు. స్వతంత్ర పోరాటం మొదలుకాంగానే, పత్రికలు సహజంగా ఆ పోరాటపు వార్తలు వ్రాయటమే కాక బాహాటంగా స్వాతంత్ర ఉద్యమాన్ని సమర్ధించేవారు. అలా చెయ్యటం అప్పుడు దేశభక్తి. కాని అదే ధోరణి నిస్పక్షపాతమా అని ఇవ్వాళ చర్చ చెయ్యగలమా! చెయ్యలేము, కారణం మనకు కావలిసినది అదే కాబట్టి. ఎక్కువమంది ప్రజలు స్వతంత్రం  కోరుకున్నారు కాబట్టి.

కాలక్రమాన స్వతంత్రం వచ్చింది. అప్పటికి కూడ  మన తెలుగులో ముఖ్య వార్తా పత్రిక ఆంధ్ర పత్రికే. దశబ్దాలపాటుగా స్వతంత్ర పోరాటాన్ని  సమర్ధిస్తూ వ్రాసే అలవాటున్న వారు, స్వతంత్రం వచ్చినాక, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వపు కొమ్ము కాస్తూ వ్రాయటం సహజంగా జరిగిపోయింది. అది ఎవరికీ ఎబ్బెట్టు అనిపించలేదు. మీడియాలో పక్షపాత ధోరణికి రెండవ అంకం ఇది. స్వతంత్ర పోరాటం అంటే కాగ్రెస్ వారు చేసినదే పోరాటం  అన్న వైఖరే ఉండేది. ఆంధ్ర పత్రిక స్థాపించినది వారి పార్టీకి సంబంధించి నాయకుడే  కాబట్టి, సహజంగా ఆ పత్రికలో కూడా అదే విధమైన ప్రచారం జరిగింది. ఇది తెలిసి చేసినది కాదు కాని,  ఈ స్వాతంత్ర్య పోరాటాన్ని నడిపినవారందరూ కాంగ్రెస్ ఖాతాలో పడిపోవటం వల్ల,  ఆ పత్రిక కూడా అలాగే వ్రాసేది.  ఇది పత్రికల పక్షపాత ధోరణికి మరో విధంగా కొనసాగింది. ఈసారి,   దేశభక్తి అనుకుంటూ ఈ పక్షపాత ధోరణి కొనసాగింది.  ఆ కొత్త రోజుల్లో ఎవరికీ ఇదేమీ పెద్ద తప్పుగా అనిపించలేదు.

ఆ తరువాత ఆంగ్లంలో వచ్చే ఇండియన్ ఎక్స్‌ప్రెస్  మొదలయ్యింది. వారు కొద్దిగా కాంగ్రెస్ వ్యతిరేకత చూపించేవారు. ఆ పత్రికకు తెలుగు లో ఆంధ్ర ప్రభ మొదలయ్యింది.అప్పటి మీడియాలో కొద్దిగా విభిన్న స్వరం వినపడటం మొదలయ్యింది. రాజకీయ నాయకులు మొదలు పెట్టిన రెండవ తెలుగు వార్తా పత్రిక (నాకు తెలిసి) ఆంధ్ర జ్యోతి. ఇది కూడా కాంగ్రెస్ నాయకుడు స్థాపించిన పత్రికే!  సహజంగా ఆ పత్రిక కూడా కాంగ్రెస్ పక్షపాతిగానే మొదలయ్యి కొనసాగింది. అదే పత్రిక ఇప్పుడు వ్రాస్తున్న విధానం అందుకు పూర్తిగా నాణేనికి రెండవ వైపే కాని, నిస్పక్షపాతమా అంటే అవును అని మాత్రం జవాబు రాదు.

ఇక కమ్యూనిస్ట్  ఉద్యమాలు వచ్చి వారి వారి బాకా పత్రికలు మొదలు పెట్టుకున్నారు. పార్టీ పత్రికలు కాబట్టి నిస్పక్షపాత ధోరణికి అవకాశమే లేదు. వారి ధోరణి పూర్తిగా ప్రచార ధోరణి కాబట్టి నిస్పక్షపాత మీడియా లో ఈ పత్రికలను చేర్చలేము.  అవి పార్టీ కరపత్రాల కంటే ఎక్కువగా లేవు.

ఇక ఎలెక్ట్రానిక్ మీడియాను తీసుకుంటే, రేడియోలో వార్తలు అంటే అప్పటికి ఇప్పటికి కూడా ఆకాశవాణి తప్ప మరొక రేడియో మన దేశంలో లేదు. ఆకాశవాణి మొదట్లో   బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టబడి, స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వ  అధీనంలోకి వచ్చింది. ఆకాశవాణి అనేక అద్భుత కళారూపాలను తమ కార్యక్రమాలుగా చేసి శ్రోతలను అలరించినప్పటికీ, వార్తల దగ్గరకి వచ్చేప్పటికి, ప్రభుత్వ ధోరణి తప్ప మరొక ధోరణి లేదు, ఉండటానికి లేదు. ఇప్పుడు ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ, స్వతంత్ర సంస్థగా ఉన్నది కాబట్టి, కొద్దిగా స్వంత ఆలోచనలు చేస్తున్నట్టుగా కనపడుతున్నది. ఆపైన ప్రస్తుతపు ఎలెక్ట్రానికి మీడియా వాతావరణంలో,   గంజాయి వనంలో తులసి మొక్కలాగ ఆకాశవాణి కనపడుతున్నది కాని, నిస్పక్షపాత వార్తలను ప్రసారం చేస్తున్నదా అంటే, లేదనే చెప్పవలసి ఉంటుంది.

ఇదే విషయం టి వి కు అన్వయిస్తే, దూరదర్శన్ ది కూడ ఆకాశవాణి పరిస్థితే కాని భిన్నంగా ఏమీ లేదు. 1990 లలో వచ్చిన కేబుల్  టి వి దుమారంలో అనేకానేక ప్రవైటు టి వి లు వచ్చి వాటిల్లో కొన్ని 24 గంటల వార్తా చానెళ్ళు ఏర్పడి, వార్తలను "ప్రసారం" చేస్తున్నారు అనే కంటె "ప్రచారం" చేయటం మొదలు పెట్టారు అంటే సరిగ్గా సరిపోతుంది. వార్తా చానెళ్ళ నిస్పక్షపాత ధోరణి అనేది  ఏమన్నా ఉన్నదా అసలు అని వెతికి పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సరే,   మళ్ళి ప్రింట్ మీడియా దగ్గరకు వెళితే, రాజకీయ నాయకులు పత్రికలను స్థాపించటం ఆంధ్ర పత్రికతోనే మొదలు కదా!  ఆ పత్రిక ఉన్నంత కాలం కాగ్రెస్ పక్షపాతం చూపిస్తూనే ఉన్నది. అటువంటి పక్షపాతం ఆ పత్రిక మొదటి రోజుల్లో స్వాతంత్ర్యం  వచ్చేవరకూ దేశభక్తి కింది చలామణి అయినా, 1947 తరువాత ఏ మాత్రం కల్తీ లేని పక్షపాత ధోరణే. ఆ పత్రిక కూడ 1970లు వచ్చేప్పటికి కాంగ్రెస్ ను బాహాటంగా  సమర్ధించటం తగ్గించింది. 1972-73 ప్రత్యేక ఆంద్ర  ఉద్యమం జరిగిన మూడు నాలుగు నెలలూ కూడా ఆ ఉద్యమానికి వెన్ను దన్నుగా నిలిచింది. ఆ ఉద్యమకారులకు అది సంతోషాన్ని ఇచ్చినా,  పత్రిక వ్రాసే విధానం నిస్పక్షపాతం అనటానికి వీల్లేదు. ఆ తరువాత  తరువాత రోజుల్లో ఆత్యయిక పరిస్థితి  విధించటం (1975 లో)  పత్రికా స్వాతంత్రానికి కాంగ్రెస్ విఘాతం కలిగించటంతో చాలా పత్రికలు తమ కాంగ్రెస్ ప్రేమను వదిలేశాయి. కాని ఆ ప్రేమ అంతా కూడా ద్వేషంగా మారి పూర్తి కాగ్రెస్ వ్యతిరేక పత్రికలు అయిపోయినాయి. ఈ ధోరణి కూడా నిస్పక్ష పాతం కాదు కదా.

జనతా పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినప్పుడు, నిర్ద్వంద్వంగా (OUT AND OUT)  ఇండియన్ ఎక్స్‌ప్రెస్,  ఆ పార్టీ ని సమర్ధించింది. తరువాత ద్వంద్వ సభ్యత్వం విషయం మీద ( అంటే మునుపు  జనసంఘ్ సభ్యులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో సభ్యులుగా కొనసాగటం) ఆ పార్టీలో లుకలుకలు బయలుదేరగా, కాంగ్రెస్ చక్కటి "మీడియా మానేజిమెంట్" చేసి, పత్రికల్లో ఆ గోల భూతద్దంలో చూపించేట్టుగానూ, ఒక్కొక్క పత్రిక ఆ గొడవలో ఒక్కొక్క పార్శ్వాన్ని చూపించేట్టుగా చెయ్యటంలొ తన వంతు పాత్ర తాను సమర్ధంగా నిర్వహించింది. అప్పటి వరకూ దినపత్రికలుగా ఉన్న వార్తా పత్రికలు  ఎమర్జెన్సీ ఎత్తేసిన తరువాత, వార పత్రికలూ, పక్ష పత్రికలూ, మాసపత్రికలుగా పుంఖాను పుంఖాను పుంఖాలుగా  బయలుదేరాయు.  సండే, వీక్, ఇండియా టుడే, ఫ్రంట్ లైన్ అప్పుడు పుట్టినవే. ఈ పరిణామాన్ని జాగ్రత్తగా  చూస్తూ,   తద్వారా చివరకు జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి మీడియా సహాయంతో కల్పించటంలో అప్పటి అప్పోజిషన్ కాంగ్రెస్ మంచి విజయాన్ని సాధించింది. కాంగ్రెస్ ఈ సారి,  "కాంగ్రెస్ (ఐ)" అన్న పేరుతో మళ్ళి అధికారంలోకి వచ్చింది. అప్పటికి 1980 దశకం మొదలు అయ్యింది. కాంగ్రెస్ (ఐ) ఏమయ్యింది?  ఆ పార్టీని ఈరోజున కాంగ్రెస్ గానే ఎలా పరిగణిస్తున్నారు? కాంగ్రెస్ (ఐ) అనే పార్టీ పేరు ఏమయ్యింది అన్న  విషయం మీద నాకు ఇంతవరకూ మీడియాలో-ప్రింట్ కాని, ఎలెక్ట్రానిక్ కాని-విడమరిచి చెప్పిన దాఖలాలు కనపడలేదు, వినపడలేదు. కాని,  పూర్వ జనసంఘ్ సభ్యులు ఒక సామాజిక సంస్థలో(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) సభ్యులవటమే  పెద్ద తప్పిదం అనుకునే విధంగా చిత్రీకరించటం మీడియా ఘనంగా నిర్వహించింది.  ఇది ఏపాటి నిష్పాక్షపాతతో తెలియదు మరి! 
పక్షపాత ధోరణి దాదాపు 1980 లవరకూ కూడా కనిపించీ కనపడకుండా చాప కింది నీరులాగానే ఉన్నది.  1980 దశకం మన పత్రికా చరిత్రలో చాలా ముఖ్యమైనది. అంటె పక్షపాతం, నిస్పక్షపాతం అనే కూడలిలో ఉన్నాయి అన్ని పత్రికలూ. పార్టీ నాయకులు పెట్టిన పత్రికలు ఎలాగూ తమ పార్టీ వారినే సమర్ధిస్తాయి. కాని అలా కాకుండా ఉన్న పత్రికలు ఏమి చెయ్యాలి. చివరకు ఈ పత్రికలలో దాదాపు అన్నీ కూడా ఏదో ఒక పట్టు కొమ్మను సంపాయించుకున్నాయి.

1983 వచ్చేప్పటికి ప్రాంతీయ దుమారం లేగి ఎన్ టి ఆర్ పెట్టిన తెలుగు దేశం పెనువేగంతో వచ్చి అధికారం చేజిక్కించుకున్నది. ఆ క్రమంలో "ఈనాడు" వార్తాపత్రిక,  తెలుగు దేశం అని పిలవబడే రాజకీయ పార్టీకి  ఇచ్చిన మద్దతు ప్రజాస్వామ్య పరిరక్షణ అన్న పేరుతో కొట్టుకుపోయింది కాని,  పక్షపాత ధోరణి అని అప్పుడు  ఎవరూ పెద్దగా అనుకోలేదు. నాదెండ్ల భాస్కర్ రావు 1984 లో ఎన్ టి ఆర్ ను పదవీచ్యుతుణ్ణి చేసినప్పుడు కూడా అదే పత్రిక, "ప్రజాస్వామ్య పరిరక్షణ" చేసి అందరి మెప్పు సంపాయించింది. కాని నాదెండ్ల చేసినపనే   ఎన్ టి ఆర్ అల్లుడు కొన్ని సంవత్సరాల తరువాత చేస్తే, ఆ పనిలో తప్పు ఈ పత్రికకు వీసమంతైనా కనపడలేదు. అప్పటికి ఎన్ టి ఆర్ రెండవ వివాహం చేసుకుని ఉండకుండా  ఉంటె,  ఈ పత్రిక అలాగే నిమ్మకుండిపొయ్యేదా, లేదా ఆ తిరుగుబాటును సమర్ధించేదా. లేదా మరొక కోణం చూద్దాం, ఆ తిరుగుబాటును కడియం శ్రీహరి గారో, ఎర్రం నాయుడుగారో చేసి ఉంటే ఆ తిరుగుబాటును ఈ పత్రిక సమర్దించేదా  అన్నది కోటి రూపాయల ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు అందరికీ తెలుసు. ఆ జవాబే మన తెలుగు మీడియాలో ఉన్న మీడియాకు  సంబంధించిన పక్షపాత ధోరణికి  సాక్ష్యం!  అదే  పత్రిక  ఒకే పార్టీ తరఫున వ్రాస్తున్నది  అన్న ఆరోపణలకు గురి అయ్యి,  ఇప్పటికి కూడ బయటపడలేక పోతున్నది. ఏది ఏమైనా పక్షపాత పత్రికగానే నిలిచింది కాని, నిస్పక్షపాత ధోరణి అప్పుడప్పుడూ కంటి నీడి తుడుపుగా చూపించినా, నిస్పక్ష ధోరణికి కొనసాగించలేకపోయిందనే చెప్పుకోవాలి.

ప్రపంచ వ్యాప్తంగా 1950 లలో మీడియాలో ఒక పెను మార్పు వచ్చింది, ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో. అదేమిటి అంటె, ఆ పత్రిక యజమానే ముఖ్య సంపాదకుని అవతారం ఎత్తటం, అసలు సంపాదకుడు ఉద్యోగిగా మారటం.  ఈ మార్పు కనిపించీ కనపడకుండా మన దేశంలో ఉన్నా కూడా, 1980-90లు వచ్చేప్పటికి, అసలు పధ్ధతి అదే, యజమానే సంపాదకుడు
ఒకప్పటి రష్యాలో మీడియా స్వాతంత్ర్యం 
గురించిన కార్టూన్ 
అవ్వాలి, అలా కాకుండా సంపాదకత్వం చేసేది మరెవ్వరు చేస్తారు అని చాలా
సిన్సియర్ గా వాదించేవరకూ పెరిగిపోయింది.  తద్వారా, సంపాదకుడు "ఉద్యోగి" లేదా ఫ్రంట్ మాన్ (Front Man) గా మాత్రమే ఉండటం అలవోకగా జరిగిపోయింది. మా యజమాని మా మీద వత్తిడి తీసుకురాడు, మేము స్వతంత్రులమే అని అప్పుడప్పుడూ, భుజాలు తడుముకుంటారు కాని, ప్రస్తుతం పత్రికలు, చానెళ్ళ నడవడికలో ముఖ్య పాత్ర యజమానులదే కాని, సంపాదకులదేనా?  అని అడిగితే నిర్ద్వంద్వంగా, ఘంటాపథంగా, సంపాదకులదే తుది నిర్ణయం అని చెప్పుకునే స్థితి ఉన్నదా! అటువంటి స్థితికి  కారణం ముఖ్య సంపాదకుడు ఆ పత్రిక  యజమానే కాబట్టి. అటువంటి పరిస్థితులలో, నిస్పక్షపాత ధోరణి ఎక్కడినుంచి వస్తుంది?  ప్రస్తుతం ఉన్నదే నిస్పక్షపాత ధోరణి అనేసుకుంటే చెయ్యగలిగినది ఏమీలేదు. దానినే ఉన్నంతలో తృప్తిగా బతకటం, చిన్నప్పుడు చదువుకున్న పద్యం తానొవ్వక, ఇతరుల  నొప్పింపక తిరుగువాడు ధన్యుడు సుమతీ తాత్పర్యాన్ని బాగా వంటపట్టించుకునట్టుగా  అనుకోవాలి తప్పితే మరొకటి కాదు అని నా భావన. 


ఇక పత్రికలను  ఒక సామాజిక అవసరంగా కాకుండా పూర్తి వ్యాపార దృష్టితో నడపటం అనేది 1990 లు వచ్చేప్పటికి బాగా ఎక్కువయి పోయింది. ప్రవైటు టి వి చానెళ్ళకు ప్రకటనల వల్ల  వస్తున్న  ఆదాయం  చూసేప్పటికి అది కోట్లల్లో ఉండటం ఒక ఆకర్షణగా మారిపోయి, మీడియా కూడ ఒక వ్యాపారం కింద పెట్టుబడి పెట్టవచ్చు అన్న ఆలోచన "పెద్ద వాళ్ళ" కు రావటం జరిగింది. మెల్లిమెల్లిగా మీడియా వ్యాపార ప్రకటనలను తయారుచేసే వారు వాటిని  మీడియాకు ఇప్పించేవారి "హవా" మొదలయ్యింది. ప్రస్తుతం, అదొక పెద్ద లాబీ అనే కంటే మాఫియా అనటం సమంజసమేమో మరి. అటువంటి యాడ్ మాఫియా కనుసన్నల్లోనే ప్రస్తుతం మీడియా నడుస్తున్నది కాని నిస్పక్షపాత ధోరణితో కానే కాదు.  కోట్లల్లో నిండు పేజీ ప్రకటనలను ఇస్తూ ఉండే ఏ ఇండస్ట్రియల్ హౌస్ కు వ్యతిరేకంగా ప్రస్తుతపు మీడియా వార్త వ్రాయగలదా! ప్రకటనల లెక్కేమిటి మాకు అని, నిస్పక్షపాతంగా ఉండగలిగిన మీడియా మనకు ఉన్నదా! ఎక్కడ ఏ వార్త ఎప్పుడు మేము వెయ్యలేదు అని నిలదీస్తే, ఎవరు చెప్పగలరు!  కారణం, వారు వెయ్యని వార్త మనకు తెలిస్తే కదా!!  అలా చూపించాలిసినది, వ్రాయాలిసినది మీడియానే మరి!

ప్రస్తుతపు మీడియా ధోరణి చాలా చిత్రమైనది. ఒక పార్టీని పట్టుకుని, రెండో పార్టీని కడిగి పారెయ్యటం. ఒక పార్టీ ప్రభుత్వంలో ఉంటె, ఒక ధోరణి, మరొక పార్టీ అధికారంలో ఉంటె మరొక ధోరణి. కాంగ్రెస్ కాకుండా మరొక పార్టీ ఏదన్నా అధికారంలోకి ఒక రాష్ట్రంలోకి వస్తే, అక్కడ ఏమి జరుగుతుందా, తెగ చూపించేద్దాము అన్న తాపత్రయం కనపడుతుంది. మామూలుగా చూపించే పధ్ధతికి వెయ్యి రెట్లు ఎక్కువ చేసి చూపటం ఒక అలవాటుగా మారి, అదే మీడియా నిస్పక్ష పాత ధోరణి అని ప్రకటించుకునే వరకూ వెళ్ళిపోగా, ప్రజలు మాత్రం అది "మీడియా సర్కస్" అని కొట్టి పారేసి చానెల్ మార్చుకుని, పాత సినిమా పాటలు, లేదా కార్టూన్లు  చూడటానికి అలవాటు పడ్డారు. అంతకంటే ఏమి చేయగలరు మరి! 

ఇప్పుడు తగ్గింది కాని, స్వతంత్ర భారత చరిత్రలో, మొట్టమొదటి సారి కాంగ్రేసేతర ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ఏర్పడుతున్న సమయంలో, మీడియా వాటిని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలుగా వ్యవహరించటం మొదలు పెట్టింది! ఇలా ఎవరు మొదలు పెట్టారో కాని, వారి మనస్సు ఎంతటి ప్రేజ్యుడీస్ తో నిండి ఉండాలి? కాంగ్రెస్ మాత్రమె అధికార పార్టీ, మిగిలిన పార్టీలన్నీ కూడా ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షంగా పిలవబడుతున్న పార్టీ ఆ రాష్ట్రంలో అధికారం లో ఉన్నా సరే, అది ప్రతిపక్ష పాలిత రాష్ట్రం!! ఎంతటి అద్భుత జ్ఞానం! నిజానికి అటువంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రతిపక్షం, వేరొక పార్టీ అధికార పార్టీ. 

మీడియాలో ఇలా అప్పట్లో వ్రాయబట్టే, 1977 ఆగష్టులో నేను ఒక విచిత్ర ప్రశ్నను ఎదుర్కొన్నాను. సిటీ బస్సులో ప్రయాణిస్తూ ఉంటే, నా చేతిలో పేపరు చూసి పక్కన కూచున్న పెద్దాయన (ఆయనెవరో నాకు తెలియదు) అడిగిన విషయం నన్ను విచలితుణ్ణి  చేసింది. ఆయన అన్న మాటలు, "ఇప్పుడు జనతా పార్టీ అధికారం లో వచ్చింది కదా ఆగష్టు పదిహేనుకు, జనతా పార్టీ జెండా ఎగరేస్తారా". అంటే ప్రజలకు బారత జెండాకు, అదే రంగులున్న ఒక పార్టీ జెండాకు తేడా స్వాతంత్రం వచ్చిన మూడు దశాబ్దాలకు కూడా తెలిసే అవకాశం లేకుండా చేసారు. పోనీ ఆ పెద్దాయన నిరక్షరాశ్యుడా అంటే, పంచే లాల్చీ వేసుకున్నా కూడా (!!) బాగా చదువుకున్న వారిలాగే కనపడ్డారు. ఉన్న పరిమిత సమయంలో (నేను లేదా ఆయన దిగే లోపల) భారత జెండాకు ఒక పార్టీ జెండాకు తేడా చెప్పే ప్రయత్నం చేసాను కాని ఎంతవరకూ నా ప్రయత్నం ఫలించిందో తెలుసుకునే అవకాశం  లేదు.  చెప్పొచ్చేది ఏమంటే, మీడియానే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు అని వ్రాస్తున్నప్పుడు సామాన్య పౌరునికి పై విధమైన తెలియని తనం ఉండటం లో  ఆశ్చర్యం ఏమున్నది!

ప్రస్తుతానికి నిస్పక్షపాత ధోరణికి గీటురాయి ఏమంటె, సెక్యులరిజం అనే ఒక మాట. ఈ మాట పట్టుకుని, సాధ్యమైనంతవరకూ, హిందూ మతాన్ని ఇష్టపడె  పార్టీలను తప్ప మిగిలిన అన్ని పార్టీలను లౌకిక పార్టీలుగా చిత్రీకరిస్తూ వారు ఎటువంటి పనిచేసినా సరే సమర్ధించటం ఒక గొప్ప నిస్పక్షపాత ధోరణిగా ఇప్పుడు మీడియాలో చెలామణి అవుతున్నది. ఒక పక్క కులమతాలు ఉండకూడదని గొతెత్తి అరుస్తూనే, ఒక మంత్రివర్గం ఏర్పడగానే, అందులో ఫలానా సామాజిక వర్గానికి చోటు  లేదు, ఫలానా సామాజిక వర్గానికి మాత్రమే చోటు ఎక్కువగా ఉన్నది అని వెర్రి విశ్లేషణ కూడా నిస్పక్షపాత ధోరణిగానే చెలామణి అవుతున్నది.  

ఇక పత్రికల్లో వామపక్ష ధోరణి ప్రస్తుతానికి "ఫ్యాషన్" కాదుట. ఒకప్పుడు,  అంటె 1970ల్లో,  లాల్చీ పైజమా  వేసుకుని, చంకకొక గుడ్డ సంచీ తగిలించుకుని, గుల్జార్ కళ్ళ జోడుతో  ఎటువంటి వార్తనైనా సరే ఒక వర్గపోరాట లో భాగంగా కమ్యూనిస్ట్ పదజాలంతో వ్రాయటం ఒక గొప్ప హాబీగా అన్ని పత్రికల్లోనూ వెలసిల్లింది. అదీ నిస్పక్షపాత ధోరణిగానే చెలామణి అయ్యింది. పత్రికా యాజమాన్యాలు,  అలా వ్రాయనివ్వటానికి (తమ దాకా రాకుండా జాగ్రత్త పరుస్తూ) కారణం తమ పత్రికను కొన్ని వర్గాల వారికి కూడా ఆకర్షణీయంగా రూపొందించటానికే  తప్ప మరొకటి కాదు.



ఇప్పుడు పక్షపాతం-నిస్పక్షపాతం అంటే ఏమిటి అంటే తెలియనంతగా గజిబిజిగా, గందరగోళంగా మీడియాను తయారుచేసి పారేశారు - రాజకీయనాయకులు, వాటిని నడుపుతున్న వ్యాపారస్తులు కలిసి. ఈ గందరగోళంలో అసలైన వార్త ఏది, ఏ పత్రిక, ఏ చానెల్,  ఏ వార్తను ఎందుకు ఎత్తి చూపుతున్నది లేదా అసలు వ్రాయటం లేదు అన్న విషయాన్ని, నిస్పక్షపాతంగా అర్ధం చేసుకోవాలిసిన బాధ్యత  పాఠకుడిది లేదా ప్రేక్షకుడిదే  కాని మీడియాది కాదన్నట్టుగా,  ఈ పక్షపాత ధోరణి విపరీతంగా ప్రబలిపోయి, "మీడియా హౌవుస్" లన్నీ కూడ అదే పద్ధతిన నడుస్తున్నాయి. ఈ విషయం ఎంతవరకూ వచ్చిందంటే,  మీడియాను అదుపులో పెట్టటానికి మార్గాలు అన్వేషించాలా  అన్న చర్చలు ప్రభుత్వం కాదు,  సామాన్య ప్రజలే లేవదీసేట్టుగా ఉన్నది.

టైమ్స్ నౌ ఆంగ్ల చానెల్ కు నవ నిర్మాణ్ సేన నాయకుడు రాజ్ థాక్రే   ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు మీడియా వారిని కూడా ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. ఈ వీడియో లో ఆయన, మీడియా గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రమే ఉంచటం జరిగింది పూర్తి వీడియో కావాలంటే టైమ్స్ నౌ (TIMES NOW) వారి వెబ్ సైటులో  కాని యు ట్యూబ్ లో  కాని చూడవచ్చు:
 పై వీడియా టైమ్స్ నౌ (Times Now) వారి వీడియోల నుండి గ్రహించబడినది.వారికి ధన్యవాదాలు 

 ఇక "పైడ్ న్యూస్" ట, వార్తలాగా కనిపించే ప్రకటనలుట, ఆ తరువాత, స్టింగ్ ఆపరేషన్లుట, అదికూడా కొంతమంది రాజకీయ నాయకులు, పార్టీలమీదే కాని అవసరమైన  అందరిమీదా కాదుట. వీళ్ళ లెక్క ప్రకారం ఒక్క బంగారు లక్ష్మణే  లంచగొండి రాజకీయ నాయకుడు!!!!!!  ఇదే మీడియా నిస్పక్షపాత ధోరణికి ఒక గొప్ప నిదర్శనం! ఈ మధ్య ఒక రివర్స్ స్టింగ్ ఆపరేషన్ జరిగింది.  అంటే, పత్రికా విలేఖరుల మీద, ఒక పెద్ద వ్యాపార సంస్థ "రివర్స్ స్టింగ్"(ఒక వార్త వెయ్యకుండా ఉండేందుకు ఆ పత్రికా ప్రతినిధులు డబ్బులు డిమాండ్ చేయ్యటాన్ని వీడియో రికార్డ్ చేసి-నీవు నేర్పిన విద్యే... అన్న విధాన) ఆ విషయం బట్టబయలు  చేసి  ఆ పత్రికను ఇరుకున పెట్టింది. ఆ లంపటం లోంచి బయట పడటానికి ఆ మీడియా హౌస్ నానా తంటాలూ పడుతున్నది. ఈ విషయం మిగిలిన చానెళ్ళ వాళ్ళు అతి కొద్ది చూపించి చేతులు దులుపుకున్నారు. ప్రేక్షకులు/చదువరులు Professional Courtesy అనుకోవటంలో తప్పులేదు కదా. కాని ఇదే స్టింగ్ తమ మీడియా వారి మీద కాకుండా ఉంటే ఆ వీడియో ఒకరి దగ్గర నుంచి మరొకరు అందిపుచ్చుకుని 24 గంటలూ తెగ చూపించి ఊదరపెట్టే వాళ్ళు కాదూ. ఇదీ నిస్పక్షపాతమేనా!!

 ఒకానొక యువ నాయకుడుట, ఒక పార్టీకి ఆ నాయకుడు తప్ప వేరొక దిక్కులేదట!  కాని, మన ఆంధ్రప్రదేశ్ లో వేర్పాటువాద ఉద్యమం మొదలయ్యి, ఒకపక్క ప్రత్యేక రాష్ట్రం, మరొక పక్క సమైక్యం అంటూ ఉంటె, ఆ యువనాయకుడు (ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవటం అంటూ  జరిగితేనుట,  వారేనుట ప్రధాని అయ్యేది) ఈ విషయం మీద ఒక్క మాట మాట్లాడడు. వారి పార్టీలోనే మరొక యువ నాయకుడు వారి పార్టీ మీద తిరుగుబాటు చేసే పరిస్థితి  వచ్చినా సరే, ఇతనూ యువకుడే "ట "కదా మరి (42 ఏళ్ళు!)  , ఆ మరణించిన నాయకుని పుత్రరత్నాన్ని సముదాయించటం ఏ మాత్రం చేతకాలేదు సరికదా, ఒక్క సారంటే ఒక్కసారి ఆ విషయంలో ఒక్క ప్రకటన, విడుదల  చెయ్యనే లేదు.  ఈ విషయాల మీద ఒక్క పత్రిక కాని, టి వి చానెల్ కాని మాట్లాడదు. ఆ యువ నాయకుని మీద ఈగ వాలనివ్వదు మీడియా. ఎందుకనో! ఇదీ నిస్పక్షపాత ధోరణేట.  కాని, ఎప్పుడో ఒక దశాబ్దం క్రితం జరిగిన ఒక ఘోరానికి ప్రతిక్రియగా జరిగిన మరొక ఘోరాన్ని మటుకు ఇవ్వాళ్టికి కూడా మళ్ళీ మళ్ళీ ఆ బొమ్మలే చూపిస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం మటుకు మీడియా చేస్తుంది (ఆ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు మరీను). ఇది కూడా నిస్పక్షపాత ధోరణేట మరి.

గ్రేట్ డిక్టేటర్ సినిమాలో చివరి సీన్ లో, హిట్లర్ ను అనుకరిస్తూ ఒక నియంత వేషంలో, చార్లీ చాప్లిన్ ఒక అద్భుతమైన ఉపన్యాసం ఇస్తాడు. అందులో, నియంతలు తమని తాము లిబరేట్ చేసుకుంటారని కాని, ఇతరులకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వరు అనే ప్రాపంచిక సత్యాన్ని అద్భుతంగా చెప్తాడు. ఈనాడు "ఫ్రీ మీడియా" అంటే, పత్రికలూ, చానెళ్ళు తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటానికి ఒక లైసెన్స్ అని  అన్వయించుకుని,  అంతకంటే ఫ్రీ మీడియా అంటే ఏమిటి అని బుకాయించే స్థితికి వచ్చింది. నిజమైన పత్రికా స్వేచ్చ అంటే ఏమిటి అనేది ప్రేక్షకులకు/చదువరులకు తెలిసే అవకాశమూ లేదు, ఎవరన్నా చెప్పే వారూ లేరు.   మీడియా తనకు ఇష్టమైన వార్తలనే ప్రసారం చేసే స్వేచ్చ తెచ్చిపెట్టుకున్నదని  చెప్పవచ్చు. కాని చదువరులకు, ప్రేక్షకులకు తాము చదువదలుచుకున్న వార్తలు కోరే అధికారం ఎప్పటికీ రాదు వదిలేయండి, కనీసం అలా  కోరే అవకాశం  ఎప్పటికన్నా వస్తుంది అంటారా. చాలా చిత్రంగా ఉంటుంది మీడియా వ్యవహారం. ఒక వార్త గురించి ప్రపంచంలో ఇంతకంటే ఘోర అన్యాయం జరగటానికి అవకాశం ఉన్నదా అన్నట్టుగా గోలగోలగా ఊదరగొట్టేస్తారు. ఒక నాలుగు రోజులు పోయినాక ఆ విషయంలో ఏమయ్యింది అనే విషయాన్ని పొరబాటున కూడా ఎక్కడా రిపోర్ట్ చెయ్యరు. ఆ సంఘటన జరిగినప్పుడు ఉన్న "న్యూస్ వాల్యూ" ఆ తరువాత ఉండదుట! నాకు గుర్తుకు వచ్చిన అతి కొద్ది విషయాలు:
  • వధేరా వ్యవహారం లో మీడియాలో విషయాలు బయటకు వచ్చినాక ఏమయ్యింది, ప్రస్తుత పరిస్థితి ఏమిటి.
  • విజయవాడలో చిన్నపిల్లను కిడ్నాప్ చేసి ఆ తరువాత చంపేసిన ఉదంతం లో ఆ ఘోరం చేసిన వాడిని అరెస్ట్ చేసారు. ఇప్పుడు ఆ కేసు ఎక్కడ ఉన్నది?
  • చార్మినార్ బాంక్ దివాళా వ్యవహారం ఇప్పటి పరిస్థితి ఏమిటి.
  • కృషి బాంక్ వెంకటేశ్వరరావు ఇప్పుడు ఏమి చేస్తున్నాడు, ఆ బాంకు ఖాతా దారులకు డబ్బులు అందినాయా.
  • ముంబాయిలో 2008 లో టెర్రరిస్ట్ దాడి జరుగుతుండగా మీడియా, ఆ టెర్రరిస్టులకు చెవులు కళ్లుగా  పనిచేయటాన్ని తట్టుకోలేక వందల మంది పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ సుప్రీం కోర్టులో వేశారుట. ఆ కేసు ఏమయ్యింది.
 ఏవో ప్రమాదాల వార్తలు, ప్రకృతి వైపరిత్యాల వార్తలు మాత్రం ఒక పధ్ధతిలో వాళ్ళకు చేతనైనంతవరకూ పాఠకులకు, ప్రేక్షకులకు అందచేస్తారు. మళ్ళీ ప్రమాదం చేసిన వ్యక్తి రాజకీయ నాయకుడైతే, లేదా ఆ ప్రకృతి వైపరీత్యం గురించి ముందుగా చెప్పలేకపోవటం, లేదా ఆ తరువాత రిలీఫ్ పనులు సవ్యంగా జరగలేదు అనే మాట వస్తే,  ఒక్కో పత్రిక/చానెల్ ది ఒక్కొక్క దారి. సవాలక్ష మాటలేల, ప్రతి  పత్రికకు, ప్రతి చానెల్ కు ఒక "ఎజెండా"  అంటూ ఉన్నది. ఆ ఎజెండాలో ముఖ్యమైనది ఏ పార్టీ తరఫున తాము ఉంటే ఎక్కువ లాభదాయకం అన్నదే కాని మరొకటి కాదు అని ప్రజలు చెవులు కొరుక్కోగలరే కాని,  మీడియాలో   "మీడియాలో నిస్పక్షపాతత" అనే విషయం మీద నిఝంగా నిష్పక్షపాత చర్చ జరిగే అవకాశం ఉన్నదా అసలు? 


ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ ఆత్మకథ 
ఆఫీసు పని వత్తిడులలో,  అప్పుడప్పుడు మాత్రమే వ్రాస్తూ వచ్చాను. ఈలోగా ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నాయర్ వ్రాసుకున్న ఆత్మకథ "బియాండ్ ది  లైన్స్" (Beyond the Lines) కొనటం జరిగింది. ఆ పుస్తకం చదవటం మొదలు పెట్టాను కాని ఇంకా పూర్తి  చెయ్యలేదు (కొన్నది 12 12 2012 సాయంత్రం). ఆ పుస్తకాన్ని తిరగేస్తూ ఉంటే (400 పైచిలుకు పుటలు), చివరలో ఆయన ఈనాటి మీడియా ఉన్న పరిస్థితి మీద The Indian Media అనే శీర్షికతో ఒక వ్యాసం వ్రాసి, తన ఆవేదనను వ్యక్త పరిచారు. ఆ వ్యాసం నుండి ఆయన మాటలు లో కొన్ని చూడండి :
  • Journalism as a profession has changed a great deal from what it was in our times.  I feel an acute sense of disappointment, not only because it has deteriorated in quality and direction but also because I do not see journalists attempting to revive the values once practised.  The proliferation of newspapers and television channels has no doubt affected the quality of content, particularly reporting.   Too many individuals are competing for the same space.  
  •  What appalls me most is that editorial primacy has been sacrificed at the altar of commercialism and vested interests.  It hurts to see many journalists bending backwards to remain handmaidens of the proprietors, on the one hand and the establishment, on the other.  This is so different from what we were used to.
  • Today bulk of our news papers and television channels are owned and run as family enterprises.  The proprietors are usually the real editors, even when they have a front man called 'Editor'.  A few newspapers have members of their family formally trained. 
  •  In our days, the business or the advertisement department would maintain a distance from the Editorial Section because they were aware that we did not welcome even their Managers.  Whenebver a press note or some other material came from them, we just threw it into the wastepaper basket.  Even when they wrote "Business Must", it made no difference.  
  •  Today a new innovation called CEO has been introduced in newspapers as if the press was an industry or business house.  The CEOs matter more than Editors.  Some News Papers, like the Times of India, have no Editor.  They proudly pronounce that the market is more important than the Editorial content and are proud to sell news columns.  That is how the term 'paid news' has come into currency, although the practice has been misused by regional papers beyond all limits. 
  • The Corporate Sector dictates not only to small but also to large newspapers on the line they should or should not adopt on important economic matters.  The rivalry within the corporate sector is also affecting the press because the comparatively more powerful industrialist can arm twist a newspaper proprietor and advise him or her not to run the advertisement of a rival. 
  • Honesty in money matters is important for Editors,  but it is crucial in the running of newspapers.  The printed word is still gospel truth for our readers. I know of Editors who mould their writings to please the powers that be at the time and that do a U-turn when there is a change of government.  Different political parties when they come to power use advertisements to influence the media.  Ninety five percent of the news papers in India cannot resist this temptation because government advertisements constitute a substantial part of their revenue. The television networks are no different. 
  • What has disappointed me most is the compromises that journalists make to advance their careers.  Indeed, success has become synonymous with passiveness.  If you know how to get along, you advance in life and begin to believe that talent does not matter, but conformism does.
  • ...The Press Council of India appointed a committee which investigated charges (re.paid news).  The report was first suppressed and then altered because the council members, under pressure from their owners, could not reach a consensus.  Some portion of the report is as follows:
In recent years, corruption in the Indian media has gone way beyond the corruption of individual journalists and specific media organistions - from "planting" information and views in lieu of favours received in cash or kind, to more institutionalised and organised forms of corruption wherein news papers and televisions channels receive funds for publishing or broadcasting information in favour of particular individuals, corporate entities, representatives of political parties and candidates contesting elections, that is sought to be disguised as "news"
 కులదీప్ నాయర్ కంటే మాకు ఎక్కువ తెలుసు, ఆయనకేమి తెలుసు మీడియా నిస్పక్షపాతత గురించి, అప్పుడెప్పుడో కాదు ఇప్పటికీ నిస్పక్షపాతమే అనేసుకుని నా చిన్ని బొజ్జకు శ్రీరామరక్ష దీవెనలతో  తృప్తిగా ఉండగల  నిబ్బరం ఉన్నవాళ్ళది, పైన ఒకచోట అన్నట్టుగా సుమతీ శతకకారుని  పద్యాన్ని (తానోవ్వక్క ఇతరుల నొప్పింపక.....తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ) అద్భుతంగా వంటబట్టించుకున్న  నికార్సైన లౌక్యం తప్ప మరొకటి కాదని నా ఉద్దేశ్యం.

వేయి మాటలేల, మీడియాను విమర్శిస్తూ ఎవరన్నా వ్యాసం వ్రాస్తే ఏ  పత్రికలోనన్నా ప్రచురించే అవకాశం  ఉన్నదా!  ప్రస్తుతానికి సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని ఇలా బ్లాగుల్లో వ్రాసుకునే అవకాశం  ఉన్నది కాని, సామాన్య ప్రేక్షకుని/చదువరి మనస్సులో మాట నలుగురితో పంచుకునే అవకాశం మీడియాలో ఉన్నదా. ఇక్కడ కూడా అభిప్రాయం వెలిబుచ్చినా, మీడియా వారు దాడి చేసి ఆ వ్రాసిన మనిషిని ఏకాకి చేసే ప్రయత్నాలు అనేకం జరిగాయి,   జరుగుతాయి కూడా. ఎవరైనా తాము చేసే ఉద్యోగం, వృత్తి లేదా వ్యాపారం  గురించి సమర్ధించుకోవటం సహజం. మీడియా కూడా అదే దారిన నడుస్తున్నది అని నా భావన.

చిట్ట చివరగా, సమాజానికి మీడియా కావాలి. అలాగే మీడియా,  సమాజం లేకుండా లేనే లేదు. సమాజంలో జరిగే అవకతవకలు ఎత్తి చూపించటానికి మీడియా  ఎంతయినా అవసరం ఉన్నది.  కానీ,  అదే మీడియాలో జరిగే అవకతవకలు ఎవరు  ఎత్తి  చూపుతారు? ఎవరన్నా ఉండే  అవకాశాన్ని మీడియానే కలుగచేసుకోవాలి. అంబుడ్స్మన్ అనండి, లేదా సెల్ఫ్ సెన్సార్ అనండి లేదా మరేదన్నా పేరు పెట్టుకొండి, కాని  అలా కలుగచేసుకోవటం  మీడియా ఆరోగ్యానికి ఎంతయినా అవసరం.   రోగగ్రస్తుడికి వైద్యం ఎప్పుడూ  వెగటునే కలిగిస్తుంది.  కాని వైద్యం లేకపోతే  రోగి మరణిస్తాడు. ఈ విషయం తెలిసిన రోగి బతుకుతాడు, ఇంకా బాగా తెలిసి ఉన్న వ్యక్తి  రోగి కాకుండా, రోగం రాకుండా తనను తానూ కాపాడుకుంటాడు. రోగం వచ్చినా కూడా  అనారోగ్యమే  లేదని చెప్పుకుంటే రోగం ముదరటమే కాకుండా  ఏ విధమైన వైద్యానికి లొంగని పరిస్థితి ఏర్పడటం జరుగుతుంది.
=================
రాడియా టేపుల వ్యవహారం లో మీడియాకు  వచ్చిన అప్రదిష్ట అంతా ఇంతా కాదు!

ఎన్ డి టి వి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని (పైన ఉన్న వీడియో) ఈ విషయంలో  చేసింది. ఆ కార్యక్రమానికి తమ ఎడిటర్ ఎవరైతే ఆ టేపుల్లో వినపడ్డారో వారిని,  మరి కొందరు బయట ఎడిటర్లను పిలిచారు ఆ కార్యక్రమాన్ని "ఎడిట్" చెయ్యలేదట, ఎలా వచ్చిన కార్యక్రమం అలాగే చూపించారుట, ఆ విషయం ఆ కార్యక్రమపు మొదట్లో ప్రకటించి మరీ చెప్పారు, వారి ఇతర కార్యక్రమాల్లో ఇలా ఎప్పుడూ  ప్రకటించారు.  ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ డి టివి ఎడిటర్ తాను ఈ వ్యవహారం వల్ల  చాలా హార్ట్ అయ్యానని, ప్రచురించిన ఆ పత్రిక పెద్దగా లెక్క  లేకుండా(with impunity) ప్రచురించింది అన్నారు. తమ మీద ఆరోపణ వచ్చింది కాబట్టి,  చేతిలో చానెల్ ఉంది కాబట్టి, తాము అమాయకులమని నిరూపించుకునే ప్రయత్నం (ఇది ప్రేక్షకులు ఎంత నమ్మారు అన్నది తెలియదు) ఎంతో చేశారు.  ఇదే విధమైన కర్టెసీ, వీరు తమ వార్తా ప్రచారానికి గురిపెడుతున్న వ్యక్తులకు ఇస్తున్నారా!? అలా మీడియా పక్షపాతానికి గురయ్యిన వారికి మీడియాలో తమ పొజిషన్ చెప్పుకునే అవకాశాన్ని (వారి మనుషులు ఆరోపణలకు గురయ్యారు కాబట్టి) ఇస్తారా, ఇస్తున్నారా, అది కూడా ఎడిట్ చెయ్యకుండా. ఎలాగో 24 గంటల చానెళ్ళే కదా, టైముతో పనేమున్నది? ఎంతసేపు అయితే అంతసేపు చూపించవచ్చు కదా. అలా ఎప్పుడన్నా చేశారా!!?

ఈ మొత్తం విషయం మీద నాకొక కోరిక ఉన్నది. మీడియా తమ కథనాలను ఎలా సేకరిస్తారు (ముఖ్యంగా టి వి జర్నలిస్టులు) ఏ విధంగా వివిధ వ్యక్తులను మాట్లాడే విధంగా చేస్తారు అనే విషయాన్నీ చూపించే ఒక నిస్పక్షపాత చానెల్ ఉంటే చాలా బాగుంటుంది. చదువరులకు/ప్రేక్షకులకు తమ ముందుకు వచ్చే వార్తా, వార్తా వ్యాఖ్యలు ఎలా వస్తున్నాయో, ఎలా తయారవుతున్నాయో తెలుస్తాయి. 

 oooOooo





 


16 కామెంట్‌లు:

  1. చాలా బాగా రాశారండి. ప్రస్తుత జర్నలిజం ముఖ్యంగా ఇంగ్లిష్ మీడియా, దేశ సామాన్య పేద, మధ్యతరగతి ప్రజల నుంచి దూరంగా జరిగి అంతర్జాతీయ కోణం లో నుంచి (ఆ చానల్స్ లొ పని చేసే ఎడిటర్లు ఎక్కువగా లండన్,అమెరికా యునివర్సిటిలలో జర్నలిజం చదివిన వాళ్లు) మనదేశ సమస్యలను చూడటం మొదలు పెట్టారు. ఈ విషయం గ్రహించిన దేశ విదేశాలలో స్థిరపడిన మధ్యతరగతి వర్గం వారు, వారిని నిలతీయటం మొదలు పెట్టారు. ఇప్పుడు మీడీయా వారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

    2G scam sideshow: Netizens lambast high-profile journalists
    NEW DELHI: The people are showing who the boss is. The weapon in their hands is the internet, which, in the last five days, has seen frantic activism against "power brokering" by journalists in collusion with corporate groups and top government politicians. It all began with the publication of sensational tapes related to the 2G spectrum scam by two magazines over the weekend

    http://articles.timesofindia.indiatimes.com/2010-11-25/india/28254163_1_niira-radia-conversations-with-corporate-lobbyist-tapes

    రిప్లయితొలగించండి
  2. చాలా చక్కగా వ్రాశారు..... ప్రజలకీ, ప్రజాసామ్యానికి నోరులాగా [VOICE] ఉండి ప్రజల మధ్య జరిగే అన్ని విషయాలనీ ఏ మాత్రం పక్షపాతం లేకుండా చెప్పాలిసిన బాధ్యత మీడియాదే.... కానీ మన మీడియా నోరుకి "రాజకీయ పెద్ద మెదడూ........వ్యాపారపరమైన చిన్న మెదడులని" బయట నుండీ ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్ లాగా తగిలించుకొని పని చేస్తున్నది. మిడియా తనకి ఉన్న అసలు మెదడిని పూర్తిగా వదిలివేసింది..... స్వంతంగా మెదడు లేని మీడియా ఇంతకన్నా ఏమి చేస్తుంది.... బయట మెదడులు ఏది చెపితే అదే గంగిరెద్దులాగా తలాడిస్తూ చెయ్య వలసినదే కదా......!!!

    రిప్లయితొలగించండి
  3. చిన్న విషయం చెప్పటం మరచాను. ఈ సెక్యులర్ మీడియాకి ప్రత్యామ్నన్యాయం గా జాతీయ స్థాయిలో ఒక ఇంగ్లిష్ టి వి చానల్ పెట్టాలని కొంతమంది భారతదేశ బాగుకోరే వారు నిర్ణయించారు. అది త్వరలో కార్యరూపం దాల్చబోతోంది కూడాను. ఈ వ్యాసం మటుకు చాలా గొప్పగా రాశారు.

    రిప్లయితొలగించండి
  4. చాలా కాంప్రెహెన్సివ్ గా రాశారు.

    రిప్లయితొలగించండి
  5. ధన్యవాదాలు శ్రీరాం గారూ,ఫణీంద్ర గారు

    శ్రీరాం గారూ, ఆ కొత్త చానెల్ గురించిన వివరాలు మీ దగ్గర ఉంటె చెప్పండి. అటువంటి చానెల్ గురించి ఒక వ్యాసం వ్రాసి అందరికీ తెలియచెబుదాము.

    రిప్లయితొలగించండి
  6. శివరామప్రసాదు కప్పగంతు గారికి,
    చాలా బాగా విశ్లేషించారు. Kudos. ముఖ్యంగా ఎనబైయవ దశకంలో దాకా పత్రికలు స్తాపించబడిన తీరుతెన్నులు అవి తీసుకున్న stancesకి కారణాలు లాంటి విషయాలు తెలియని నావంటి వారికి చాలా ఆసక్తిగొలిపాయి.

    కాని ఒక ప్రశ్న! పత్రికలుగాని, వ్యక్తులు లేదా సంస్థలుగాని absoluteగా నిస్పక్షపాతంగా ఉండగలరా? నిస్పక్షపాతం అనేది relative టర్మ్ అని మాత్రమే అనిపిస్తుంది. నా ద్రుష్టిలో పత్రికలు పక్షపాతంగానే ఉండాలి కాని దానిని ధైర్యంగా నిజాయితీతో ఒప్పుకొని అవి ఆ stance తీసుకోవడానికి కారణం ఎంటో కూడా వివరించాలి. నిస్పక్షపాతం కన్నా ప్రజల అబిప్రాయాలు polarize చెయ్యడానికో లేదా చెయ్యకుండా ఆపడానికో అవి ఉండాలి. దిశానిర్దేశం చెయ్యగల రాజకీయ, సంఘీక, ఆర్థిక, సామాజిక, సాంసృతిక thought leadersకి ప్లాట్‌ఫారంలా ఉండాలి. కొన్ని సందర్బాలలో ఉంటున్నాయి కూడా. కాకపోతె మన దారిద్ర్యానికి (వారి భావ దారిద్ర్యానికి కూడా) వ్యక్తుల అలోచనలని విమర్షించడం వదిలేసి, ఏకంగా వ్యక్తుల పైనే బురద జల్లుకొవటంలాంటి విపరీతాలకి తెర తీస్తున్నాయి. మీ అంత అనుభవం విశ్లేషనా శక్తి నాకు లేవు కాని, మీ ఆర్టికల్‌లో కాంగ్రెస్ కి మీడియా భయంకరంగా వత్తాసు పలుకుతోంది, ఆరెస్సెస్ భ.జ.పా చిటికి మాటికి ఆడిపోసుకుంటుంది అంటున్నారు. అది వాస్తవం కూడా. కాని అది కాంగ్రెస్ media management strategy అని మీరే ముందు చెప్పిన వ్యాఖ్యం justify చేస్తుంది. మిడియా manage చెయ్యబడింది. అది ఆరెస్సెస్ చేతగాని తనమో లేదా కాంగ్రెస్‌కి First Movers Advantage అయ్యుండాలి.

    మీడియాకి అనవసరమైన పవిత్రతని ఆపాదించి అది ఈ విలువల ప్రకారమే నడుచుకోవాలనే నిబందన మీ ఆర్టికల్ లో కనపడుతుంది. పూర్తిగా సమజానికి లేని విలువలు ఒక్క industryకి గాని, sectionకి గాని ప్రత్యేకంగా ఆపాదిస్తే అవి ఎక్కువరోజులు నిలువవు.

    Sir, I firmly believe, be it media or any other sectin/sector, the values are merely a representation of society whole. And that is what we are seeing

    రిప్లయితొలగించండి
  7. ఆ చానల్ ఇంకా మొదలు పెట్టవలసి ఉంది. ప్రస్తుతానికి దాని పేరు తెలియదు. మొదలైతే మీకు చెపుతాను.

    రిప్లయితొలగించండి
  8. విజయ్ గారూ, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. సామాన్యంగా ప్రొఫైల్ లేని వారి వ్యాఖ్యలు కాని, ఉత్తిత్తి ప్రొఫైల్ అంటె ఏ మాత్రం వివరాలు లేని వారి వ్యాఖ్యలు కాని నేను ప్రచురించను. మీ వ్యాఖ్య కు సమాధానం చెప్పటానికి మాత్రమే మీ వ్యాఖ్య ప్రచురిస్తున్నాను.

    మీడియా పక్షపాతంగానే ఉండాలి అని అంటున్నారు. సరే బాగున్నది, ఎవరికి పక్షపాతంగా ఉండాలి? ఈ విషయం ఎవరు నిర్ణయించాలి, యజమాని, సంపాదకుడు, జరనలిస్ట్, రిపోర్టరు, ఫొటోగ్రాఫరు. మీరు చెప్పినట్టుగా ఆ విషయం ఒప్పుకుని వ్రాస్తే పరవాలేదు, చెప్పేవి శ్రీరంగనీతులు.... సామెతలో లాగ ఉంటెనే ప్రమాదం. పాఠకులు/ప్రేక్షకులను తప్పుదారి పట్టించినట్టు అవుతుంది. సమాజంలో కొన్ని వ్యవస్థలకు గౌరవం ఉండాలి. ఒకటి గురువు, రెండు నాయకుడు, మూడు మీడియా. ఈ మూడూ నిజాయితీ,బాధ్యతలతో ఉంటె,సమాజానికి సవ్యమైన విద్య దొరుకుతుంది, దశానిర్దేశనం జరుగుతుంది, కావలిసిన సమాచారం అందించబడుతుంది. ఆ కారణాన మీడియా నిస్పక్షపాతంగా ఉండాలి అని ఆక్రోశించటం. మీడియా గా పిలవబడుతున్న ఈనాటి ఈ "ప్రచార సాధనాలను" పూర్తిగా వినోదం కోసమే అనుకుని, నిజమైన మీడియా తయారయ్యితే బాగుండును అని నా భావన. కాని మనకు ఈ తేడా తెలియాలి. ఏ మీడియా వినోద ప్రధానంగా ఉండి మనకు వినోదం కలిగిస్తున్నది, ఏ మీడియా వినోదంలో భాగంగా మనను ప్రభావ పరచటానికి "ప్రచారం" చేస్తున్నది. ఏది మనకు నాణ్యమైన సమాచారాన్ని ఇస్తున్నది. ఈ విషయం, తేటతెల్లం చెయ్యకుండా చాపకింద నీరులాగ ఎవరి ఎజెండాలను వారు మీడియా ముసుగులో కొనసగిచంటం సమాజానికి ధ్రోహం చెయ్యటమే అని నా ఉద్దేశ్యం.

    మనం పత్రికల్లో కాని చానెళ్ళల్లోకాని చూస్తుంటాము. వార్తను వార్తగా రిపోర్ట్ చెయ్యటం లేదు. ఆ వార్త వ్రాసిన రిపోర్టరు లేదా ఆ యాంఖరు ల అభిప్రాయాలతో కలగలిసిపోయి వస్తున్నది. అది తప్పు పధ్ధతి. మీడియా తన అభిప్రాయం చెప్పుకోవటానికి సంపాదకీయాలు ఉన్నాయి, లేదా వ్యాసాలు వ్రాయవచ్చు. ముందు వార్తను ఎలా జరిగినది అలా మాకు తెలియచెయ్యండి. అంతే కాని వార్తను వక్రీకరించి, పూర్తిగా చెప్పకుండా, ఒక పక్కనుంచే చెప్పటం దారుణం, ఆపైన ప్రజల సమాచార హక్కును భంగపరచటమే. సమాచార హక్కు చట్టం గురించి ఇంత మాట్లాడుతున్న మన మీడియా, ఆ సమాచారాన్ని ఎంతవరకు కల్తీ లేకుండా తాము ఇస్తున్నది ఆత్మ విమర్శ చేసుకోవాలి అని నా అభిప్రాయం. కాంగ్రెస్ మంచిదా, బి జె పి పవర్ లోకి రావాలా అన్న విషయం మీద తప్పనిసరిగా ఇలా వ్రాస్తేనే నిస్పక్షపాతత అని కాదు నా అభిప్రాయం. ఈ ఇద్దరి మధ్య ఎవరిని ఎంచుకోవాలి అనే నిర్ణయం ప్రజలు చేసుకోగలిగిన సమాచారం మొత్తం కూడా మీడియా ఇవ్వగలగాలి. అంతే కాని ఒక నాయకుడి మీద స్టింగ్ ఆపరేషను చేసి అవినీతి అంతా అక్కడే ఉన్నది అన్నట్టుగా చిత్రీకరించటం దుర్మార్గమైన పని. వీళ్ళు సెక్యులర్, వీళ్ళు కాదు అని నిర్ణయించుకోవాలిసినది ప్రజలు. అసలు మనకు సెక్యులరిజం ఎంత కావాలి అనే విషయం కూడా నిర్ణయం తీసుకోవాలిసినది ప్రజలే కాని మీడియా కాదు. మీడియా చెప్పినంతవరకే మన ఆలోచించాలిసిన పని లేదు. ఎందుకు అంటె చాలా vested interestతో వ్రాస్తున్నారు ఇప్పుడు. మీరు చెప్పినట్టుగా అలా అని ఒప్పుకునే ధైర్యమే కాదు, నిజాయితీ కూడా లేదు. ఇదే చాలా బాధకలిగించే విషయం.


    రిప్లయితొలగించండి
  9. "I firmly believe, beit media or any ohter section/sector, the values are merely a representation of society whole and that is what we are seeing"

    I am of the view that it cannot be applied to Media. Media cannot be a mere representation of society. Media should be in a position to discern whats good or bad dispassionately but not with prejudice.

    This does not mean that while reporting itself, they start to propogate that this is good or this is bad. Let the analysis be presented to us as "analysys" but not as part of news. News and analysys are two different things but now the separation lines are not only quite blurred but also overlapping.

    Media gets along with the society at large but at a point when the society is turning towards wrong direction, Media should be able notice it in its initial stage itself to guide those who care to listen and guide sincerely and really sincerelly without any favour or prejudice.

    How to do it is the multi crore question and that is the refinement and goal towards what media should travel instead of bogging down to getting hypnotised by their own self acclaim of being quite impartial all the time and they reached the stage of nirvana already.

    రిప్లయితొలగించండి
  10. 1. "ఆయన(అంటే కల్లూరి భాస్కరం)(మీడియా)ఎప్పటికీ నిష్పక్షపాతంగానే ఉన్నది తెలుసుకోండి అనే విధంగా చెప్పడం". "అప్పుడెప్పుడో కాదు ఇప్పటికీ నిష్పక్షపాతమే అనేసుకుని నా చిన్ని బొజ్జకు శ్రీరామరక్ష దీవెనలతో తృప్తిగా నిబ్బరంగా ఉన్నవాళ్లది..."
    మొదటి వ్యాఖ్య గురించి...'అనేవిధంగా' అనడం కాదు, నేనలా ఎక్కడ అన్నానో స్పష్టంగా చూపించండి. చూపించలేనప్పుడు ఆ మాటను ఉపసంహరించుకోండి. చర్చలో పాల్గొన్న శ్రీనివాస్ గారు, నా బ్లాగులను చూసిన మిగిలిన వీక్షకులు నా డిమాండ్ తో ఏకీభవిస్తారనుకుంటున్నాను. మీడియాపై మీరు చేసిన నిర్దిష్ట ఆరోపణలో నిజం లేదంటూ కొన్ని వాస్తవాలను మాత్రమే ఉదహరించాను. ఆ నిర్దిష్ట ఆరోపణ ఏమిటో, నేనిచ్చిన సమాధానం ఏమిటో వీక్షకులు స్వయంగా చూసుకోవచ్చు.
    ఇక రెండవ ఆరోపణ...మీరు చేసే ఉద్యోగం ఏమిటో నాకు తెలియదు కానీ, మీడియా ఉద్యోగుల గురించి మీకు తెలిసింది తక్కువని పై వ్యాఖ్యను బట్టి అర్థమవుతోంది. 'చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష' అనే మాటనే తీసుకుంటే, అలా అనుకునేవారు ఎవరూ మీడియా ఉద్యోగంలోకి రారు. పదింటికి వెళ్ళి అయిదింటి తిరిగొచ్చే అవకాశమూ, రిటైరయ్యాక పింఛనూ వచ్చే ఉద్యోగం చూసుకుంటారు. మీడియా ఉద్యోగులకు ఈ రెండు అవకాశాలూ ఉండవు. ఉండకపోగా తక్కువ జీతంతో ఎక్కువ పనిభారాన్ని, ఉద్యోగంలో అభద్రతా పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. సాయంకాలాలు ఎలా ఉంటాయో కూడా మరచిపోయే స్థితిలో మీడియా ఉద్యోగులు ఏళ్లతరబడి గడుపుతారు. ఇప్పుడిప్పుడు మీడియా ఉద్యోగులకు ఆకర్షణీయమైన జీతాలు లభిస్తున్నాయి. అది కూడా ఆంగ్ల మీడియాలోనే. చానెళ్లు వచ్చిన తర్వాతే. తెలుగు పత్రికలకు సంబంధించినంతవరకు ఆకర్షణీయమైన జీతాలు ఇస్తున్న పత్రికలు రెండు కంటే లేవు. జీతాలు పెరిగినా పనిభారంలో, పనిగంటలలో మార్పు లేదు. మీ కుటుంబంలో, లేదా మీకు తెలిసిన కుటుంబాలలో మీడియా ఉద్యోగులు ఎవరూ లేకపోతే, కనీసం మీకు దగ్గరలో ఉన్న మీడియా ఉద్యోగిని ఒకసారి కదిపి చూడండి. మీడియా బతుకులు ఎలా ఉంటాయో చెబుతాడు. మీ ఉద్యోగం ఏమిటో నాకు తెలియదు కానీ ఆ ఉద్యోగంలో ఉండే సాధకబాధకాలు ఎలా ఉంటాయో తెలుసుకోకుండా నేను కామెంట్ చేయను. తెలుసుకోవలసిన అవసరం ఉంటే వినమ్రంగా అడిగి తెలుసుకుంటాను. వృత్తి నేర్పే క్రమశిక్షణ అది. ఇంకో విషయం. ఏవో ఆదర్శాల నుంచి స్ఫూర్తిని పొంది మీడియా లాంటి రంగాలలోకి ప్రవేశిస్తారు. అయితే ఏ ఉద్యోగంలోనూ ఆదర్శవంతమైన పరిస్థితులు ఉండవు. మీడియాలోనూ అంతే. మీడియాలో సంపాదకులు, సంపాదక సహాయకులు ఉంటారు. వాళ్ళ కంటూ కొన్ని విలువలు, ప్రాపంచిక దృక్పథం, జణహితం పట్ల నిబద్ధత ఉంటాయి. అవి కొంత లోపించినవారు మీడియాలో ఉన్నా మీడియా పని పరిధుల్లో, లక్ష్మణ రేఖను దాటకుండా పని చేయడానికి వారూ అలవాటు పడతారు. మరోవైపు మీడియా యజమాని అవసరాలూ, పాక్షికతలూ కూడా ఉంటాయి. అయినాసరే, సంపాదకులు, సంపాదక సహాయకులు పని చేయడానికి అవసరమైన సొంత జాగా ఉంటూనే ఉంటుంది. ఇప్పుడిప్పుడు ఆ జాగా తగ్గిపోతున్న మాట నిజమే. అయితే అది వేరే చర్చ. బీజేపీని వేలెత్తి చూపడమే మీడియా పతనానికి నిదర్శనంగా చూపించే ఒక సంకుచిత చర్చా వేదిక మీదికి ఆ చర్చను తీసుకురాను.

    రిప్లయితొలగించండి
  11. 2. "ప్రతి పార్టీలో జరిగినట్టే బీజేపీలో కూడా అంతర్గత యుద్ధాలు జరగకూడదని ఏమన్నా మీడియా రూలు పెట్టిందా? మీడియాకు ఎందుకింత ఆర్.ఎస్.ఎస్. ఫిక్సేషన్?" ఈ ప్రశ్న ఎలా ఉందంటే, అన్ని చోట్లా జరుగుతున్నట్టే ఢిల్లీలోనూ మానభంగాలు జరుగుతున్నాయి. జరగకూడదని మీడియా ఏమన్నా రూలు పెట్టిందా అని అడిగినట్టుగా ఉంది. మీడియా రూలేమీ పెట్టదు. జరుగుతున్నది చెబుతుంది. చెప్పడానికే అది ఉంది. అయినా మీకెందుకు అంత మీడియా ఫిక్సేషన్? ప్రజాక్షేత్రంలో ఉన్నవారిపైన, ఉన్న సంస్థలపైనా మీడియా ఫోకస్ ఉండి తీరుతుంది. అది ఫిక్సేషన్ అనండి, ఇంకోటి అనండి. మీడియా ఫ్యాక్ట్స్ తోనే కాదు పర్సెప్షన్ లతో కూడా డీల్ చేస్తుంది. వ్యక్తులనుంచి, సంస్థలనుంచి తప్పుడు సంకేతాలు వెడుతున్నా, స్వాభావిక విరుద్ధమైన పోకడలు కనిపిస్తున్నా మీడియా వాటిని ఎత్తి చూపిస్తుంది. వ్యాఖ్యానిస్తుంది. ప్రజాక్షేత్రంలో ఉన్నవారికి, ప్రజలకు మధ్య కమ్య్యునికేషన్ కు అవగాహనకు సాయపడేది మీడియానే. ప్రజాస్పందనను వ్యక్తులకు, వ్యవస్థలకు చేరవేసేది మీడియానే. అభిమానం దురభిమానంగా మారి ఎవరైనా మా పార్టీని, మా సంస్థను ఇలా అంటారా అని ఆవేశపడచ్చు. కానీ ప్రజాక్షేత్రంలో ఉన్నవారు అలా అనుకోలేరు. మీడియా అద్దంలో లోపాలను గుర్తించడానికి, జాగ్రత్త పడడానికి ప్రయత్నిస్తారు. లేదా ప్రయత్నించాలి. బీజేపీకి కానీ, ఆర్.ఎస్.ఎస్. కు కానీ ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ గీటురాయిగానే వాటి పోకడలను చూపించి, వ్యాఖ్యానిస్తుంది. ఉదాహరణకు, దుర్యోధనుడికి ఒక రేటింగ్, ధర్మరాజుకు ఒక రేటింగ్ ఉంటాయి. ధర్మరాజుతో విభేదించేవారు కూడా అతని రేటింగ్ ను గుర్తిస్తారు. ఆ రేటింగ్ తగ్గినట్టు అనిపిస్తే అయ్యో, ధర్మరాజే అనుకుంటారు. ఎవరివరకో ఎందుకు, నువ్వాడిన అబద్ధాన్ని నమ్మి గురువు ప్రాణత్యాగం చేశాడని సాక్షాత్తు అర్జునుడు అన్నను నిందిస్తాడు. మహాభారతం చూడండి. ఇవన్నీ మీడియా పనితీరు గురించిన ప్రాథమిక పాఠాలు, మరచిపోకండి.

    రిప్లయితొలగించండి
  12. మీ ప్రశ్న ద్వారా మీరే కాంగ్రెస్ ను, బీజేపీని ఒకే గాటన కట్టి దొందూ దొందే నంటూ మీ పార్టీకి మీరే డిస్సర్వీస్ చేస్తున్నారు. ఆవేశంతోనో, అనాలోచితంగానో మీ వాదాన్ని మీరే బలహీన పరచుకుంటున్నారు. పైగా మీడియా మీద రాళ్లేస్తున్నారు.
    3. "నా దృష్టిలో మీడియా మేనేజ్ మెంట్ కాంగ్రెస్ కు తెలిసినంతగా మరే ఇతర పార్టీకీ తెలియదు. బీజేపీ పరమ అసమర్థ పార్టీ, అందుకనే ఆ పార్టీ ఎప్పుడూ మీడియా నుంచి నెగెటివ్ రిపోర్టింగ్ ను ఎదుర్కొంటూ ఉంటుంది." కాంగ్రెస్ కు మీడియా మేనేజ్ మెంట్ బాగా తెలుసునంటే, కనీసం తెలుగు మీడియాలో మూడు దశాబ్దాలుగా ఉన్న మాలాంటివాళ్లం నవ్వుకోకుండా ఉండలేం. కాంగ్రెస్ అనుకూల మీడియా ఢిల్లీ స్థాయిలో అదికూడా ఏ హిందుస్తాన్ టైమ్స్ వంటి ఒకటి రెండు పత్రికలకో పరిమితమై ఉందేమో, నేను తగినంత పరిశీలన చేయకుండా ఇప్పటికిప్పుడు చెప్పలేను. తెలుగు మీడియాకు సంబంధించినంతవరకు మా అవగాహన, అనుభవం ఏమిటంటే మీడియా మేనేజ్ మెంట్ బొత్తిగా తెలియనిదీ, అందుకు పనిగట్టుకుని ప్రయత్నించనిదీ కాంగ్రెస్సే. ఇక్కడ బాగా వ్యాప్తిలో ఉన్న ప్రధాన పత్రికలను చూసినా ఆ సంగతి మామూలు పాఠకునికే తెలిసిపోతుంది, మేధావి పాఠకుడు కానవసరంలేదు. 1.హిందూ: యాంటీ-కాంగ్రెస్ 2. ఈనాడు: యాంటీ-కాంగ్రెస్ 3. ఆంధ్రజ్యోతి: యాంటీ-కాంగ్రెస్ 4. సాక్షి: యాంటీ-కాంగ్రెస్ 5. వార్త: ఒక్కోసారి కాంగ్రెస్ అనుకూలంగా కనిపించచ్చు. కానీ పూర్తిగా ప్రొ-కాంగ్రెస్ కాదు 6. ఆంధ్రభూమి: పూర్తిగా ప్రొ-కాంగ్రెస్ అని చెప్పలేం. 2004లోకి ఒకసారి వెళ్ళి, యూపీఏ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజునుంచే తెలుగు పత్రికల్లో కాంగ్రెస్ పై దాడి ఎలా ప్రారంభమైందో చూడండి. నేను కాకపోతే రాష్ట్రంలోని సీనియర్ పాత్రికేయులను ఎవరినైనా అడిగి చూడండి, కాంగ్రెస్ కు మీడియా మేనేజ్ మెంట్ ఎంత తెలుసో చెబుతారు. అన్నట్టు ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, మీడియా మేనేజ్ మెంట్ బాగా తెలిసిన ఏకైక తెలుగు రాజకీయ ప్రముఖుని మీరు పూర్తిగా వదిలేశారు. ఎన్నో ఆసక్తికరమైన ముచ్చట్లు ఉన్న ఆ విషయంలోకి నేనిప్పుడు వెళ్ళను.

    రిప్లయితొలగించండి
  13. చెప్పడం మరచిపోయాను. ఆయన కాంగ్రెసేతర ప్రముఖ నాయకుడు కూడా. బీజేపీకి ఆరేళ్లు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి.
    5. "వ్యాఖ్యలు అర్థవంతంగా, వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి." మంచిదే, మీ బ్లాగు గురించి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మరి ఎదుటివారి బ్లాగులు కరాబు చేసే దుస్సాహనికి ఎలా పాల్పడ్డారు? ఇదెక్కడి ద్వంద్వ నీతి? దీనిని ఎలాంటి సంస్కారం అనాలో విజ్ఞులైన మీ బ్లాగ్ వీక్షకుల నిర్ణయానికే వదిలేస్తాను. మీ 'వ్యాఖ్యలు ఎంత అర్థవంతంగా, వ్యాసానికి సంబంధించి ఎంత విశ్లేషణాత్మకంగా ఉన్నాయో' వీక్షకులే ఒక అంచనాకు రావడానికి వీలుగా మచ్చుకు ఒకటి ఉదహరిస్తున్నాను. "These reporters not only that they do not write anything about the leftist terrorism...may be out of fear or may be because of their leftist leanings or payments from China."ఒక విద్యావంతుడు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసినప్పుడు, గడ్కరీపై కానీ, మరొకరిపై కానీ వచ్చిన ఆరోపణలు చూసి, వారు నిజంగానే అవినీతికి పాల్పడ్డాడని ఒక అవిద్యావంతుడు నిర్ణయానికి వస్తే ఆశ్చర్యమేముంటుంది? అదీగాక, గడ్డి తినే అలవాటు ఉన్నవాడు, అందుబాటులో ఉన్న స్వదేశీ గడ్డి కోసమే ఎగబడతాడు కానీ విదేశీ గడ్డికోసం అర్రులు చాస్తాడా?? ఈ ఆరోపణలో ఎంత గొప్ప విశ్లేషణ ఉందో ఒకసారి ఆలోచించుకోండి. మీ ఆరోపణ బాణం మీలాంటి వాళ్ళ వైపే తిరిగే అవకాశముందన్న ఆలోచన కూడా లేకుండా నోరుజారారు. నా బ్లాగుపై మీ స్పందనలు, మీ బ్లాగుకు మీరే నిర్దేశించుకున్న ప్రమాణాలకు ఎంతవరకు తుల తూగేలా ఉన్నాయో ఆత్మ పరిశీలన చేసుకోండీ. మీ బ్లాగు వీక్షకులను కూడా పరిశీలించమని కోరుతున్నాను. 'ఒరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తా నొరులకు అవి చేయకునికి పరాయణము ధర్మపథములకెల్లన్' అనే తిక్కన సూక్తిని మీకు గుర్తు చేస్తున్నాను. ఇంకొకటి కూడా. నా ఈ స్పందనపై వెలువడే వ్యాఖ్యల విషయంలో కూడా మీ ప్రమాణాలను పాటిస్తారని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  14. 6. "కుల దీప్ నయ్యర్ కంటే మాకు ఎక్కువ తెలుసు, ఆయనకేమి తెలుసు మీడియా నిష్పక్షపాతత గురించి..." ఆంగ్ల మీడియాకు చెందిన కులదీప్ నయ్యర్ ఒక్కరే మీ కంటికి ఆని ఉండచ్చు. ఆయన కంటే ఎక్కువ కాకపోయినా ఏమాత్రం తక్కువ తెలియని సీనియర్ పాత్రికేయులు తెలుగునాట కూడా ఉన్నారు. ఇంకోటి కూడా మీరు గమనించాలి. కులదీప్ నయ్యర్ సీనియర్ పాత్రికేయుడిగా గౌరవనీయుడే. అయితే ఆయన ఎస్టాబ్లిష్మెంట్ కు దగ్గరగా కూడా ఉన్నారు. రాజ్యసభ సభ్యత్వం, బ్రిటన్ లో హైకమీషనర్ పదవీ పొందారు. మీడియా విలువలకు నికార్సైన ప్రతిబింబంగా ఆయనను చూపించి ఆయన ఫోటో పెట్టుకునేవారూ, ఆయన అభిప్రాయాలను విస్తారంగా అందించేవారూ ఈ వివరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎస్టాబ్లిష్ మెంట్ కు దూరంగా ఉండి, పదవికో పరకకో ప్రలోభపడకుండా జీవితాలు చాలించిన, ఇంకా జీవించి ఉన్న పాత్రికేయుల వైపు కూడా దృష్టి సారించండి.
    చివరగా నేను అనేది ఏమిటంటే, మీ ఫోటో చూస్తే మీరు తగినంత వయసున్న వారిలా , వయసుతోపాటు తగినంత పరిణతినీ ఆశించ దగిన వ్యక్తిలానే కనిపిస్తున్నారు. మీ స్పందనలలో కూడా ఆ పరిణతిని ప్రదర్శించండి. ఎవరిలోనైనా సరే సింగిల్ ట్రాక్ మనస్తత్వమూ, ఆలోచనారహితమైన ఆవేశమూ విజ్ఞానాన్ని, అవగాహనను పెంచుకోడానికి ఏమాత్రం తోడ్పడదు. ఎవరి దృక్పథాలూ, ఎవరి అభిప్రాయాలూ వారికి ఉంటాయి. నాగరికమైన పద్ధతిలో పంచుకోవచ్చు. అన్ని రకాల చర్చా వేదికలనూ పార్లమెంట్ లా మార్చాల్సిన అవసరం లేదు. చర్చించుకున్నంత మాత్రాన ఉన్నపళంగా ఎవరూ తమ అభిప్రాయాలనూ, విశ్వాసాలనూ మార్చుకోరు. కాకపోతే చర్చ వల్ల ఆలోచనలకు స్పష్టత వస్తుంది. అవతలివైపు ఏముందో తొంగి చూసే వెసులుబాటు కలుగుతుంది. అవగాహన విశాలమవుతుంది. చర్చ నుంచి ఏమైనా ప్రయోజనం పొందదలచుకుంటే వేదికను వీలైనంత ఆరోగ్యవంతంగా ఉంచడం మొదటి షరతు, చివరి షరతూ కూడా.

    రిప్లయితొలగించండి
  15. భాస్కరం గారూ,

    మీ స్పందనకు ధన్యవాదాలు. మీ స్పందన స్థాయి ఎలా ఉంటుందని అంచనా వేశానో, పొల్లుపోకుండా అలాగే స్పందించారు. నా అంచనా వమ్ముచెయ్యనందుకు కూడా ధన్యవాదాలు. మీడియాలోనివారు నేను వ్రాసిన వ్యాఖ్యలు కాని, నా బ్లాగులో వ్యాసానికి కాని తీవ్రంగా స్పందించటం నాకు కొత్త కాదు. అందుకే నా వ్యాసంలో "...ఇక్కడ కూడా అభిప్రాయం వెలిబుచ్చినా, మీడియా వారు దాడి చేసి ఆ వ్రాసిన మనిషిని ఏకాకి చేసే ప్రయత్నాలు అనేకం జరిగాయి, జరుగుతాయి కూడా......" అని వ్రాశాను. మునుపు ఏ ఫి మీడియా కబుర్లు బ్లాగులో, ఒకసారి, నా బ్లాగులోనే మరొక వ్యాసానికి ఇలాంటి అసహన ప్రధానమైన స్పందననే ఎదుర్కొన్నాను.

    మీ దృష్టిలో మీ బ్లాగుకు ఎవరన్నా వచ్చి వ్యాఖ్యలు వ్రాస్తే దాన్ని "ఖరాబు" చెయ్యటం అనుకుంటే మీకు చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. గమనించుకోండి. వృత్తి నేర్పిన క్రమశిక్షణ అని ఒక చోట చెప్పుకున్నారు. కాని మీరు వ్రాసిన ఒక్క అక్షరంలో అదేమిటో కనపడలేదు, విపరీతమైన తామసం తప్ప. ప్రస్తుతం మీడియా ఎదుర్కోంటున్న ఒక పెద్ద బెడద ఏమంటె, "విమర్శ". దశాబ్దాలుగా విమర్శ అంటే ఏమిటో, ఎలా ఉంటుందో, తెలియకుండా పెరిగిపోయింది మీడియా. ఈరోజున బ్లాగులు ఇతర సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్య పాఠకులు, ప్రేక్షకులు తమ అభిప్రాయాలను, స్పందనలను మీడియా వారి సెన్సారింగ్ లేకుండా తెలియచేసే అవకాశం వచ్చింది. ఈ పరిణామం మీడియాకు విపరీతమైన అసహనాన్ని కలగచేస్తుండటం సహజం. మీ స్పందనలో ఆ అసహనమే కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నది.

    నేను వ్రాసినది "మీడియా" అనే వ్యవస్థ గురించి. మీరు అయితే ఆ వ్యవస్థలో ఒక ఉద్యోగి అయ్యి ఉంటారు. మీ మీద నేనేమీ వ్యక్తిగత వ్యాఖ్యలు చెయ్యలేదు. కాని మీరు నా మీద, నా ఫొటో చూసి ఎదేదో వ్యాఖ్యలు చెయ్య ప్రయత్నించారు. దురదృష్టకరం.

    నేను వ్రాసిన వ్యాసం ఉన్నది, మీ స్పందన పోస్ట్ చేశాను. ఇతర వీక్షకులు కూడా నా వ్యాసాన్ని, మీ స్పందన చూసి ఎలా స్పందిస్తారో చూద్దాం. తరువాత నా స్పందన.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.