17, ఫిబ్రవరి 2013, ఆదివారం

శ్రీరంగం గోపాలరత్నం గారితో ముఖా ముఖి


గోపాలరత్నం గారితో ముఖాముఖి అంటే నేను పాల్గొన్న విషయం కాదు. ఎప్పుడో 1960 లలో మునుగంటి శ్రీరామమూర్తి గారి సంపాదకత్వం లో ప్రచురించబడిన గానకళ అనే నెలవారీ పత్రికలో ప్రచురించబడినది. ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి పాఠకులకు అందించినది "నారద" అనే పేరుతో అప్పట్లో వ్రాస్తున్న, అసలు పేరేమిటి నాకు తెలియని వారు. వారెవరో ఈ కథనం చదివిన వారు తెలిస్తే చెప్పగలరు.

స్కాన్ చేసిన పాత పత్రికలు   మనకు ఇంటర్ నెట్లో దొరకటం మొదలు పెట్టినాక (ఎ పి  ప్రెస్ అకాడమీ వారి పుణ్యమా అని) ఇలా అప్పటి వార్తలు, ఇంటర్వ్యూలు, చూసి తెలియని అనేకానేక విషయాలు తెలుసుకునే అవకాశం  దొరికింది. నాకు ఈ అదృష్టాన్ని కలగచేసినది మాత్రం మన బ్లాగు గంధర్వ శ్రీ శ్యాం నారాయణ గారు. వారికి నా ధన్యవాదాలు. 

దొరికిన సమాచారం ఏ విధంగా పంచుకోవాలి అని కాసేపు మీమాంసలో కొంత గడిపినాక అక్కడ ఉన్నవి "పిడిఎఫ్" వాటిని ఇమేజి ఫైళ్ళు గా చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తే చదవటానికి అంత సౌకర్యంగా ఉండదని, విషయం మొత్తం మళ్ళీ  టైపు చేసి ఇక్కడ అందచేయటం జరిగింది. 

శ్రీరంగం గోపాలరత్నంగారి సంగీత సాగరం లో ఓలలాడిన వారికి ఇక్కడ ఉన్న ఈ విశేషాలు ఎంతో ఆసక్తిని కలుగు చేస్తాయి. ఆవిడ చక్కటి సమాధానాలు సూటిగా ఏ విధమైన భేషజం చూపకుండా చెప్పటం చాలా ముచ్చట వేసింది. ముఖ్యంగా గాన కళ పత్రికలో ఆకాశవాణీ వారి కార్యక్రమాల మీద ముఖ్యంగా సంగీత కార్యక్రమాల మీద ఒకప్పుడు ప్రచురించిన సమీక్షలు (అవెక్కడున్నాయో వెతికి పట్టుకోవాలి) తరువాత నిలుపుచేసిన విషయం పత్రిక వారిని అడగటం ఆవిడకు "విమర్శ" మీద ఉన్న గౌరవాన్ని తెలియచేస్తున్నది.  ఈవేళ విమర్శ అంటేనే విరుచుకుపడి వ్యక్తిగతమైన ఆరోపణలకు దిగజారిపొయ్యే చౌకబారు మనుష్యులకు ఆవిడ ఒద్దిక ఎంతకీ అర్ధం కాకపోవటంలో  ఆశ్చర్యం ఏమీ లేదు.  

ఆంధ్ర దేశం ఈ రోజున మిమ్ములను చూచుకుని మురిసిపోతున్నది, గర్విస్తున్నది కూడ.  ఐతే, దీనెపై మీకు తోచిన అభిప్రాయాలేమైనా ఉంటే చెబుతారా?


దీనిపై నేను తెలిపే అభిప్రాయాలేవీ ప్రత్యేకంగా లేవు.  నాలో మాత్రం ఏ విధమైన మార్పు రాలేదు.  ఒద్దికగా ఉండటం నా స్వబావం. దేశానికేమైనా నా వల్ల పేరు ప్రఖ్యాతులు వస్తే నాకు ఒక విధంగా సంతోషకారణమని మాత్రం చెప్పగలను.  యధోచితమైన సేవ చేయగలిగామన్న సంతృప్తి అది.  అంతేగాకుండా ఇది గురుకటాక్షమని కూడా అనుకుంటాను
మీ గురుభక్తి చాలా ఆదర్శంగా ఉన్నది.  గురు శిష్య సంబంధంలో మీ అభిప్రాయాలేమిటండీ?


అది చాల పవిత్రమైనది.  ఈ రోజున ఒక స్థాయికి రాగానే గురువును విస్మరించే స్వభావం మంచిది కాదు.  గురుపీఠము గురుపీఠమే, ఆపైన అనేక మెరుగులు అనేకమంది వద్ద ఒకప్పుడు దిద్దుకొనవచ్చు. అనేక మంది సంగీతజ్ఞుల గానం ఆదర్శంగా తీసికొని అవలంభిచనూవచ్చు.  ఎందరో మహానుభావులు అనే త్యాగయ్యగారి అమర సందేశం ఉండనే ఉన్నది.  గురువును చిన్న చూపు చూడటము చిన్నబుచ్చటము అభిలషణీయం కారాదు.
అయితే మీ గురువుగారు ఎవరండీ? ఆదర్శనీయులైన సగీతజ్ఞులెవరయినా మీ దృష్టిలోనున్నారా?


ప్రస్తుతము విజయనగర సంగీత కళాశాలలో వీణాధ్యాపకులుగా ఉన్న శ్రీ కవిరాయిని జోగారావుగారు నాకు గురువులు.  పూజనీయులు శ్రీపాద పినాకపాణి గారు నాకు వంద్యనీయులు. వారి బాట నాకాదర్శము.  పాణిగారు మాటలలోనే సంగీతం చెబుతారు.  అట్టి అసాధారణ పర్జావందులు వారు.  ఇంకను ఎక్కడ మంచి ఉంటె అక్కడ తీసికొనే స్వభావం నాది. శ్రీ ఓలేటి గారివల్ల నేను యెన్నో విషయాలు తెలిసికోగలిగాను.  అల్లాగే -- --  ఇంకా --
మీరు ఆంధ్రదేశంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి కచేరీలు చేశారు కదా, అందులో మీ అనుభవాలేమిటి?


అన్య రాష్ట్రీయులు (ముఖ్యంగా తమిళులు) మంచి ఉంటే ఆదరిస్తారు. మెచ్చుకుంటారు. వారినిగురించి మరొకలాగ మనం భావించనవసరం లేదు.  విజయవాడ రేడియో నుండి సంగీత శిక్షణ విని ఆనందించి, ఫలానా, ఫలానా చెప్పంది అని అడిగినవారు కూడా ఉన్నారు.  ఇదివరలో విని వల్లెవేసినామని చెప్పిన వారూ ఉన్నారు.  పైగా శ్రీరంగం మా ఇంటి పేరవటం కూడా కొంత సన్నిహితత్వాన్ని పెంపొందించిందేమోనని (కొన్ని చోట్ల) నా అభిప్రాయం.  వాళ్ళ ప్రాంతము అని కొంతమంది అనుకోవడం కద్దు. కాదని తెలిసినప్పుడు కూడా వాళ్ళల్లో ఏ విధమైన మార్పు రాకపోవడం నేను స్పష్టంగా గమనించాను.
అక్కడి వాతావరణానికి ఇక్కడికి తేడా ఏమయినా మీకు కనిపించిందాండి?


ముఖ్యమైన ప్రశ్న వేశారు.  నేను గమనించిన ముఖ్యాతి ముఖ్యమైన తేడా ఒకటి ఉన్నది.  తమిళ గాయకలోకములో, అభిప్రాయబేధాలున్నప్పటికీ, అనేక వర్గీయులున్నప్పటికీ, వ్యక్తిగత విభేదాలను సంగీత కళలోనికి జొప్పించరు.  ఈ రోజున గొప్పగా పొగడినవారిని మరునాడు తెగడరు.  సంగీతము, ప్రజ్ఞా పాటవము విషయము వచ్చినప్పుడు ఉదారంగా ఉంటుంది వారి వైఖరి.  మన వారిలో అలా కాదు.  కక్షలు, కావేషాలు తెగనాడడానికే ఉపకరిస్తవి.  ఇది సహింపరాని విషయం.  మన దేశము ఈ అగ్ని గుండంలోంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. ఇది అందరి గురించి చెబుతున్నాననుకోకండి.  సద్గుణములు, సహనమూ గలవారు మనలో లేరని కాదు.  మొత్తం మీద విషయం చెప్పాను 
గానకళ పత్రిక చదువుతున్నారా? మీ అభిప్రాయాలేమిటి దానిమీద?


మన పత్రిక ఎపుడు వస్తుందా అని ఆతురతతో ఎదురు చూసేవారలలో నేనొక ప్రముఖురాలిననుకుంటాను.  విషయాలన్నీ, చక్కగా ఉంటున్నవి. 

అవును కాని, ఆకాశవాణి విమర్శ తీసివేశారెందుచేతనండీ? నాకేమిటొ వెలితిగా, షాక్ లాగా ఉన్నది, అది లేకపోవడం.  ముఖప్రీతి పొగడ్తలే కాని, యదార్ధం కరువుగా దొరికే ఈ దేశంలో, పొగడ్తే కాని విమర్శ సహింపలేని గాయకులెక్కువగా ఉన్న ఈ రోజులలో పేదకు పెన్నిధి దొరకినట్టుగా తలపోసేదాన్ని ఈ శీర్షికను చూసి.....
యదార్ధాన్ని ఒప్పుకొని సరిదిద్దుకొందామనే జిజ్ఞాస మనవారు కొంతమందిలో లోపించింది.  నిజానికి విమర్శ కావలనేవారు ఎక్కువమంది ఉన్నారనుకోండి.  చేసిన విమర్శలయినా ఎవరినీ బాధించడానికి కాని, నొప్పించటానికి కాని, తలపోసినవి కావు.  బహిరంగ విచారణకు నిలబెట్టినా నిలబడగలిగినవే.  అవి విమర్శలుగానే కావు, సూచనలు మాత్రమే.  ఆ మాత్రపు సహిష్ణత కూడా మనవారిలో కొంతమందికి లేదు.  అందుచేతనే దానికి తగిన వాతావరణాన్ని తయారుచేయుటకు కృషి చేస్తున్నాము.  చాలావరకు కృతకృత్యులమయినాము కూడా.  తరుణము, అవకాశము చూచుకొని తప్పక తిరిగి మొదలు పెడతాము.  ఏ కొద్దిమందికో జడసి మాత్రము విరమించలేదని సవినయంగా మీకు విశద పరుస్తున్నాము.

మీరు చేసిన కచేరీలలో ప్రముఖంగా చెప్పుకోతగ్గవి చెబుతారా?


మ్యూజిక్ ఎకాడమీ మదరాసులో రెండు సార్లు 1958-60 లో పాడాను.  తిరువయ్యూరులో త్యాగరాజోత్సవములో పాడినప్పుడూ, అక్కడనే శ్యామ శాస్త్రులవారి గృహంలో కూర్చుని పాడినపుడూ మధురానుభూతి పొందాను. ఆంతే కాకుండా, మైసూరు, బెంగళూరు, కలకత్తా, నాగపూరు, సేతూర్ (కేరళ) లలోనూ కచేరీలు చేశాను.  కచేరీ జరుగుతుండగా ఉత్సాహం పట్టలేక 94 సంవత్సరాల సేతూర్ జమీందారు కంజీరా తీసికొని నా కచేరీకి వాయించిన సందర్భం నన్ను ఆనందభరితురాలిని చేసింది.
ఇంతకీ అడగ మరిచాను, మీది సంగీత కుటుంబమా?


మా నాయనగారు వెంకటవరదాచారిగారు, వయొలిన్, గాత్రం నేర్చుకున్నారు.  సంగీతాభిలాషాయనకు మెండు.  మా నాయనమ్మగారు (వారి పేరే నాది) కూడా సంగీతంలో ప్రవేశం ఉన్నది.  సరే ఇప్పుడు మా సోదరులు, గోవిందాచార్యులు కూడా ఆ కోవకు చెందినవారే.
మరొక్క విషయం! మీరు శాస్త్రీయ సంగీతం పాడినా, లలిత సంగీతం పాడినా, భక్తి గేయం పాడినా, నాటక, నాటికల్లో పద్యం చదివినా పాట పాడినా చివరకు మంగళ హారతి పాడినా పూర్తి న్యాయం చేయగలగడం నిజంగా విశేషమమేనండీ! ఎట్లా సాధ్య పడుతున్నదండీ అది?
ఏదైనా ఒక పని నియోగింపబడ్డప్పుడు, దానిలో తాదాత్మ్యం పొంది,  శక్తి వంచన లేకుండా, శరీరం దాచుకోకుండా కృషి సల్పితే తప్పక సత్ఫలితం ఉంతుందని నా పగాఢ విశ్వాసము.  దాని పర్యవసానమే మీకలా అనిపించి ఉండవచ్చు. 
చాలా సంతోషమండీ! చక్కని విషయాలు ప్రస్తావించుకున్నాము. ఓపికతో మీరు మంచి విషయాలు చెప్పారండీ! నా కృతజ్ఞతను ఎట్లా తెలపాలో తోచడంలేదు.


ఇందులో ఏముందండీ! మీరు కూడా నాకు సదవకాశం ఇవ్వటం మూలంగానే కదా కొన్ని ముఖ్య విషయాలు బయటకు వచ్చినవి. అందుకు నేనూ కృతజ్ఞురాలనే.
********************************************
ఇంటర్వ్యూ మొత్తం చదివారు కదా! ఈ కింది లింకు నొక్కి  ఆవిడ పాటలు వినండి:

*********************************************
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.