1, సెప్టెంబర్ 2013, ఆదివారం

మగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో సంభాషణ

 
  శ్రీ మంగళంపల్లి బాల మురళీకృష్ణ 
ఫోటో కర్టెసీ ది హిందూ దినపత్రిక

మన మధ్యనే తిరుగుతో మనకు ప్రతి రోజు ఏదో ఒక రూపాన వినపడుతూ ఉండే సంగీత కళానిధి శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ.  ఆయన పాఠశాలకు వెళ్ళి మనకు తెలిసిన చదువు చదువుకున్నది చాలా తక్కువ. కాని అన్నిటిలోనూ ముఖ్యంగా సంగీతపరంగా ఆయన అందరి కంటే ఎక్కువే. ఆయన సంగీతం లో కొత్త రాగాల కల్పనలోనే కాకుండా, మాటల్లో కూడా అందెవేసిన చేయి. నవ్వుతూనే అది పొగడ్తో, చురకో తెలియకుండా,  అలవోకగా ఆయన దగ్గరనుంచి మాటలు వచ్చేస్తాయి. పాడుతా తీయగా కార్యక్రమంలో ఒకసారి అలా తళుక్కున మెరిసి, ఆ కార్యక్రమ నిర్వాహకుడు, ప్రముఖ సినీ గాయకుడు ఎస్ పి  బాలసుబ్రహ్మణ్యాన్ని పొగిడారో లేక చురక అంటించారో తెలియకుండా "మన బాలు కొంత సాధన చేస్తే నాలాగా పాడగలడు కాని, నేను ఎప్పటికీ ఆయన లాగా పాడలేను" అందరిముందు స్టేజీ మీద అనేసరికి ఎస్ పి  తలమునకలయ్యి ఆయనకు  పాదాభివందనం చేశారు.

అటువంటి అద్భుత వ్యక్తితో సంభాషించటం సులువైన పని కాదు. ఆయనతో సంభాషించి వరల్డ్ స్పేస్ రేడియోలో "స్పందన" కార్యక్రమానికి   ఆర్ జి మృణాళిణి గారు  చక్కటి ఇంటర్వ్యూ మనకు అందించారు. మృణాళిణి గారు  ఆ సంభాషణను చాలా చక్కగా నిర్వహించారు, ఆయన మాటలకు ఎక్కడా అడ్డుతగలకుండా, ఆయన మాటల ధోరణి కొనసాగానిచ్చి తాను అడగవలసిన ప్రశ్నలు  అడిగి ఇంటర్వ్యూ మొత్తాన్ని రక్తి కట్టించారు.

ఆయన చెప్పిన అనేక విషయాలు ఇంతవరకూ నేనైతే మరెక్కడా వినలేదు.ఎన్నెనో అద్భుత విషయాలు చెప్పారు ఆయన. ఒక్క సంగీతం గురించే కాదు, సంప్రదాయం అంటే  ఏమిటి? దేవుడు ఎక్కడ, మనమందరమూ దేవుళ్ళమే, ఇలా అనేకానేక విషయాలు వివరించారు. 

మీకు మీ జీవితంలో అన్నిటికన్నా సంతోషాన్నిచ్చిన సంఘటన చెప్పమన్నప్పుడు, "నాకు మొదటి సారి డాక్టరేట్ వచ్చినప్పుడు చాలా సంతోషం కలిగింది. ఎందుకు అంటే నా లెటర్ హెడ్ మీద నా పేరుతో బాటుగా డాక్టర్ అని వేసుకోవచ్చు అని. ఎందుకు అంటే నాకు ఒకటో తరగతి సర్టిఫికేట్ కూడా  లేదు" అని  ఫ్రాంక్ గా చెప్పగలిగిన హాయైన మనిషి శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు.

ఈ కింది ప్లేయర్లో పైన చెప్పిన ఇంటర్వ్యూ వినవచ్చు. మీరు ఇంతకు ముందు ఈ ఇంటర్వ్యూ వరల్డ్ స్పేస్ రేడియోలో విని ఉంటే, ఈ ఇంటర్వ్యూ కొద్దిగా నిడివి తగ్గింది అనిపించవచ్చు. నిజమే మొత్తం గంట పైనున్న కార్యక్రమాన్ని ప్రశ్నలు జవాబులు  ఎక్కడా పోకుండా సభాషణ మధ్య కొద్ది విరామ సంగీతం మాత్రం వచ్చేట్టుగా  ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను.  ఈ ఫైలు నాకు ఈ మధ్య హైదరాబాదు వెళ్ళినప్పుడు అందచేసిన శ్యాంనారాయణ గారికి ధన్యవాదాలు.
 

 ఆడియోకర్టెసీ వరల్డ్ స్పేస్ రేడియో 
  ఈ కార్యక్రమాన్ని వరల్డ్ స్పేస్ రేడియో వారు, శ్రీ మంగళంపల్లి     బాలమురళీ కృష్ణ గారి జన్మదినం సందర్భంగా ప్రసారం చేశారు. 3 వ్యాఖ్యలు:

 1. ఇంటర్వ్యూను బ్లాగులో పంచుకున్నందుకు ధన్యవాదాలు శివరామప్రసాద్ గారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చక్కని ఇంటర్ వ్యూ. మీరన్నట్టుగా మృణాళిని గారి ప్రశ్నలూ, అడిగిన విధానమూ చాలా బాగున్నాయి. బాలమురళి గారు డబ్బు గురించి చెప్పిన మాటలూ, ‘శిష్యుల నుంచి కూడా నేర్చుకున్నాను’ అనటమూ, మిగిలిన విశేషాలూ ఆకట్టుకునేలా ఉన్నాయి. అన్నమయ్య గురించి బ్యాలెన్స్ డ్ గా చెప్పిన వ్యాఖ్య బాగుంది. ప్రశ్నల మధ్యలో మీరు కూర్చిన విరామ సంగీతం హాయిగా, అర్థవంతంగా ఉంది!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. వేణు గారూ.

  చాలాకాలానికి మీరు నా బ్లాగు చూసినట్టున్నారు. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. విరామ సంగీతం ఆ కార్యక్రమంలో ఉన్నదే నిడివి తగ్గిస్తూ, ఒక్కొక్క ప్రశ్న జవాబు తరువాత సద్దాను. మధ్య మధ్యలో వారి కార్యక్రమపు వివరం కూడా ఉంచాను. "స్పందన" కార్యక్రమం బాగున్నది. ప్రస్తుతం నేను ఐ పాడ్ లో వరల్డ్ స్పేస్ రేడియోవారి పాటలు వింటూ ఈ "స్పందన" కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నాను

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.