5, నవంబర్ 2014, బుధవారం

బీహార్ పబ్లిక్ సర్వీసు కమీషనూ :: పెర్రీ మాసన్ పుస్తకాలూమనకు తెలుగులో ఒక సామెత ఉన్నది, బోడి గుండుకీ  మోకాలికి ముడి వెయ్యటం అని, రెండు  అతకని విషయాలను చెప్పేప్పుడు వాడుతూ ఉంటారు.  ఈ మధ్యన  "పెర్రీ మాసన్" పుస్తకాలు (కాలేజీ రోజుల్లో నా  ఫేవరేట్ పుస్తకాలు)  దొరుకుతాయేమో అని వెతుకుతుంటే చాలా  చిత్రంగా అసలు మనం ఎంత వైల్డ్ గా ఆలోచించినా ఊహించలేని  వెబ్ సైటులో దొరికినాయి. ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ వ్రాసిన 80+ పెర్రీ మాసన్ డిటెక్టివ్ పుస్తకాలు అన్నీ కూడా  ఈ వెబ్సైటులో ఉన్నాయి.  ఎక్కడ దొరికినాయి! బీహారు పబ్లిక్ సర్వీస్ కమీషన్ వారి వెబ్ సైటులో!!

పెర్రీ మాసన్ పుస్తకాలు   దొరికాయి అన్న ఆనందం కన్నా కూడా (అది కూడా పి డి ఎఫ్ ఫార్మాట్లో), ఆ పుస్తకాలు దొరికిన చోటు,  నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. పబ్లిక్ సర్వీసు కమీషన్ అంటే,   ఆ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలాకు తగిన అబ్యర్ధులను ఎంపిక చేయ్యటమే ముఖ్యమైన విధిగా కల సంస్థ. ఆ సంస్థ వెబ్ సైటులో,  ఉంటే గింటే వారి పరీక్షల సిలబసు లేదా మోడల్  పేపర్లు ఉండాలి. కాని చిత్రంగా, డిటెక్టివ్ పుస్తకాలు ఐన పెర్రీ మాసన్ నవలలు ఉండటం ఏమిటి అని సందేహం. లేదంటే బీహారు పబ్లిక్ సర్వీసు కమీషను వారు, వారి రాష్ట్రానికి కావలిసిన లీగల్ ఆఫీసర్లు, పోలీసు డిటెక్టివ్ లను ఎంపిక చేసుకోవటానికి ఈ పెర్రీ మాసన్ పుస్తకాలను ముఖమైన పాఠ్యాంశాలుగా తీసుకోలేదు కదా! ఏమో చెప్పలేము! దేశంలో  ఎక్కువ సంఖ్యలో ఐ ఎ ఎస్ అధికారులను అందిస్తున్నది బీహారు రాష్ట్రం. వారి  అబ్యర్ధులు అంత చురుకుగా ఉండటానికి కారణం,   బీహార్ రాష్ట్ర పబ్లీక్ సర్వీసు కమీషను ఇలా పెర్రీ మాసన్ పుస్తకాలను సిలబస్సు గా పెట్టి కృషి చేస్తున్నారా!!  భలే సరదాగా ఉన్నది ఈ విషయం. ఆంగ్లంలో "Pleasantly Surprised" అని ఒక వాడుక ఉన్నది. కలిగినది ఆశ్చర్యమే కాని, అది ఆనందాన్ని కలిగించే ఆశ్చర్యం. 

పరీక్షల్లో ఫలానా ఫలానా కేసులో పెర్రీ మేసన్ ఏమి చేసి గెలిచాడు, పాల్ డ్రేక్ ఎలా అసాధ్యమైన విషయాలను తన పత్తేదారు తెలివితేటలతో కేసు మంచి పట్టులో ఉండగా పెర్రీ మేసన్ కు  అందచేశాడు, పెర్రీ మేసన్ సామాన్యంగా అన్ని కూడా ఎక్కువగా మహిళలకు సంబంధించిన కేసులే ఎందుకు తీసుకుంటాడు,  సెక్రటరీ డెల్లా  స్ట్రీట్, పెర్రీ మాసన్ విజయాల్లో ఎలా తన పాత్ర నిర్వహిస్తూ ఉంటుంది  వంటి ముఖ్యమైన ప్రశ్నలు వేస్తూ తమ అబ్యర్ధులను ఎంపిక చేస్తారో ఏమిటో చెప్పలేము. ఏమైనా బీహారు కదా, ఏమైనా జరుగవచ్చు, మిగతా దేశంలో సామాన్యంగా జరిగేవి బీహారులో జరగకా పోవచ్చు. 

పెర్రీ మాసన్ గా నటించిన రేమాండ్ బర్
డెల్లా  స్ట్రీట్ గా బార్బరా హేల్
  అసలు ఈ పెర్రీ మాసన్ ఎవరు?   ఎవరు ఏమిటీ! అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఆయనొక పెద్ద లాయరు, ఆయనకొక అందమైన సెక్రటరీ డెల్లా స్ట్రీట్, వీళ్ళిద్దరి మధ్యా ఏమన్నా రొమాన్సు ఉన్నదా! ఆధారాలు ఎక్కడా నవలల్లో కనపడదు, ఏమో మరి లేదని మాత్రం చెప్పలేము. గేర్ట్రూడ్ అనే రిసెప్షనిస్టు, అప్పుడప్పుడూ కనపడుతూ ఉంటుంది. వీళ్ళతో పాటుగా లాయరుగారి  టీములో ముఖ్యుడు, పాల్ డ్రేక్  అనే డిటెక్టివ్ సంస్థ యజమాని, చీఫ్ డిటెక్టివ్. ఇతనే దాదాపు అన్ని
పాల్ డ్రేక్  గా విలియం హాపర్
కేసుల్లోనూ మన లాయరుగారికి చేదోడు వాదోడుగా ఉంటాడు. అన్ని కథల్లోనూ విలన్ ఎవరు? ఇంకెవరు పోలీసు అధికారి రిచర్డ్ ట్రాగ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ హామిల్టన్ బర్గర్. ప్రతి కథలోనూ క్రైమ్ ఎలిమెంట్ ఉంటుంది, లేకపోతే  డిటెక్టివ్ నవల ఎలా అవుతుందీ! మన లాయరు గారి క్లైంట్ ఏదో  గొడవలో ఇరుక్కుంటాడు, సామాన్యంగా ఒక హత్య జరిగి ఆ హత్యా నేరం ఈ క్లైంట్ మీద మోపబడుతుంది. కథ రకరకాలుగా పాల్ డ్రేక్ సహాయ సహకారాలతో అనేక మలుపులు తిరిగి, చివరకు క్లైమాక్స్ కోర్ట్ రూములో
పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీసు డిటెక్టివ్ లు  విలియం టాల్మన్, రే కాలిన్స్
అనేకమైన వీరోచిత, కొండకచో వితండ వాదనలతో, లాయరు గారు పోలీసులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను బఫూన్లను చేసి తన క్లైంట్ నిర్దోషి అని నిరూపిస్తాడు. కథ సుఖాంతం. ఈ పుస్తకాలు చదవటం మొదలుపెడితే ఆపటం కష్టం, సరదాగా ప్రయాణాల్లోనూ, వేచి ఉండక తప్పని పరిస్థితుల్లోనూ ఈ పుస్తకాలు మనకు కాల వ్యవధి తెలియకుండా చేస్తాయి.  

ఈ పెర్రీ మాసన్ ఎంతటి ప్రసిద్ది చెందాడు అంటే, ఆ పుస్తకాలను రచయిత పేరుమీద కాకుండా పెర్రీ మాసన్ పుస్తకాలు అనేంతటి పాపులర్ అయిపోయాడు ఈ "కథా" నాయకుడు. ఈ పుస్తకాలు వాడుకుని అనేక సంవత్సరాలపాటు టి  వీ సీరియళ్ళు  వచ్చినాయి. అవ్వి ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. పైన ఇవ్వబడిన పాత్రల ఫొటోలు ఆ టి వి సీరయళ్ళ ల్లో ఎక్కువ కాలం ఆయా పాత్రలు నిర్వహించినవారివే.

ఇంతకీ ఈ పుస్తకాల రచయిత ఎలా ఉంటారు!? రచయిత పేరు ఎర్ల్ స్టాన్లీ

గార్డెనర్.  ఈయన మాసేచూసేట్స్  లో ఉండేవారట, 81 సంవత్సరాలు జీవించిన ఈయన కూడా లాయరేనుట. మరి! ఇహనేం!! నోబెల్ బహుమతి పొందిన రచయిత కాకపోయినా,  ఆయన పుస్తకాలు వేలల్లో  అమ్ముడు పోయినాయి, అనేకమందికి ఏంతో కాలక్షేపం, వినోదం, కోర్టు పని తీరులను తెలుసుకునే వీలు కలిగించినాయి. ఆయన వ్రాసిన ఫార్మాటులో అంటే ఒక లాయరు, సెక్రటరీ, ఒక డిటెక్టివ్ మన తెలుగులో కాపీ కొట్టి ప్రయత్నీంచారు కాని, మన పాఠకులు, మేము ఆ ఒరిజినల్ ఆంగ్లమే చదువుతాము అని కాపీ రచయితల రచనలను చదువము అని నిర్ద్వంద్వంగా తిప్పి కొట్టారు. ఏమైనా పెర్రీ మాసన్ పుస్తకాలను యధాతధంగా తెలుగులోకి అనువదించి ప్రాచుర్యంలోకి తీసుకువస్తే బాగుంటుంది. కాలేక్షాపానికి, సరదాగా  చదువుకోవటానికి బాగుంటాయి. పెర్రీ మాసన్ నవలల సృష్టి కర్త, గార్డెనర్ గురించిన కొన్ని వివరాలు ఈ కింది వెబ్సైటులో ఉన్నాయి. 

ఇవన్నీ మనకెందుకు, "నువ్వోకందుకు ఇస్తే నేనొకందుకు తీసుకున్నాను" అన్న చందాన, బీహారు పబ్లిక్ సర్వీసు కమీషను వాళ్ళు ఏ కారణాన పెర్రీ మాసన్ పుస్తకాలు వాళ్ళ  వెబ్సైటులో పెడితే మనకెందుకు. మంచి డిటెక్టివ్ పుస్తకాలు దొరుకుతున్నాయి, పైగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం!

ఇంతా చేసి అసలు రహస్యం చెప్పనే లేదు కదూ! ఇదిగో బీహారు పబ్లిక్  సర్వీసు కమీషను వారి వెబ్సైటు. ఎంత అమాయకంగా కనపడుతున్నదో చూడండి, ఇక్కడ మీరు ఎంత వెతికినా మచ్చుకి కూడా వాళ్ళ వెబ్ సైటులో పైన చెప్పిన డిటెక్టివ్ పుస్తకాలు ఉంటాయన్న ఒక్క చిన్న క్లూ కూడా  దొరకదు.
బీహారు పబ్లిక్ సర్వీసు కమీషను హోమ్  పేజీ (క్లిక్)
సరే ఇప్పుడు ఈ వెబ్ పేజీ చూడండి, ఆ కిందనే ఆ పేజీకి వెళ్ళటానికి లింక్ ఇవ్వబడింది. ఇక మీ ఇష్టం,  పెర్రీ మాసన్ అభిమానులు ఆ పుస్తకాలు కావలిసినవి డౌన్లోడ్  చేసుకోవచ్చు. 
బీహారు పబ్లిక్ సర్వీసు కమీషను వెబ్ సైటులో పెర్రీ మాసన్ పుస్తకాలు (క్లిక్)
ఇప్పటికే దాదాపుగా 40వేల మంది పైచిలుకు ఈ పేజీని దర్శించారని అక్కడ ఉన్న సమాచారం చెబుతున్నది. చిత్రం ఏమంటే ప్రభుత్వ చిహ్నం మూడు  సింహాలు కనపడుతూ, నిక్ నెట్ (ప్రభుత్వ వెబ్ సైటు సర్వీసు) లో ఇలా విదేశీ  డిటెక్టివ్ పుస్తకాలు ఉంచటం ఎంతవరకూ సబబు? అనే ప్రశ్నకు జవాబు మాత్రం  దొరకటం లేదు. ఎవరు చేశారు!  బీహారు పబ్లిక్ సర్వీసు కమీషను అధికారులకు ఈ విషయం తెలుసో లేదో మరి!!  మన టివి  మీడియా వారి కంట ఇది పడినట్టు లేదు. 
 *************************************************
ఆలసించిన ఆశాభంగం  తప్పదు  మరి!

ఈరోజు అంటే నవంబరు 30 2014 చూస్తె ఆ పుస్తకాలు ఉన్న లింకు తొలగించారు
 *************************************************


5 వ్యాఖ్యలు:

 1. ఫెర్రీమేసన్ మిష్టరీ నావల్స్‌లో కారెక్టర్ల పరిచయం, రచయిత ఎర్ల్ స్టాన్లీ గార్డ్‌నర్ బ్రీఫ్ బయోగ్రఫీతో పాటు ఆతని నావల్స్ పిడీఎఫ్ లింక్ కూడా ఇవ్వడం బాగుంది. మీరు ఎంతబాగా పరిచయం చేశారంటే - ఈ పుస్తకాలని వెంటనే చదవడం మొదలుపెట్టేయ్యాలనిపిస్తుంది. ధన్యవాదాలు శివరామప్రసాదు గారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ధన్యవాదాలు వర్మ గారూ. మీ కాకినాడ బ్లాగు కూడా నేను తరచూ చదువుతూ ఉంటాను. మీరు వ్రాసినవి చదివినాక కాకినాడ వచ్చి స్వయంగా చూడాలని కోరిక.

   పెర్రీ మాసన్ పుస్తకాల పరిచయం వ్రాద్దామని మొదలు పెట్టలేదు! నా ఉద్దేశ్యం ఒక ప్రభుత్వ సంస్థ ఇలా విదేశీ పుస్తకాలను తమ వెబ్ సైటులో ఉంచటానికి ఎలా అనుమతి ఇచ్చింది అన్న సందేహం వచ్చింది ఆ విషయమే హైలైట్ చేద్దామని నా ఉద్దేశ్యం. కాని వ్రాయటానికి ఉపక్రమించినాక, పెర్రీ మాసన్ గురించి తెలియని వాళ్లకు కూడా చెప్పాలికదా అని పరిచయం కొద్దిగా వ్రాసాను. మీకు నచ్చినందుకు సంతోషం.


   తొలగించు
 2. శివ గారూ, అద్భుతం! పెర్రీమేసన్ డిటెక్టివ్ నవలలు ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైట్లో ఉంటాయని ఊహలోకి కూడా రానేరాదు. నిజంగా మీరు గొప్ప డిస్కవరీయే చేశారు. బ్లాగ్ పాఠకుల, నవలాభిమానుల తరపున మీకు అభినందనలూ, కృతజ్ఞతలూ !

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ధన్యవాదాలు వేణూ గారూ. నేను అనుకోవటం బీహారు పబ్లిక్ సర్వీసు కమీషన్లో పనిచేస్తున్నవారు ఎవరో ఈ పుస్తకాల మీద ఆసక్తి ఉండి పెర్రీ మాసన్ పుస్తకాలు అప్లోడ్ చేసి ఉంటారు. పై అధికారులకి తెలిసి ఉండదు.

   తొలగించు
  2. Venu garu and Sivaram garu,

   I am very surprised to see few more perry mason fans. I had read all books of perry mason in my Kanpur days and currently have all the PDFs with me. I had downloaded from torrents. you will find some books in few railway stations.

   మీరు చెప్పినవి కాక గార్డ్నర్ గారి గురించి మరొక రెండు విషయాలు:

   1. ప్రతీ నవల గార్డ్నర్ గారికి తెలిసిన ఫోరెన్సిక్ టెక్నీషియన్ కో లేదా పోలీస్ అధికారికో అంకితం ఇచ్చారు. ఇచ్చేటప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు చేసిన సేవ గురించి వివరంగా చెప్పారు. నాకు అది చాలా నచ్చింది.

   2. ఆయన ఒకేసారి డజను నవలలు రాశారట. అది ఒక రికార్డ్ అంటారు. దీని గురించి వీకీలో ఏమీ లేదు గాని 1990లలో వచ్చిన చందమామ ప్రశ్నావళిలో ఉంది. ఏ నెలలో వచ్చిందో నాకు గుర్తు లేదు.

   Many thanks for your article

   తొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.