14, ఏప్రిల్ 2015, మంగళవారం

ఉషశ్రీ గారి మహాభారత యుధ్ధం ప్రసంగం - నక్కా జోగారావుగారికి ధన్యవాదాలు

ఉషశ్రీ గారు పురాణాలకు మారు పేరు. ఒక లౌకిక భారత ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ, తనదైన శైలిలో మన పురాణాలకు అద్భుతమైన పేరు తీసుకు వచ్చిన దిట్ట. రామ అంటే  బూతు పదంగా భావించే లౌకిక మూర్ఖులను,   చేతి దూరాన ఉంచి తనదైన శైలిలో పురాణాలను ఏమాత్రం రాజీ లేకుండా చెప్పిన ఉపన్యాస కర్త ఉషశ్రీ గారు. మనం ఆయన పురాణాలు ఎంత విన్నా కూడా అవన్నీ ఆయన ఆకాశవాణిలో చెప్పినవి లేదా పదవీ విరమణ తరువాత  కాసేట్ కంపెనీల కాసెట్లల్లో చెప్పిన పురాణాలే.  ఉషశ్రీ గారు బయట పురాణం  చెబితే ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు, అవును నేను విన్నాను ఆయన పురాణ ఉపన్యాసం అని ఎంత మంది చెప్పగలరు! 

అవును ఉషశ్రీ గారి పురాణం  ఏ విధమైన నిబంధనలు అధికారుల నిఘా లేకుండా ప్రజల మధ్యకు ఆయన వచ్చి చెప్పిన ఉపన్యాసాలు విన్న అదృష్టవంతులలో నేనూ  ఒకణ్ణి . 

విజయవాడ రామకోటి సంఘం వారు ఏర్పరిచిన ఉపన్యాస ప్రాంగణం లో ఆయన ఒక పరంపరగా పురాణ ఉపన్యాసాలు చేశారు. 1978-79 లో అనుకుంటాను, ఆయనకు వస్తున్న పేరు కంటగింపు అయ్యి,  ఆయనంటే గిట్టని వారు ఆయన్ను ఆకాశవాణి  విజయవాడ కేంద్రం నుంచి కడప కేద్రానికి బదిలీ చేశారు. ససేమిరా  అని ఆయన బదిలీకి ఒప్పుకోలేదు, కడప  వెళ్లి చేరలేదు. ఆ సమయంలో చేసిన ఉపన్యాసాలు అవి. ఒక్కొక్క రోజు సాయంత్రం ఆరు అవటం ఆలశ్యం  ఆ ప్రాంతం అంతా ఇసకేస్తే రాలనంత మంది జనం, ఎదురుగా ఉన్న రోడ్డు మొత్తం శ్రోతలే, ట్రాఫిక్ జామ్ తో బస్సులు, ఇతరాలు దారి మళ్ళించి వెరే దారిలో పంపే వారు. ఎదురుగా ఉన్న సత్యనారాయణపురం రైల్వే  స్టేషన్ ప్లాట్ఫారం నిండా జనం, రేలేక్కి దిగటానికి వీల్లేనంత మంది జనం, కంట్రోలు చెయ్యటానికి వీల్లేనంత శాంతియుత జన సమూహం, ఆ రెండు గంటలూ శ్రద్ధగా విని వెళ్ళిపొయ్యే వాళ్ళు. అలాంటి పురాణ ఉపన్యాసం ఆరోజున ఉషశ్రీ గారికి చెల్లింది, ఈరోజున చాగంటి వారు మరింత దీక్షతో చేస్తున్నారు, ప్రజలను ఉత్తేజితులను చేస్తున్నారు, ధర్మమార్గానికి మళ్ళిస్తున్నారు. 
పైన చెప్పినప్పటి రికార్డింగ్ లేదుకాని, రాజమహేద్రవరం లో 1980 ప్రాంతాలలో చేసిన మహాభారత ఉపన్యాసం సురస డాట్ ఆర్గ్(క్లిక్ చెయ్యండి) వారి పుణ్యమా అని ఈరోజున మనం ఆ ఉపన్యాసం వినగలుగుతున్నాము. ఈ ఉపన్యాసం ఎక్కడో అమెరికాలో ఉన్న సుసర్ల శాయి గారికి ఎలా అందింది! వారికి అందచేసిన వారు, శ్రీ నక్కా జోగారావు గారు.  ఈ ఆడియోను యు-ట్యూబులోకి ఎక్కించి మీకోసం ఇక్కడ అందిస్తున్నాను, విని ఆనందించండి. 


విని ఆనందించిన అందరికీ ఒక విజ్ఞప్తి ఎవరికన్నా నక్కా జోగారావు గారు తెలిసి ఉంటే దయచేసి తెలియచెయ్యగలరు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.