5, జులై 2015, ఆదివారం

ఒక శుభవార్త - ఉషశ్రీ గారి ధర్మసందేహాలకు జవాబులు ఆడియో సి డి దొరుకుతున్నది

ఉషశ్రీ గారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి చేసిన పురాణ ప్రవచనాలు, ఆ ప్రవచనాలకు ముందుగా ఆయన చేసిన ధర్మసందేహాలకు సమాధానాలు ఎంతగానో పేరొందినాయి. నభూతో నభవిష్యతి గా ఇప్పటికీ అలనాటి శ్రోతల జ్ఞాపకాల్లో ఉన్నాయి. 

మొగలి పువ్వు ఇస్తే ఏమి చెయ్యాలో తెలియని గుమాస్తాలు ఆకాశవాణి  వారు. నాకు తెలిసిన చాలా బాధాకరమైన విషయం ఏమంటే, ఉషశ్రీ గారి గొంతు ఉన్న ఒక్క టేపు కూడా అకాశవాణి వారి వద్దలేదట. ఈ విషయం అబద్ధం అవ్వాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. ఇది అబద్ధం కాదు అని చెప్పగలిగిన వారు ఆకాశవాణి వారే, కాని ఆ గుమాస్తాలకు (అదే బ్యోరోక్రాట్లకు) ఇలాంటి సున్నిత హృదయం ఉండాలని అనుకోవటం పాషాణం కరగాలని అని ఆశించటమే తప్ప మరొకటి కాదు. 

తెలుగులో పురాణ ప్రవచనాలకు ఎంతో పేరు ప్రఖ్యాతులను తీసుకు వచ్చి, తద్వారా తాను పనిచేస్తున్న సంస్థ ఆకాశవాణికి దశదిశలా కీర్తి ప్రతిష్టలను సంపాయించిన వారు శ్రీ ఉషశ్రీ. అటువంటి ఉషశ్రీ గొంతు మచ్చుకు కూడా తమ దగ్గర ఆర్ఖైవ్స్ లో లేకుండా చేసిన, చేసుకున్న అధమాధమ సంస్థగా ఆకాశవాణి చరిత్రలో మిగిలిపోయింది. ఈ మాట అనంగానే ఆకాశవాణి గుమాస్తాలకు విపరీత కోపం రావచ్చు. కనీసం ఆ కోపంలోనైనా,
మీరు చెప్పినది తప్పు, మా దగ్గర శ్రీ ఉషశ్రీ గారి పురాణ ప్రవచనాలు, ధర్మ సందేహాలకు సమాధానాలు టేపులు అన్నీ ఉన్నాయి అని చెప్పి, ఆ టేపులను, సి డి ల ద్వారా ప్రజలకు ఆకాశవాణి వారు అందించగలిగితే నేను ఇలా వ్రాసినందుకు (ఆ సిడి లు కొనుక్కున్న మరుక్షణమే)బహిరంగ క్షమాపణలు వీడియో తీసి, ఇదే బ్లాగులో ప్రచురిస్తాను
ఎవరో గుమాస్తా అధికారి వచ్చి టేపులన్నీ చేరిపేయిస్తుంటే (ఒక్క ఉషశ్రీ గారి టేపులే కాదు, అలనాటి ఆణిముత్యాలవంటి అద్భుత కార్యక్రమాలన్నిటి టేపులూ) అప్పటి ఆకాశవాణి కళాకారులు ఏమన్నా చేశారా! చూస్తూ ఊరుకునట్టున్నారు. అంతకన్నా ఏమి చేస్తాం అని సమర్ధించుకోవచ్చు. కానీ, కనీసం ఈ విషయం ఏ వార్తా పత్రికకన్నా ఆకాశరామన్న సమాచారం ఇచ్చి ఉంటే, పత్రికలు ఈ ఘోర వార్తను ప్రముఖంగా ప్రచురించి ఉండేవారు,  ఆకాశవాణి కార్యక్రమాలకు, ముఖ్యంగా ఉషశ్రీ గారి ప్రవచనాలకు ప్రజల్లో ఉన్న ఆదరణ, అభిమానం దృష్ట్యా ఆకాశవాణి కార్యాలయాలను ప్రజలు ముట్టడించి  ధర్నా చేసి, ఈ విపరీతపు పనిచేసిన అధికార్లకు బుద్ది చెప్పి ఆ టేపుల ధ్వంసాన్ని అడ్డుకునేవారు అనిపిస్తుంది. 

అనేకానేక ప్రభుత్వ కార్యాలయాల్లో పర్వతాలను తలపించే పధ్ధతిలో ఎందుకూ కొరగాని పాత  రికార్డులను ఎంతో ఆప్యాయంగా, ఎంతో ఖర్చు పెట్టి మరీ దాచుకునే ఈ ప్రభుత్వ అధికార్లు, ఆకాశవాణి దగ్గరకు వచ్చేప్పటికి రేడియో కళకు సంబంధించిన ఈ వారసత్వాన్ని   చేరిపెయ్యాలన్న దురాలోచన ఎందుకు వచ్చిందో వాళ్ళకి కూడా తెలియదు. ఒకళ్ళంటారూ , వాళ్ళకి పాపం టేపుల కొరతట అందుకని పాత టేపులు చెరిపేసి, దాని మీద కొత్త కార్యక్రమాలు మళ్ళీ రికార్డు చేసి డబ్బులు "అదా" చేశారుట. ఇంతకంటే అపభ్రంశపు "సాకు" ప్రపంచలో ఎవ్వరికీ దొరకదు. 

సరే గతజల సేతుబంధనం వల్ల ఉపయోగం లేదు కదా, బి పి పెరగటం తప్ప!
====================================================

ఫేస్ బుక్ లో  కే వి ఎస్ సుబ్రహ్మణ్యం గారు (ఉషశ్రీ గారి అల్లుడు) ఒక అద్భుతమైన సమాచారం అందరితో పంచుకున్నారు. ఆ విషయం ఆయన మాటల్లోనే  చూడండి. 

                       ఉషశ్రీ ధర్మ సందేహాలు
"ఒక రెండున్నర దశాబ్దాల క్రితం రేడియో శ్రోతలు పేరెన్నికగన్న పదం. ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపూ శ్రోతలు మైమరిచిపోయేవారు. ఎంత ముఖ్యమైన పనైనా పక్కన పెట్టేసేవారు. రేడియోలకూ హారతులూ ఇచ్చేవారు. అగరవత్తులు వెలిగించి మరీ ఆ కార్యక్రమాన్ని వినేవారు. 

లక్ష్మణ యతీంద్రులవారు చెప్పిన అనుభవం ఇది... 
 
'ఉషశ్రీగారు రేడియోలో మహాభారత ప్రవచనం చేస్తున్నప్పుడు ఓ మండువేసవిలో జరిగిన సంఘటన ఇది. అత్యవసర పని పడింది. ఏలూరులో వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. రిక్షా బేరమాడాను. ఎక్కాను. కొంతదూరం వెళ్ళిన తరవాత ఆ రిక్షా కార్మికుడు... ఓ చెట్టునీడన ఆపేశాడు. అదేమిటబ్బీ అని అడిగా... ఒక్కసారి కిందకి దిగండి స్వామీ అన్నాడు. దిగాను. సీటు ఎత్తి..అందులోనించి రేడియో బయటకు తీశాడు. చెట్టు కింద కొంత ప్రాంతాన్ని శుభ్రంచేసి, దుప్పటి పరిచాడు. రేడియో దానిపై పెట్టి కాళ్ళూ, చేతులూ కడుగుని వచ్చాడు. డబ్బులొద్దండి వేరే రిక్షా చూసుకోండన్నాడు.. నేనింకా అక్కడుండడం చూసి, అతడేం చేయబోతున్నాడో చూడాలనిపించింది. ఉంటానులే అన్నాను. సభక్తికంగా నమస్కరించి రేడియో ఆన్‌ చేశాడు. ప్రకటన వినిపించింది. .. ఆకాశవాణి.. విజయవాడ కేంద్రం... ఇప్పుడు ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది... ఆశ్చర్యపోయాను నేను. ఉషశ్రీగారి ప్రవచనం విన్న తరవాత.. బయలుదేరాడు... ఆపేసినందుకు మన్నించమన్నాడు. నాకు చాలా ఆనందమనిపించింది. మన్నించమన్నందుకు కాదు.. ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని అంత భక్తిశ్రద్ధలతో విన్నందుకు... పామరులను సైతం ఆకట్టుకున్న కార్యక్రమమది.. ఉషశ్రీ నిజంగా ధన్యుడు... అంటూ.. యతీంద్రులవారు మా ఇంటికి (సుబ్రహ్మణ్యం గారింటికి) పరామర్శకు వచ్చినప్పుడు చెప్పారు.
 
ఇదిగో ఈ చిన్న ఆడియో అలాంటి కార్యక్రమంలోదే... మేము విడుదలచేయబోయే ఉషశ్రీ ధర్మసందేహాలలోని ఓ రసగుళికను ఆస్వాదించండి. వినిపించండి. పుష్కర స్నానాలు అందరూ చేయవచ్చా.. లాంటి అనేక సందేహాలకు సమాధానాలు అందుకోండి. వినడానికి ఈ క్రింది వీడియో చూడగలరు".
                                 


ఈ ఆడియోలో వినపడే గొంతులు రెండు. ఒకటి శ్రీ ఉషాశ్రీగారిది కాగా, రెండవ గొంతు, ఉషశ్రీ గారి (రేడియో) శిష్యుడిగా పేరొందిన శ్రీ ఎ బి ఆనంద్ గారిది. వారి మాటల్లో వచ్చిన పుష్కరాల ప్రస్థావన, 1980 పుష్కరాల గురించి అయ్యి ఉంటుంది.

సీడీ కావాల్సిన వారు... 8008551231 లేదా...9295456478 నెంబర్లను సంప్రదించండి..
సుబ్రహ్మణ్యం గారి ఈ మెయిలు చిరునామా: zubram@gmail.com  
 ====================================================

కాబట్టి ధర్మసందేహాలు అప్పట్లో విని, మళ్ళీ వినాలని ఎదురుచూస్తున్న ఉషశ్రీ అభిమానులకు ఇది ఒక శుభవార్త. ఈ సి డి లను మనం కొనగలిగితే  ushasri.org వారిని మనం ఎంతగానో ప్రోత్సహించి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలను చెయ్యమని భుజం తట్టిన ఫలితం దక్కుతుంది. 

సిడి లు  కావాల్సిన వారు, ఫోను కాని, మెయిలు కాని చేసి, తమకు కావాల్సిన సి డి లను తెప్పించుకోవచ్చు. నాకు తెలిసి, ఇటువంటి అమూల్యమైన సిడిలకు ధర పెట్టాలంటే కష్టం. కానీ, అతి చిన్న ధర ఉంచినట్టు సమాచారం. దయచేసి పైనున్న వివరాలతో సుబ్రహ్మణ్యం గారిని సంప్రదించగలరు. 
 ****************************************************
మునుపు ఉషశ్రీ గారి పురాణ ప్రవచనం గురించి వ్రాసివ్యాసాలు 


పై వీడియోలో కనబడుతున్న ఫోటో ఉషశ్రీ గారి చిన్నప్పటి ఫోటో


 

1 కామెంట్‌:

  1. రామాయణంలో పిడకల వేట... సుబ్రహ్మణ్యం గారు ఉషశ్రీగారి పెద్దల్లుడు కాదు, మూడో అల్లుడు. ఇక ఆకాశవాణిపై మీ ధర్మాగ్రహం గురించి చెప్పేదేముంది, మాదీ అదే మాట అనడం తప్ప.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.