14, జులై 2017, శుక్రవారం

నిన్ను కోరి - ఒక మంచి సినిమా

 

చాలా కాలం తరువాత ఒక చక్కటి సినిమా చూశాము. నానీ మొదటి సినిమా "అష్టా-చెమ్మా" సినిమా నాకు బాగా నచ్చింది. ఆ తరువాత "కిష్టిగాడి లవ్ స్టోరీ" అనుకుంటాను  ఎదో బస్సులో వెడుతూ చూశాను. బాగున్నది. 

నాని గురించి, నాకు అనిపించింది చెబుతాను, "ఇతనొక నటుడు, ఇతను సినిమాలు చెయ్యటానికి ఒప్పుకోవటానికి ముందే కొంత ఆలోచించి,  ఆ సినిమా తన టేస్ట్ కు సరిపోతేనే నటిస్తాడు" ఇది నా అభిప్రాయం. ఇప్పటివరకూ అతని సినిమా చూసినవి మూడు, అందులో రెండ్రోజుల క్రితం చూసినది "నిన్ను కోరి" సినిమా. ఈ సినిమా అతని సినిమాలలో ఇంతవరకూ అద్భుతమైన సినిమా. 

 ముంబాయిలో మగళవారం ( శలవ రోజు కాదు) 11:15 కు పివిఆర్ లో మొత్తం హాలులో పది మందికి మాత్రమె సినిమా చూపిన హాలు యాజమాన్యానికి థాంక్స్ చెప్పాల్సిందే. మొన్నా మధ్య నాని ఒక ప్రకటనలో తన మనసులో బాధ ఇలా చెప్పాడు, "సినిమాలను కలెక్షన్ల బట్టి బేరీజు వెయ్యటం దారుణం"అని.  నిజమే మరి. ఫలానా సినిమా ఇన్ని కోట్లు వసూలు చేసింది కాబట్టి అదే గొప్ప సినిమా అనేసుకోవటం తప్పకుండా తప్పుడు అభిప్రాయం అని,  నేను కూడా ఈ సినిమా చూసినాక అతనితో ఏకీభవిస్తున్నాను.    

సినిమా నాకు ఎలా అనిపించింది చెప్పటానికి ముందు, ఈ సినిమాలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరో చూచెదము.


పాపం మొగుడు (అసలు హీరో)   
ఆది పినిసెట్టి
సినిమా హీరో (కాసేపు విలనీ కూడా)
నాని
హీరోయిన్
నివేద థామస్
దర్శకుడు(ఇదే మొదటి సినిమాట)
శివ నిర్వాణ
డప్పులు కాదు సంగీతం 
గోపి సుందర్
కెమెరా 
కార్తిక్ ఘట్టమనేని


ఈ సినిమాలో నాకు బాగా నచ్చినవి మూడు:

1. కథ: ఇక రెండో ఆలోచన లేకుండా చెప్పగలను.మామూలుగా గత రెండుమూడు దశాబ్దాలుగా వస్తున్నా మూస ప్రేమ కథే ఇది. కానీ, పెద్ద కానీ అతి సామాన్యమైన కథను చక్కటి మలుపులు తిప్పుతూ సగటు ప్రేక్షకుడి  ఆలోచనకు అందకుండా, సినిమా పోంకం చెడకుండా అద్భుతంగా మలిచారు. చక్కటి కథ, చక్కటి  స్క్రీన్ ప్లే. కథా మూలం దర్శకుడు శివ నిర్వాణదేనుట. కోన వెంకట్ స్క్రెన్ ప్లే అద్భుతంగా ఉన్నది. కత్తిమీద సాము అలవోకగా చేసాడు వెంకట్.

 గోపీ సుందర్ 
2. సంగీతం: ఒక్క మాటలో చెప్పాలంటే "సూపర్బ్".  ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూ లో హీరోయిన్ చెప్పినట్టుగా,  మ్యూజిక్ విడిగా విన్నా బాగుండాలి, మళ్ళీ  సినిమాలో కలిసిపోవాలి. సరిగ్గా సంగీతం సినిమాలో కలిసిపోయింది. "ఉన్నట్టుండి గుండె" పాట చాలా బాగున్నది. "బ్రేక్ అప్" పాట "మూక పాట" అయినా కూడా అతి చెయ్యకుండా చాలా బాగా చేసారు.

3. ఫోటోగ్రఫీ: మన తెలుగు సినిమాలలో ఎదో వాళ్ళ పడికట్టు మాటలతో "పాన్ షాట్", "లాంగ్ షాట్" "క్లోజప్" ఇలా ఎదో చెప్పటమే కానీ, సినిమాలో కథజరుగుతున్న ప్రాంతాన్ని చక్కగా చూపించటం తక్కువ. ఈ సినిమాలో ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉన్నది. అమెరికా చక్కగా చూపించారు, ధిల్లీ కూడా ఎంతో బాగా
 కార్తిక్ ఘట్టమనేని 
చూపించారు. ఆంధ్రా యూనివర్సిటీ (అనుకుంటాను) లో తీసిన సీన్లు కూడా చాలా బాగున్నాయి. కథ ప్రకారం (మూక పాటలకు కాదు) సినిమాలో ఎక్కువ భాగం అమెరికాలో తీశారు. అలా తీసినందుకు మనకు అమెరికాలో చక్కటి ప్రాంతాలను కార్తిక్ అద్భుతంగా      చూపించాడు. ఫోటోగ్రఫీ చేసిన కార్తిక్ ఘట్టమనేని కి చాలా మంచి భవిష్యత్తు ఉన్నది. ఆతను ఇంకా మంచి మంచి సినిమాలకు పనిచేస్తాడు. 


ఇన్ని చెప్పి అసలు విషయం చెప్పకపోతే ఎలా! అదే ఈ సినిమాకు దర్శకుడు.ఎవరు ఆయన, ఇప్పటికి ఎన్ని సినిమాలు? అంత సీన్ లేదు, ఇదే
  శివ నిర్వాణ  
మొదటి సినిమాట అతనికి. అతని పేరు శివ నిర్వాణ. సినిమా ఇంత చక్కగా రావటానికి దోహదపడిన ముఖ్య అంశాలలో దర్సకత్వానికి పెద్దపీట వెయ్యవలిసిందే. మనం సీనియర్ దర్శకుడు అనుకునే వాళ్ళు ఎవరు తీసినా ఈ సినిమాను నాశనం చేసేవాళ్ళే. కొత్త వాడు కాబట్టి, చక్కగా తీసి, మనకు
ఎక్కడా ఆడ్ మూమెంట్ కనపడకుండా కథను సినిమాగా చేసి చూపాడు . సినిమా అలా చక్కగా నిండుగా,గంభీరంగా నడిచిపోతుంది. మనకు ఒక మంచి దర్శకుడు దొరికాడు, అతని పేరు చూసి సినిమాకు వెళ్ళచ్చు అని ఒక భరోసా అనుకుంటున్నాను. చూడాలి (సీతారామయ్య గారి మనవరాలు సినిమా తీసిన దర్శకుడి గురించి కూడా ఇలానే అనుకుని నిరాశపడ్డాను) ప్రేక్షకులను నిరాశపరచడు అనే అనిపిస్తున్నది. ఇదేదో ప్లూక్ హిట్ కాదు.


అన్నట్టు మరచిపోయ్యాను, ఈ సినిమాలో హాస్యం. అబ్బ! ఎంత బాగున్నదో.
 మురళీ శర్మ-పృథ్వి 
హాస్యానికి ఒక "లేకి" ట్రాక్ పెట్టె ఈ రోజుల్లో, అసలు హాస్యానికి ప్రత్యేకమైన ట్రాకే లేదు. సినిమా కథలో కలిసిపోయిన ఆరోగ్యకరమైన చక్కటి  హాస్యం. సవ్యమైన డైలాగులతో
హాస్యం. ఎక్కడా కూడా ఈ మాటలు కథకేమిటి సంబంధం అనిపించదు. మామా అల్లుళ్ళుగా మురళీ శర్మ, పృథ్వి కలిసి ఒక అద్భుతాన్ని సృష్టించారు. గతితప్పుతున్న, గతితప్పిపోయిన తెలుగు సినిమా హాస్యానికి, వాళ్ళ నటనతో, డైలాగ్ డేలివరీతో.   మళ్ళీ  ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టారు.   ఇక్కడ కూడా స్క్రిప్ట్ రైటర్, దర్శకులను అభినందించాలి.

ఈ సినిమాలో ఒక ట్రీవియా. ఇప్పుడు చాలా మందికి తెలియని "మడత
మంచం" చూపించారు. సినిమాలలో మనకు తెలిసిన వస్తువులు, మనం సామాన్యంగా వాడుకునేవి చూపిస్తే వచ్చే సహజత్వం, పెద్ద పెద్ద సెట్లు వేస్తె రాదు. ఈ సినిమాలో అటువంటి లోపం రానివ్వకుండా చక్కటి "లోకేల్స్" లో సినిమాని తీసి సహజత్వం  ఎక్కడా పోకుండా జాగ్రత్త తీసుకోవటం ఎంతయినా ముదావహం. 
సినిమాలో కథేమిటో చెప్పనే లేదుకదూ? చెప్పేస్తే ఎలా! కొద్దిగా  క్లూస్   చెబుతాను.  హీరో,  హీరోలాగా కనిపిస్తాడు మొదట్లో. కానీ,  కాసేపటికి విలనా? అనిపిస్తాడు. మరొక కథా నాయకుడు అసలైన విలనా? అని కూడా సస్పెన్స్ ఉన్నది. కానీ అతనే అసలైన హీరోనా! మరి సినిమా హీరో! తెలియాలంటే సినిమా చూడాలి, తప్పదు. 

రాంగోపాల వర్మ అన్నట్టుగా సినిమా చూసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు ఎందుకు చెప్పాలి,మంచి సినిమా వాళ్ళకు చూపించినందుకు ప్రేక్షకులే దర్శకుడికి ధన్యవాదాలు చెప్పాలి. ఈ సినిమా చూస్తె అలాగే అనిపిస్తుంది. దర్శకుడికి నిర్మాతకు ధన్యవాదాలు.

*****************************************************
మంచి సినిమాలు వచ్చినప్పుడు చూడకుండా వదిలేస్తే మనకు చెత్త సినిమాలే వస్తాయి. ప్రేక్షకులమైన మనం,  మన  టేస్ట్ ఏమిటో చెప్పాలంటే మంచి సినిమాలు మాత్రమె ఆదరించాలి.
*****************************************************


1 వ్యాఖ్య:

  1. ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్లు, ద్వందార్ధాల డైలాగులు లేకుండా ఒక మంచి సినిమా రావడం అంటే ఎనిమిదవ వింతగానే అనుకోవాలి. మంచి స్క్రీన్ ప్లే ప్రేక్షకులని కట్టి పడేస్తుంది. డైరక్టర్ తొలి సినిమాలోనే ఇంత పేరు తెచ్చుకోవడం చాలా సంతోషం. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడం ప్రేక్షకుల కర్తవ్యం. అప్పుడే మంచి సినిమాలు మరిన్ని ఊపిరి పోసుకుంటాయి.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.