టైటిల్ "రంగస్థలం". అదొక సినిమా. అందుకని బాగున్నది. రాంగోపాలవర్మ మెచ్చుకోవటంలొ ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే టేకింగ్ చాలా బాగున్నది. ఒక పాట చాలా బాగున్నది. కానీ, అదేపాట, సినిమాలో కంటే యూ ట్యూబ్ లొనే ఉన్న వెర్షనే బాగున్నది. పాట విని మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి సినిమాలో పిక్చరైజేషన్ని చూసి నిరాశ చెందానేమో అని అనుమానం.
ముందుగా, యాంఖర్ గా మనకు బాగా తెలిసిన అనసూయను మెచ్చుకోవాలి. ఆవిడ చేసిన సినిమా చూడటం ఇదే మొదటిసారి. చాలా చక్కగా చేసింది. వయసుకు తగ్గ వేషం వేసి, (ఏమి వుడ్ అది, ఆ! టాలీవుడ్) దర్శకులకు, తనకు హీరోయిన్ వేషాలు వెయ్యాలన్న ఆశ ఇక లేదనీ, వదిన, అక్కయ్య లెదంటే అత్త వంటి వేషాలు వేసేస్తాను అన్న సందేశం ఇచ్చేసింది అని నాకు అనిపించింది.
ప్రతి సినిమాకు కథ ఉండాలి కదా! ఈ సినిమాకు కూడా ఒక కథ వండారు. అదేమిటి అంటే....పూర్తి కథ చెప్పను, చూచాయగా మాత్రమె చెబుతాను. వినండి. నేను కూడా ఆ దర్శకుడు సుకుమార్ రూట్లోనే వెడతాను, సస్పెన్స్ ఆమాత్రం ఉండొద్దూ!
ఒకానొక కుర్రాడు దుబాయ్ లో పనిచేస్తూ ఉంటాడు. అతనికి, హాస్టల్లొ ఉండి చదువుకునే ఒకమ్మాయికి, సినిమా భాషలొ చెప్పాలంటే, ప్రేమ ట్రాకు నడుస్తూ ఉంటుంది.
ఆ అమ్మాయి కుటుంబ నేపధ్యం, దర్శకుడు మన దగ్గర నుంచి పూర్తిగా దాచిపెట్టాడు. కాని చెప్తాడు, ఎప్పుడూ? చిట్ట చివరికి చెప్పిన కథ ఇప్పటికే చాలా చెప్పేశాము, ఇక ముగిద్దాము అని వారికి ఆలొచన వచ్చినప్పుడు. ఆ పధ్ధతి హిచ్-కాకియన్ కాదని ఊరికే గోలపెట్టకండి. తప్పేమున్నది, అదొక తేలుంగు సినిమా మరి, మీరు లొట్టలు వేసుకుంటూ తెగ మెచ్చుకుంటూ చూశే ఇంగ్లీషు సినిమా కాదుగా!
ఆ కుర్రాడికి ఊళ్ళో ఒక చెవిటి తమ్ముడు, కొంచెం దుందుడుకులే. జాగ్రత్త! అతనే ఈ సినిమాకు హీరో. అందుకనే ఆ దుందుడుకు తనం కొంచెం ఏమిటి సినిమాలో హీరోకి ఎంత ఉండాలో అంతా ఉంటుంది. వీళ్ళిద్దరికీ ఒక్క చెల్లెలు, సరే, పాత నటులను ఉధ్ధరించటానికి, తల్లితండ్రులు. తండ్రి పేరేదో ఉండాలి! ఆ, గుర్తుకు వచ్చింది, కోటేశ్వరరావు, ఒక టైలరు. తల్లి, కరక్ష్ గా ఊహించారు, గృహిణి. చెల్లెలికి, అవసరం ఐనప్పుడు ఫ్రేములొ కనపడటం తప్ప, పెద్ద పనిలేదు.
సరే, ఒక విలన్ ఉన్నాడు-రాజనాలకి ఎక్కువ,రావు గోపాలరావుకి తక్కువ. పాపం, ఆయనకు పెళ్ళాం పిల్లలు, చివరకు గోడ మీద ఫొటోల్లొనైనా చూద్దాము అని మనం ఎంత ప్రయత్నించినా కనపడరు. దర్శకులకు విలన్ల మీద కనికరం ఉంటే ఎలా? అంతటి విలేజీ విలన్ కి పక్కన రామలింగయ్య కూడా లేడు. ఒక గుండు రౌడీ ఉన్నాడు కానీ, అబ్బే! అల్లు రామలింగయ్య అంత, ఈ గుండు నటుడు ఎప్పటికీ కాలేడు.
డబ్బు సంపాదనకి, ఆ పైన ముఖ్యంగా ఊరికి తాను మాత్రమే ఎల్లకాలమూ పంచాయితీ ప్రెసిడెంట్ గా ఉండటనికి చెయ్యకూడని పనులు చెయ్యటం తప్ప విలన్ కు సహజంగానే వేరే పనులు ఉన్నట్టు కనపడదు. కాలక్షేపానికి రేడియో సదా వింటూ ఉంటాడు. విలన్ అన్న తరువాత, ఆమాత్రం ఉండాలి అని, చుట్టలు తెగ పీలుస్తూ ఉంటాడు. అన్నట్టు మరచాను, ఈ మతిమరపు ఒకటి నా ప్రాణానికి! పాత సినిమా పాతాళ భైరవిలొ ఎస్వీ రంగారావు అంత కాకపోయినా, సినిమా విలన్ చెయ్యతగ్గ పూజలుకూడా ఈ సినిమాలో విలన్ చేస్తూ ఉంటాడు, మేకలను కూడా బలి ఇస్తూ ఉంటాడు సుమా! మీలాగా నాలాగా కనపడటానికి ఆయనకు పిచ్చా, వెర్రా. సినిమా అండీ, అదొక సినిమా.
డబ్బు సంపాదనకి, ఆ పైన ముఖ్యంగా ఊరికి తాను మాత్రమే ఎల్లకాలమూ పంచాయితీ ప్రెసిడెంట్ గా ఉండటనికి చెయ్యకూడని పనులు చెయ్యటం తప్ప విలన్ కు సహజంగానే వేరే పనులు ఉన్నట్టు కనపడదు. కాలక్షేపానికి రేడియో సదా వింటూ ఉంటాడు. విలన్ అన్న తరువాత, ఆమాత్రం ఉండాలి అని, చుట్టలు తెగ పీలుస్తూ ఉంటాడు. అన్నట్టు మరచాను, ఈ మతిమరపు ఒకటి నా ప్రాణానికి! పాత సినిమా పాతాళ భైరవిలొ ఎస్వీ రంగారావు అంత కాకపోయినా, సినిమా విలన్ చెయ్యతగ్గ పూజలుకూడా ఈ సినిమాలో విలన్ చేస్తూ ఉంటాడు, మేకలను కూడా బలి ఇస్తూ ఉంటాడు సుమా! మీలాగా నాలాగా కనపడటానికి ఆయనకు పిచ్చా, వెర్రా. సినిమా అండీ, అదొక సినిమా.
కానీ, ఇంతటి విలన్, చివర్లొ పారిపోయి ఎక్కడొ పొలల్లొ నేలకు దిగువగా ఉన్న కట్టడంలో సద్దాం హుస్సేన్ లాగా దాక్కుని పడుకుని ఉండటం చూస్తే, దర్శకుడి ఆనతి మేరకు సహజంగా మనం కథానాయకుడి పక్క ఉండాల్సి వచ్చినా కూడా, విలన్ మీద జాలి వెయ్యకుండా ఉండదు. ఎంత అయినా ఒకప్పటి హీరొకదా. అంతకంటే ఘోరం, తాను చెయ్యని తప్పుకు హీరొ చేతిలో కుక్క చావు చస్తాడు. పాపం విలన్ల బతుకులు అంతేగా మరి. అందుకే, అదొక సినిమా.
సినిమా వెంటనే అయిపోతుందా! మీరెంత ఆశావాదులైనా అంత అత్యాశ పనికిరాదు. మరి? అవును, ఆ విలన్ చచ్చిపోంగానే సినిమా అవదండీ. పైగా ఆ విలన్ చచ్చిన సంగతి చివరివరకూ మనకు కూడా తెలియదు. అయినా, సినిమా ఎలా ఉండాలి, ఎప్పుడు అయిపోవాలి అన్నీ మీ ఇష్టమేనా! దర్శకుడు అనేవాడు ఒకాయన ఉంటాడు తెలుసా! అదొక సినిమా.
పైగా.........ఏమిటండీ ఈ క్షొభ నాకూ?! మాటి మాటికీ అడ్డువస్తారు. ఇలా ఐతే నేను ఇక వ్రాయను. పైనే చెప్పానా? లేదా? ఇది హిచ్-కాకియన్ సస్పెన్స్ కాదూ అని. ఏమిటొయ్ హిచ్-కాక్ గొప్పతనం. ఏమిటిటా ఆ హిచ్-కాకీయం! హేమీ లేదూ. సినిమలో ప్రతి విషయం ప్రేక్షకులకు మాత్రం చూపిస్తూ చెబుతూనే, సినిమాలొ ఉన్న పాత్రలకు ఎవరికి ఎంత తెలియాలొ అంతే తెలిసె పధ్ధతిలొ కథ నడపటమే హిచ్-కాకీయం, మనకు, అంటే ప్రేక్షకులకు, అప్పటికే తెలిసిన విషయాలు, పాత్రలు కథనం ద్వారా మాత్రమె సినిమా చివరలో ఎలా తెలుసుకుంటాయి అన్నదే ఉత్కంఠ లేదా సస్పెన్స్.
పైగా....అంటూ ఆపారేమిటి?
ఏదీనన్ను చెప్పనిస్తే కదా! చెబుదామని అనుకుంటున్న అసలు విషయం మర్చిపోయ్యాను. పోనీ ఇది వినండి. ప్రకాష్ రాజు లేడూ, అవును ఆయనే ఈ మధ్య ఊహూ తెగ "హార్ట్" అయిపోయి ఏదేదో తెగ మాట్లాడి పబ్లిసిటీ కోసం తాపత్రయపడుతున్నాడే, ఆయనే. వారికి తగ్గ పాత్ర ఇచ్చారు ఈ సినిమాలో. పెద్దగా కనపడడు, పైగా చాలా ముఖ్యమైన పాత్ర అని చివరికి తెలుస్తుంది మాష్టారూ. కాస్టింగ్ విషయంలో అతనికి బాగా నప్పిన పాత్ర ఇచ్చినందుకు, దర్శకుడిని అభినందించాల్సిందే, తప్పదు.
హీరోయున్.....? మీ ఆత్రం పాడుగానూ. వస్తున్నా అక్కడికే వస్తున్నా. నాకు తెలియదూ మీ ఆసక్తి! తెలుగమ్మాయి కాదు. పెరిగింది తమిళ నాట, అమ్మేమో మలయాళీ. వాళ్ళ నాన్న తెలుగాయనేలే. అందుకే కాబోలు తెలుగు కుర్రాడికి ఇచ్చి పెళ్ళి చేసాడు. ఆ అమ్మాయి హీరోయిన్. పేరు సమంత. సినిమాలో ముచ్చటగా ఉందబ్బాయ్. మీరేదో అంటూ ఉంటారే "నేటివిటీ" అని. ఆ విషయంలో చక్కగా పల్లెటూరు అమ్మాయిగా నప్పింది. పైగా, హీరోయిన్ అయ్యి కూడా బాగా నటించింది కూడా. షరా మామూలే, రెండు మూడు పాటలు, పల్లెటూరు అమ్మాయిగా వేసినా సరే గ్లామర్ ధారాళంగా పారింది. డోంట్ వర్రీ, మీరేమీ డిజప్పాయింట్ అవ్వరులే!
ఇంకేమి చెప్పాలీ ఈ సినిమా గురించీ? ఏమిటీ! హాస్యమా! ఈ సినిమాలో హీరోనే హాస్యపు బండి చులాగ్గా లాగిపారేశాడు. పైకి పోయిన వాళ్ళు ఇప్పుడు ఎలాగో లేరు, , రిటైర్ అయ్యేవాళ్ళు వెళ్ళిపోయి, హాస్యం చేస్తూ వచ్చి, హీరోలం అనుకుని మూల కూచున్న వాళ్ళు పోగా, మళ్ళీ హాస్యానికి ఇక బ్రహ్మానందమే మిగిలాడు కదా! అయినా సరే, మళ్ళీ బ్రహ్మానందం దేనికి పెద్ద ఖర్చు అనుకుని, హీరోకి చెవుడు పెట్టి ఆ అవకరంతో హాస్యం బండి చాలా అద్భుతంగా లాగించారు. పైగా ఆ చెవుడు, సినిమా సస్పెన్సుకు కూడా భలే వాడుకున్నారు.
సంగీతం ఎలా ఉన్నది అంటే చెప్పటానికి బాగానే ఉన్నది అని చెప్పాలి. పైన చెప్పానే, ఆ ఒక్క పాట బాగున్నది. మొదట్లో యు ట్యూబ్ లో చూసినప్పడు. నేను అక్కడ కామెంట్లో వ్రాసినది కరెక్ట్. సాహిత్య పరంగా, సినిమా పాటల ఎడారిలో ఒయాసిస్సులాగా బాగున్నది. సాహిత్యకర్త చంద్ర బోసుట. బాగా వ్రాశాడు. వింటారా ఆ పాట! సినిమాకి ఎలాగో వెళ్ళి చూస్తారుగా. పోనీ యు ట్యూబ్ లో ఉన్నదే వినండి. నాకైతే అదే బాగున్నది.
నేను వ్రాసేది "పరిచయం" మాత్రమె. సమీక్ష లాగా మీకు అనిపిస్తే అది నా తప్పు కాదు. ఇప్పుడు ఈ సినిమాలో నాకు నచ్చినవి ఆపైన నచ్చనివి రెండూ చెబుతాను.
మొదట, నచ్చినవి:
- సినిమా టేకింగ్ ఎక్కడా బోర్ కొట్టకుండా చక్కగా ఉన్నది. ప్రతి సినిమాకు ఒక "పేస్" ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఆ పేస్ బాగున్నది. ఎక్కడా చెడలేదు.
- ఇంటర్వెల్ కు ముందు పాటలు వినటానికి బాగున్నాయి. శ్లేష అర్ధం అయ్యింది అనుకుంటాను.
- చిరంజీవి కొడుకయ్యి, ఇప్పటికి దాదాపు అన్ని సినిమాలు హిట్స్ అయ్యి, రామ్ చరణ్ గ్లామర్ పోతుంది అనుకోకుండా చెవిటి మనిషి వేషం వెయ్యంటం అద్భుతం. పాత్ర ఏదైతే అది చెయ్యగలిగిన వాడే నటుడు అన్న ముఖ్య విషయం ఇప్పుడు మనకున్న హీరోల్లో ఒక్కాయనకన్నా తెలిసినందుకు సంతోషంగా ఉన్నది.
- కథ వెరైటీగా ఉన్నది. మనవాళ్ళే వ్రాసి ఉంటే అంతకంటే అద్భుతం లేదని చేతులు నేప్పెట్టేదాకా చప్పట్లు కొట్టటానికి సదా రెడీ. కాదంటే? ఏమిచేస్తాము! ఆ ఒరిజినల్ ఆంగ్ల సినిమా ఎదో చెబితే అది కూడా చూసి తరిస్తాము.
- పల్లెటూరి వాతావరణం బాగా తీసుకుని వచ్చారు. పక్క పాత్రలు వేసిన వాళ్ళు కూడా సరిగ్గా సరిపోయి ఆయా పాత్రల్లో వొదిగి పొయ్యారు. ఎక్కువ మంది మన "జబర్దస్త్" బాచ్ నటులు ఉన్నారు. ముఖ్యంగా అందులో షేకింగ్ శేషు, పేద రైతుగా జీవించాడు.
- సంగీతం మొత్తం మొత్తం వీనుల విందుగా ఉన్నది అని అనలేము కానీ, బాగున్నది. అక్కడక్కడా బాక్ గ్రౌండ్ స్కోర్ లో వచ్చే బిట్లు బాగున్నాయి. ఇంటర్వెల్ తరువాత వచ్చే పాటల్లో ఒక్కటి కొద్దిగా బాగున్నది. నారాయణమూర్తి సినిమాల బ్రాండ్ కనపడింది. దేవీశ్రీ ప్రసాద్ మంచి బీట్ ఇచ్చాడు, సాహిత్యం ఒకే. వినండి.
ఇక నచ్చనివి:
- సినిమాలో కథ 1985 లో జరిగిందని చెప్పారు. కానీ, కథలో ఏమిటి ఆ సంవత్సరం ప్రాముఖ్యత? నాకైతే ఏమీ కనపడలేదు. కథ నడపటానికి సెల్ ఫోన్లు ఉంటే కొంత అడ్డు అని అలా 1985 అని మనకు నమ్మ బలికారు అనిపించింది.
- సస్పెన్సు కోసం కథను ముందుకు వెనక్కు తిప్పటం, పైగా ప్రేక్షకులకు చాలా విషయాలు చెప్పకపోవటం నాకు నచ్చలేదు.
- హీరో అన్నకు "ఒక అమ్మాయికి" ప్రేమ ట్రాకు నడుస్తూ ఉంటుంది. హీరో అన్నేమో దుబాయ్ లో పనిచేస్తూ ఉన్నట్టు చెబుతారు, ఎదో శలవలకు వచ్చినట్టు చూపించారు. దుబాయ్ లో ఉన్న కుర్రాడికి, పట్నంలో హాస్టల్ లో చదుకునే అమ్మాయికి ప్రేమ ట్రాకు ఎలా నడిచింది, పైగా 1985లో! సెల్ ఫోన్లు ఇంటర్ నెట్ లు లేవాయే. అందుకే సినిమా అది.
- హీరోను ఒక పాము కరిచి పారిపోతుంది.ఆ పాము కోసం వెతుకుతూ ఉంటాడు. అది ఎందుకు పెట్టారో? హీరో తన్ను కరిచిన పామునే వదలలేదు, తన కుటుంబానికి ఇంత హాని చేసిన వాడిన వదలడు అని చెప్పటానికా! మరీ యాబ్‌స్ట్రాక్ట్‌గా ఉన్నదనిపించింది. లేదంటే, సగటు తెలుగు ప్రేక్షకుడికి ఉండే సినిమా లాజిక్ నాకు లోపించిందేమో!
- ప్రకాష్ రాజ్ కారు ఎక్కంగానే ఒక లారీ వచ్చి వెనకనుంచి గుద్దేస్తుంది. దానికి ముందు, ఆ ప్రమాదం జరగబోతోంది అని తెలిసిన వాడల్లే అరుచుకుంటూ, హీరో తెగ పరిగెత్తి వస్తాడు. ఆ సంఘటన నేపధ్యం సినిమాలో ఎక్కడా చెప్పలేదు.
- తాను ఊహించని వ్యక్తి తన కుటుంబానికి ద్రోహం చేశాడని ప్రమాదం జరగటానికి ముందుగా తెలిసినాకూడా, హీరో ఆ వ్యక్తిని తీసుకు వెళ్ళి హాస్పిటల్ లో చేర్చి, కాపాడి, కుటుంబ సభ్యులే వాళ్ళ వల్ల కాదనుకుని వెళ్ళిపోయినా కూడా, తానె అన్నీ అయ్యి, దాదాపుగా మూడేళ్ళు ఆసుపత్రిలో ఉండి కంటికి రెప్పలా చూసుకుని ఆ వ్యక్తిని బతికించి, అప్పుడు చంపెయ్యటం చాలా అసంబద్ధంగా ఉన్నది. అందుకే అది సినిమా!
- హీరోయిన్ పెళ్ళి చూపులు, పెళ్ళి చెయ్యబోవటం చాలా పేలవంగా ఉన్నది. ఆ సీన్ లు పెట్టటం వల్ల కథకు ఒరిగినది ఏమీ లేదు, హీరోని మరింత పైకి నేట్టినదీ లేదు. హీరోయిన్ పాత్ర పెంచటానికి మాత్రం ఉపయోగపడింది.
- సినిమాల్లో మనిషి మరణం ఎంత తక్కువ చూపిస్తే అంత బాగుంటుంది. మరణానంతరం తంతు అంతా పొల్లు పోకుండా చూపించి పాత్ర మీద సానుభూతి రాబట్టాలనుకోవటం దర్శకుడి భావదారిద్ర్యం తప్ప మరేమీ కాదు. అప్పుడెప్పుడో 1972 లో వచ్చిన పండంటి కాపురం సినిమాలో సులక్షణ బాల నటిగా చిన్న కుర్రాడి పాత్రలో మరణిస్తే, పాతి పెట్టటం చూపించినది మొదలు (డైరెక్టర్ లక్ష్మీ దీపక్ అనుకుంటాను) ఈ సినిమా వరకూ ఈ చావు "తంతు" చూపించిన దర్శకులు అందరూ ఈ భావదారిద్ర్యం నుంచి తీసుకుంటున్న వాళ్ళే. "స్వాతి ముత్యం" సినిమాలో రాధిక చనిపోయిన సీన్ గుర్తున్నదా! చాలా సింపుల్ గా తీసి గుండె పిండేశారు. ఆంగ్లంలో సటిలిటీ (subtility) అంటారు అది ఉండాలి దర్శకులకు. కళాతపస్వి అని పొగడటం కాదు, కొన్ని కొన్ని నేర్చుకోవాలి.
- సినిమాల్లో ఒక ఐటం సాంగ్ పెట్టాలన్నదురాచారం ప్రకారం ఇందులోనూ అలాంటి అసంబద్ధమైన పాట ఒకటి ఉన్నది. ఆ పాట ఇంటర్వెల్ తరువాత.
- హీరో విలన్ దగ్గర డబ్బు తీసుకోవటం చూపకుండా, ఆ విషయం మీద నానా యాగీ చేసే సంఘటన ఎందుకు పెట్టినట్టు? తనకెదురు తిరిగిన వాళ్ళను చంపేసి అడ్డు తొలగించుకునే విలన్, హీరోను డబ్బులిచ్చి తన పక్కకు తిప్పుకోవటానికి ఒక్క కారణం కూడా లేదు. జస్ట్ హీరో కాబట్టా!
- సినిమాలో పెద్ద సీన్, ఎలెక్షన్ల సీన్ అవుతుందని ఉత్కంఠతో ఎదురుచూసే నాలాంటి అమాయక ప్రేక్షకులకు నిరాశే ఎదురయ్యింది. జస్ట్ అలా, అనసూయను ప్రెసిడెంట్ చేసేసినట్టు చూపించి చేతులు కడిగేసుకున్నారు.
- ఈ సినిమాకు ఫైట్లు ఎవరో మరి? చాలా అసంబద్ధంగానూ అసహజంగా ఉన్నాయి. గుండు విలన్ ని హీరో, చాకలి గుడ్డలు ఉతికినట్టు ఉతికితే, అవును, నిజంగా కాళ్ళు పట్టుకుని గిర్రున తిప్పి తల నేలనేసి కొడితే, వాడు, జస్ట్ చెయ్యి విరిగి బయట పడతాడు. కానీ, అదే గుండు గాడు, విలన్ చెంబు పెట్టి రెండు వెయ్యంగానే చచ్చి ఊరుకుంటాడు. అందుకే అది సినిమా.
- ఈ గుండు విలన్ ని చావ గొట్టినప్పుడు మాత్రం పోలీసులు వెంటనే వచ్చి హీరోను అరెష్టు చేసి తీసుకుపోయి బాదుతారు. కానీ, తరువాత మన హీరో, బోలెడు మంది విలన్ మనుషులను చకచకా పొలాల్లో చంపేస్తే ఎక్కడా పోలీసుల ఊసే లేదు! హత్య చెయ్యబడిన అన్న శవాన్ని హీరో అలా భుజాన వేసుకు వచ్చేస్తాడు. అప్పుడు కూడా పోలీసులు కలుగచేసుకోరు. తన అన్నాను హత్య చేయించాడన్న కోపంతో, హీరో అల్ పవరుఫుల్ విలన్ ఇంటి మీద దొమ్మీకి వెళ్ళి సర్వ నాశనం చేసినా పోలీసులు కలుగచేసుకోరు. దర్శకుడు చెబితే కాని వాళ్ళు ఎంత ఘోరం జరిగినా రారన్న మాట. అవసరం ఐతే, చిన్న వాటికి వచ్చి హీరోను కొట్టేస్తారు. ఈ లాజిక్ నాకు తెలియదు. తెలుగు సినిమాలు చూట్టం తక్కువ కదా మరి.
- చిట్టచివరకు విలన్ తాను ఎందుకు హీరో అన్నను చంపించాడో చెప్పిన కారణం చాలా అసంబద్ధంగానూ 1985లో అయినా సరే నిజానికి దూరంగానూ ఉన్నది.
- పేర్ల ద్వారా, నర్మగర్భంగా కొన్ని షాట్ల ద్వారా ఒకటి రెండు సామాజిక వర్గాలను విమర్శచేసే ప్రయత్నం చాలా ఏవగింపు కలిగించింది.
ఏది ఏమయినా, సినిమా చూస్తున్నంత సేపూ విసుగైతే మాత్రం పుట్టలేదు. ఈ విషయానికి దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే.
ఏమిటీ! సినిమా కథ చెప్పలేదా? భలేవాళ్ళే కథ పూర్తిగా నేనే చెప్పేస్తే డైరెక్టరు దేనికీ, సినిమా తియ్యటం దేనికీ. చక్కగా వెళ్ళి చూడండి. ఒకే.
// “ఒక విలన్ ఉన్నాడు-రాజనాలకి ఎక్కువ,రావు గోపాలరావుకి తక్కువ” //
రిప్లయితొలగించండిరివర్సండీ, రివర్స్ - రావు గోపాలరావుకి ఎక్కువ, రాజనాలకి తక్కువ అంటే బాగుంటుందేమో? ఎంతైనా రాజనాల సీనియర్ విలన్ కదా 🙂.
ఇంతకీ మీరీ సినిమాని పొగిడినట్లా, తెగడినట్లా 🤔? మీరన్న subtle పద్ధతిలో ... తెగడినట్లేనని ... నా అనుమానం.
రాజనాల్ సీనియర్ అయ్యి ఉండచ్చు కానీ నా దృష్టిలో రావుగోపాల రావే గొప్ప విలన్.
తొలగించండిసినిమా చూడండి. నేను తెగడనూ లేదు పొగడనూ లేదు. నా అభిప్రాయాలు చెప్పాను. అంతే.
బాగా రాసారండి. ఇంకా చెప్పాలంటే ఏకేశారు.
రిప్లయితొలగించండిమీ way of writing చాలా jovial గా ఉంది. నేను సినిమా ఇంకా చూడలేదు అనుకోండి. మీది చదివాక ఒకసారి చూడొచ్చు అనే ధైర్యం కలిగింది కనక చూస్తాను.
మీ పట్ల అభిమానంతో మీ సమీక్ష పూర్తిగా చదివాను. నేను సినిమాలు చూసి చాలా ఏళ్ళు అయింది. అందువల్ల ప్రస్తుతం ట్రెండ్, యాక్టర్స్ పేర్లు ఏవీ తెలియవు. అతిశయోక్తి కాదు. (మొన్న పుస్తక ప్రదర్శనకు ఒకాయన వచ్చి సినిమా కి పని చేస్తారా అని అడిగితె పైన మీకు చెప్పిన సమాధానమే చెప్పి దణ్ణమ్ పెట్టాను.) సరే. మంచి సినిమా అయితే ఎప్పుడో టీవీలో వేస్తారుగా అప్పుడు చూస్తా. ధన్యవాదాలు .
రిప్లయితొలగించండిచాలా బాగున్నది, ముఖ్యంగా నచ్చినవి మరియు నచ్చనివి.
రిప్లయితొలగించండిThe review is excellent and worth publishing in a daily.
రిప్లయితొలగించండినాకు బాగా నచ్చింది
రిప్లయితొలగించండిబాగా చెప్పారు. మీరు చెప్పిన నచ్చనివి పాయింట్లతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.
రిప్లయితొలగించండిసినిమా చూడలేదు, కానీ మీ రివ్యూ చదువుతూ ఉంటే కంటిన్యూ చేయాలనిపించింది. బాగా వ్రాశారు. ప్లస్, మైనస్ లు రెండూ అర్ధవంతంగా ఉన్నాయనిపించింది.
రిప్లయితొలగించండిశివరామప్రసాద్ గారు మీ సమీక్ష చాలా బాగుంది. అసలు ఒక సినిమా పై ఇంత విశ్లేషణాత్మక సమీక్ష నేను ఎప్పుడు చదివింది లేదు. నేను కూడా సినిమా చూసాను.
రిప్లయితొలగించండిసినిమా లోని హీరో, హీరోయిన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సినిమా లోని ప్రతి ముఖ్య సన్నివేశాలపై మీ సమీక్ష చాలా చాలా బాగుంది. సినిమాలోని అన్ని అంశాలపై ప్లస్ మరియు మైనస్ పాయింట్లపై మీ విశ్లేషణ బాగుంది.
నిజానికి నేను మీ ఫేసుబుక్ ఫ్రెండ్ ని కాను. ఒక ఫేసుబుక్ స్నేహితుడి ప్రొఫైల్ చూస్తుంటే దాంట్లో మీరు పోస్ట్ చేసిన సమీక్ష చదివే అవకాశం కలిగింది.
అభినందనలు..
Thank you.
తొలగించండి