20, జులై 2009, సోమవారం

జయదేవ్-ప్రముఖ కార్టూనిస్ట్ (వ్యంగ్య చిత్రకారుడు) మొదటి భాగం

జయదేవ్(Jayadev) ప్రముఖ తెలుగు వ్యంగ్య చిత్రకారుడు. 1940 అక్టోబర్ 9న కడపలో జన్మించారు. ఈయన పూర్తి పేరు 'సజ్జా జయదేవ్ బాబు'. 1959వ సంవత్సరం నుండి కార్టూన్లు (వ్యంగ్య చిత్రాలు) చిత్రిస్తూ ఉన్నారు. గీతల్లో ఒడుపే కార్టూన్ కు ప్రాణం అన్నమాటను నిత్య సత్యం చేస్తూంటాయి ఆయన కార్టూన్లు.ఈయన తన బాల్యం లో ఎక్కువ భాగం మదరాసు లోని పాత చాకలి పేటలో గడిపారు. వృత్తిరీత్యా జంతుశాస్త్రాన్ని మదరాసులోని సర్ త్యాగరాయ కాలేజీ లో 1997 వరకు బోధించారు.


ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రికలో 1959లో మొదలు పెట్టి, తెలుగులో వచ్చిన దాదాపు అన్ని వార, మాస పత్రికలన్నిటిలోనూ తన వ్యంగ్య చిత్రాలను ప్రచురించారు. అన్ని ప్రముఖ పత్రికలు, ముఖ్యంగా యువ దీపావళి సంచికలలో ఈయన కార్టూన్లు లేకుండా ప్రచురించబడేవి కాదు. 2002 వరకు ఆయన చిత్రీకరించిన వ్యంగ్య చిత్రాల సంఖ్య 40,000 పైగా ఉన్నాయి.


కార్టూనిస్ట్ అయిన విధం

చిన్నతనంలో చదువు మొదలు పెట్టినప్పుడు పడిన పునాది చేతి వ్రాత గుడ్రంగా వ్రాసేవాడు. 6వ 7వ తరగతులు చదువుతున్నప్పుడు డ్రాయింగ్ మాష్టారి దగ్గర పెన్సిల్ తో బొమ్మలు గీయటం నేర్చుకున్నారు. 9వ తరగతిలో తరగతి పత్రిక (Class Magazine)కు ఆంగ్లకవి వర్డ్స్ వర్త్ (Wordsworth) పద్యానికి బొమ్మ గీసి మెప్పు సంపాదించారు. 1957లో కాలేజీలో చదువుకుంటున్నప్పుడు, బయాలజీ ప్రొఫెసర్ వ్రాయబోతున్న పుస్తకానికి బొమ్మలు వేయటంకోసం, పెన్సిల్ తో కాకుండా, ఇండియన్ ఇంక్ తో, బ్రిస్టల్ బోర్డు పేపరు మీద, సన్నటి క్రోక్విల్ పాళీతో బొమ్మలు వెయ్యటం నేర్చుకున్నారు .


1959లో మొదటి కార్టూన్ ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. కాని ఆ మొదటి కార్టూన్ ప్రస్తుతం అందుబాటులో లేదు. చివరికి, వేసిన జయదేవ్ దగ్గరకూడ లేదట. కాని వారు చెప్పిన ప్రకారం, ఆ మొదటి కార్టూన్ నిశ్శబ్ద వ్యంగ్యచిత్రమే. అందులో రెండు బొమ్మలు. మొదటి బొమ్మలో దొంగను తరుముతున్న పోలీస్. రెండో బొమ్మలో పోలీస్ దొంగ జుట్టుపట్టుకునేప్పటికి, ఆ దొంగ పెట్టుకున్న పెట్టుడు జుట్టు(విగ్) పోలీస్ చేతిలోకి ఊడొచ్చి, వాడు పారిపోవటం! తన మొదటి కార్టూన్ తనదగ్గరే లేదని బాధపడుతుంటారు జయదేవ్.
(సశేషం)
(నేను తెలుగు వికిపీడియాలో వ్రాసిన వ్యాసాన్ని మూడు భాగాలుగా అందిస్తున్నాను)
(నేను అడిగినదే తడవుగా నాకు అన్ని వివరాలు ఇచ్చి ఈ వ్యాసం వ్రాయటానికి ప్రోత్సహించిన జయదేవ్ గారికి నా కృతఙ్ఞతలు )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.