20, జులై 2009, సోమవారం

బాబు ప్రముఖ కార్టూనిస్ట్ (మూడవ భాగం)


బాబుగారు వేసిన ఈ కార్టూన్, ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మీద చక్కటి చురక. సామాన్య వోటరును ఎంత వెర్రివాణ్ణి చేసి రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకుంటున్నారో చూపిస్తుంది ఈ కార్టూన్. ఇందులో చూడండి, ఆ సామాన్య వ్యక్తి ఆశగా తనకు కావాల్సినవి ఆబగా (కొవ్వొత్తి వెలుగులో, ఇంట్లో సరైన లైటుకూడ లేదన్నమ్మట) వ్రాస్తుంటే, ఇవన్నీ మనచెసేదా పెట్టేదా అని వ్యంగ్యంగా చూస్తున్న రాజకీయ నాయకుడు, బాబు గారి అద్భుత చిత్రీకరణ.

వ్యంగ్య చిత్ర ధారావాహిక1972లో ఆంధ్రపత్రిక వార పత్రికలో, సంచిక తెరువగానే ముఖచిత్రం వెనుక వెంకన్నాస్ కోల్డ్ (అప్పట్లో మనదేశంలో విడుదలయిన ప్రముఖ ఆంగ్ల చిత్రం మెకన్నాస్ గోల్డ్ కు పారడీగా-పేరువరకు మాత్రమే) 24 వారాల పాటు ప్రచురించబడి పాఠకులను ఎంతగానో అలరించింది. తెలుగులో వ్యంగ్య చిత్ర ధారావాహికలలో మొదటిది బుడుగు అయితే, వెంకన్నాస్ కోల్డ్ రెండవది.


ప్రముఖుల అభిప్రాయాలు

శివలెంక రాధాకృష్ణ-ఆంధ్ర పత్రిక సంపాదకులు-చక్కటి గీత, నొప్పించని హేళన, మొత్తం మీద అందంగా కనిపించే బొమ్మ-తెలుగు కార్టూన్‌లలో ఈ లక్షణాలు ఉన్న సంప్రదాయాన్ని బాపు మొదలు పెట్టారు. జయదేవ్, బాబుల హాస్య చిత్రాలు ఈ సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నాయి. బాబు మంచి కార్టూనిస్టుగానే కాదు, ప్రథమ శ్రేణికి చెందిన కథా రచయితగానూ పేరుపొందాడు.
బాపు-ప్రముఖ చిత్రకారులు, దర్శకులు, వ్యంగ్య చిత్రకారులు- వీరు మాటలతో కాకుండా తన గీతలతోనే బాబు కార్టూన్ల మీద తన అభిప్రాయాన్ని విన్నూత్నంగా వ్యక్తపరిచారు. ఆంగ్లంలో కుర్చీలోంచి పడిపోవటం(Falling off the Chair) అన్న వాడుక ఉన్నది . ఈ వాడుకను సామాన్యంగా ఆవతలి వ్యక్తి మీద ఎంతగానో మంచి అభిప్రాయాన్ని వ్యక్తపరచతానికి వాడతారు. భాపు గారు, ఆ ఆంగ్ల వాడుకననుసరించి తాను బాబు కార్టూన్లు చదువుతూ ఎంతగానో ఆనందిస్తున్నట్టుగా కార్టూన్ వేసి, బాబును ఎంతగానో మెచ్చుకున్నారు.
జయదేవ్-ప్రముఖ కార్టూనిస్ట్-తెలుగు కార్టూనుకు దర్పణం పట్టిన కార్టూనిస్టులు ఇద్దరే ఇద్దరు. ఒకరు బాపు, మరొకరు బాబు. ఇద్దరి కార్టూనుల్లో హావం, భావం, పదం, రేఖా విన్యాసం మెండుగా కనిపించి, పాఠకుడి మనసునాకట్టుకుంటాయి. బాపు కార్టూను కళాకోవిదుడు. ఆయన్ని అన్ని కోణాలనుంచి పరిశీలించి, చదివి వంటపట్టించుకుని, కార్టూన్ విద్యలో ఉత్తీర్ణుడయ్యారు బాబు. తన చుట్టూ కదిలే, మెదిలే, వస్తువుల్ని, అంశాల్ని, వ్యక్తుల్ని, వాసనతో సహా పట్టేసి, స్పృశించి, సందర్భానుసారంగా తన ఊహా శక్తిని ప్రదర్శించగల నేర్పు బాబు ఒక్కరికే వుంది. 1965లో "మకెన్నాస్ గోల్డ్" సినిమా రిలీజైంది (విజయవాడలో1970వ సంవత్సరంలో ఊర్వశీ సినిమా హాలులో మొదటి సినిమాగా విడుదలయ్యింది). ఆ సినిమా టైటిలును బాబు పట్టుకున్నారు. "వెంకన్నాస్‌ కోల్డ్" బొమ్మల కథను సృష్టించారు(1972లో). అతనికి స్పూర్తి ఏ విధంగా కలుగుతుందో చెప్పలేము. అన్ని రకాలుగా ఆలోచించి, వ్యంగ్యాన్ని పండించగల ధీమంతుడు బాబు!
వేమూరి బలరామ్‌-స్వాతి వారపత్రిక వ్యవస్థాపకులు, సంపాదకులు-ఎదుటివారిని ఏడిపించడం ఎందరికో వేడుక. కాని ప్రతి వార్ని నవ్వించాలని కొందరికే కోరిక. అలా నవ్వించగలిగిన కొందరిలో 'బాబు'ది ఓ ప్రత్యేక బాణి.
రామకృష్ణ-ప్రముఖ కార్టూనిస్ట్- "బాపు తరువాత అంత అలవోకగా,తేలికైన గీతలలో కార్టూన్ చిత్రించటంలో నేర్పరి బాబు........సామాన్యుడి దైనందిన జీవితంలోని అనుభవాలకు చాలా దగ్గరగా ఉంటాయి ఆయన కార్టూన్లు. అందుకే అవి అంత బాగా పేలతాయి........."


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.