19, జులై 2009, ఆదివారం

జయదేవ్-ప్రముఖ కార్టూనిస్ట్ (వ్యంగ్య చిత్రకారుడు) రెండవ భాగం




కార్టూన్లతో సంఘ సేవ

పొగ తాగటం వల్ల వచ్చే దుష్పరిణామాలు, నలుగురూ ఉన్నచోట ధూమపానం వల్ల జరెగే అసౌకర్యం, ఇతరులకు అనారోగ్య హేతువు కావటం వంటి విషయాలమీద అవగాహన 1970లలోనే వచ్చింది. కాని, పబ్లిక్ ప్రదేశాలలో పొగతాగటాన్ని నిషేధించటానికి అప్పటినుండి, మూడు దశాభ్దాల పైన పట్టింది. 1960-1970 దశకాలలో మధ్యాహ్నం సమయంలో వేసే మ్యాటినీ ఆటలకు (అప్పట్లో ఎ.సి. హాళ్ళు లేవు, మొదటి ఆటకు బయట వెలుగు ఉండదు కనుక తలుపులు మొత్తం తీసేవారు)సినిమాకు వెళ్ళితే, పొగ మేఘాల మధ్య చూడవలసి వచ్చేది. పొగరాయుళ్ళు అంతగా తమ అలవాటును యధేచ్ఛగా అన్ని చోట్లా కొనసాగించేవారు. ఇది గమనించి బాధపడిన జయదేవ్, తన కార్టూన్లను మాధ్యమంగా వాడుకుంటూ, ధూమపానం వల్ల వచ్చే దుష్పరిణామాలను ప్రజలకు హాస్యంతో జతపరిచి చెప్పసాగారు. అంతేకాక, తాను స్వతహాగా ఆచార్యుడవటం వల్ల, తాను పాఠం మొదలు పెట్టటానికి ముందు విద్యార్ధులకు పొగ తాగవద్దని హితవు పలికేవారు. వీరి మాటలు సరైన సమయంలో, సరైన విధంగా ఆ విద్యార్ధుల మనస్సులమీద పనిచేసి అనేకమందిని ఆ చెడ్డ అలవాటు బారిన పడకుండా చేసింది. వీరు వేసిన కార్టూన్ సకల ప్రజాదరణ పొందటమే కాకుండా, భారత కాన్సర్ సొసైటీ(Cancer Society of India)వారు, తమ ధూమపాన వ్యతిరేక ఉద్యమ ప్రచారంలో కూడ వాడుకుంటున్నారట. భారత ట్రేడ్ ఫైర్ అథారిటీ(Trade Fair Authority of India) వారు జయదేవ్‌ను ఢీల్లికి ఆహ్వానించి సత్కరించారు.
వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు
బాపు తరువాత సంతకం అక్కర్లేని అతి కొద్దిమంది వ్యంగ చిత్రకారులలో జయదేవ్ ఒకడు. baabu -కొలను వెంకట దుర్గా ప్రసాద్ మరొకరు). చూడగానే ఇది జయదేవ్ కార్టూన్ అని తెలిసిపోతుంది. వీరు వేసిన కార్టూన్లలో చక్కటి పొందిక అకట్టుకునే ఆకర్షణ. బొమ్మ చిత్రీకరణలో ఎటువంటి విపరీతాలు (మిడి గుడ్లు, అసహజ రూపాలు వంటివి) ఉండవు. సహజత్వానికి దగ్గరగా కార్టూన్ల లోని అయా పాత్రల ముఖ భంగిమలు, సదర్భానికి సరిపొయే ముఖ కవళికలు హాస్యప్రధానంగా చిత్రీకరించటంలో జయదేవ్ దిట్ట. అలాగే కార్టూన్లలోని సంభాషణలు ఎంతో పొదుపుగా చక్కటి భాషలో ఉండి అరోగ్యకరమైన హాస్యాన్ని అందిస్తాయి. బొమ్మకి వ్యాఖ్యా, లేదా వ్యాఖ్యకు బొమ్మా అని తటపటాయించేవారికి, వ్యాఖ్య లేకుంటే బొమ్మ అర్ధం కాదు. బొమ్మలేకుంటే వ్యాఖ్య అర్ధంకాదు. కార్టూన్లలో ఈ రెండిటికీ మంచి సంబంధం ఉండాలి అని వివరిస్తారు జయదేవ్. నేపాళం, భూపాళం, (తాగుబోతు) బ్రహ్మం, మిస్టర్ నో, బాబాయ్-అబ్బాయ్ వంటి పాత్రలను కార్టూన్లలో సృష్టించి పాఠకులను అలరించారు జయదేవ్.

(సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.