20, జులై 2009, సోమవారం

బాబు ప్రముఖ కార్టూనిస్ట్ (మొదటి భాగం)
వ్యక్తిగతం
కొలను వెంకటదుర్గాప్రసాద్ విజయవాడలో 1946, జూన్ 1న జన్మించారు. వీరి తండ్రి కొలను సత్యనారాయణ, తల్లి కొలను పిచ్చమ్మ. మొదట వీరి పేరును వెంకటరమణ అనుకున్నారట కాని ఈయన తండ్రి విజయవాడ దుర్గాదేవి మీద ఉన్న భక్తితో, పేరును వెంకటదుర్గాప్రసాదుగా నిర్ణయించారట. ఇంట్లో అందరూ "బాబు" అని ముద్దుపేరుతో పిలిచేవారు. 1962వ సంవత్సరంలో విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో పి.యు.సి (Pre University Course) చదివారు. సినిమా ప్రచార కార్యక్రమంలో (Publicity)లో కొంతకాలం పనిచేశారు కేంద్రప్రభుత్వ ఉద్యోగంలో 1966వ సంవత్సరంలో చేరి, 40 సంవత్సరాలు పనిచేసి గ్రూప్-బి అధికారిగా 2006లో పదవీ విరమణ చేసి ప్రస్తుతం విజయవాడలోని సీతారాంపురంలో నివాసముంటున్నారు. వీరి భార్య పేరు శాంతకుమారి. వీరికి ఇద్దరు కుమారులు కళ్యాణచక్రవర్తి, వేణు.


వ్యంగ్య చిత్రకారుని ప్రగతి

వీరు చలనచిత్ర ప్రచార రంగంలో పనిచేస్తున్న రోజులలో, స్నేహితుడు క్యానం భగవాన్ దాస్ ( ఈయన కూడ కార్టూనిస్టే-భగవాన్ పేరిట వ్యంగ్య చిత్రాలు గీశేవారు) మార్గదర్శనంలో, బాపు ఆడుగుజాడలలో, అతని ఏకలవ్య శిష్యరికం చేస్తూ కార్టూన్లను వెయ్యటం మొదలుపెట్టారు. మొట్టమొదటి కార్టూన్, ఆంధ్ర పత్రికలో 1963 సంవత్సరం, సెప్టెంబరు 6వ తారీకు సంచికలో ప్రచురితమయ్యింది. (పైన బొమ్మలో తన గురువు లాంటి స్నేహితుడు భగవాన్‌దాసుతో బాబు)
ఆ తరువాత డజన్ల కొద్దీ వ్యంగ్య చిత్రాలు ప్రచురించాడు. ఆంధ్ర పత్రిక సంపాదకులయిన శివలెంక రాధాకృష్ణ ఇతడిని ఎంతగానో ప్రొత్సహించారు. ఆంధప్రత్రికలోనే కాక తమ అనుబంధ ప్రచురణలైన భారతి (మాస పత్రిక), కలువబాలలో వీరి కార్టూన్లనే కాక, కథలకు బొమ్మలు, కథలు మరియు అనువాదాలను దాదాపు రెండు దశాబ్దాల పాటు, ప్రచురించారు. 1972 సంవత్సరంలో "వెంకన్నాస్ కోల్డ్" అన్న వ్యంగ్య చిత్ర ధారావాహికను ఆంధ్రపత్రికలో 24వారాల పాటు (6 నెలలు) ఏకధాటిగా ప్రచురించి పాఠకులను ఎంతగానో అలరించి మెప్పు పొందారు. అలాగే, "ఇ వేమన పద్యాలను" నాలుగు సంవత్సరాలపాటు ప్రచురించి, హాస్య ప్రధానంగా బొమ్మలు వేసి, వేమన పద్యాలను మరింత ప్రాచుర్యంలోకి తీసుకుని వచ్చాడు. బారిష్టర్ పార్వతీశం నవల మొదటిభాగానికి బొమ్మలు వేశాడు. తెలుగులోని అన్ని ప్రముఖ వార/మాస పత్రికలలోనే కాక, ఆంగ్లంలో ప్రచురితమయ్యే, కార్వాన్(Carvan)లో చాలా కార్టూన్లను వేశారు. అలాగే ఉమెన్స ఎరా(Women's Era)పక్ష పత్రికలో మోడెస్ట్(Modest) అన్న శీర్షికన, రెండు సంవత్సరాల పాటు కార్టూన్లను ప్రచురించారు. 1970 ప్రాతాలలో, తన మిత్రుడు, ప్రముఖ కార్టూనిస్ట్ అయిన జయదేవ్‌తో కలసి "పేజీ కార్టూన్ల"ను వెయ్యటం ఒక మరుపురాని గొప్ప అనుభవం అని చెప్తారు బాబు. జపాన్, బెల్జియం, టర్కీ దేశాలలో జరిగిన వివిధ కార్టూన్ల పోటీలలో ఇతని కార్టూన్లను ప్రదర్శించారు. తనకు అన్నిటికంటే జరిగిన సన్మానం బాపు తన కార్టూన్‌ను మెచ్చుకోవటం అని చెప్పి మురిసిపోతారు. ఉద్యోగంనుండి మాత్రమే పదవీ విరమణ చేశారు, తన ప్రవృత్తి అయిన వ్యంగ్య చిత్ర పరంపరను మటుకు చక్కగా కొనసాగిస్తున్నారు, ప్రతివారం స్వాతి పత్రికలో కార్టూన్లను ప్రచురిస్తున్నారు.


కథాకారుని ప్రగతి
చాలామందికి తెలియని విషయం, ఈయన మంచి కథా రచయిత కూడ. తన కథలను తన అసలు పేరుతో ప్రచురించటం వల్ల, "బాబు" కార్టూనిస్ట్ మరియు కథా రచయిత కొలను వెంకటదుర్గాప్రసాద్ ఒకరే అన్న విషయం చాలామంది పాఠకులకు తెలియదు.
"ప్రముఖ కార్టూనిస్టు అయిన బాబు కథలు కూడ వ్రాస్తారు" అని చెప్పుకోవటానికి మాత్రమే కాకుండా, చక్కటి కథలను రచించి, ఆంధ్రపత్రిక ఆ రోజులలో (1970లలో)నిర్వహించే దీపావళి కథల పోటీలలో, మూడుసార్లు బహుమతులను సంపాదించారు.
వ్యంగ్య చిత్ర చిత్రీకరణ విషయంలో బాపును గురువుగా బావిస్తే, హాస్య రచనల విషయంలో ముళ్ళపూడి వెంకటరమణ ను తన గురువుగా భావిస్తారు.

బాబు-బాపు
కొత్తగా కార్టూన్లను చూడటం మొదలు పెట్టిన పాఠకులు, పేర్లలో ఉన్న సామ్యం వల్ల, బాబు-బాపు ఇద్దరూ ఒకరే అనుకునే అవకాశం ఉన్నది. బాపు తెలుగు వ్యంగ్య చిత్రాలకు ఆద్యుడు, పితామహుడయితే, ఆ ఒరవడిని అంది పుచ్చుకుని, తెలుగులో వ్యంగ్య చిత్రాల చిత్రీకరణలో చెయ్యగలిగిన ప్రయోగాలన్నీ చేసి పాఠకులను అలరించినవారు బాబు . అందుకనే, తన కార్టూన్ల సంపుటిలో బాబు ఎంతో ఒద్దికతో, "ఎవరి గీతలనయితే నేను చూచి గీయడం నేర్చుకున్నానో-ఆగీతాకారుడైన శ్రీ బాపూగార్కి" అని కృతజ్ఞతలు చెప్పుకున్నారు.


నేను పూర్వం తెలుగు వికీపేడియాలో వ్రాసిన వ్యాసం ఇక్కడ మూడు భాగాలుగా ఇస్తున్నాను

కావలిసిన వివరాలన్నీ ఓపికగా ఇచ్చిన "బాబు" గారికి, ఈ వివరాలు సంపాయించటంలో ఎంతగానో సహకరించిన "జయదేవ్" గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.