3, అక్టోబర్ 2009, శనివారం

అమరావతి కథలు సమీక్ష 3

రచయిత శ్రీ సత్యం శంకరమంచి

రాత్రి బాగా పోద్దుపోయినాక, అలా డాబామీద పచార్లు చేస్తూ చల్లగాలి భోంచేస్తుండగా చక్కగా చంద్రోదయమయ్యి, కొబ్బరి ఆకుల మధ్య నుంచి వెన్నెల అందాలు పరికిస్తూ ఉండగా, ఎక్కడినుంచో వినిపించీ వినిపించ నట్టుగా తలత్ మెహమూద్ పాటో, రావు బాలసరస్వతి గానమో, సాలూరి రాజేశ్వర రావు గందర్వ గానమో వినిపిస్తే కలిగే ఆనందం చెప్పనలవి కానిది. అంతటి ఆనందం కలగచేయగలవు అమరావతి కథలు, పైన చెప్పిన హంగులేమీ లేకుండానే.

ఈవేళ మరొక ఐదు కథల గురించి.

11.ధావళీ చిరిగిపోయింది
ముఖ్య పాత్రలు-అవధాన్లుగారు, ఆయన భార్య సోమిదేవమ్మ, ఆయన కుమారుడు పేరిశాస్త్రి
బాపు బొమ్మ-తల్లి దగ్గర చాలా అనందంగా పాలు తాగుతున్న బాలుడు, పాలు తాగుతూ ఒక కాలు విలాసంగా తల్లి నడుంమీద వేయబోవటం బొమ్మకు తెచ్చిన అందం, కథాంతంలోని కొసమెరుపుకు అద్దం.
కథ-ధావళీ మడి కట్టుకుని పూజ చేసుకోవటానికి వాడే ఒక వస్త్ర ధారణ. ఒక తరం నుంచి వేరొక తరానికి వచ్చిన అంతరం సూచిస్తూ, కథకు "ధావళీ చిరిగి పొయ్యింది" అని పేరు పెట్టడం సముచితంగా ఉన్నది.పండిత పుత్ర:, పరమ శుఠ: అన్న నానుడి నిజంచెయ్యటానికి, వేద పండితుడయిన అవధాన్లు గారి కుమారుడు, పేరిశాస్త్రి శతవిధాలాప్రయత్నించటం, తన కుమారుడి హీనస్థితి భరించలేక కుమిలిపోతూ అవధాన్లు గారు మరణించటం, ఈ విధంగా చూస్తే, కథ చాలా సూక్ష్మం. కాని, కథ చెప్పిన తీరు, కథలో పాత్రలచేత పలికించిన సంభాషణలు, రచయిత చెప్పదలుచుకున్న విషయాన్ని, స్పుటంగా తెలియచేస్తాయి. "అయ్యో! అయ్యో! మాలవాణ్ణి ముట్టుకుంటారుటండీ? అన్న భార్యతో అవధాన్లు గారు "పట్టు నీకూ పెడ్తాను వీబూది......నీకీ రోగం పోవటానికి" అనటం కథలోని ముఖ్య సందేశం. తన తండ్రి మరణ వార్తను తెలుపుతున్న సమయంలో, పేరిశాస్త్రి,తన తల్లి స్పర్శతో మామూలు మనిషయినట్టు, మారినట్టు సూచిస్తూ కథ ముగుస్తుంది.

12.రాగిచెంబులో చేపపిల్ల
ముఖ్య పాత్ర
-సుబ్బమ్మగారు, అమె భర్త సత్యనారాయణగారు
బాపు బొమ్మ- శివుని తలమీదున్న గంగ భూమ్మీద పడుతున్నట్టు, అందులో ఓ చేపపిల్ల కూడ ఉండటం చూసిన సుబ్బమ్మగారు అదెక్కడ తనమీద పడుతుందోనన్న భయంతో తప్పుకు పోతున్న భంగిమను, పరమేశ్వరుడు ఓరకంట చిలిపిగా గమనిస్తూ ఉండటం, కథ మొత్తాన్ని చెప్తుంది.
కథ-సుబ్బమ్మగారు తన మడి అతి చాదస్తంతో తాను బాధపడటమే కాక తన భర్తను కూడా బాధపెడుతుండటమే కధాంశం. భక్తి పేరిట లేదా మడి పేరిట ఆ కాలంలో కొంతమందిలో పెచ్చరిల్లిన పిడివాద చాదస్తాన్ని హాస్యభరితంగా ఎత్తిచూపి ఎద్దేవా చేయటం జరిగింది. "అందుకేనేమో రామయ్యగారి కర్రి ఆవు తనని పొడవటానికి వస్తుంది" అని సుబ్బమ్మగారి చేత అనిపించి, వేర్పాటు కారకమైన చాదస్తపు మడి/భక్తి, దేవుడుకూడ హర్షించడని, స్పురింపచేశారు రచయిత.

13.అద్గద్గో బస్సు
ముఖ్య పాత్రలు-గ్రామీణులు, జట్కా సాయబు
బాపు బొమ్మ-కొత్తగా వచ్చిన బస్సు యాంత్రిక గుర్రాలతో ఒక నదీ ప్రవాహంలా దూసుకుని పొబోతుంటే, ఒక బక్కచిక్కిన జట్కా గుర్రం ముందుకు వంగబడి, బలహీనంగా దిగులుగా ఆ బస్సువంక చూస్తూ,కథావిషయమైన కొత్త నీరు వచ్చి పాత నీరుని కొట్టేయటాన్ని సూచిస్తుంది.
కథ-ఒక సంఘటన వర్ణన. అమరావతి గ్రామంలోకి మొట్టమొదటిసారి బస్సు వచ్చినప్పుడు (20వ శతాబ్దపు మొదటి రోజులలో) ఆ సంఘటన గ్రామీణుల మీద చూపిన ప్రభావం, ఈ యాంత్రిక జీవన విధానపు మొదటి మెట్టు జట్కా సాయబును ఎలా మొట్టిపడేసిందో వివరించబడింది. కథ చివరిలో, జట్కా సాయబు అక్కసు పట్టలేక ఎవరూ చూడకుండా తన చండ్రకోలతో బస్సు మీద ఒక్క మీకు పీకుతాడు ఆ శబ్దానికి ముసలి గుర్రం చెంగున పరెగెత్తటంతో ముగుస్తుంది.

14.పువ్వుల్లేని విగ్రహాలు నవ్వాయి
ముఖ్య పాత్రలు-పెద్దయ్యగారు, ఆయన కొడుకు నారాయణ
బాపు బొమ్మ-పరమేశ్వరుని వొళ్ళో కూచుని నారాయణ అమ్మవారికి అలంకారం చేస్తున్నట్టు, అందుకు పరమేశ్వరుడు తనవంతు సహాయం చేస్తున్నట్టుగా వేశారు. అయ్యవారి వొళ్ళొ భక్తుడు అమ్మవారి అలంకారం చేస్తూండటం చక్కటి భావన.
కథ-రచయిత సంఘటనా వర్ణన మీద ఎక్కువ మక్కువ ఉన్నట్టు ఈ కథా సంపుటిలో అనిపిస్తుంది. సంపుటిలొ ఆ పంథాలో రచన చేయబడిన కథలు ఎక్కువ ఉన్నాయి. శివరాత్రి ఉత్సవాలకు ఊరేగింపుకు విగ్రహాలను తయారు చెయ్యటం, ఆ తరువాత జరిగిన ఊరేగింపు కథలోని ముఖ్య సంఘటన. పెద్దయ్యగారు గుడి అర్చకులలో పెద్ద. ఆయన విగ్రహాలను ఊరేగింపుకు అలంకరిస్తుంటే, ఆయన ఆరేళ్ళ కొడుకు నారాయణ తాను కూడా చేస్తానని, తండ్రి ఒళ్ళో కూచుని అలంకారం చెయ్యటానికి ప్రయత్నించటం, చివరకు అతని వల్ల అసలు పని చెడుతుండటం చూసి, పిల్లవాణ్ణి పక్కన కూచోపెట్టి, పెద్దయ్య అలంకారం పూర్తి చెయ్యటం, నారాయణ ఆ అలంకారమంతా తానే చేసినట్టు భావించి పరమానందభరితుడవటం అకట్టుకునేవిధంగా రచించారు.

15.పందిరిపట్టి మంచం
ముఖ్య పాత్రలు-చినముత్తెం, బుల్లిరామయ్య
బాపు బొమ్మ-ఇది నిజంగా బాపు బొమ్మే. ఎవరైనా అందమయిన స్త్రీని "బాపు బొమ్మ"లా ఉన్నది అని వర్ణించటం ఒక వాడుక. చినముత్తెం చిత్రాన్ని చాలా అందంగా, పట్టెమంచం నేపధ్యంలో కనపడుతున్నట్టుగా, బాపు చిత్రించారు.
కథ-ఒక అందమైన వేశ్య,చినముత్తెం కథ ఇది. చిన ముత్తెం, భార్య పిల్లలున్న బుల్లిరామయ్య మీద మనసుపడి, అతని అధీనురాలవుతుంది. అతని కుటుంబ పోషణ కూడా తానే చేస్తూ ముప్ఫయి ఏళ్ళు గడిపి, చివరి కాలంలో, తమకోసం తన తల్లి చేయించిన, పెద్ద పట్టెమంచం బుల్లిరామయ్య పిల్లల కోసం ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ పట్టెమంచం వాళ్ళింట్లో వంశపారపర్యంగా వాడబడినట్టు సమాచారమిస్తూ, కథ ముగించారు రచయిత. వేశ్య, విటులను పట్టి పీడించి ఆస్తిపాస్తులు హరించటం, సామాన్యమని లోకోక్తి. అందుకు భిన్నంగా, వేశ్యలలో కూడ ధర్మ బద్ధులు ఉండవచ్చు అన్న ఒక కోణాన్ని చూపించారు రచయిత. ఇంకే కథలోనూ కనపడని రచయిత చిలిపితనం, ఈ కథలో చినముత్తెం అందం వర్ణించటంలో కనపడుతుంది.

1 వ్యాఖ్య:

  1. నాకు ఈ పుస్తకం రేర్ బుక్స్.టికె వెబ్ సైట్ లో దొరికిందండీ. చాలా బాగున్నాయి కధలు. ఇక ఆ పుస్తకం పూర్తి చేసేదాకా వేరే ఇంకేమీ చదివేది లేదు. కధ, కధని వివరించే తీరూ కూడా మనసుకు హత్తుకునే లాగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి సాహిత్యం ఎక్కడా కనబడ్డం లేదు. టివీలు, సినేమాలు ఇంతగా అలవాటు అయ్యాక మంచి పుస్తకం చదివేవారూ కరువయ్యారు. చాలా థాంక్స్ అండీ. ఇలాగే ఇంకా మంచి సాహిత్యం పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.