2, అక్టోబర్ 2009, శుక్రవారం

మన సాహిత్య సాంస్కృతిక సంపద

చైనాలో 1950 1960లలో పిచ్చేక్కినట్టుగా, సాంస్కృతిక విప్లవం అని పేరు పెట్టుకుని అల్లరి మూకలు గ్రంధాలయలమీద, ఇళ్ళమీద, విశ్వవిద్యాలయాలమీదపడి, అందిన పుస్తకాలన్ని చింపి తగులపెట్టేవారు. ఈ దుండగీడు పనికి ఆ దేశ అప్పటి అధినేత అశీస్సులు ఉండేవి. ఈ విధంగా చైనా ప్రజలు తమ సాంస్కృతిక సంపదను చేజేతులా, ఈ అల్లరి మూకలకు ఎదురుచేప్పే చేవ లేక పోగొట్టుకున్నారు, పాడిచేసుకున్నారు.

సరే మనదేశంలో పోయిన కళాసంపదలు, విదేశీ దురాక్రమణదార్ల చేతులో పోయినవి పోగా, చివరకు 20వ శతాబ్దంలో పుట్టి పెరిగిన చక్కటి పత్రికలు, ప్రచురించబడిన కథలు, నవలలు, బొమ్మలు ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి? ఏ విదేశీ దురాక్రమణదారూ దోచుకోలేదు వీటిని, ఏ అల్లరి మూకలు చించి పోగులు పెట్టలేదు. మరి ఏమైనాయి? సరైన పోషణ, జాగ్రత్త లేక కాల గర్భంలో కలసిపోయినాయి.

20వ శతాబ్దంలో, దాదాపు 1980లవరకు కూడ భారతి అన్న ఒక సాహిత్య పత్రిక ప్రచురించబడేది. కాశీనాథుని నాగేశ్వర రావుగారు ఈ పత్రికను స్థాఫించారు. భారతిలో ఒక్క రచన ప్రచురించబడినా మన జన్మ ధన్యమే, ఆ రచనకు ఎంతగానో గుర్తింపు వచ్చినట్టుగా భావించేవారు. కాని కాలక్రమేణా ఆదరణ కరువై పత్రిక ఆగిపోయింది. ఇప్పుడు ఆ పాత పత్రిక సంచికలు ఎక్కడైనా దొరుకుతాయా? దొరకచ్చు, మట్టి కొట్టుకునిపోయి, చిరిగి పోయి ఏలైబ్రరీలలోనో ఓ మూల కొన్ని దొరకచ్చు. ఈ అద్భుత పత్రికను దాచి మన సాహిత్య పరిణామ క్రమానికి దర్పణం పట్టిన ఈ పత్రికను ఒక పధ్ధతి ప్రకారం దాచే నాధుడే కరువాయె.

అదే విధంగా యువ మాస పత్రికలో ఎన్ని సాహిత్య మణిపూసలు ప్రచురితమయ్యేవి. దీపావళి యువ అంటే ఎంత ఎదురుచూసేవాళ్ళం. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే విజయచిత్ర, వనిత, చివరకు ఆంధ్ర సచిత్ర వార పత్రిక ఎక్కడా కనపడకుండా మన అనాలోచిత నిరాదరణకు లోనై కనుమరుగైపోయినాయి. చందమామ పత్రిక ఇంకా బతికే ఉన్నాను అంటోంది, తెలుగు వాళ్లు అమ్మి వదిలించుకుంటే, ఎవరో పరాయివాళ్ళు ఆ పేరుతో డబ్బు సంపాదనే ఏకైక ధ్యేయంగా కొనుక్కున్న వారి పంచన.

కాకపోతే, చందమామది కొంచెం మెరుగైన పరిస్థితి. ఎందుకంటే చందమామ అమ్ముకునే ముందు, పాత సంచికలు అన్నీ జులై 1947లో మొదలయ్యిం దగ్గరనుంచి స్కాన్ చేయించి భద్రపరిచారు.వారి వెబ్ సైటులో చూడటానికి అవకాశం ఉన్నది. అలాగే ulib.org లో కూడ లబ్యమౌతున్నాయట. సరే ulib.org లో ఉన్నయి కదా అని ఆశగా అక్కడకు వెళ్ళితే, నిరాశే ఎదురయ్యిందిఏ ఒక్క సంచిక కూడ సవ్యంగా అప్లోడ్ చెయ్యలేదు. కొన్ని తెలుగు చందమామలు హిందీ చందమామగా, పేరు ఒక సంచికది, తీసి చూస్తే మరొక సంచిక, ఇలా అస్తవ్యస్తంగా ఉన్నది పరిస్తితి. ఈ పాత చందమామల నిధిని ఆసక్తి ఉన్నవారు డౌన్లోడ్ చేసుకు పోతున్నారని, మరి వీరిమీద ఎవరన్నా వత్తిడి తీసుకొచ్చి అలా చేయిస్తున్నారో లేక, వారి వ్యవహారమే అంతేనో తెలియదు. కాని చందమామ వెబ్ సైటులో మాత్రం మన చదువుకోవటానికి వీలుగా అన్ని చందమామలు చక్కగా ఉన్నాయి.

ఏది ఏమైనా ఆ పాత పత్రికల లో ఒక్క చందమామ ప్రతులు మాత్రమే కనీసం చూడటానికి టెక్నాలజీ పుణ్యమా అని దొరుకుతున్నాయి. మన సాహితీ సంస్కృతులకు ఆలవాలమైన అనేక ఇతర పత్రికల మాటేమిటి. ఇంకా నాకు తెలియని, నా అభిరుచిలో లేని అనేక మణిపూసలు ఉండి ఉంటాయి.
ఇదేవిధంగా రేడియో కార్యక్రమాల పరిస్థితి. ఆకాశవాణి విజయవాడ కేద్రం నుండి 1950-1970లలో అద్భుతమైన కార్యక్రమాలు వచ్చినాయి. అలాగే , మదరాసు, హైదరాబాదు కేద్రాలు కూడా తీసిపోలేదు. అప్పటి నాటికలు, నాటకాలు, ప్రసంగాలు, చెళుకులు, ఎంతగానో ప్రసిధ్ధి చెందిన కార్మికుల కార్యక్రమం, వనితావణి, పిల్లల ప్రోగ్రాముల జింగిల్సు కూడ అందుబాటులో లేవు. ఆకాశవాణివారు, ఏదో కంటితుడుపు చర్యగా, కొన్ని నాటకాలను సి డి లుగా విడుదల చేశారు. ఆకాశవాణి ఆర్ఖైవ్స్‌లో ఉన్న విలువ కట్టలేని కళాఖండాలు (ఇంకా ఉన్నాయో, వారి గుమాస్తాలు ఆవతల పారేశారో)ఉన్నాయట . నా ఉద్దేశ్యంలో, అన్ని ఆకాశవాణి కేద్రాలు, వారి దగ్గర ఉన్న అప్పట్లో పేరు తెచ్చుకున్న కార్యక్రమాలన్ని ఇంటర్నెట్లోకి కనీసం వినటానికి వీలుగా ఉంచితే ఎంతయినా బాగుంటుంది.
మన పత్రికా ప్రచురణ చరిత్రలో కూడా 1950ల నుండి 1970ల వరకు స్వర్ణ యుగంగా పిలవబడుతున్నది. కనీసం అప్పటి పత్రికల ప్రతులు కూడా ఎక్కడా లభ్యమవుతున్న జాడ లేదు. ఇంటర్నెట్ లో వెతికితే చివరకు కవరు పుటలు కూడా దొరకటంలేదు. ఆ పాత పత్రికలను, రేడియో కార్యక్రమాలను సేకరించి, ఒక వరుసగా రాబొయ్యే తరాలవారికి అందచేసే ప్రక్రియ ఎక్కడన్న జరుగుతున్నదా? ఎన్నెన్ని సాంస్కృతిక సంస్థలు, ఎంతమంది కోటీశ్వరులు మన తెలుగు నేల మీద, ఎవరైనా ఈ బృహత్ కార్యక్రమానికి పూనుకుంటే బాగుండును, మనలాంటి సాహితీ ప్రియులు మనకు చేతనైనంత సహాయం మన వంతుగా చేసే అవకాశం ఉంటుంది

లేకపోతే చైనాలో హింసా పూర్వకంగా నాశనం చెయ్యబడితే, మనదేశంలో అహింసా పధ్ధతిన, పూర్తి నిరాదరణ చూపి మన సాహిత్య సాంస్కృతిక చిహ్నాలను రూపుమాపిన ఘనత మనకు దక్కుతుందని నా భయం.

3 కామెంట్‌లు:

  1. సాహితీ ప్రియుల ఆవేదనంతా మీ టపాలో వ్యక్తమయ్యేలా బాగా రాశారండీ.

    ఎవరూ పట్టించుకోక కాలగర్భంలో కలిసిపోయిన మన సాహితీ సంపద గురించి తల్చుకుంటే ఎంతో బాధ కలుగుతుంది.

    ఆణిముత్యాల్లాంటి ఆకాశవాణి ప్రోగ్రాములను కూడా అందరికీ అందుబాటులోకి వస్తే ఎంతో బావుంటుంది!

    రిప్లయితొలగించండి
  2. వేణూగారూ,

    మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. సాహితీ సంపద ఇంకెవరన్నా కొల్లగుట్టి నాశనం చేస్తుంటే నిస్షాయులై చూడటం ఒక కష్టం అయితే, నిరాదరణ వల్ల కనుమరుగౌతున్న దశను చూడటం నరకంతో సమానం.

    మీ దగ్గర భారతి, యువ, విజయచిత్ర, వంటి చక్కటి పత్రికల ముఖ చిత్రాలేమైనా ఉంటే నాకు పంపగలరు, వ్యాసానికి బొమ్మలుగా కూరుస్తాను. ఇంటర్నెట్లో యువ అని వెతికి చూడంది, పనికిరాని, నేలబారు సినిమా పోస్టర్లే వస్తున్నాయి. భారతి అని వెతికితే మరీ ఘోరం. విజయచిత్ర-చక్రపాణి అని వెతికితే, చక్కన్న గారి ఫొటో తప్ప మరింకేమీ దొరకటంలేదు. మన బ్లాగుల్లో ఎవరన్నా పాత పత్రికలను,రేడియో కార్యక్రమాలను పరిచయం చేస్తుంటే, దయచేసి చెప్పగలరు.

    రిప్లయితొలగించండి
  3. మీరు యువ పేరుతో సెర్చ్ చేస్తే ఏవేవో వస్తున్నాయని అంటున్నారు. ఒకసారి చందమామ పేరును కొట్టి చూడండి. జన్మ ధన్యమవుతుంది. చందమామ అని ఈ మధ్య వచ్చిన సినిమా తప్ప ఇంకేమీ కనబడదు. మీ బ్లాగులోనూ, చందమామలు బ్లాగులోని కొన్ని బొమ్మలు మాత్రం వస్తున్నాయి. ఇది మన గ్రహచారం కాకపోతే ఏమిటి?

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.