4, అక్టోబర్ 2009, ఆదివారం

వాతావరణ హెచ్చరికలు

ఏదైనా ఒక ప్రకృతి వైపరిత్యం సంభవించినప్పుడు మాత్రమే వాతావరణ కేద్రం, వారు ఇచ్చే హెచ్చరికల గురించి మనం వింటూ ఉంటాము, మరింత తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాము. ఆ తుఫానో, వరదో తగ్గిపోగానే, మనం మళ్ళి మామూలు జీవితంలోకి పడిపోతాము, వాతావరణ హెచ్చరికలు ఇక చూడం.

ప్రభుత్వ సంస్థలు కూడ, ముఖ్యంగా నీటి పారుదల శాఖ కూడ ఇదే పధ్ధతి అవలంభిస్తోందా? లేకపోతె, మన రాష్ట్రంలో కురిసిన ఇంతటి భారీ వర్షం వాళ్ళ దృష్టికి ఎందుకు రాలేదు, ఆ వైపరిత్యం వల్ల జరగబోయే పరిణామాలు ఎందుకు అంచనా వెయ్యలేదు. అవసరమైనప్పుడు మాత్రమే ఈ హెచ్చరికలు చూస్తారా, లేక వారికి ఒక ప్రత్యేక విభాగం ఈ విషయం చూడటానికి, పై అధికారులకి ఏరోజుకి ఆరోజు తెలియచెప్పటానికి ఉన్నదో లేదో తెలియటం లేదు.

వాతావరణ హెచ్చరికలు కూడ ఎంతవరకు నమ్మ దగ్గవి. ఎప్పుడూ కూడ మనం రేడియోలో లేక టి వి లో వింటూంటా, రాబొయ్యే ఇరవై నాలుగు గంటలలో ఒకటి రెండు చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షం వరకు పడవచ్చు. ఆ ఒకటి రెండు చోట్లు ఎక్కడ?? తెలియదు! ఓ మోస్తరు అంటే ఎంత? భారీ వర్షం అంటే ఎంత? ఇవీ తెలియదు. మనకు తెలిసిందల్లా ఆ వచ్చే ప్రకృతి వైపరిత్యం భరించటమే.

మరొక విపరీతం ఉన్నది ఈ వాతావరణ హెచ్చరికల్లో. వాతావరణ పరిశోధనా కేద్రం వారు ఉదాహరణకి రాబొయ్యే 24 గంటలలో భారీ వర్షం అని చెప్తారు ఇవ్వాళ. అంటే, రేపు ఈ సమయం వరకు అయ్యి ఉంటుంది. కాని ఈ వాతావరణ హెచ్చరిక మీడియాకు చేరేప్పటికి కొంత సమయం పడుతుంది, వారికి ఈరోజు సాయత్రం లేదా రేపు పొద్దున్న వారు ఈ విషయం చెప్పటానికి నిర్ణయించారనుకుందాము. అప్పుడు కూడ రాబొయ్యే 24 గంటలు అనే చెప్తారు. కాని ఆ సమయానికి ఈ భారీ వర్షం వచ్చేసి ఉంటుంది. ఈ వార్త విని వర్షం ఇంకా పడుతుందేమో అని బెంబేలెత్తిపోతాము. కాని రాదు.

ఇలా సమన్వయం లేక, వచ్చిన వాతావరణ హెచ్చరికలను అన్వయించటం చేతకాక కొన్ని వైపరిత్యాలలో నష్టం ఎక్కువవుతున్నది.

అసలు, వాతావరణ కేద్రం వారే నేరుగా ప్రతిరోజూ కొన్ని సమయాలలో సీదాగా ప్రసారం చెయ్యటానికి ఎందుకు ఏర్పాటు చెయ్యకూడదు? అంటే, రోజూ కొన్ని నిర్ణీత సమయాలలో, వాతావరణ కేద్రం అన్ని మీడియా కేద్రాలకు హుక్ అప్ అయ్యి, లైవ్ వార్తలు వస్తున్నప్పుడు వారు చెప్పే హెచ్చరికలు అందించే వీలుండాలి. మీడియా మొత్తం ఈ పనికి సహకరించాలి, ఆ చెప్పిన సమయం, ఒక నిమిషమో, రెండు నిమిషాలో , వాతావరణ కేంద్రాని వదిలెయ్యాలి.

ఆ తరువాత ఇంతటి భారీ వర్షాన్ని వాతావరణ కేద్రాలు ముందుగానె గ్రహించి హెచ్చరికలు చెయ్యగలిగాయా, వారి దగ్గర అటువంటి పరిశీలనకి తగిన సామగ్రి ఉన్నదా. 2005 జులైలో ముంబాయి నగరంలో భారీగా వర్షాలు కురిసిన పిదప వచ్చిన ఆకస్మిక వరదలు వచ్చినాయి అక్కడ ఉన్న వాతావరణ కేద్రానికి సరైన సామగ్రి లేక ఈ భారీ వర్షాలు వస్తాయన్న ప్రమాదాన్ని ముందుగానే పసికట్టలేక పోయింది.
ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న వాతావరణ కేద్రం ఈ భారీ వర్షం గురించి హెచ్చరికలు జారీ చెయ్యగలిందా. అటువంటప్పుడు అంతటి భారీ వర్షం వస్తుంది అని హెచ్చరిక వాతావరణ కేద్రం హెచ్చరించినా , నీటి పారుదల శాఖ అధికారులు తీసుకున్న చర్యలు ఏమిటి. రాబొయ్యే నీటి పరిమాణం అంచనా వేసి, శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ ఆనకట్టలలో ఇప్పటికే ఉన్నా నిలవ నీటిని ముందుగానే దశలవారీగా వదిలేసి ఉంటే, ఈ వరద బాక్ వాటర్ వల్ల వచ్చిన కర్నూలు ముంపు తప్పి ఉండేదేమో. వాతావరణ హెచ్చరిక ఉన్నాసరే నిమ్మకు నీరెత్తినట్టుగా సంబంధిత శాఖలు ప్రవర్తించి ఉంటే, ఈ విషయాన్ని తీవ్రంగాపరిగణించి, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.

ఒకవేళ వాతావరణ కేద్రం ఇప్పుడు కురిసిన భారీ వర్షం ముందుకాగానే పసి కట్టి ఉండకపోతే, దానికి కారణాలు తప్పనిసరిగా దర్యాప్తు చేసి ఈ విధంగా మరొకసారి జరగకుండా తగిన నివారణ చేపట్టావలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

ఇక మీడియా!! ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ప్రజలకు హెచ్చరిక చేసి, వారికి వెను వెంటనే అవసరమైన సమాచార ఇస్తూ వారికి సరైన మార్గాన్ని చూపించవలసినది పోయి, ఈ వైపరిత్యాన్ని ఎంత ఎక్కువచేసి, ఎంత భయానకంగా చూపిస్తే బాగుంటుందో పన్నాగాలు పన్నుతున్నారు. హడావిడి హడావిడిగా మాటలు తొట్రుపడుతూ, అరుస్తూ వాళ్ళ "కథనాలు" చూపించే రిపోర్టర్లు, పనికి రాని చర్చలు అందించే ఏంఖర్లు. వాటన్నిటికి తోడు, వరద భీభత్సం చూపిస్తూ, వెనుక సంగీతం కూడ కలిపి ప్రజలను భయభ్రాంతులకు గురిచెయ్యటంలో మీడియా విజయం సాధించింది.వాళ్ళు చూపించే వరద బొమ్మలు ఎక్కడ ఎన్ని గంటలకు షూట్ చేసారో కూడ చెప్పకుండా అవే బొమ్మలను తిరిగి తిరిగి చూపించేస్తున్నారు. ఆ బొమ్మలు నిజంగా ఇప్పుడు వచ్చిన వరదవా లేక వాళ్ళ లైబ్రరీలలో ఉన్న మునుపటి వైపరిత్యపు బొమ్మలో తెలియకుండా ఉన్నది.

ప్రభుత్వ శాఖలకు, వాతావరణ కేద్రాలకు, మీడియాకు మధ్య సమన్వయం లోపించింది. ఏది ఏమైనా, ఈ వరద వైపరిత్యం, మానవ తప్పిదం ఫలితమే అని అనుకుంటున్నాను. కొంచెం ముందుగా స్పందించి ఉంటే, కనీసం కర్నూలు ముంపును నివారించగలిగి ఉండేవారు.

అధికారంలో ఉన్నవారికి ప్రకృతి వైపరిత్య నివారణమీద ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉన్నది.అంతేకాని, వైపరిత్యం జరిగిపోయినాక సహాయక చర్యలు చేస్తూ తీయించుకోవలసిన ఫొటోలమీద దృష్టి ఉండకూడదు

2 వ్యాఖ్యలు:

  1. పదిహేను,ఇరవై రోజులక్రితం అనుకుంటా రుతుపవనాలు వెనక్కి వెళ్ళిపోయాయి ఇంక వర్షం పడదని రెండు రోజులు చెప్పారు చెప్పిన తర్వాతి రోజే మాకు భారీ వర్షం,అప్పటినుంచి ప్రతిరోజూ వర్షమే.ఇప్పుడేమో రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి,దానికి తోడు అల్పపీడనమంటూ అదరగొడుతున్నారు.ఆడువారి మాటలకు అర్థాలు వేరులే అంటారు గానీ వాతావరణశాఖ మాటలకు అర్థాలు వేరులే ఔనంటే కాదనిలే కాదంటే అవుననిలే అని అర్థం చేసుకోవాలన్నమాట.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. కొన్ని వేల కోట్ల రుపాయలను కొత్త ప్రాజెక్ట్ ల మీద ఖర్చు చేసే ప్రభుత్వం, ఇప్పటికే మరమత్తులు అవసరమైన ప్రాజెక్ట్ లను ఎందుకు నిర్లక్ష్యం చెస్తోందో అర్ధంకావడంలేదు. నిన్న మొన్న వార్తా పత్రికలు చదవగా నాకు అర్ధం అయిన విషయం ఇది. శ్రీశైలం, సాగర్, చివరకు ప్రకాశం బారేజ్ కూడా ఎన్నో మరమత్తులు అవసరమని తెలుస్తోంది. మీరు చెప్పినట్టు ప్రక్రితి వైపరీత్యాలు వచ్చినప్పుడు మాత్రమే స్పందించి, ఏవెవో సహాయ కార్యక్రమాలు ప్రకటించి, వాటిలో కూడా లాభాలు సంపందించాలని చూసే దళారులకు అప్పగించి చేతులు దులిపేసుకోడం ఎంత వరకు న్యాయం? ఈ విషయంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపడితే కనీసం కొంతమంది ప్రాణాలైనా కాపాడబడతాయి. ఇంకా సహాయ చర్యలు కూడా సాధ్యమైనంత నిజాయితీతో చేపడితే బాగుంటుంది. ఆస్తి పాస్తులను పోగొట్టుకుని కట్టుబట్టలతో మిగిలిన వరద బాధితులను ఇంకా మోసం చేస్తూ ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని వారి దాకా చేరనివ్వకుండా మధ్యలో మింగేసే దళారుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.