28, అక్టోబర్ 2009, బుధవారం

మీకు తెలుసా! ఒక మహా రచయిత శతజయంతి ఈరోజున



కొడవటిగంటి కుటుంబరావుగారి నూరవ జన్మదినం రోజు (28 అక్టోబరు 2009). అద్భుత రచయిత శతజయంతి ఉత్సవాలు జరుపుకోవాలన్న ఆరాటం తెలుగు వారిలో ఎంతమందికి ఉందో తెలియదు కాని, నేను మటుకు కుటుంబరావుగారి రచనల మీద ఉన్న మక్కువకొద్దీ వ్యాసం వ్రాసి, నా అబిమాన రచయితకు నా వంతు నివాళి అర్పించదలుచుకున్నాను.

నాకు, కుటుంబరావుగారి రచనల పరిచయం జరిగింది ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం వారు 1980లో నిర్వహించిన నవలా స్రవంతి కార్యక్రమం ద్వారా. కార్యక్రమం నాకు గుర్తు ఉన్నంతవరకు కొడవటిగంటి వారి చదువు నవలతో ప్రారంభం అయ్యింది. ఇప్పుడు మనం ఆడియో బుక్సు అని గొప్పగా చెప్పుకునేవి, ఆకాశవాణివారు, తమ కార్యక్రమం ద్వారా ఏళ్ల క్రితమే కొడవటిగంటి కుటుంబరావుగారి రచనలలో అత్యున్నతమైనదిగా పేరొందిన చదువుతో తెలుగువారికి పరిచయం చేసె ప్రయత్నం చేశారు. కొడవటిగంటి వారి రచన ఎంత సొగసుగా, సామాన్యమైన భాషలో ఉన్నతమైన భావాలను వ్యక్తీకరించిందో, నవలా స్రవంతిలో చదివిన రేడియో కళాకారుడు ఎవరో గాని (ఆయన పేరు తెలియదు) కుటుంబరావుగారి మనసులోని భావాలను తన చక్కటి గొంతుకతో ప్రాణం పోశారు. నేనప్పుడు నాగార్జునసాగర్లో ఉద్యోగం వచ్చిన కొత్తల్లో, బ్రహ్మచారిగా ఉండేవాడిని. రేడియో ఒక్కటే కాలక్షేపం. నవలా స్రవంతి కార్యక్రమం మొత్తం ఆకాశవాణి వారు సి డిగా వేసి విడుదలచేస్తే ఎంతబాగుండునో కదా! ఇది పూర్తిగా అత్యాశే!! నా అభిప్రాయం తప్పవ్వాలని అశిస్తూ మళ్ళి అసలు విషయంలోకి వద్దాం.

విధంగా కొడవటిగంటి వారి పరిచయం జరిగినాక, చదువు పుస్తకం కొని చదవాలని ప్రయత్నం మొదలు పెట్టాను. దాదాపు 8-9 సంవత్సరాల తరువాత విశాలాంధ్ర పబ్లికేషన్స్ వారి పుణ్యమా అని, విజయవాడ పుస్తక ప్రదర్శనలో దొరికింది (అప్పటికి మా ఊరు విజయవాడకు బదిలీ అవ్వటం నా అదృష్టం) చదువు "చదివిన" తరువాత, విశాలాంధ్ర వారి రీడర్స్ క్లబ్బులో చేరి వారప్పుడే ప్రచురించటం మొదలు పెట్టిన "కుటుంబరావు సాహిత్యం" సంపుటాలు కొనుక్కోవటం మొదలు పెట్టాను. ఆరు సంపుటాలు, తరువాత రెండు నవలికలు,కథల సంపుటాలు నా దగ్గర ఉన్నాయి.

కుటుంబరావుగారు కల్పించిన పాత్రలలో కెల్లా వెంటపడి అనేకరోజులు గుర్తుండి, భయపెట్టేది "సీతప్ప" పాత్ర. కుటుంబరావుగారు "బెదిరిన కనుషులు" మరియు "బ్రతుకు భయం" నవలలో సీతప్ప పాత్రను అద్భుతంగా చిత్రీకరించారు. అసూయ, అనుమానం, కొత్త విషయాలపట్ల ఆసక్తి లేకపోవటాం, సాధ్యమైనంతవరకు అలా అలా ఏదో ఒకచోట నక్కి బతికెయ్యటం, గొప్పలు చెప్పుకోవటం, అర్థం పర్థంలేకుండా పూర్తిగా తనకు అనుకూలంగానే మాట్లాడుకోవటం, సీతప్ప ముఖ్య లక్షణాలు. సీతప్పకు తగిన భార్యే దొరుకుతుంది, అతని కూతురు వీరి పెంపకంలో దేభ్యంలాగ తయారయ్యి తన కాపురాన్ని తానే చేజేతులా ధ్వంసం చేసుకొని, అటు భర్తను సుఖ పెట్టలేక, ఇటు తన తప్పు తెలుసుకోలేక అఘొరిస్తూ ఉంటుంది. పైగా, తానున్న స్థితే గొప్పగా ఉన్నదని కూడా తలపోస్తూ ఉంటుంది. ఇక సీతప్ప కొడుకు, చాలా కాలం సీతప్ప ప్రభావంలో పడి అదే జీవితం అని వానపాములాగ బ్రతికినా, తన అన్న (పెత్తండ్రి కొడుకు) ప్రకాశాన్ని చూసి కొంత మారుతాడు. నవలల్లో ప్రకాశం ఒక మంచి పాత్ర. ప్రకాశం, సీతప్ప అన్న కొడుకు, వేరే ఊళ్ళొ ఉంటూ ఉంటాడు. సారి ప్రకాశం సీతప్ప ఇంటికి వస్తాడు. అతను రావటం, అతని మాటలు, ప్రవర్తన బావిలోని కప్పలవంటి సీతప్ప కుటుంబానికి చాలా ఎబ్బెట్టుగాను విచిత్రంగాను పైగా అఘాయిత్యంగాను కనపడతాయి. అతని రాక సీతప్ప ఇంట్లో ఒక తుఫాను వచ్చినట్టు అవుతుంది. ప్రకాశంతో తిరిగి కొంత, అతని మాటలు విని కొంత , సీతప్ప కొడుకు మారినట్టుగా కొంత సంఘటనాపూర్వకంగా రచయిత చక్కగా చెప్పారు. ఈ  ప్రహసనాన్ని చక్కటి చలనచిత్రంగా చూసే అదృష్టం మనకు లేకపోయింది, వైవిధ్యమున్న విషయాల మీద తీసే సినిమాలను ఆదరించని మన బుద్దే దీనికి కారణం. ఆలోచించండి, రావి కొండలరావుగారినిలేదంటే పొట్టి ప్రసాద్ ను  సీతప్పగానూ చంద్రమోహన్ను సీతప్ప కొడుకుగాను ఉంచి తళుక్కుమని అలా వచ్చి వెళ్ళిపోయే అతిధి పాత్రలో శోభన్ బాబు, ప్రకాశంగా సినిమా తీస్తే ఎంత బాగుండేది. ప్చ్!! మనకు ప్రాప్తంలేదు. మనం చెత్త సినిమాలు చూడటం వల్ల ఇన్ని కోట్లు సంపాయించుకున్నారు. ఇటువంటి సినిమా ఒకటి మన ప్రముఖ నిర్మాతలు తీస్తే వాళ్ల సోమ్మేమీ పోదుకదా!! పైగా విజయవంతమైతే మరిన్ని డబ్బులు వస్తాయి, మంచి ఒరవడిని తీసుకొచ్చిన ఘనతా దక్కుతుంది. ఇదే మరి, మన సినీ పరిశ్రమకు, బెంగాలీ మలయాళీ సినిమాకు తేడా.

కుటుంబరావుగారు, మనలో ఉండే స్వార్థపరత్వాన్ని, ఊకదంపుడు మాటల అలవాటును, భేషజాలను, వినోదాత్మకంగా ఎత్తి చూపారు. కథలు చదువుతున్నప్పుడు, మన్ని మనం ప్రకాశంగా ఊహించుకోవటం తప్పనిసరి, మనం సీతప్ప ఎంతమాత్రం కాదని సర్ది చెప్పుకుంటాం. కాని మనలో కూడ ఒక సీతప్ప ఉన్నాడని, మనకో ప్రకాశం తారసపడేవరకు మనకు తెలియదు. కుటుంబరావుగారి సీతప్ప పాత్రను తరచి తరచి చూసుకుని, అర్థం చేసుకుంటే తప్ప, మనకు తారసపడే ప్రకాశాలను గుర్తించం, ఒహవేళ గుర్తించినా వారిని, సీతప్పలాగ, భయం భయంగానే చూస్తాం లేకపోతే ఏహ్యభావంతో దూరంగా ఉంచటానికి ప్రయత్నిస్తాము. ప్రతి మనిషిలోనూ ఉన్న వైరుధ్య వైఖరులు-తనకో మాట, ఇతరులకో మాట, తనకో న్యాయం, ఇతరులకు మరొకటి-కొట్టొచ్చినట్టుగా సీతప్ప పాత్ర ద్వారా, ఏకొద్దిపాటి తెలివితేటలు ఉన్నవారికైనా అర్ధమయ్యే రీతిలో అభివర్ణించారు కుటుంబరావుగారు.

ఆయనే అన్నట్టుగా చెప్ప తగనిది, కథ కాదు. కొడవటిగంటి కథలన్నీ మాటకే కట్టుబడి ఉన్నాయి. నేటి రచయితలు తప్పనిసరిగా తెలుసుకొవలిసిన విషయం ఇది. ఏదో ఒక సంఘటన చూసో, లేక ఫలానా వార పత్రిక వారు సెంటర్ స్ప్రెడ్ కోసం వ్రాసే కథలకు ఎక్కువ డబ్బులు ఇస్తారనో, గీకి పారెయ్యటం రచయిత బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తాయి. ముందుగా చెప్పవలసిన విషయం రాసేవాడికి తెలిసి ఉండాలి, తరువాత చెప్పే పధ్ధతి తెలియాలి. రెండూ లేకుండా వ్రాస్తే అది రచన అవ్వటానికి అవకాశం లేదుకదా, సాహిత్యానికి ఆమడ దూరంగాకూడ నిలబడే అర్హత కూడా ఉండదు. లేనిపోని వర్ణనా పటాటోపం మచ్చుకైనా కనపడదు మన కొ కు కథలలో. కుటుంబరావుగారి కథల ఎత్తుగడ చదువరులను మురిపిస్తుంది, ముందుకు, మరింత ముందుకి చదివిస్తుంది. ఉదాహరణకి:

1. పాత సంప్రదాయం కథ "బతికి ఉండగా శేషగిరిరావు కలెక్టరీ చేశాడనీ, మధుసూధనరావు బి.. పరీక్షలో మొదటి క్లాసులో మొదట వచ్చేడనీ కాదు మధుసూధనరావుకు సోమసుందరంగారు పిల్లనిచ్చింది"
2. రాక్షస కృత్యాలు కథ "గణపతికి మేనమాగారింట్లో అడుగు పెట్టేవరకూ అనుభవంలేదు. కాని అభిప్రాయాలున్నై, ఉన్న అభిప్రాలేమో చాలా దృఢంగా కూడా ఉన్నై"
3. ఫాపం అమాయకురాలు కథ "మా పున్నయ్య మామను చూస్తే నాకు చాలా అపేక్షే! కాని ఆయన మాటన్నపుడల్లా నాకు వళ్ళు మండుకొచ్చేది. ఇంకా ఆయన మాటలంతా నమ్ముతున్నారనే ఆయన ధైర్యం"

"...పడవలాంటి కారులో నల్లత్రాచులాటి రోడ్డు మీద రయ్యిన దూసుకు పోతున్నాడు మన్మధుడు లాంటి తులసికుమార్, అతని మనసులాగ ఎర్రాగా కాలిపోతోంది ఆకాశం, ఊహలు ఆకాశంలోని హంసలాగ ఎటో ఎటో ఎగురుతున్నాయి..." లాంటి సందర్భ ఔచిత్యం లేని వర్ణనలు పొరపాటునకూడ ఎక్కడా చెయ్యలేదు కుటుంబరావుగారు. వారు కల్పించే పాత్రల పేర్లు కూడ ఎంతో సామాన్యంగా మన చుట్టుపక్కల రోజూ కనపడే/వినపడేవే ఉంటాయి కాని, కథకోసం కల్పించిన అంతుచిక్కని (outlandish) పేర్లు ఉండవు. పాత్రల పేర్లు కులాన్ని సూచించవు . కథాలోని భాష, ఎంతో సౌమ్యంగా, చిన్న చిన్న అచ్చ తెలుగు మాటలతో, సామాన్య జనం సంభాషణల్లో వాడే మాటలే చదవటానికి ఎంతో ఇంపుగా వ్రాయటం కుటుంబరావుగారికే చెల్లింది. ఏదన్న ఆంగ్ల పదం వ్రాయవలసి ఉన్నప్పుడు, వీలైతే నలుగురికీ అర్ధమయ్యే తెలుగు పదం వాడతారు, వీలుకానప్పుడు అదే ఆంగ్లపదాన్ని యధాతథంగా వాడారుగాని, అచ్చతెలుగు ఏమైనా సరే వ్రాయాలన్న దుగ్ధతో, ఎక్కడా వాడుకలో లేని, దాదాపు ఎవరికీ అంతుచిక్కని కంకర్రాయిలాంటి తెలుగు పదాల్ని సృష్టించలేదు. తన రచనల్లో చెప్పదల్చుకున్న విషయం ఎటువంటి ఆవేశం లేకుండా, పాఠకుడిని ఆలోచింపచేసేవిగా వ్రాశారు తప్ప, చదువరిని రెచ్చగొట్టె పధ్ధతిలో ఎక్కడా వ్రాయలేదు. వారి అమ్మాయి శ్రీమతి ఆర్ శాంతకుమారిగారు అన్నట్టుగా, "నాకు తెలుసు నేను చెప్తున్నాను, మీరు వినండి" అనే ధోరణిలో ఆయన రచనలు ఉండవు, ఆయనా అలా ఉండేవారు కాదు.

ఆయన సాహిత్య ప్రకాండ మొత్తం ఒక ఎత్తు అయితే, తెలుగు పత్రికలకు ఆయన చేసిన సేవ అనిరతరం. వార పత్రికలు ప్రస్తుతం వస్తున్న సైజు ఆయన నిర్దేసించినదే. తెలుగులో మొట్టమొదటి వారపత్రిక అయిన ఆంధ్ర సచిత్ర వారపత్రిక మొదట్లో ఇప్పుడు వస్తున్న సినిమా పత్రికల సైజులో (సితరా మొలగునవి, రోజువారి పత్రిక సగంలోకి మడిస్తే వచ్చే సైజు, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ సైజు అంటే ఇప్పటివారెవరికీ తెలియదు మరి) వచ్చేదిట. ఆంధ్ర పత్రిక దాదాపు మూతపడిబోయ్యే సమయంలో, కుటుంబరావుగారికి పత్రిక నడిపే బాధ్యత అప్పగించారు. ఆయన చేసిన మొట్టమొదటి పని, పత్రిక మనం ఇప్పుడు చూస్తున్న వార పత్రికల సైజుకు తగ్గించటం. తరువాత ఆయన, ఇతర రచయితలు శ్రీ నండూరి రాంమోహనరావు, శ్రీ సూరంపూడి సీతారాంలతో కూడి త్రీ మస్కిటీర్సుగా పిలవబడి, అనేకానేక శీర్షికలను, చక్కటి ఆంగ్ల రచనలను (మార్క్ ట్వైన్ రచించిన టాం సాయర్, హకల్బెరిఫిన్ , విచిత్ర వ్యక్తి, ఆర్ ఎల్ స్టీవెన్సన్ రచించిన కాంచన ద్వీపం మొదలగునవి) తెలుగులోకి అనువదింపచేసి ధారావాహికలుగా పాఠకులకు అందచేశారు. అప్పటివరకు ఆంగ్లం తెలిసినవారికి మాత్రమే అందుబాటులో ఉన్న నవలలు , కుటుంబరావుగారి పుణ్యమా అని తెలుగు వారందరికి పరిచయమయ్యాయి. కుటుంబరావుగారు వారి స్నేహితులు కలసి చేసిన రకరకాల ప్రయోగాల వల్ల మూత పడుతుంది అనుకున్న పత్రిక అమ్మకాలు నాలుగింతలు ఐదు రెట్లుగా పెరిగిపోయి, పత్రిక మళ్ళీ నిలబడే అవకాశం వచ్చిందట.

చక్రపాణి-నాగిరెడ్డి గార్లచే 1947లో మొదలు పెట్టబడినప్పటికీ, 1952లో కుటుంబరావుగారు సంపాదకుడిగా ఆయన ఆధ్వర్యం లోకి చందమామ (ఒకొప్పటి ప్రముఖ మాస పత్రిక) వచ్చేవరకు, ఒక అనామక పత్రికగానే ఉన్నది. ఆయన పేరు చందమామ వారు సంపాదకుడిగా ఎప్పటికి పత్రికలో ప్రచురించకపోయినా, కుటుంబరావుగారు తీసుకున్న శ్రధ్ధ (చక్రపాణి నాగిరెడ్డిగార్ల సహకారంతో) చందమామను తెలుగు పత్రికా లోకంలో తలమానికంగా నిలబెట్టింది. ఆయన చందమామను నడిపిన కాలం 1952 నుండి 1980లో ఆయన మరణించేవరకు, పత్రికకు స్వర్ణయుగమే. చిన్న పిల్లల మనస్సులు ఎంతో సున్నితంగా ఉండి, విషయాలను ఎల్లకాలం గుర్తు పెట్టుకునే దశలో ఉంటాయి. విషయం బాగా తెలిసిన కో.కు గారు, చిన్నారి పాఠకులకోసం అన్ని కథలను, తన శైలిలో చెక్కి, చిత్రిక పట్టి కథా శిల్పాలుగా చేసి వదిలేవారు. ప్రతి కథ (ఎవరు వ్రాసినా సరే) కుటుంబరావుగారి చేతిలో పడి ఆణిముత్యంగా మారిపొయ్యేది. ఇవ్వాల్టికి పాఠక ఆదరణ కోసం వెంపర్లాడుతూ, ఆ పత్రిక, దశాబ్దాల నాటి కథలనే మళ్ళీ మళ్ళీ పునర్ముద్రణ చేస్తోంది అంటే ఆ కథల గొప్పతనం అర్ధం చేసుకోవచ్చును అంతర్లీనంగా ప్రతి కథలోను, ఒక నీతి సూత్రం, సంభాషణల్లో తర్కం, మూఢనమ్మకాలను మూలాల్లోకి వెళ్ళి ప్రశ్నించటం వంటివి రోజులలో చందమామ చదువుతూ పెరిగిన పిల్లలకు (మూడు నాలుగు తరాలవరకు) దొరికిన పెన్నిధి, వారి జీవితాలను ప్రభావితం చేసి నలుగురూ కలసి జీవించే సరైన పధ్ధతిలోకి మళ్ళించినాయి. ప్రభుత్వం వారు పిల్లలకు ఇది మంచి, ఇది కూడదు అని నిర్దేసించిన పాఠ్య పుస్తకాలకంటే, భాషా పరంగాను, అలోచనా పరంగాను, చందమామ కథలు అప్పటి పిల్లలకు (అనేకమార్లు పెద్దలకు కూడ) చక్కటి "చదువు" నేర్పాయి.

చందమామ పత్రికకు ఆయన దిద్దిన మెరుగులలో అన్నిటికన్నాఎక్కువగా తళతళలాడేది బేతాళ కథల శీర్షిక , అసలులో కథలు పాతిక మాత్రమే! కాని, చందమామలో వందల కొలది మామూలు కథలను బేతాళ కథలుగా ఎంతో నేర్పుగా మార్చి ప్రచురించారు. సాధారణమైన పిల్లల కథల్లోంచి, కథ చివర, ప్రతి నెలా, ఒక చిక్కు ప్రశ్నను సృష్టించడం, దానికి చక్కటి సమాధానం చెప్పించడం, సామాన్య విషయం కాదు. అతి కష్టతరమైన ఈ పనిని, దశాబ్దాల పాటు నిరాఘాటంగా కొనసాగించడం, తెలుగు జానపద సాహిత్యంలోని పేరొందిన ఒక కథా సంపుటిని తీసుకుని, ఆ కథలను ప్రచురించటమే కాక, అదే పంధాలో అనేక ఇతర కథలను ప్రచురించి, చిన్న పిల్లలకు (పెద్దలకు కూడ) చక్కటి ఆలోచనా పద్ధతి, సందేహాలను ప్రశ్నల రూపంగా వ్యక్తపరచటం,తర్కంతో కూడిన చక్కటి సమాధానాలు ఇచ్చే నేర్పరితనం, ఈ శీర్షిక ద్వారా కుటుంబరావుగారు నభూతో నభవిష్యతిగా రూపొందించారు ఈ బేతాళ కథలు. తెలుగు పత్రికా చరిత్రలో అన్ని శీర్షికలకన్న ఎక్కువకాలం ప్రచురించబడిన, ఇంకా ప్రచురించబడుతున్న శీర్షిక ఇది ఒక్కటే అయి ఉండవచ్చును.ఈ చక్కటి సాహిత్య ప్రక్రియ వెనుక ఉన్నది మన కుటుంబరావుగారే.

మొత్తం ప్రక్రియ తానేదో గొప్పపని చేస్తున్నాని అనుకుంటూ చెయ్యలేదు. తన ఉద్యోగ ధర్మంగానే చేశారు.

చివరకు. మహా రచయిత శత జయంతి సందర్భంగా ఆయన రచనలను లాంఛన ప్రాయంగా తలుచుకోవటం మాత్రమే చెయ్యకుండా, ఇప్పుడు దొరుకుతున్న వారి రచనల సంపుటాలను "కొని" చదివితే, రచనలను ప్రచురిస్తున్నవారికి స్వాంతన కలిగి ఇటువంటి చక్కటి రచనలను మరిన్ని ప్రచురించే ధైర్యం, శక్తి వస్తాయి. అదే సాహితీ ప్రియుని కోరిక, కొడవటి కుటుంబరావుగారికి మనం అందించగల నివాళి. ఉట్టి చదివి వదిలేస్తే గోపీచంద్ గారు (పండిత పరమేశ్వర శాస్త్రి నవలలో) ఎద్దేవా చేసిన "జొన్నలు" తిన్న కోళ్ళకి మనకు తేడా ఉండదు. కొని చదవాలి, ఆకళింపు ఛేసుకోవాలి, చాతనైనంతవరకు, కావలిసినంతవరకు, మన జీవితాలకు అన్వయించుకుని అవలంభించే ప్రయత్నం చెయ్యాలి.

కుటుంబరావుగారి రచనల నుండి కొన్ని మంచి మాటలు:

"... మనిషి మూడువిధాలుగా వుంటున్నాడు. పశువుగా, మానవుడుగా, దేవతగా. పశుత్వంలోనూ మంచీ చెడూ వుంది, మానవత్వంలోనూ వుంది. దేవత్వంలోనూ వుంది. ........ ఇంతవరకూ అందరికీ తెలిసే వుండవచ్చును. అందరికీ తెలీని విషయమేమిటంటే, పశుత్వంలో చెడు చాలా కొద్ది, మానవత్వంలో మంచి చెడు చాలకొద్ది, మానవత్వంలో మంచి చెడూ చెరిసగంగా వుంది, దేవత్వంలో మంచి కన్న చెడు చాలా జాస్తి...." (సూరి సిధ్ధాంతం 1)

".....చిరిగి రూపుమాసి పోయిన ఆచారాలు నీ కెలా పనికొస్తై. ఆచారమనేది కేవలం పనిముట్టు. మనిషి ఉపయోగం కోసం ఏర్పడ్డది ఆచారం. కాని మనిషి ఆచారం కోసం ఏర్పడ్డవాడు కాడు." (సూరి సిధ్ధాంతం 1)

" ...బుధ్ధంటే అర్థం కాలేదు. మనస్సనుకుంటున్నావు, మనసు వేరు, బుధ్ధి వేరు. వాళ్ళూ వాళ్ళూ అనేక విషయాలను గురించి అనుకుంటున్న మాటలన్నీ జ్ఞాపకం వుంచుకుని, వాటిని నిజం కింద అంగీకరించి, వాటి ప్రకారం ఆచరించటం బుధ్ధిని ఉపయోగించటం కాదు. దేన్ని గురంచయినా నీ అభిప్రాయం ఒకటి ఏర్పరుచుకున్నవా? !" (సూరి సిధ్ధాంతం 1)

"...మనిషి జ్ఞానానికి అంతుంది కాని అజ్ఞానాని లేదు" (సూరి సిధ్ధాంతం 1) (ఈ వ్యాక్యం మరెక్కడిదైనా కో కు గారు ఇక్కడ వాడుకున్నారా, మరింకెక్కొడో చదివిన జ్ఞాపకం)

".......స్వరాజ్యం, స్వేచ్చ అని గొంతు బొంగురు పొయ్యేదాకా అరుస్తారే! నా బుధ్ధిని వాళ్ళ బుధ్ధులకు దాస్యం చెయ్యమన్నావా? మతం హిస్టరీ అనుకున్నావా, జాగ్రఫీ అనుకున్నావా బోధ చెయ్యటానికి? బుధ్ధుడి మతం తీసుకున్న వాళ్ళల్లో మరొక్క బుధ్ధుడున్నాడా? నిజమయిన క్రైస్తవుడు క్రీస్తొకడేనా? ఇంకొకడున్నాడా? అర్జనుడి తరువాత జీవితంలో భవద్గీత అర్థం చేసుకున్నవాడి లక్షణా లేవైనా వున్నయా? పైగా ఈ మతాలు ప్రచారం కావటానికి ఎంత నెత్తురు ప్రవహించిందో తెలుసునా? ఇదంతా ఎందుచేత?" (సూరి సిధ్ధాంతం 1)

........."లోకంలో అనేక రకాల పశువులున్నారు. వాళ్ళను గురించి కథల్లోనూ, నాటకాలలోనూ చదువుతూనే వున్నాం. కాని ఎదురుగా వచ్చినప్పుడు చూసీ చూడనట్టు ప్రవర్తిస్తున్నాం ఎందుకు! (సూరి సిధ్ధాంతం 2)
(సూరి సిద్దాంతం లో సూరి తానె అయ్యి ఉంటారని నా ఊహ)
"........ఆపేక్ష ఎంత ఉన్నా మగవాళ్ళు ఆడదాని మనస్సును సుకుమారం చూడరు. మనస్సుకు కష్టం కలిగినప్పుడు మగవాళ్ళకు తెలియనివ్వరాదు. దానివల్ల గాయం మరింత పెద్దది కావటమే కాని ఏమీ లాభం లేదు. అందుచేత, ఆడదాని కమిత ఓర్పూ, నిబ్బరం ఉండాలి. కొంతమంది ఆడవాళ్ళకవిలేక, చప్పున కుండ మొహాన పగలగొడతారు-వెనకా ముందు చూడకుండా. ఇటువంటి సంఘటన కలిగినప్పుడల్లా ఓర్పు లేకపోవటం ఆడదాని తప్పా? లేక ఆడదాని మనసు కనిపెట్టలేక పోవటం మగవాని తప్పా?....." (పెద్ద దిక్కు కథలో)

".......బాగా అలోచించాక స్త్రీ పురుషుడికన్న శరీర బలాల్లో తక్కువైనట్టుగానె, పురుషుడు స్త్రీ కన్న మనో నిగ్రహంలో హీనుడుగా కనిపిస్తాడు. ......పైగా ఆడది మనసులో పెట్టుకున్నట్టు మగవాడు పెట్టుకోడు........."(పెద్ద దిక్కు కథలో)

1. తెలిసినవారు నవలా స్రవంతిలో నవల చదివిన రేడియో కళాకారుని పేరు తెలియచేస్తే ఎంతగానో సంతోషిస్తాను. ఎవరిదగ్గరైనా అప్పటి ఆ అపురూప కార్యక్రమాన్ని రికార్డు చేసి దాచి ఉంటే, షేర్ చెయ్యగలిగితే అంతకంటే మహాత్భాగ్యం మరొకటి ఉండదు.
2
. కుటుంబరావుగారి కథల గురించి, కథలలోని విషయాలను ఉదహరిస్తూ అనేక వ్యాసాలూ వ్రాయమని, మన బ్లాగు మిత్రులందరికీ విజ్ఞప్తి.
 
కుటుంబరావుగారి కుమారుడు శ్రీ రోహిణీ ప్రసాదు గారు , పై వ్యాసాన్ని చూసి స్పందించటం నాకు ఎంతగానో ఆనందం కలిగించింది. వారి స్పందన ఈ కింద ఇస్తున్నాను

"మీరు సమగ్రంగా రాశారు. మా నాన్న వీలున్నంతవరకూ ఇరవయ్యో శతాబ్దపు మనిషిలా జీవించడానికి ప్రయత్నించారు. ఈ రోజుల్లో కూడా నాకు మానసికంగా పద్ధెనిమిదో, పంతొమ్మిదో శతాబ్దంలో బతుకుతున్నవాళ్ళు తగులుతూ ఉంటారు. ఆధునికత అంటే లేటెస్ట్ రిస్ట్ వాచీలూ, సెల్‌ఫోన్లూ, టీవీలూ ఉపయోగించడమే కాదని చాలామందికి తెలిసినట్టులేదు. ఈ వెనకబాటుతనం చూస్తే అయిదు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూవస్తున్న ప్రగతివాదశక్తులన్నీ విఫలం అయాయనిపిస్తుంది. ఆలోచనలోనూ, భాషలోనూ కూడా స్పష్టత సాధించడం మానాన్న రచనల్లోని ఒక ముఖ్యలక్షణం అనిపిస్తుంది".






(మిత్రుడు ఎం వి ఎల్ ప్రసాదు గారికి నా ప్రత్యెక కృతఙ్ఞతలు, సరైన సమయంలో కుటుంబరావుగారి శతజయంతి గురించి గుర్తు చేసి వ్యాసం వ్రాయటాని కారణమయ్యారు. ఇంతవరకు ఆయనను కలవలేదు, అనేకమార్లు నెట్లో సంభాషించటం, ఫోనులో మాట్లాడటమే. ఆయన అమెరికాలో ఉన్న తెలుగువారు, ఒక మంచి సాహిత్య అభిమాని)


16 కామెంట్‌లు:

  1. ఎంత బాగా రాశారండీ! సమగ్రంగా ఉంది మీ టపా!

    కుటుంబరావు గారి మీద నా అభిమానం పూజించే స్థాయిలో ఉంటుంది. ఆ భావ ప్రకటన, ఆ మాండలీకాలు, అలవోగ్గా చేసి పారేసే వ్యక్తిత్వ విశ్లేషణ, ఇవన్నీ ఇంకెవరికీ,ఇంకెవరికీ సాధ్యం కావు. విరసం వాళ్ళ పుణ్యమా అని ఇదివరలో విశాలాంధర్లో అందుబాటులో లేని ఆయాన రచనలన్నీ ఇప్పుడు మళ్ళీ మొత్తం 14 సంపుటాల్లో అందుబాటులోకి వస్తుండటం సంతోషించదగ్గ వార్త. నాలుగు సంపుటాలు వచ్చేశాయి కూడాను!

    మీరు కోట్ చేసిన వాక్యాలన్నీ చిరపరిచితాలే! చదువుతుంటేనే మనసు పులకరిస్తోంది.

    ఈ శతాబ్దపు అద్భుత రచయిత!

    రిప్లయితొలగించండి
  2. ఆయనవి కొన్ని కధలు, సాహిత్య వ్యాసాలు కొన్ని చదివాను. చదవాల్సినవి చాలా ఉన్నాయి.

    మంచి వ్యాసం వ్రాశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. మంచి రచయితను గుర్తు చేసారు.బాగా రాసారు. అభినందనలు. హిందీ ప్రవీణ చేసినప్పుడు కొడవటిగంటి కుటుంబరావు గారి కధలు ఉండేవి మాకు.

    మీ ఇష్టమైన పుస్తకాల లిస్ట్ లో Treasure Island ఉంది... మొన్ననే ఆ పుస్తక పరిచయం books and galfriends లో ప్రచురితమైంది.వీలుంటే చూడండి.

    http://booksandgalfriends.blogspot.com/2009/10/blog-post_26.html

    రిప్లయితొలగించండి
  4. "ఇవ్వాల్టికి పాఠక ఆదరణ కోసం వెంపర్లాడుతూ ఆ పత్రిక దశాబ్దాలనాటి కథలనే మళ్ళీ మళ్ళీ పునర్ముద్రణ చేస్తోంది అంటే ఆ కథల గొప్పతనం అర్ధం చేసుకోవచ్చును"

    చిన్న సవరణ. పాఠకాదరణకోసం వెంపర్లాడటం మాటేమిటో గాని, లాభాలు తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకుందామనే అప్పటి యాజమాన్యం ఆలోచనలే చందమామ కథల, ధారావాహికల పునర్ముద్రణకు బలమైన కారణంగా చెప్పాలి. చందమామ పాలసీలో జరిగిన మార్పుగానే దీన్ని గుర్తించాలి.

    1980ల నుంచే చందమామ లైబ్రరీకి పుస్తకాలు సేకరణకోసం బడ్జెట్ కేటాయింపును నిలిపివేశారు. అప్పటినుంచే పాత కథలు, సీరియళ్లను వేయడం ప్రారంభమయింది. చిత్రాగారు, కుటుంబరావు గారు ఆకస్మికంగా పోవడం, బయటకు చెప్పలేని కారణంచేత దాసరి సుబ్రహ్మణ్యం గారు ఉన్నట్లుండి ధారావాహికలు రాయడం ఆపివేయడం.. అరయంగా కర్ణుడీల్గె నార్గురి చేతన్ అనే చందంగా, చందమామ పతనం పేరిట మీవంటివారు చెబుతున్న దానికి, పాతకథలే ఎక్కువగా రీప్రింట్ చేయడానికి పలు కారణాలు ఇలా తోడవుతున్నాయి.

    1980ల తర్వాతే చందమామ అన్నిభాషల్లోనూ సర్క్యులేషన్ బాగా పెరగడం గమనించాలి. 1980 తర్వాతే ఒరియా చందమామ రెండు లక్షల సర్క్యులేషన్ దాటడం, తెలుగు, హిందీ ఒక్కొక్కటి లక్ష కాపీలు దాటడం, పలు భాషల్లోకి చందమామ విస్తరించడం జరగడం యాదృచ్ఛికం కాదు. చందమామ దార్శనికతకు మార్గ దర్శకత్వం వహించిన ఘనాపాఠీలు - చక్రపాణి, చిత్రా, కుటుంబరావుల అస్తమయం- దాసరి సుబ్రహ్మణ్యం గారి అస్త్రసన్యాసం (ధారావాహికలకు సంబంధించి) చందమామపై బలంగానే పడిందనడంలో సందేహం లేదు కానీ 1996వరకు కూడా చందమామ సర్క్యులేషన్ పెద్దగా పడిపోయింది లేదు.

    చందమామకు అనుకోకుండా కలిగిన అజ్ఞాతవాసం -దీనికి ఎన్నో కారణాలు. లేబర్ సమస్య మాత్రం కాదు- పత్రిక భవిష్యత్తుపై బలంగా దెబ్బతీసింది. 1996లోనే ఒరిస్సాను ముంచేసిన భారీ తుపాను ప్రభావం ఒరియా చందమామను కోలుకోలేనంత దెబ్బ తీసింది. లక్షలాది కుటుంబాలు చెల్లాచెదురైపోయి, కుటుంబ ఆర్థిక వ్యవస్థ ఆ రాష్ట్రంలో కుప్పగూలిపోయన స్థితి చందమామకు ఉత్పాతంలా తగిలింది. ఇలాంటి ఎన్నో కారణాలు చందమామ భవితవ్యాన్ని నిర్దేశించాయి.

    అన్నిటికంటే మించి కుటుంబరావు, చిత్రా గార్ల అస్తమయం చందమామ క్వాలిటీని రెండురకాలుగా దెబ్బతీసింది. దానికి దాసరి గారి అస్త్రసన్యాసం అగ్నికి ఆజ్యం పోసిన చందంలా అయిందనుకోండి.

    ఈ వ్యాఖ్య మీ వ్యాసం పరిధిని దాటి ఎక్కడికో పోయినట్లుంది. ఇంతటితో ఆపివేస్తాను.

    సకాలంలో, కుటుంబరావు గారి గురించి ఇంత పెద్ద జ్ఞాపకం, పరిచయం చేశారు. అభినందనలు. మళ్లీ వస్తాను..

    రిప్లయితొలగించండి
  5. శివ గారూ, కొ.కు. గురించి మంచి విశేషాలు చాలా వివరంగా రాశారు.

    తెలుగు సాహితీ దిగ్గజం కొ.కు. రచనలను వి.ర.సం. వారు వరుసగా సంపుటాలు వేస్తున్నారు. ‘కొడవటిగంటి కుటుంబరావు రచనా ప్రపంచం’ పేరుతో ఇప్పటికి నాలుగు పుస్తకాలు వెలువడ్డాయి.

    కొ.కు. సృష్టించిన ‘సీతప్ప’ పాత్ర గురించి మీరు రాసింది చాలా బావుంది. టిపికల్ కారెక్టర్ సీతప్పకు కొ.కు. ఉపయోగించిన భాష చాలా విలక్షణమైనది. దీని ప్రభావం నన్ను కొద్దికాలం వెంటాడి వేధించింది! ‘బెదిరిన మనుషులు’ లాంటి గొప్ప కథలను ఎన్నిటినో కొ.కు.రాశారు.

    మంచి టపా రాసినందుకు అభినందనలు!

    రిప్లయితొలగించండి
  6. Shri M V L Prasad garu has responded as follows by e mail after reading the article on Shri Kodavatiganti.

    ---------- Forwarded message ----------
    From: Prasad MVL mvlprasad@gmail.com
    Date: 2009/10/28
    Subject: Re: MAIL FROM SIVARAMAPRASAD KAPPAGANTU
    To: SIVARAMAPRASAD KAPPAGANTU vu3ktb@gmail.com


    శ్రీ శివరామ ప్రసాదు గారు:
    కృతఙ్ఞతలు!
    ఇప్పుడే చదివాను...చాల కూలంకషం గా రాసారు. పాత రోజుల కథన్లని గుర్తు తెప్పించారు!
    నా పేరు రాయ వలసిన అవసరము లేదు కాని మీ అభిమానము చాలు...

    -ప్రసాదు

    రిప్లయితొలగించండి
  7. సుజాతగారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. కుటుంబరావుగారి కథలు ఇష్టపడని వారెవరు ఉంటారు! వారి శతజయంతి సందర్భంగా, మీ బ్లాగులో కూడ కుటుంబరావుగారి గురించి ఒక వ్యాసం వ్రాస్తే బాగుంటుంది. ఆ తరువాత మాండలీకాలు అన్నారు. కుటుంబరావుగారు మాండలీకాలలో వ్రాయటం..........నా కంట పడలేదండి. మరి వ్రాశారేమో. నాకు తెలిసినంతవరకు కోకు వ్రాసిన భాష యావత్తూ కృష్ణా-గుంటూరు జిల్లాలలోని ప్రజలు మాట్లాడుకునేదే. గోదావరి యాస కూడ ఆయన రచనలో నాకెక్కడా కనపడలేదు. మాండలీకాలలో వ్రాయటం అనేది ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది, కేతు విశ్వనాథ రెడ్డిగారు "అతడు అడవిని జయీంచాడు" నవలను ప్రచురించిన తర్వాతే (ఆంధ్ర జ్యోతిలో) అనుకుంటాను.

    మీ బ్లాగులో కూడ ఈ మహా రచయిత గురించిన వ్యాసం కోసం ఎదురు చూస్తూ.....

    రిప్లయితొలగించండి
  8. వెంకట రమణగారూ, తృష్ణగారూ మీ వ్యాఖ్యలకు థాంక్స్. తృష్ణగారూ, ట్రెజర్ ఐలాండ్ నా దగ్గర ఒరిజినల్ లైబ్రరీ ఎడిషన్ ఉన్నది, తెలుగు అనువాదం కాంచన ద్వీపం కూడ ఉన్నది (ఒక 30 సంవత్సరాల క్రితం కొన్నది). అయినా మీరు చెప్పిన వెబ్ సైటు చూస్తాను. ఈ వెబ్ గురించి నాకు చెప్పినందుకు, ప్రత్యేక ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  9. రాజుగారూ, ఇప్పటివరకు మీరు నా బ్లాగులో వ్రాసిన అతిపెద్ద వ్యాఖ్య ఇదే అనుకుంటాను. చాలా టైము వెచ్చించినట్టున్నారు. మొదట, ఏ పత్రికైనా ఒక నిబధ్ధతో నడిపితేనే నిలబడుతుంది, ఎక్కువకాలం మన్నుతుంది. చందమామే దానికి ఉదాహరణ. యజమానులలో సిన్సియారిటీ ఉన్నన్నాళ్ళూ చందమామ నిలబడింది. మహానుభావుడు చక్రపాణిగారు కన్నుమూయటం, చందమామపతనం ఆరంభం ఒకేసారి జరిగినాయి. ఆ తరువాత చిత్రా మరణం, మరో రెండు సంవత్సరాలలో మహా రచయిత, చందమామకు అనామిక సంపాదకుడు (28 సంవత్సరాలు ఏకబిగిన) కొడవటిగంటి కుటుంబరావుగారి ఆకస్మిక మరణం చందమామను కుంగతీశాయి. ఆ పధ్ధతిలో చక్కటి సంపాదకీయ లక్షణం ఉన్న మరొకరు దొరకక పోవటం మనందరి దురదృష్టం. 1996 వరకు సర్కులేషన్ పడకపోవటానికి కారణం, అలవాటుగా చందమామను కొంటున్నవారు ఉన్నందున. అలాంటివారు వయస్సు పైబడటం వంటి కారణాలవల్ల, ముఖ్యంగా వారు కూడ ఇది మన పాత చందమామ కాదన్న విషయం గమనించుకోవటం వల్ల ఆ తరువాత సర్కులేషన్ పడిపోయిందని నా అనుమానం.


    కొడవటిగంటివారి చేతిలో పడి అన్ని కథలూ ఆణి ముత్యాలయ్యాయి. అప్పటి చందమామ రచయితలు ఒకరిద్దరు తప్ప (పాలంకి వారు మొ||లగు వారు) మిగిలినవారందరూ సరదాగా ఒక కథ వ్రాసి పంపినవారే. వ్యాసంలో నా పాయింటు కూడ అదే, అతి సామాన్యమైన కథను తన సంపాదకీయ నైపుణ్యంతో ఒక చక్కటి కథగా మలచటం వల్ల, ఆ కథలు మళ్ళీ మళ్ళీ ప్రచురించబడినాయి. చందమామ పూర్వపు ప్రాభవం కోసం కొంత ఆరాటపడ్తోంది అనిపించటానికి కారణం ఆ కథలను పునర్ముద్రించటమే, మీరు చెప్పిన కారణం మాత్రమే అయితే మటుకు, నా దృష్టిలో చాలా అన్యాయం.

    ఒక్క కోరిక రాజుగారూ, ఆన్ లైను చందమామలో మనకు తెలిసిన చందమామకు ఎక్కువకాలం సంపాదకుడిగా పని చేసిన కుటుంబరావుగారి మీద వ్యాసం (ఆయన శతాబ్ది సందర్భంగా) వ్రాయటం ఎంతైనా సముచితంగా ఉంటుంది. దయచేసి వ్రాయగలరు. మీ చేతిలో ఒక చక్కటి వ్యాసం తయారవుతుంది. నా కోరికను మన్నించండి.

    రిప్లయితొలగించండి
  10. మీ సమగ్రంగా రాశారు. మా నాన్న వీలున్నంతవరకూ ఇరవయ్యో శతాబ్దపు మనిషిలా జీవించడానికి ప్రయత్నించారు. ఈ రోజుల్లో కూడా నాకు మానసికంగా పద్ధెనిమిదో, పంతొమ్మిదో శతాబ్దంలో బతుకుతున్నవాళ్ళు తగులుతూ ఉంటారు. ఆధునికత అంటే లేటెస్ట్ రిస్ట్ వాచీలూ, సెల్‌ఫోన్లూ, టీవీలూ ఉపయోగించడమే కాదని చాలామందికి తెలిసినట్టులేదు. ఈ వెనకబాటుతనం చూస్తే అయిదు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూవస్తున్న ప్రగతివాదశక్తులన్నీ విఫలం అయాయనిపిస్తుంది. ఆలోచనలోనూ, భాషలోనూ కూడా స్పష్టత సాధించడం మానాన్న రచనల్లోని ఒక ముఖ్యలక్షణం అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  11. శివ గారూ !
    కొడవతిగంటి వారి రచనల గురించి చాలా వివరంగా రాసినందుకు కృతజ్ఞతలు. వెంటనే చదివినా కొన్ని పని ఒత్తిడుల వలన ఆలస్యంగా స్పందిస్తున్నాను. ఇలాగే ఇంకా ఎన్నో మీ నుంచి రావాలని అశిస్తూ....

    రిప్లయితొలగించండి
  12. బాగుంది అండి మీ సమగ్ర పరిశీలన , నా దగ్గర అన్ని పుస్తకాలు వున్నాయి మీరు చెప్పినవి అన్ని చదివేను కాని మీరు చాలా బాగ వివరణ ఇచ్చారు. వూరికే గొప్ప హంగులకు ఆర్భాటాలకు పోకుండా ఏదో మాములు గా మా చిన్నప్పుడూ మా ఇంట్లోనో మా పక్క ఇంట్లోనో జరిగిన కధ లా వుంటాయి చదువుతుంటే. మళ్ళీ అంతలోనె ఆ కధ ల నుంచి ఆ కాలపు సామాజిక నైతిక, ఆర్ధిక ఆహార్యాలన్నిటిని అర్ధం చేస్తారు. మంచి రచయత వారి గురించి మీ నుంచి ఒక మంచి విశ్లేషణ.

    రిప్లయితొలగించండి
  13. రోహిణీ ప్రసాద్ గారూ. మీరు మీ అమూల్యమైన అభిప్రాయం నా బ్లాగుకు వచ్చి ఇచ్చినందుకు ధన్యవాదములు. మీ వ్యాఖ్య ను వ్యాసంలో భాగంగా ఉంచాను.

    భావన గారూ మీరు వ్రాసిన వ్యాఖ్యకు ధన్యవాదములు. మీ దగ్గర కుటుంబరావుగారి పుస్తకాలన్నీ ఉన్నాయి కదా. దయచేసి, మీరుకూడ ఒక వ్యాసం మీ బ్లాగులో వ్రాయగలరు.

    వేణూ గారూ. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు. సీతప్ప పాత్ర గురించి తెలిసిన మరొకరు దొరికారు మీరు. ఆనందం. కుటుంబరావుగారి సాహిత్య కృషికి నిజమైన నివాళి, మనం సీతప్పలం కాకుండ ఉండటమే.

    రిప్లయితొలగించండి
  14. శివ ప్రసాద్ గారూ,
    మాండలికాలంటే గుంటూరు యాస గురించే నేను ప్రస్తావించింది. బహుశా అక్కడ పుట్టి పెరగడం వల్ల కాబోలు తరచూ ఆయన రచనల్లో దొర్లే మధ్య తరగతి (బ్రాహ్మణ) కుటుంబాల్లో వినపడే మాటలు నాకు చాలా దగ్గరగా, ఆత్మీయంగా అనిపిస్తాయి. సవతి తల్లి నవలిక లో వెంకమ్మ మాటలు, కొత్త కోడలు నవల్లో హనుమాయమ్మ గారు మాట్లాడే మాటలు,అలాగే తిమింగలం వేటలో నాగభూషణం భార్య సుభద్ర మాటలు ఇవన్నీ నా చుట్టూ బోలెడు మంది మాట్లాడగా విన్నాననిపిస్తుంది.చిరపరిచితాలుగా అనిపిస్తాయి."శ్రీకృష్ణ ప్రరబ్రహ్మణే నమః" లో భైరవ శాస్త్రుల్ని, "మగవాడి దౌర్జన్యం" లో శ్రీరాముల్ని, "మారు పేర్లు" లో సుబ్రహ్మణ్యాన్ని,చదువు లో సుందరాన్ని నేనెరుగుదుననిపిస్తుంది. ఎనని చెప్పను? ప్రతి పాత్రా నా చుట్టూ ఉన్న మనుషుల్లో నేను చూశాననే అనిపిస్తుంది.

    సరితాదేవి డైరీ లో సరితా దేవి ఆలోచనలు మాటలు ఇవన్నే ఎక్కడో చూశాననో, విన్నాననో అనిపిస్తూ ఉంటాయి. ఏవేవో జ్ఞాపకాలు రేపుతాయి.అలాగే కథల్లోని పాత్రలు కూడా నా చుట్టూ ఒకప్పుడు ఉన్న సజీవ పాత్రలనే అనిపిస్తుంది నాకు.


    అంతగా ఆయన రచనల్ని ఐడెంటిఫై చేసుకుంటాను నేను. ఆయన రచనల్లో కనపడే పదునైన హాస్యం కూడా కట్టిపడేస్తుంది.

    మీరు ఇంత సమగ్రంగా రాశాక ఇంకా నా బ్లాగులో కుటుంబరావు గారి రచనా వైభవం గురించి మళ్ళీ నేను రాయగలనంటారా?

    ఏదో ఒక చిన్న నవలను నా దృష్టి నుంచి పరిచయం చేసే దిశగా ఆలోచిస్తాను.

    అన్నట్లు అతడు అడవిని జయించాడు నవల కేశవ రెడ్డిగారిది కదా!

    రిప్లయితొలగించండి
  15. సుజాతగారూ,

    మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. అతడు అడవిని జయించాడు రచయిత పేరు తప్పువ్రాశాను, సరిచేసినందుకు కృతజ్ఞతలు.

    నేను కుటుంబరావుగారిగురించి అతి కొద్ది, నాకు నచ్చిన సీతప్ప పాత్ర, చందమామ సంపాదకీయం మాత్రమే కవర్ చేశాను. కుటుంబరావుగారి సమగ్ర సాహిత్యంలో నేను వ్రాసింది అతి తక్కువ. మీరు, ఆయన వ్రాసిన దిబ్బ కథల గురించి వ్రాస్తే బాగుంటుంది. నాకు ముంబాయినుంచి బెంగుళూరికి బదిలీ అయ్యి ఆరు నెలలక్రితమే రావటం, ఇంకా నా పుస్తకాల పాకింగు తియ్యకపోవటం వల్ల దొరికిన ఒక్క సంపుటి చూసి ఎక్కువగా చదివిన గుర్తుతో వ్రాశాను.

    కుటుంబరావుగారి కథలు, నవలల్లోంచి అనేక పేర్లు చెప్పి మళ్ళీ అవి చదివిన అనుభూతి కలిగించారు.దయచేసి మీరుకూడ వ్రాస్తే చాలా బాగుంటుంది, సాహిత్యం మీద అభిమానం ఉన్న బ్లాగర్లందరూ తలా ఒక వ్యాసం వ్రాస్తే ఆయన శత జయంతి ఉత్సవాలకు (బయట ఎవరన్నా చేసినా చెయ్యకపోయినా) మనం మొదలు పెట్టిన మంచి ప్రారంభం కాగలదని నా ఉద్దేశ్యం.

    తరువాత విరసం వారు కుటుంబరావుగారి సాహిత్యం సంపుటాలుగా వేస్తూ ఇప్పటేకే 14 సంపుటిలు వేశారని విన్నాను. మీకు తెలిస్తే, దయచేసి ఆ సంపుటాలను తెప్పించుకోవటానికి ఏ చిరునామాకి వ్రాయాలి (ఇ మైలు ఉంటే ఇంకామంచిది), డబ్బులు ఎంత ఎలా పంపాలి వివరాలు నాకు తెలియచేయగలరు.

    రిప్లయితొలగించండి
  16. శివ గారూ,
    విరసం వాళ్ళు వేస్తున్న సంపుటాలకు నేను డబ్బు కట్టేశాను. ఇప్పటి వరకు నాలుగు సంపుటాలు పంపారు కూడానూ! కొడవటిగంటి రచనా ప్రపంచం పేరుతో! దీని గురించి వేణువు బ్లాగర్ వేణు గారు తన బ్లాగులో మార్చిలోనే ఒక టపా రాశారు. ఇదిగో లింకు!
    http://venuvu.blogspot.com/2009/03/blog-post_16.html

    ఇది చూసే నేను వారి నుంచి పుస్తకాలు తెప్పించుకుంటున్నాను. హైదరాబాదులోని వీక్షణం ఆఫీసుని కూడా సంప్రదించవచ్చు వీటి కొరకు. నాకు అక్కడినుంచే వస్తాయి.

    వారి చిరునామా కంటే ఈ మెయిల్ మీకు ఉపకరిస్తుంది.

    veekshanam2003@gmail.com
    reachcdrc@yahoo.com

    కొత్త పుస్తకాల్లో అనవసరమైన ఫుట్ నోట్సూ అవీ లేకుండా హాయిగా కూడా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.