18, నవంబర్ 2009, బుధవారం

బెంగుళూరు పుస్తక ప్రదర్శన

నేను మా ఊరు విజయవాడ వదిలి పది సంవత్సరాల పైన అయ్యింది. ఈ పది సంవత్సరాలలో , బెంగుళూరు వచ్చినాక మాత్రమె పుస్తక ప్రదర్శన వెళ్ళటానికి కుదిరింది. ఇంతకు ముందు ఉన్నా ముంబాయి, హైదరాబాదులలో ఈ ముచ్చటకు అవకాసం ఉండేది కాదు. ఇక బెంగుళూరులో, విజయవాడంత గొప్పగా కాకపోయినా ఉన్నంతలో పుస్తక ప్రదర్సన అంటూ జరగటం సంతోషకరం. ఎలాగో అలా దారి వెతుక్కుని వెతుక్కుని పాలెస్ గ్రౌండ్సుకు వెళ్ళగలిగాను. విశాలమైన చోటే కాని నిర్వాహకుల నిర్వాకం వల్ల స్టాలుకు స్టాలుకు మధ్య పెద్ద దూరం ఉంచలేదు. అందువల్ల చాలా ఇరుకుగా తిరగవలసి వచ్చింది. పైగా ఆవరణ అంతా కప్పేసి లోపల ఫాన్లు ఉంచినా జనాభారం వల్ల కాబోలు ఊపిరి తీసుకోవటం సులభంగా కాలేదు.

ఈ కష్టాలన్ని భరిస్తూ, తెలుగు పుస్తకాలు ఎక్కడా ఎక్కడా అనుకుంటూ తిరుగుతుంటే మన విశాలాంధ్ర వారి స్టాల్ ప్రత్యక్షమయ్యింది. ప్రాణం లేచి వచ్చి (విశాలాంధ్రలో సంవత్సరాలపాటుగా రీడర్స్ క్లబ్ మెంబర్ని) వెళ్ళి పుస్తకాలు తిరగేసి నాకు నచ్చిన పుస్తకాలు కొన్నాను.

కొడవటిగంటివారు కథలు నాలుగు సంపుటాలు, మధురాంతకం రాజారాం గారి కథలు, పాలగుమ్మి పద్మరాజుగారి కథలు దొరికినాయి.

నాకు అన్నిటికంటే ఆనందాన్నిచ్చిన పుస్తకం శ్రీ భమిడిపాటి కామేశ్వరరావుగారి పుస్తకం "హాస్య వల్లరి" మొదటి సంపుటం. దాదాపు కనుమరుగౌతున్న రచయిత శ్రీ భమిడిపాటి కామేశ్వరరావుగారి పుస్తకాలు మళ్ళి ప్రచురించినందుకు విశాలాంధ్రవారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ పుస్తకాన్ని కూడ కొనుక్కున్నాను. ఆగలేక తిరిగి వస్తూ బస్సులో కొంత చదివి నవ్వుకుంటుంటే పక్కవాళ్ళు కొంత బెదిరినట్టు కనబడ్డారు కూడా!

మరొక ఆణిముత్యం బాపు గారి "ఇడిగిడిగో బుడుగు" కార్టూన్లు. ఈ పుస్తకం బాపు గారి శిష్యులు శ్రీ గంధం గారు సేకరించి వేశారట.. బుడుగు పుస్తకం విడుదలకు పూర్వమే, ఈ బుడుగు కార్టూన్లు ఆంధ్ర పత్రికలో ధారావాహికగా వచ్చినాయట.

చక్రపాణిగారి గురించిన ఒక చక్కటి పుస్తకం దొరికింది. అందులో ఆ మహానుభావుడి జీవిత విశేషాలు, చందమామ స్థాపన, తీసిన సినిమాలు, నాగిరెడ్డిగారితో దోస్తి, ఆయన సమకాలీనులగురించి చక్కగా ఎన్నెన్నో అమూల్యమైన ఫొటోలతో ఉన్నది. పుస్తకం పేరు "చక్రపాణి విజయ పతాక" చక్రపాణి శతజయంతి సందర్భంగా 2008లో నవరత్న బుక్ హౌసువారు ప్రచురించినది. చందమామ ప్రియులు తప్పనిసరిగా కొని చదవవలసిన పుస్తకం.


కొడవటిగంటి కుటుంబరావుగారి కథలు చదివినతరువాత మరే రచయిత కథలు చదివినా కొంత పేలవంగా ఉండటం సహజం. కాని కొడవటిగంటి కుటుంబరావుగారికి సరితూగగల రచయిత మధురాంతకం రాజారాంగారేనని నా అభిప్రాయం. కథ ఎత్తుగడకాని, చెప్పదలుచుకున్న విషయాలను చెప్పే పధ్ధతిలో కాని, అనవసరపు వర్ణనలు లేకపోవటంకాని మనం పోల్చి చూస్తే కుటుంబరావుగారికి సరైన వారసుడు రాజారాంగారు అనటంలో నాకేమాత్రం సందేహంలేదు.

మొదటిరోజున వెళ్ళినప్పుడు కొడవటిగంటివారి సంపుటాల్లో మొదటిది మినహా మిగిలిన మూడు దొరికాయి. నా అభ్యర్ధన వినిపించుకుని, విశాలాంధ్రవారు, మర్నాడు ఆదివారం (అదే చివరిరోజు) రండి, తెప్పించి ఇస్తాం అనటంతో, మా అబ్బాయికి పురెక్కించి వాడి వాహనం లో ఇద్దరం వెళ్ళాం.

ఈ రెండో సారి వెళ్ళినప్పుడు ఒక విచిత్రం జరిగింది. మేమిద్దరం ఒక్కొక్క స్టాలూ పరకాయిస్తూ వెళ్తుండగా, ఒకాయన నా దగ్గరకు వచ్చి, "మీరు బ్లాగరా?" అని అడగటంతో నేను నివ్వెరపోయ్యాను. అవునండి మీరెవరు అనటంతో తాను కూడ తోటి బ్లాగరు అని తన పేరు నాగమురళి అని తనతో పాటుగా ఉన్న రవి(బ్లాగాడిస్తా)ని కూడ పరిచయం చేశారు. మరిద్దరు బ్లాగర్లు కలిసిన సంతోషంలో అక్కడే పెద్దగా జనం లేని స్టాలులో నిలబడి కాసేపు మాట్లాడుకున్నాం. వాళ్ళిదరి దగ్గర వాళ్ళ ఈ మైలు చిరునామలు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చినాక. "మన తెలుగు చందమామ" బ్లాగుకు భాగస్వాములుగా ఆహ్వానించాను. నా సైడు ఫోజు ఫొటో చూసి నన్ను ఎవరైనా గుర్తుపడతారనుకోలేదు!!

విశాలాంధ్రవారు వారి మాట నిలబెట్టుకుని కొడవటిగంటి సంపుటాలలో మొదటిది అందించారు. మేము ఆనందంగా ఇంటికి తిరిగివచ్చి, ఆ పుస్తకాల అధ్యయనం పడ్డాం. ఇది బెంగుళూరు పుస్తక ప్రదర్శన కథ

7 కామెంట్‌లు:

  1. శివ గారూ!

    నాగమురళి, రవి గార్లు మిమ్మల్ని గుర్తుపట్టటం బావుంది. మీరు నివ్వెరపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు.
    బ్లాగులో మీ ఫొటో ఇవ్వటం వల్ల వాళ్లు తేలిగ్గా మిమ్మల్ని గుర్తుపట్టివుండాలి. జయదేవ్ గారి కార్టూన్ కూడా సాయపడిందేమో!

    > ఆగలేక తిరిగి వస్తూ బస్సులో కొంత చదివి నవ్వుకుంటుంటే పక్కవాళ్ళు కొంత బెదిరినట్టు కనబడ్డారు కూడా!:)

    బావున్నాయండీ, బెంగుళూరు పుస్తక ప్రదర్శనలో మీ అనుభవాలు!

    రిప్లయితొలగించండి
  2. ఇడిగిడుగొ బుడుగు పుస్తకం వేసింది విశాలాంద్ర వారు కాదు సార్, బాపు గారి ప్రియ శిష్యులు , చిత్రకారులు గంధం గారు వేశారు.

    రిప్లయితొలగించండి
  3. శివరాంగారూ, మీ బెంగళూరు పుస్తక ప్రదర్శన అనుభవం చాలా బాగుంది. మీరు చూసి కొనుక్కున్న "చక్రపాణి విజయ పతాక" పుస్తకం గురించే మీరు ఇదివరకే మెయిల్ చేసినట్లున్నాను. దీన్ని నా బ్లాగులో పరిచయం చేద్దామని కూడా అనుకున్నాను. ఈలోపల మీరే పట్టేశారు. ప్రతి చందమామ ప్రియుల చేతిలో ఉండవలసిన పుస్తకం ఇది.

    అలాగే నాగమురళి, బ్లాగాడిస్తా రవిగార్లను కలిశారన్నమాట. మనం ఇలాంటి చోట్లే కలుస్తుంటాము కదా. థ్రిల్లింగ్‌గా ఉంది చదువుతుంటే. కుటుంబరావు గారి రచనలను ప్రచురణ కర్తలకే ఒకేసారి లేదా దఫాలుగా కాని కట్టి ఉంటే మీకు రెండువేలకే 16 సంపుటాలు పంపేవారు -ప్రింట్ ప్రాతిపదికన- మొత్తానికి నాలుగు భాగాలయినా కొన్నారు. చాలా సంతోషం.

    ఈ సందర్భంగా మీకు మరో సంతోషకరమైన విషయం చెబుతాను. కొకు శతజయంతి సందర్భంగా ప్రజాసాహితి పత్రిక నవంబర్ సంచికను కుటుంబరావు గారి ప్రత్యేక సంచికగా వేశారు. 1980ల మొదట్లో తన మీద రంజని వారు వేసిన 'భావవిప్లవకారుడు కొకు' తర్వాత మళ్లీ అంత వివరంగా చాలా వ్యాసాలతో ఈ ప్రత్యేక సంచిక వచ్చింది. కొకు అభిమానులు తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని తీసుకోవచ్చు.

    ఎ4 సైజులో 120 పుటలలో వచ్చిన దీని వెల 40 రూపాయలు మాత్రమే. నేను చందా కట్టాను కాబట్టి ఇప్పటికే నావద్ద ఉంది. మళ్లీ ఇంకో కాపీ కూడా తీసుకోవాలని అనుకుంటున్నాను. చందమామలో కుటుంబరావు గారి పాత్ర గురించి దాసరి సుబ్రహ్మణ్యం, రావికొండలరావు గార్లు రాసిన పాతవ్యాసాలు కూడా దీంట్లో వేసారు. అవసరమనుకుంటే త్వరపడండి. ఈ పుస్తకం కావాలంటే విజయవాడలోని ప్రజాసాహితి ఆఫీస్ ఫోన్ -98486 31604- కు కాల్ చేసి కనుక్కోండి.

    ప్రజాసాహితి వారు ప్రతి 3 లేదా 4 నెలలకు ఓ ప్రత్యేక సంచిక తీసుకువస్తున్నారు. సంవత్సరం చందా వందరూపాయలు మాత్రమే కనుక చందా తీసుకుంటే క్రమం తప్పకుండా అన్ని ప్రత్యేక సంచికలూ పోస్ట్ ద్వారానే పొందవచ్చు. వీలైతే ఇంతవరకు వీరు వేసిన అన్ని ప్రత్యేక సంచికలూ తెప్పించుకోవాలనుకుంటున్నా. నిన్ననే వారికి మెయిల్ చేసాను.

    అభినందనలు

    రిప్లయితొలగించండి
  4. వేణుగారూ,

    నేను హాస్యానికి బెదిరిన మనుషుల గురించి వ్రాసినది ఇట్టే పట్టేశారు. మీ వ్యాఖ్యకు థాంక్యూ

    రాజుగారూ,

    మీరు ఇచ్చిన సమాచారానికి ధన్యవాదాలు. నాకే కాకుండా, ఈ బ్లాగులోకి వచ్చి వ్యాఖ్య వ్రాదామనుకున్నవాళ్ళందరికి ఉపయోగపడుతుంది.

    అయ్యా అన్వర్‌గారూ,

    మీరు చెప్పింది కూడ నిజమే అనుకుంటాను. పుస్తకం వెనుక అట్టమీద మరియ్ మొదట్ పుటలలోనూ చూస్తే ప్రతులకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ అని ఉంటే వారే వేశారనుకున్నాను. ప్రచురించినవారు రైన్ బౌ ఆర్ట్ సిరీస్ వారు అని ఇప్పుడే చూశాను. వ్యాసంలో తగిన మార్పు చేస్తాను. తెలియ చెప్పినందుకు కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  5. అన్ని పుస్తకాలు చూసేసరికి, ఏవి చూడాలో తెలీక, ఏవేవో చూస్తూ, ముఖ్యమైనవి మర్చిపోయాను. అందులో "చక్రపాణి విజయ పతాక" ఒకటి. మాయాబజార్ పుస్తకం చూశాను కానీ, విజయపతాక పుస్తకం మిస్సయ్యింది. విశాలాంధ్ర మా ఊరు అనంతపురం లో ఉంది కాబట్టి, అక్కడికెళ్ళినప్పుడు తీసుకోవాలి.

    రిప్లయితొలగించండి
  6. చాలా బాగుంది మీ పుస్తక ప్రపంచ విహారం. మంచి సాహిత్యానికి రోజులు చెల్లిపోయాయేమో అనే నేటి కాలంలో అంత మంచి మంచి పుస్తకాలు ముద్రించి, వాటిని ఎంతో అబ్బురంగా పదిలపరిచే మీలాంటి నిజమైన సాహిత్య అభిమానుల చేతికి అందించడం విశాలంధ్ర వారి గొప్పతనం. నాకు అప్పుడప్పుడు ఒక సందేహం వస్తుంటుంది. మీ ఇంట్లో పుస్తకాల కోసం ఎన్ని గదులు కేటాయించారా అని? నా దగ్గర ఉన్న అతి కొద్ది పుస్తకాలనే సద్దలేక నాకు నీరసం వస్తూ ఉంటుంది. పుస్తకాలు కొనడమేకాదు వాటిని సమ్రక్షించి ముందు తరాల వారికి అందజేయడం కూడా చాలా కఠినమైన పని కదండీ. మా పిన్ని ఇలాగే ఎన్నో పుస్తకాలు కొని ఎంతో కాలం పాటు జాగ్రత్తగా కాపాడుకుని చివరకు పెళ్ళి, పిల్లలు, ఊర్లు మారడం వంటి వాటితో ఎన్నో విలువైన పుస్తకాలు పోగొట్టుకుని తన పిల్లలకు ఇప్పుడు అవి అందించలేకపోయానే అని ఎంతో బాధ పడుతోంది. కాబట్టి మీరు చాలా గ్రేట్, మంచి సాహిత్యాన్ని ముందు తరాలకు అందిస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  7. మా లంబాడి జీవితంలో (మూడేళ్ళకొకసారి బదిలీ)లో పుస్తకాలకు ప్రత్యేక గది!!!?? కొన్నవన్ని చదివిన తరువాత జాగ్రత్తగా పాక్చేసి పెట్టెల్లో (సామాన్లు తరలించటానికి వాడే అల్యూమినియం షీటుతో చేసినవి)లో ఉంచుతాను. వీలైనప్పుడు, మా ఊరు విజయవాడ తరలిస్తూ ఉంటాను. అక్కడ మా ఇంట్లో పుస్తకాలు తప్ప ఇంకేవి లేవు. చెదలు పట్టకుండా(విజయవాడలో అదో బెడద) గంధం పొడి చల్లి ఉంచుతాను. ఇప్పటివరకు జాగ్రత్తగానే ఉన్నయట మరి. పుస్తకాలు కొనటం అలవాటు ఈరోజుదా! దాదాపు 40 సంవత్సరాలబట్టి జరుగుతున్నది. మొదట్లో ఇంగ్లీషు సాహిత్యం, కొంచెం అలశ్యంగా తెలుగు.

    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.